ఆర్థిక ధీమాకు ఐదు మంత్రాలు
ఇప్పుడిప్పుడే ఆదాయార్జనలో పడిన యువతలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్లానింగ్‌పై సరైన అవగాహన ఉండదు. కొందరికి ఎంతకాలమైనా ఇదో బ్రహ్మ పదార్థంలా కొరుకున పడదు. మరికొందరికి కొంత నష్టపోయాక గానీ తత్వం బోధపడదు. నిజానికి దీని గురించి మరీ తలలు బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలనే నిబద్ధత కొంత, పరిజ్ఞానం పెంచుకోవాలన్న జిజ్ఞాస మరికొంత, వాటితో పాటు ఆ ప్లాన్‌ను అమలు చేయడానికి కట్టుబడి ఉండాలనుకోవడం ఇంకొంత... ఇవి చాలు. ఇదిగో దీనికోసం పాటించాల్సిన ఐదు సూత్రాలు...
బడ్జెట్ వేసుకోవడం..
ఒక్కసారి ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకున్నాక బడ్జెట్ రూపొందించుకోవాలి. ఖర్చులను ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. ఒక నెల, రెణ్నెల్లు ఇలా బడ్జెట్ వేసుకుని, వ్యయాలపై దృష్టి పెడితే దేనికెంత ఖర్చు పెడుతున్నాం? ఎక్కడ తగ్గించుకోవచ్చు? ఎంత ఆదా చేసుకోవచ్చు? తెలుస్తుంది. మీ ఆర్థిక స్థితిగతులు కూడా బోధపడతాయి. దీని వల్ల అనవసరమైన ఖర్చులు, రుణాలు తగ్గించుకుని, ఆదాయాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోవడం సాధ్యపడుతుంది. అవసరాలను తీరుస్తూనే వృథా ఖర్చులను పక్కకు తప్పించగలిగేలా బడ్జెట్‌ను రూపొందించుకోగలిగితే అన్నివిధాలా శ్రేయస్కరం. స్మార్ట్‌గా ఖర్చు పెట్టడమంటే పొదుపు చేయడం కూడా అని గుర్తుపెట్టుకోండి.
ఖర్చులపై స్వీయ నియంత్రణ
ఖర్చు చేసేటప్పుడు మన అవసరాలు, కోరికల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. ఏదైనా కొనే ముందు, దాని అవసరమెంత? మీ ఆర్థిక పరిస్థితులపై దాని ప్రభావమెంత? వంటి అంశాలను బేరీజు వేసుకోవాలి. ఒకవేళ అది తప్పనిసరి అయితే, మీ ఆర్థిక పరిస్థితిని తల్లకిందులు చేయనిదైతే ముందుకెళ్లండి. అలాగని, ఎంతసేపూ ప్లానింగ్ గురించే ఆలోచిస్తూ... వినోదాలు, చిన్న చిన్న సరదాలు, స్నేహితులతో పార్టీలు మొదలైనవి పూర్తిగా వదిలేయాలని కాదు. అవి కూడా ఎంజాయ్ చేయాలి. అదే సమయంలో అవసరం లేని వాటిని కూడా కొనేసుకోవాలి అన్న ఆలోచనను నియంత్రించుకోవాలి. బైటికి వెళ్లినప్పుడల్లా క్రెడిట్ కార్డులను వెంట తీసుకెళ్లే అలవాటుంటే తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే ట్రాక్ తప్పడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి. ప్రతిసారీ నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా కొనుగోళ్లు చేసుకునేందుకు వీలు కల్పించే సాధనంగా మాత్రమే కార్డులను వాడాలి తప్ప పదే పదే రుణం అవసరాల కోసం కాదు. వీటిని వాడి అప్పుల చక్రవ్యూహంలో చిక్కుకుపోవద్దు.
లక్ష్యాలకు కట్టుబడి ఉండటం..
ఉద్యోగంలో చేరినప్పట్నుంచీ.. అంతకు ముందే నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలి. ఈ ఆర్థిక లక్ష్యాలు స్వల్పకాలికం, మధ్య కాలికం లేదా దీర్ఘకాలికమైనవిగా ఉండొచ్చు. గడువు ఎంత పెట్టుకున్నప్పటికీ.. వాటిని సాధించే దిశగానే పనిచేయండి. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటి సాధనపై దృష్టి పెట్టడం వల్ల డబ్బును, సమయాన్ని సరైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం సాధ్యపడుతుంది.
అత్యవసరాల కోసం ఆదా..
ఉద్యోగ భద్రత రోజులు పోయాయి. ఎప్పుడుంటాయో, ఎప్పుడు ఊడతాయో తెలియని పరిస్థితిలో ప్రస్తుతం ఉద్యోగాలు ఉంటున్నాయి. పని చేసే కంపెనీ వ్యాపార విధానాలు మారడం వల్ల కావొచ్చు లేదా సంస్థ ఆర్థిక పరిస్థితులు బాగోలేక పోవడం వల్ల కావొచ్చు ఉద్యోగాలకు సమస్య వచ్చి పడొచ్చు. ఇలాంటి కష్టకాలంలో ఆదుకోవడానికి చేతిలో కొంతైనా డబ్బు ఉంచుకోవాల్సిందే. ఇందుకోసమే రెగ్యులర్‌గా ప్రతి నెలా కొంత మొత్తాన్ని తీసి పక్కన పెట్టి అత్యవసర నిధిని తయారు చేసుకోవాలి.
కుటుంబానికి భద్రత..
ఎలాంటి ప్రతికూల పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అనుకోని విధంగా ఇంటి భారాన్ని మోసే వారు ఆస్పత్రి పాలైనా లేదా వారికి అవాంఛనీయమైనదేదైనా జరిగినా కుటుంబ ఆర్థిక పరిస్థితి తల్లకిందులు కాకుండా బీమా రక్షణ ఉండాలి. జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు తగినంత కవరేజీ ఉండేలా చూసుకోవాలి.