ప్రయోజనం లేని పథకాలను పరిహరిద్దాం!
అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశం ఈనెల 30 లోగా బడ్జెట్ అంచనాలను పంపించాలని ఉత్తర్వులు
హైదరాబాద్: ప్రణాళికేతర పథకాల కొనసాగింపు అవసరమా..? అవసరం లేని పథకాలకు నిధులు కేటాయించకపోతే ఏర్పడే పరిణామాలు ఏమిటన్న వివరాలను లోతుగా పరిశీలించాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలను ఆదేశించింది. ఎలాంటి ప్రయోజనం లేని పథకాలను కొనసాగించడం కంటే వాటిని మూసేయడం, దశలవారీగా తగ్గించే అంశాలను కూడా పరిశీలించాలని స్పష్టం చేసింది. అలాంటి పథకాలకు నిధుల కోరే సమయంలో పూర్తి హేతుబద్ధత ఉండాలని సూచించాలని కోరింది. అనేక శాఖలు ఎలాంటి కసరత్తు లేకుండా బడ్జెట్ అంచనాలను పంపిస్తున్నాయని, అలా కాకుండా పూర్తిస్థాయి అధ్యయనం తరువాతే పంపించాలని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ అంచనాలను ఈనెల 30వ తేదీలోగా పంపించాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఆయా విభాగాల అధిపతులు తమ బడ్జెట్ అంచనాలను 25వ తేదీలోగా సంబంధిత శాఖల అధిపతులకు సమర్పిస్తే శాఖాధిపతుల స్థాయిలోనే వాటిని పరిశీలించాలని సూచించారు. కార్యాలయ వ్యయం కింద చూపే పద్దులో మంచినీరు, విద్యుత్ బిల్లుల అంశాన్ని స్పష్టంగా పేర్కొనాలని, ఏ అవసరం కోసం పరికరాలు కొనుగోలు చేస్తామన్న అంశాన్ని వివరించాల్సి ఉంటుందని ఆర్థికశాఖ పేర్కొంది. విద్యుత్, నీటి బకాయిలున్న పక్షంలో ఎంత మొత్తం బకాయిలున్నాయో వివరించడంతోపాటు, చెల్లించకపోవడానికి గల కారణాలను విశదీకరించాలని కోరారు. మరిన్ని ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయిప్రణాళిక వ్యయాన్ని ప్రణాళికేతర వ్యయాన్ని కలపడానికి వీల్లేదు.
తెలంగాణ రాష్ట్రానికి అనుగుణమైన ప్రణాళిక పథకాలనే అంచనాల్లో రూపొందించాలి.కొత్త పథకాలైతే ఎప్పుడు ప్రారంభించారు. ఎంత వ్యయం అయింది. ఈ సంవత్సరంలో ఎంత కావాల్సి ఉంది అన్న వివరాలను పొందుపర్చాలి. ఈ పథకాన్ని ఆమోదించిన తేదీని కూడా పేర్కొనాలి.ఆన్‌లైన్‌లో సంబంధిత శాఖలకు విభాగాల అధిపతులు అంచనాలను 25లోగా ఇవ్వాలి. ఆయా శాఖలు జూన్ 30లోగా ఆర్థిక శాఖకు పంపించాలి.జూన్ 30వ తేదీ తరువాత వచ్చే అంచనాలను బడ్జెట్‌లో పొందుపర్చడం సాధ్యం కాదు.ఆమోదించిన పథకంలో తొలగింపులు, మార్పులు చేయరాదు. ప్రస్తుతమున్న బడ్జెట్‌పై మరీ ఎక్కువ అంచనాలు వేసి పంపించవద్దు. ఒకవేళ బడ్జెట్ పెంచాల్సివస్తే.. అందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను జత చేయాలి.కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు, రేట్ కాంట్రాక్టు, పీరియడ్ ఆఫ్ కాంట్రాక్టు, ఎంతమంది ఉన్నారన్న వివరాలు ఇవ్వాలి.సబార్డినేట్ ఉద్యోగుల యూనిఫాం కోసం కేటాయించిన నిధులను ఇతరత్రా మళ్లించరాదు.