v.nagireddy
-
నాగిరెడ్డి మనోడే
జోగిపేట: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మెదక్ జిల్లా అందోలు నియోజకవర్గం పరిధిలోని పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట గ్రామానికి చెందిన వెంకమోళ్ల నాగిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. వి.నాగిరెడ్డి ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నాగిరెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శిగా వి.నాగిరెడ్డి పనిచేస్తున్నారు. వాస్తవానికి ఆయన 2015 ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఎన్నికల కమిషనర్‌గా నియమితులు కావాలంటే తప్పనిసరిగా పదవీ విరమణ చేయాలన్న నిబంధన ఉండడంతో నాగిరెడ్డిఅందుకు కూడా సిద్ధమయ్యారు. విద్యాభ్యాసం నాగిరెడ్డి స్వగ్రామమైన పెద్దారెడ్డిపేటలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు జోగిపేట ఉన్నత పాఠశాల, ప్రభుత్వ నెహ్రూ మెమోరియల్ కళాశాలలో అభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విద్యాలయంలో ఏజీ బీఎస్సీ పూర్తి చేశారు. బెంగుళూరులోని కళాశాలలో ఎమ్మెస్సీలో చేరారు. అనంతరం సివిల్స్ రాసి 1979-80లో ఐఎఫ్ఎస్ కర్ణాటక కేడర్‌కు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం మంగళగిరి డీఎఫ్ఓగా పనిచేశారు. అలా ఏడాదిన్నర డీఎఫ్ఓగా పనిచేసిన ఆయన, అనంతరం రెండో ప్రయత్నంగా ఐపీఎస్ కేడర్‌కు ఎంపికయ్యారు. అయితే ఎలాగైనా ఐఎఎస్ కావాలనుకున్న నాగిరెడ్డి 1984లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. నిర్వహించిన పదవులు 1982లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 1984లో సివిల్స్‌లో ఐఏఎస్‌గా ఎంపిక 1984లో కొత్తగూడెం, పెనుగొండ సబ్‌కలెక్టర్‌గా 1988-89లో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, 1989-91లో రంగారెడ్డి జిల్లా డీఆర్డీఏ పీడీగా, 1991-92లో హార్టికల్చర్ రాష్ట్ర డెరైక్టర్‌గా 1992-95లో విజయనగరం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. 1995లో కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్‌గా, 96-97లో అగ్రికల్చర్ అండ్ కో ఆపరేటివ్ జాయింట్ సెక్రటరీగా, 1997-98లో కడప కలెక్టర్‌గా 1999-2000లో ఏపీ రాష్ట్ర మార్కెటింగ్ ఎండీగా, 1999లో పంచాయతీ రాజ్ కమిషనర్‌గా, సహకార శాఖ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. 2004లో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గిరిజన, సంక్షేమ, పర్యాటక శాఖలకు అధికారిగా వ్యవహరించారు. సీఎంగా కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలోనూ పంచాయతీరాజ్, వ్యవసాయశాఖల ప్రధాన కార్యదర్శిగా, ఎన్జీరంగా విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. -
తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా నాగిరెడ్డి!
సీఎస్‌గా నియమించాలని మొదట్లో యోచించిన సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా లేకపోవడంతో పునరాలోచన ప్రస్తుతం ఆర్థిక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా వి.నాగిరెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నాగిరెడ్డి.. వచ్చే ఏడాది ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ఎన్నికల కమిషనర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తర్వాత ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో.. కమిషనర్‌ను నియమించాల్సి ఉంది. అలాగే పలు కారణాలవల్ల పోలింగ్ ఆగిపోయినా, ఖాళీ అయిన స్థానాలకూ ఎన్నికలు నిర్వహించాలి. కమిషనర్‌ను నియమించకపోతే.. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కమిషనర్‌ను నియమించాలని సర్కారు భావిస్తోంది. సమావేశాల తర్వాత ఐఏఎస్‌కు రాజీనామా.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. తెలంగాణ, అందులోనూ మెదక్ జిల్లాకు చెందిన నాగిరెడ్డికి కీలక పదవి అప్పగించాలని సీఎం కేసీఆర్ మొదట్లోనే నిర్ణయించారు. ఒక దశలో ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా లేకపోవడం ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు మాత్రమే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. నాగిరెడ్డి 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన కంటే ముందు బ్యాచ్ (1983 వారికి) అధికారులకు కూడా ఇంకా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు లభించలేదు. వచ్చే సంవత్సరం మొదట్లో 1983 బ్యాచ్ అధికారులందరికీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా నాగిరెడ్డికి పదోన్నతి లభించే అవకాశం లేకపోవడంతో.. ఆయన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగానే త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలిసింది. నవంబర్ 5 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు పూర్తయ్యాకఐఏఎస్ పదవికి నాగిరెడ్డి రాజీనామా చేసి, ఆ వెంటనే ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యలు స్వీకరించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరిని ఇక్కడే ఉంచండి ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులను ఇక్కడే కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య తదితరులను ఇక్కడే ఉంచాలని తెలంగాణ సర్కారు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. -
రుణమాఫీ, రీషెడ్యూల్‌పై కమిటీ నియామకం
హైదరాబాద్: రైతుల రుణమాఫీ, రుణాల రీషెడ్యూల్‌పై తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి ఛైర్మన్‌గా ఉంటారు. మరో 11 మంది సభ్యులు ఉంటారు. రెవిన్యూ, ఆర్థిక, వ్యవసాయ శాఖల ముఖ్యకార్యదర్శులు, రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కన్వీనర్ సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. రుణమాఫీ, రుణాల రీషెడ్యూల్‌పై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఆ తరువాత ఒక సమగ్ర నివేదికను తయారు చేసి తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తుంది. -
ప్రయోజనం లేని పథకాలను పరిహరిద్దాం!
అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశం ఈనెల 30 లోగా బడ్జెట్ అంచనాలను పంపించాలని ఉత్తర్వులు హైదరాబాద్: ప్రణాళికేతర పథకాల కొనసాగింపు అవసరమా..? అవసరం లేని పథకాలకు నిధులు కేటాయించకపోతే ఏర్పడే పరిణామాలు ఏమిటన్న వివరాలను లోతుగా పరిశీలించాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలను ఆదేశించింది. ఎలాంటి ప్రయోజనం లేని పథకాలను కొనసాగించడం కంటే వాటిని మూసేయడం, దశలవారీగా తగ్గించే అంశాలను కూడా పరిశీలించాలని స్పష్టం చేసింది. అలాంటి పథకాలకు నిధుల కోరే సమయంలో పూర్తి హేతుబద్ధత ఉండాలని సూచించాలని కోరింది. అనేక శాఖలు ఎలాంటి కసరత్తు లేకుండా బడ్జెట్ అంచనాలను పంపిస్తున్నాయని, అలా కాకుండా పూర్తిస్థాయి అధ్యయనం తరువాతే పంపించాలని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ అంచనాలను ఈనెల 30వ తేదీలోగా పంపించాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆయా విభాగాల అధిపతులు తమ బడ్జెట్ అంచనాలను 25వ తేదీలోగా సంబంధిత శాఖల అధిపతులకు సమర్పిస్తే శాఖాధిపతుల స్థాయిలోనే వాటిని పరిశీలించాలని సూచించారు. కార్యాలయ వ్యయం కింద చూపే పద్దులో మంచినీరు, విద్యుత్ బిల్లుల అంశాన్ని స్పష్టంగా పేర్కొనాలని, ఏ అవసరం కోసం పరికరాలు కొనుగోలు చేస్తామన్న అంశాన్ని వివరించాల్సి ఉంటుందని ఆర్థికశాఖ పేర్కొంది. విద్యుత్, నీటి బకాయిలున్న పక్షంలో ఎంత మొత్తం బకాయిలున్నాయో వివరించడంతోపాటు, చెల్లించకపోవడానికి గల కారణాలను విశదీకరించాలని కోరారు. మరిన్ని ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయిప్రణాళిక వ్యయాన్ని ప్రణాళికేతర వ్యయాన్ని కలపడానికి వీల్లేదు. తెలంగాణ రాష్ట్రానికి అనుగుణమైన ప్రణాళిక పథకాలనే అంచనాల్లో రూపొందించాలి.కొత్త పథకాలైతే ఎప్పుడు ప్రారంభించారు. ఎంత వ్యయం అయింది. ఈ సంవత్సరంలో ఎంత కావాల్సి ఉంది అన్న వివరాలను పొందుపర్చాలి. ఈ పథకాన్ని ఆమోదించిన తేదీని కూడా పేర్కొనాలి.ఆన్లైన్లో సంబంధిత శాఖలకు విభాగాల అధిపతులు అంచనాలను 25లోగా ఇవ్వాలి. ఆయా శాఖలు జూన్ 30లోగా ఆర్థిక శాఖకు పంపించాలి.జూన్ 30వ తేదీ తరువాత వచ్చే అంచనాలను బడ్జెట్లో పొందుపర్చడం సాధ్యం కాదు.ఆమోదించిన పథకంలో తొలగింపులు, మార్పులు చేయరాదు. ప్రస్తుతమున్న బడ్జెట్‌పై మరీ ఎక్కువ అంచనాలు వేసి పంపించవద్దు. ఒకవేళ బడ్జెట్ పెంచాల్సివస్తే.. అందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను జత చేయాలి.కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు, రేట్ కాంట్రాక్టు, పీరియడ్ ఆఫ్ కాంట్రాక్టు, ఎంతమంది ఉన్నారన్న వివరాలు ఇవ్వాలి.సబార్డినేట్ ఉద్యోగుల యూనిఫాం కోసం కేటాయించిన నిధులను ఇతరత్రా మళ్లించరాదు.