బడ్జెట్ నుంచి యూజర్ చార్జీలు | User charges from budget | Sakshi
Sakshi News home page

బడ్జెట్ నుంచి యూజర్ చార్జీలు

Published Thu, Jan 22 2015 3:12 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

బడ్జెట్ నుంచి యూజర్ చార్జీలు - Sakshi

బడ్జెట్ నుంచి యూజర్ చార్జీలు

ఆస్పత్రులతో సహా అన్ని ప్రభుత్వ సేవలకు సొమ్ము వసూలు
ఆర్థిక వనరుల సమీకరణపై వ్యూహాలు రచించండి
టెలిఫోన్, పెట్రోల్, పత్రికల బిల్లులు పరిమితికి మించితే సంబంధితులే భరించాలి
జీరోస్థాయి బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించిన ఆర్థికశాఖ
ఈ నెల 31 వరకు శాఖాధిపతులతో సమావేశాలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి యూజర్ చార్జీల మోత మోగనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీరోస్థాయి బడ్జెట్‌ను రూపొందిస్తున్న ప్రభుత్వం అందుకు సంబంధించి అన్ని శాఖలకు మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలను జారీచేసింది. ప్రతి శాఖ ప్రణాళిక-ప్రణాళికేతర పద్దుల కింద చేసే కేటాయింపులకు ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి వ్యూహాన్ని రచించుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.

ఇందుకోసం పన్నులను, పన్నేతర వనరులను మరింత సమర్థంగా వసూలు చేయడంతో పాటు ప్రజల నుంచి వాటా రూ పంలో కొన్ని నిధులను సేకరించడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, యూజర్ చార్జీల వసూళ్లతోపాటు కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకోవడంపై దృష్టి సా రించాలని సూచించారు. ఆస్పత్రులతోపాటు స్థానిక సంస్థలతో సహా ప్రభుత్వం అందించే అన్ని రకాల పౌరసేవలకు యూజర్ చార్జీలు వసూలు చేయనున్నారు.

ఇందుకోసం ప్రతి మూడు నెలలకు, ఆర్థిక సంవత్సరానికి లక్ష్యాలను నిర్ధారించుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ లక్ష్యాలు సాధించాలని పేర్కొన్నారు. అవసరాలకు అనుగుణంగా ఫలితాలు సాధించేలా జీరోస్థాయి బడ్జెట్ రూపొందించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు..
ప్రస్తుతం ఉన్న పథకాలు, కార్యక్రమాలను పూర్తిస్థాయిలో సమీక్షించి అవసరం లేని వాటిని రద్దుచేస్తారు. పథకాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యతలు, లక్ష్యాలు నిర్ధారిస్తారు.
ఇప్పటికే మంజూరై పనులు ప్రారంభమైన పథకాలన్నింటినీ సమీక్షిస్తారు. మంజూరైనా పనులు ప్రారంభించని వాటిని రద్దుచేస్తారు.
పెండింగ్ బిల్లుల వివరాలను సేకరించి వాటి వాస్తవికతను ఒకసారి పరిశీలించాలి. వాటి చెల్లింపునకు ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద ప్రాధాన్యత క్రమంలో నిధుల కేటాయింపునకు ప్రతిపాదించాలి.
సంక్షేమ పథకాల లబ్ధిదారుల అర్హతను సమీక్షించాలి. ఇందుకోసం సాంకేతిక సహకారం తీసుకోవడం ద్వారా తక్కువ ఆర్థిక వనరులతో లక్ష్యాలను సాధించాలి.  
అన్ని శాఖలు ఉద్యోగుల సంఖ్య, వారికి తగి నట్లు పని ఉందా లేదా సమీక్షించాలి. మిగు లు ఉద్యోగులుంటే వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి ఉత్పాదకత పెంచే రంగాల్లో వారి సేవలను వినియోగించుకోవాలి.
సచివాలయం నుంచి మండల స్థాయి అధికారులు, ఉద్యోగుల వ్యక్తిగత పనితీరును అంచనా వేయాలి. అన్ని స్థాయిల్లోనూ త్రైమాసిక, వార్షిక లక్ష్యాలను నిర్ధారించటంతోపాటు ఆ లక్ష్యాలను సాధించిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. లక్ష్యాలు సాధించని వారికి కోతలు పెట్టాలి.
⇒  ప్రణాళికేతర పద్దు కింద కార్యాలయాల నిర్వహణ వ్యయం వీలైనంత తక్కువగా ఉండాలి. ఇందుకు ఆ కార్యాలయ ఉన్నతాధికారులే బాధ్యత వహించాలి.
నీటి చార్జీలు, విద్యుత్, టెలిఫోన్, పెట్రోల్ చార్జీలు, భవనాల అద్దెలను కొత్త ధరల ఆధారంగా లెక్కగట్టి పెండింగ్, భవిష్యత్తులో అయ్యే మొత్తాన్ని ప్రతిపాదించాలి.
చట్టబద్ధమైన సంస్థల కార్యాలయాల అద్దెలను నెలలు, సంవత్సరాల తరబడి చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. అద్దె బిల్లులను మూడు నెల ల తరువాత కూడా చెల్లించకపోతే సంబంధిత శాఖాధిపతి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఆర్థిక సంవత్సరంలో అటువంటి బిల్లులను పరిష్కరించని పక్షంలో బడ్జెట్ కేటాయింపులు మురిగిపోతాయి. తరువాత ఆ బడ్జెట్‌లో కేటాయించరు. సకాలంలో చెల్లించని అధికారి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసి అద్దె చెల్లిస్తారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ తక్కువ వినియోగం అయ్యే బల్బులు, సాధనాలను వినియోగించాలి. శాఖాధిపతులందరూ విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పు డు పరిశీలిస్తూ వీలైనంత తక్కువ విద్యుత్ బిల్లులు వచ్చే చర్యలు చేపట్టాలి. విద్యుత్ బిల్లుల్ని క్రమం తప్పకుండా చెల్లించాలి.
అధికారులు, ఉద్యోగులకు కేడర్, హోదా వారీగా ఇంటి టెలిఫోన్, నెలవారీ పెట్రోల్, డీజిల్ కోటాతో పాటు అద్దె వాహనం, నిర్వహణ, పత్రికలకు సంబంధించి వ్యయాన్ని ప్రభుత్వం నిర్ధారించింది. నిర్ధారించిన మొత్తానికి మించి పైసా కూడా ఇవ్వరు. ఎక్కువ వ్యయం అయితే వ్యక్తిగతంగా వారే చెల్లించుకోవాలి.
 
సమీక్షించిన అజేయ కల్లం
జీరో స్థాయి బడ్జెట్‌పై బుధవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లం శాఖాధిపతులతో సమీక్షలు ప్రారంభించారు. వ్యవసాయ, పౌరసరఫరాలు, పశు సంవర్థక, గృహనిర్మాణ రంగాల ఉన్నతాధికారులతో సమీక్షించారు. గురువారం ఉన్నత, పాఠశాల విద్య, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖల ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలతో పాటు ఏడు రంగాలకు సంబంధించి ప్రకటించిన మిషన్ల ఆధారంగా జరుగుతున్న ఈ సమీక్షలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement