ఫైనాన్షియల్ బేసిక్స్ ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ ఎలా? | Financial Basics of Economic Affairs On Regulation How? | Sakshi
Sakshi News home page

ఫైనాన్షియల్ బేసిక్స్ ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ ఎలా?

Published Sun, Oct 11 2015 11:59 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

ఫైనాన్షియల్ బేసిక్స్ ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ ఎలా? - Sakshi

ఫైనాన్షియల్ బేసిక్స్ ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ ఎలా?

ఆదాయం మాట ఎలా ఉన్నా.. కాలం గడిచే కొద్దీ ఖర్చులు మాత్రం పెరుగుతూ వస్తాయి. అలాగే కొన్ని సార్లు ఊహించని పరిణామాలు కూడా సంభవించవచ్చు. అప్పుడు భారీ మొత్తంలో డబ్బులు అవసరమౌతాయి. అలాంటప్పుడు మన  పరిస్థితితేంటి? ఎవరికైతే ఆర్థిక వ్యవ హారాలపై సరైన నియంత్రణ ఉంటుందో వారు వారి జీవితాన్ని ఎలాంటి సమయాల్లోనైనా ఒడిదుడుకులు లేకుండా సాఫీగా జీవించడానికి ఆస్కారం ఉంది. అయితే ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణను ఎలా సాధించాలి?
 
అంతా మీ చేతుల్లోనే...
ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ముందుగా మీ ఆదాయ వ్యయాలకు తగిన బడ్జెట్‌ను రూపొం దించుకోండి. బడ్జెట్ రూపకల్పనకు అధిక ప్రాధాన్యమివ్వండి. బడ్జెట్ ఏర్పాటుకు సమయాన్ని కేటాయించండి . ఇప్పుడు మీ మదిలో బడ్జెట్‌ను ఎలా రూపొందించుకోవాలి? బడ్జెట్‌లో ఎలాంటి విషయాలు ఉంటాయి? వంటి తదితర ప్రశ్నలు తలెత్తి ఉంటాయి. వాటిని ఒకసారి నివృత్తి చేసుకుందాం..
 
లక్ష్యాలను నిర్దేశించుకోండి...

ఈ నెలలో ఆదాయంలో 50 శాతాన్ని మాత్రమే ఖర్చు చేయాలి... అలాగే కనీసం 30 శాతమైనా పొదుపు చేయాలి అనే కొన్ని ఆర్థిక లక్ష్యాలను పెట్టుకోండి. ఈ విధంగా లక్ష్యాలను నిర్దేశించుకోవడం వల్ల మీరు మీ ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ వస్తుంది. అలాగే ఖర్చులను కేటగిరైజ్ చేసుకోండి. ప్రతి దానికి బడ్జెట్‌లో కొంత  మొత్తాన్ని కేటాయించుకోండి. ప్రతి నెల మీ బడ్జెట్‌ను సమీక్షించుకోండి. దీన్ని ఒక అలవాటుగా రూపొందించుకోండి. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి ఇంకా ఎలాంటి మార్గంలో నడవాలో తెలుసుకోండి.
 
బడ్జెట్‌ను రూపొందించుకోండి ఇలా...
ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను గుర్తించి బడ్జెట్ రూపకల్పన జరగాలి. బడ్జెట్‌లో ప్రధానంగా రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ఆదాయం, రెండవది ఖర్చులు. వేతనం, ఇతర మార్గాల నుంచి వచ్చే మీ ఆదాయానికి సంబంధించిన అన్ని పత్రాలను భద్రంగా సేకరించండి. అలాగే మీ ఖర్చులకు సంబంధించిన వివరాలను కూడా మీ వద్ద ఉంచుకోండి.

ఇప్పుడు ఆ రెండింటికీ సంబంధించిన డాక్యుమెంట్ల ఆధారంగా సరైన బడ్జెట్‌ను రూపొందించుకోండి. అంటే ఉదాహరణకు ఒక నెలలో మీ ఆదాయం, మీరు చేసిన ఖర్చుల వివరాలను నోట్ చేసుకోండి. వేతనం, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని నోట్ చేసుకోండి. అలాగే పెట్రోల్, డీజిల్ ఖర్చు, ఇంటి అద్దె, షాపింగ్, వైద్య ఖర్చులు, రోజువారీ భోజన ఖర్చులు వంటి తదితర ఖర్చుల వివరాలను ట్రాక్ చేసుకోండి.

ఇప్పుడు పలు  మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీ రోజువారీ ఆదాయ వ్యయాలను ట్రాక్ చేయడం చాలా సులువు. ఈ విధంగా నెల మొత్తంగా ఆదాయ, వ్యయాలను నోట్ చేసుకున్న తర్వాత నెల చివరి రోజు మీ మొత్తం ఆదాయం నుంచి ఖర్చులను తీసేయండి. అప్పుడు మీ ఆదాయం మిగిలితే మీరు సరైన దారిలోనే ఉన్నట్లు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటే అప్పుడు మీ దారిని ఒకసారి పరీక్షించుకోవాల్సి ఉంది.
 
APPకీ కహానీ...
 
ఆర్థిక వివరాలు డ్రాప్‌బాక్స్‌లోకి...!
మీరు మీ వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల నిర్వహణ కోసం చక్కటి యాప్ గురించి వెతుకుతున్నారా? అయితే మీ వెతుకులాటను ఇక ఆపండి. ‘ఎక్స్‌పెన్సెస్ మేనేజర్’ అనే యాప్‌ను వినియోగించి చూడండి. ఈ యాప్ చాలా సింపుల్‌గా, చాలా ప్రత్యేకతలతో లభిస్తోంది. ఎక్స్‌పెన్సెస్ మేనేజర్ యాప్ సాయంతో మీ ఆదాయ, వ్యయాలతో కూడిన బడ్జెట్ నిర్వహణ సులభతరం అవుతుంది.
 
ప్రత్యేకతలు
* మీ ఆదాయ, వ్యయాలను రోజువారీగా, వారంగా, నెలవారీగా, ఏడాది సమయంలో ఎంతున్నాయో ఒకే సమయంలో తెలుసుకోవచ్చు.
* ఖర్చులను కేటగిరైజ్ చేసుకునే వీలుంది.
* మీరు చెల్లించాల్సిన బకాయిలను అలర్ట్స్ రూపంలో రిమైండర్‌లో పెట్టుకోవచ్చు.
* మీ ఆదాయ వ్యయాల వివరాలను డ్రాప్ బాక్స్‌లోకి కానీ, గూగుల్ డ్రైవ్‌లోకి కానీ లేదా మెమరీ కార్డులోకి బ్యాక్ అప్ చేసుకునే ఆప్షన్ ఉంది.
క్యాలెండర్‌లో నక్షత్రం, తిథీ, రాహుకాలం వంటి అంశాలను ఏవిధంగా చూస్తామో... అలాగే యాప్‌లో మనం రోజువారీగా ఖర్చులను క్యాలెండర్‌లో కనిపించే తెరపై తేదీ ప్రకారం చూసుకోవచ్చు.
* చేసే ఖర్చు ఎప్పుడు చేశాం, ఏ ప్రాంతంలో చేశాం, ఎందుకు చేశామనే అంశాలను నోట్ చేసుకోవచ్చు.
* ఆదాయ వ్యయాలను చార్ట్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో చూసుకోవచ్చు.
* క్యాలిక్యులేటర్, కరెన్సీ కన్వర్టర్, ట్యాక్స్ క్యాలిక్యులేటర్, లోన్ క్యాలిక్యులేటర్ వంటి తదితర టూల్స్ కూడా ఉన్నాయి.
* ఇతరులు ఈ యాప్‌ను వినియోగించకుండా పిన్‌ను సెట్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement