గ్రేటర్ బడ్జెట్‌కు అంచనాలేవి ?
గడువు దాటినా గడప దాటని కసరత్తు
నోటీసులు జారీ చేసినా స్పందించని విభాగాలు
వరంగల్ అర్బన్(వరంగల్ తూర్పు) : వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాల రూపకల్పనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వివిధ విభాగాల నుంచి తగిన సహకారం లేకపోవడం, సమాచారం ఇవ్వడంలో వైఫల్యం వంటి కారణాలు గ్రేటర్‌కు శాపంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆదాయ, వ్యయాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాల్సిన అధికార పాలక యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది.
చట్టం ఏం చెబుతోందంటే..!
స్థానిక సంస్థల ఆదాయం, వ్యయాన్ని మదుపు చేసేందుకు రూపొందించిన శాసనబద్ధమైన ప్రక్రియే లెక్కాపద్దులు(బడ్జెట్). ప్రతి యేటా ఆదాయ వనరులు, వ్యయ అంచనా రూపొందించే ఈ ప్రక్రియ పురపాలక సంఘాలకు ఆయువుపట్టు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పురపాలక సంస్థలు ప్రతి ఏటా డిసెంబర్ 15వ తేదీలోగా మహానగర మేయర్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ ఆమోదం పొంది, డిసెంబర్ 31వ తేదీలోగా ఆదాయ, వ్యయాలను రూపొందించి ప్రభుత్వానికి పంపాలి. కానీ బల్దియా అధికార యంత్రాంగం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.
హద్దు‘పద్దు’లేని పాలన..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ 2016–17 కేటాయింపులు, వ్యయం వంటి వివిధ అంశాలకు సంబంధించిన ప్రక్రియకు మరో రెండున్నర నెలల్లో ముగింపు పలకాల్సి ఉంది. ఈ లోగా నూతన ఆర్థిక సంవత్సరానికి 2017–18 సంవత్సరానికి అవసరమైన ఆదాయ, వ్యయాలకు సంబంధించిన బడ్జెట్ అంచనాల రూపకల్పన పూర్తి చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి అన్ని విభాగాల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి ముందస్తు అంచనాలు డిసెంబర్ 15 నాటికి అందించాల్సి ఉంది. మేయర్ అధ్యక్షతన జరిగే స్థాయి సంఘం ముందుకు పరిశీలనతోపాటు అనుమతి కోసం బడ్జెట్ అంచనాలను పంపాల్సి ఉంటుంది. గడువుదాటి నెల రోజులవుతున్నా అధికారులు మాత్రం ముందస్తు అంచనాలను అందించలేకపోయారు. అదేమంటే ఇప్పటికే పలు కీలకమైన విభాగాల నుంచి పూర్తి సమాచారం అందలేదన్న వాదనలు వినవస్తున్నాయి.
రెండు నోటీసులు జారీ చేసినా ఫలితం శూన్యం
గ్రేటర్‌లోని వివిధ విభాగాలకు డిసెంబర్ మొదటి వారంలో నోటీసులు జారీ చేశారు. పక్షం రోజుల్లో అంచనాలు తయారు చేసి అందించాలని కోరారు. నెలఖారులోగా మరో ఏడు రోజులతో కూడిన నోటీసును అందించారు. అయినా ఆయా విభాగాల అధికారులు అంచనాల రూపకల్పన, వివరాలు అందించడంలో పూర్తిగా అలక్ష్యం చేస్తున్నారు. నూతన బడ్జెట్ అంచనాల్లో మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలోపు వెచ్చించగల గణాంకాలతోపాటు అవసరమైన వ్యయాల వివరాలు, నూతన ఆర్థిక సంవత్సరానికి అంచనాలు వీరు ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు గ్రేటర్‌లో అమలవుతున్న కీలక పథకాలకు వెచ్చించిన వ్యయం, భవిష్యత్‌లో రావాల్సిన నిధులు, ప్రభుత్వ నిధులు అందుకు అనువుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రాతిపదికన అంచనాలను పూర్తి స్థాయిలో క్రోడీకరించి పంపాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మార్చిలోగా చేపట్టే పనులకు, అలాగే ఇంకా మిగిలిపోయే పనులకు, కొనసాగించాల్సిన పనులకు తగిన ఆర్థిక కేటాయింపులకు పాలక పక్షానికి తగిన అవకాశం చిక్కుతోంది.
పాలకులు తమ ప్రాధామ్యాలు, హామీలు, నెరవేర్చుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ విషయాల్లో అటు పాలకులు, ఇటు అధికారులకు కనీస స్పృహ లేకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా స్పందించగలిగితే అనుకున్న గడువులోగా బడ్జెట్ ఆమోదం దక్కడం కష్టమేమి కాదు.