ప్రపంచం ఎంత వేగంగా ముందుకు సాగుతున్నా.. ఆడపిల్లల విషయంలో మాత్రం ఇంకా అసమానతలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆడపిల్ల పుట్టకూడదని కోరుకునే తల్లిదండ్రులు లేకపోలేదు. చదువు, పెళ్లి ఇలాంటివన్నీ భారమనుకునేవారు నేటికీ ఉన్నారు. ఈ అసమానతలు తొలగిపోవాలి. ఆడబిడ్డలను కూడా అన్ని రంగాల్లో ఎగదనివ్వాలి. దీనిని దృష్టిలో ఉంచుకునికి, బాలికలను ప్రోత్సహించడానికి.. ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఆడపిల్ల పుడితే.. భారమనుకునే ఆలోచన మారాలి. మగపిల్లలు మాత్రమే కాకుండా.. ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లోనూ తమ ముద్ర వేస్తున్నారు. కాబట్టి వారి ఎదుగుదలకు ఉపయోగపడే కొన్ని పథకాలు గురించి తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలి.
సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ప్రభుత్వ మద్దతుతో కూడిన పొదుపు పథకం. ఈ స్కీమ్ కింద 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఆడపిల్లల కోసం సంరక్షులు లేదా తల్లిదండ్రులు.. అమ్మాయి పుట్టిన తేదీ నుంచి 10 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి ఖాతాను 250 రూపాయలతో ప్రారభించవచ్చు. ఇందులో గరిష్టంగా రూ. 1.50 లక్షలు వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ స్కీమ్ ఓపెన్ చేయడానికి పోస్టాఫీస్‌ను సందర్శించి ప్రారభించవచ్చు.
చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్
చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. పిల్లల వివాహం, ఉన్నత విద్య మొదలైన దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గిఫ్ట్ ఫండ్‌లు.. డెట్ అండ్ ఈక్విటీ ఇన్‌స్ట్రుమెంట్‌ల కలయికలో పెట్టే పెట్టుబడి.
ఎల్ఐసీ జీవన్ తరుణ్
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఈ 'జీవన్ తరుణ్ స్కీమ్' అందిస్తుంది. దీనిని ప్రత్యేకంగా 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య పిల్లల విద్యకు ఆర్ధిక సహాయం అందించే లక్ష్యంతో తీసుకొచ్చారు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. అంతే కాకుండా చదువుకునే సమయంలో విద్యా అవసరాలకు చెల్లింపులు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా మెచ్యూరిటీ సమయంలో మొత్తం కవరేజ్ లభిస్తుంది.
బాలికా సమృద్ధి యోజన (BSY)
భారతదేశంలో ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల బాలికల సంక్షేమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో బాలికా సమృద్ధి యోజన స్కీమ్ ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద, ఆడపిల్ల పుట్టినప్పుడు నగదు ప్రోత్సాహకం అందిస్తారు. ఆ తర్వాత వారు ఉన్నత పాఠశాల వరకు విద్యను పొందేలా చూసేందుకు వార్షిక స్కాలర్‌షిప్‌లను సైతం అందించడం జరుగుతుంది.
సీబీఎస్ఈ ఉడాన్ పథకం
సీబీఎస్ఈ ఉడాన్ స్కీమును భారత ప్రభుత్వ మానవ వనరులు మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRD) సహకారంతో 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్' (CBSE) ప్రారంభించింది. దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో మహిళా విద్యార్థుల నమోదు రేటును పెంచడం దీని లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment