Warangal metropolitan governing body
-
గ్రేటర్ బడ్జెట్‌కు అంచనాలేవి ?
గడువు దాటినా గడప దాటని కసరత్తు నోటీసులు జారీ చేసినా స్పందించని విభాగాలు వరంగల్ అర్బన్(వరంగల్ తూర్పు) : వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాల రూపకల్పనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వివిధ విభాగాల నుంచి తగిన సహకారం లేకపోవడం, సమాచారం ఇవ్వడంలో వైఫల్యం వంటి కారణాలు గ్రేటర్‌కు శాపంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆదాయ, వ్యయాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాల్సిన అధికార పాలక యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. చట్టం ఏం చెబుతోందంటే..! స్థానిక సంస్థల ఆదాయం, వ్యయాన్ని మదుపు చేసేందుకు రూపొందించిన శాసనబద్ధమైన ప్రక్రియే లెక్కాపద్దులు(బడ్జెట్). ప్రతి యేటా ఆదాయ వనరులు, వ్యయ అంచనా రూపొందించే ఈ ప్రక్రియ పురపాలక సంఘాలకు ఆయువుపట్టు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పురపాలక సంస్థలు ప్రతి ఏటా డిసెంబర్ 15వ తేదీలోగా మహానగర మేయర్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ ఆమోదం పొంది, డిసెంబర్ 31వ తేదీలోగా ఆదాయ, వ్యయాలను రూపొందించి ప్రభుత్వానికి పంపాలి. కానీ బల్దియా అధికార యంత్రాంగం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. హద్దు‘పద్దు’లేని పాలన.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ 2016–17 కేటాయింపులు, వ్యయం వంటి వివిధ అంశాలకు సంబంధించిన ప్రక్రియకు మరో రెండున్నర నెలల్లో ముగింపు పలకాల్సి ఉంది. ఈ లోగా నూతన ఆర్థిక సంవత్సరానికి 2017–18 సంవత్సరానికి అవసరమైన ఆదాయ, వ్యయాలకు సంబంధించిన బడ్జెట్ అంచనాల రూపకల్పన పూర్తి చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి అన్ని విభాగాల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి ముందస్తు అంచనాలు డిసెంబర్ 15 నాటికి అందించాల్సి ఉంది. మేయర్ అధ్యక్షతన జరిగే స్థాయి సంఘం ముందుకు పరిశీలనతోపాటు అనుమతి కోసం బడ్జెట్ అంచనాలను పంపాల్సి ఉంటుంది. గడువుదాటి నెల రోజులవుతున్నా అధికారులు మాత్రం ముందస్తు అంచనాలను అందించలేకపోయారు. అదేమంటే ఇప్పటికే పలు కీలకమైన విభాగాల నుంచి పూర్తి సమాచారం అందలేదన్న వాదనలు వినవస్తున్నాయి. రెండు నోటీసులు జారీ చేసినా ఫలితం శూన్యం గ్రేటర్‌లోని వివిధ విభాగాలకు డిసెంబర్ మొదటి వారంలో నోటీసులు జారీ చేశారు. పక్షం రోజుల్లో అంచనాలు తయారు చేసి అందించాలని కోరారు. నెలఖారులోగా మరో ఏడు రోజులతో కూడిన నోటీసును అందించారు. అయినా ఆయా విభాగాల అధికారులు అంచనాల రూపకల్పన, వివరాలు అందించడంలో పూర్తిగా అలక్ష్యం చేస్తున్నారు. నూతన బడ్జెట్ అంచనాల్లో మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలోపు వెచ్చించగల గణాంకాలతోపాటు అవసరమైన వ్యయాల వివరాలు, నూతన ఆర్థిక సంవత్సరానికి అంచనాలు వీరు ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు గ్రేటర్లో అమలవుతున్న కీలక పథకాలకు వెచ్చించిన వ్యయం, భవిష్యత్‌లో రావాల్సిన నిధులు, ప్రభుత్వ నిధులు అందుకు అనువుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రాతిపదికన అంచనాలను పూర్తి స్థాయిలో క్రోడీకరించి పంపాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మార్చిలోగా చేపట్టే పనులకు, అలాగే ఇంకా మిగిలిపోయే పనులకు, కొనసాగించాల్సిన పనులకు తగిన ఆర్థిక కేటాయింపులకు పాలక పక్షానికి తగిన అవకాశం చిక్కుతోంది. పాలకులు తమ ప్రాధామ్యాలు, హామీలు, నెరవేర్చుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ విషయాల్లో అటు పాలకులు, ఇటు అధికారులకు కనీస స్పృహ లేకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా స్పందించగలిగితే అనుకున్న గడువులోగా బడ్జెట్ ఆమోదం దక్కడం కష్టమేమి కాదు. -
కార్పొరేషన్ పోలింగ్ ప్రశాంతం
గ్రేటర్ వరంగల్‌లో 60.28 శాతం ఖమ్మంలో 67.68 శాతం అచ్చంపేటలో 70.88 శాతం ‘వరంగల్ తూర్పు’లో ఘర్షణలు సాక్షి నెట్వర్క్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు అచ్చంపేట నగర పంచాయతీ పోలింగ్ చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో 60.28 శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 67.68 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు ప్రకటించారు. అచ్చం పేట నగర పంచాయతీ పరిధిలో 70.88 శాతం పోలింగ్ జరిగింది. గ్రేటర్ వరంగల్‌లో మొత్తం 6,43,863 మంది ఓటర్లు ఉన్నారు. గ్రేటర్లో కొత్తగా విలీనమైన శివారు ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువగా జరిగింది. నగరంలోని 36వ డివి జన్ పరిధిలోని కాజీపేట రైల్వే మిక్స్డ్ హైస్కూల్ పోలింగ్ బూత్ బయట రైల్వే జేఏసీ నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోల్ చీటీలు పంచుతుండగా ధర్మసాగర్ ఎస్ఐ దేవేందర్ ఎలాంటి హెచ్చరికలూ చేయకుండా రైల్వే జేఏసీ నేతలు, రాజకీయ పార్టీల నేతలపై లాఠీచార్జి చేశారు. లాఠీచార్జిని నిరసిస్తూ రైల్వే జేఏసీ నేతలు అరగంట పాటు ధర్నా చేశారు. అలాగే, ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ 44వ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పరస్పర దాడులు చేసుకున్నారు. 47వ డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ, ఆ పార్టీకి చెందిన ఈవీ సతీశ్ ఇంటిపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. 40వ డివిజన్లో తెలుగుదేశం అభ్యర్థి మారగాని కీర్తి కిరణ్‌గౌడ్ ఓటు గల్లంతైంది. తన డివిజన్లో పరిధిలో తన కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు చెందిన 65 ఓట్లు గల్లంతయ్యాయంటూ కీర్తి కిరణ్ ఆరోపించారు. 15వ డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి శారద భర్త సురేష్ జోషిపై అధికార పార్టీ అభ్యర్థి భర్త సాదిక్ డాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సురేష్‌జోషి చేతికి, ఛాతీలో దెబ్బలు తగిలాయి. 13, 20 డివిజన్లలో బరిలో ఉన్న అధికార పార్టీ రెబెల్ అభ్యర్థులు, అనుచరులపై అధికార పార్టీ అభ్యర్థికి చెందిన అనుచరులు దాడి చేసిన ఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 2,65,710 మంది ఓటర్లు ఉండగా.. 1,79,827 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ ఉద యం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 3గంటల వరకు 57.54 శాతం పోలింగ్ పూర్తికాగా.. ఆ తర్వాత మందకొడిగా సాగింది. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో 18,614 మంది ఓటర్లు ఉండగా 13,193 మం ది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్పీ పి.విశ్వప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఖమ్మంలో నకిలీ ఓటరు కార్డులు.. ఖమ్మంలోని 22వ డివిజన్లో భారీగా నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను టీడీపీ, ైవైఎస్సార్సీపీ నేతలు పట్టుకున్నారు. రోటరీనగర్‌లోని ఓ డీటీపీ సెంటర్ నిర్వాహకుడితో.. ఎన్నికల అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఓటరు కార్డులు రూపొందించారు. 1,500కుపైగా కార్డులు తయారు చేశారని, 750 కార్డులు మాత్రం బయటకు వచ్చినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ పోలింగ్ కేంద్రం సమీపంలోని ఓ టైలర్ షాపులో నకిలీ ఓటరు గుర్తింపు కార్డుతో పాటు, రూ.2 వేల నగదును ఇస్తుండటాన్ని గమంచిన టీడీపీ అభ్యర్థి బంధువులు వీటిపై ఆరా తీశారు. టైలర్ షాపులో భారీగా ఉన్న గుర్తింపు కార్డులను టీడీపీ నాయకులు పట్టుకోవడంతో.. టీడీపీ, టీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి పద్మజారెడ్డి, టీడీపీ అభ్యర్థి సరిపుడి సతీష్‌లు, నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను బయటకు తీసుకొచ్చి రోడ్డుపై పోసి ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ నేతలు ఉన్న టైలర్‌షాపు నుంచి తీసుకొచ్చిన 250 నకిలీ ఓట్ల గుర్తింపు కార్డులను మీడియాకు చూపించారు. ఎంపీ పొంగులేటి ఆగ్రహం: నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ నకిలీ వ్యవహారం అధికారులకు తెలిసినా చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నకిలీ గుర్తింపు కార్డులతో చాలా మంది ఓటు వేశారని, ఇక్కడ వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశా రు. కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి అధికారులు కొమ్ము కాస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఓటర్లుగా చేర్పిం చి ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. కొత్త ఓటర్లపై విచారణ చేయకుండా అధికారులు ఓటు హక్కు కల్పించారన్నారు. దీనికి కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు సైతం సహకరించారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్యలు అక్కడకు చేరుకొని రీపోలింగ్ నిర్వహించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల ఆందోళనతో చాలాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డుపై వేసిన నకిలీ గుర్తింపు కార్డులను అక్కడే ఉన్న ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవి అసలువా..? నకిలీవా అని గుర్తించేందుకు వాటిని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దీనిపై స్పష్టత ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు అభ్యర్థులకు హామీ ఇచ్చారు. ఈవీఎంలకు ప్రింటర్లు దేశంలోనే తొలిసారిగా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లను అనుసంధానం చేశారు. 50 డివిజన్లకు గాను 265 పోలింగ్ కేంద్రాలుండగా, 25 కేంద్రాల్లో ప్రింటింగ్ మిషన్లు అనుసంధానం చేశారు. -
నేడే పోలింగ్
‘గ్రేటర్’లో తొలి పాలకమండలికి ఎన్నికలు ఉదయం 7 నుంచి 5 వరకు ఓటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు అవసరమైన చోట 8న రీపోలింగ్ మొత్తం డివిజన్లు : 58 మొత్తం ఓటర్లు : 6,43,862 పోటీలో ఉన్న అభ్యర్థులు : 398 పోలింగ్ కేంద్రాలు : 660 ఎన్నికల సిబ్బంది : 3,630 హన్మకొండ : రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా వరంగల్ గుర్తింపు పొందింది. గ్రేటర్ హోదా దక్కిన తర్వాత వరంగల్ మహానగర పాలక సంస్థకు తొలిసారిగా ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ నగర పాలక సంస్థను గ్రేటర్ వరంగల్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ 2015 ఏప్రిల్ 7న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. హైదరాబాద్‌తో పాటు ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. మేడారం జాతర నేపథ్యంలో ఆలస్యమైంది. ఎట్టకేలకు ఫిబ్రవరి 21న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. గ్రేటర్లో పాగా వేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కదనరంగంలోకి దూకాయి. అధికార పార్టీ తరఫున హరీశ్‌రావు ప్రచార బాధ్యతలు చేపట్టగా బీజేపీ తరఫున కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ప్రచారం చేశారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. 6,43,862 మంది ఓటర్లు గ్రేటర్ వరంగల్ జనాభా ప్రస్తుతం పది లక్షలుగా ఉంది. ఇందులో ఓటర్ల సంఖ్య 6,43,862 లక్షలు. వీరిలో స్త్రీలు 3,20,575 ఉండగా.. పురుషులు 3,23,166, ఇతరులు 121 మంది ఉన్నారు. 58 డివిజన్లు ఉండగా 398 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా 46వ డివిజన్లో 13,040 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా 36వ డివిజన్లో 8,819 మంది ఓటర్లు ఉన్నారు. పోటీలో అత్యధికంగా 6వ డివిజన్లో పన్నెండు మంది అభ్యర్థులు ఉండగా.. అత్యల్పంగా 17, 21, 29 డివిజన్లలో కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే ఎన్నికల బరిలో నిల్చున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 58 డివిజన్లలో అభ్యర్థులను నిలిపింది. 154 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మార్చి 8న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల విధుల్లో 3,630 మంది ఏనుమాముల మార్కెట్ నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు శనివారం చేరవేశారు. గ్రేటర్ ఎన్నికల పరిశీలకుడు విజయ్‌కుమార్, అదనపు ఎన్నికల అధికారి, వరంగల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఈ పనులను పర్యవేక్షించారు. నగర పరిధిలో 58 డివిజన్లు ఉండగా 660 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్లు వేసేందుకు పోలింగ్ బూత్‌కు ఒకటి చొప్పున మొత్తం 660 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అందుబాటులో ఉంచారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే అత్యవసరంగా ఉపయోగించేందుకు మరో 116 ఈవీఎంలను అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్కో బూత్‌కు సగటున ఐదుగురు చొప్పున పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిశీలకులుగా 24 మంది, సర్వే స్టాటిస్టికల్ అధికారులుగా 32 మంది, ఫ్లైయింగ్ స్క్వాడ్‌గా 24 మంది, మోడల్ ఆఫీసర్లుగా 21 మంది, రూట్ ఆఫీసర్లుగా 29 మంది, సెక్టోరియల్ అధికారులుగా 29 మందిని నియమించారు. మొత్తంగా 3,630 మంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. వీరుకాకుండా మరో 500 మంది ఉద్యోగులను అందుబాటులో ఉంచారు. సమస్యాత్మకమైనవి ఎక్కువే.. మొత్తం పోలింగ్ కేంద్రాలు 660 ఉండగా వీటిలో సమస్యాత్మక కేంద్రాలు 429 ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని నిర్వహించేందుకు 700 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల సహకారం తీసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ తలెత్తకుండా నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల బందోబస్తు కోసం ఇతర జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బందిని రప్పించారు. 9వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
గ్రేటర్ ప్రణాళికలు సిద్ధం
ఐదు నియోజకవర్గాల్లో రూ.140 కోట్లతో 800 పనులు సీసీ రోడ్లకు అత్యధికంగారూ. 53 కోట్లు శ్మశాన వాటికలపై ప్రత్యేక శ్రద్ధ ఎమ్మెల్యేల ప్రతిపాదనల ఆధారంగా నివేదిక హన్మకొండ :వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో విస్తరించి ఉన్న ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం భారీ ప్రణాళిక సిద్ధమైంది. నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేలు పంపిన ప్రతిపాదనల ఆధారంగా దాదాపు రూ.140 కోట్లతో 800 పనులు చేపట్టేందుకు బల్దియా యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సమీక్ష సమావేశంలో ప్రతిపాదనలు సమర్పించారు. అత్యధికంగా వర్ధన్నపేటలో.. గ్రేటర్ వరంగల్ కార్పొరేషను ఇటీవల 58 డివిజన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ డివిజన్ల పరిధిలోఐదు శాసన సభ నియోజకర్గాలు ఉన్నాయి. వీటిలో 24 డివిజన్లు వరంగల్ తూర్పు, 23 డివిజన్లు వరంగల్ పశ్చిమ, 9 డివిజన్లు వర్ధన్నపేట, 2 డివిజన్లు పరకాల, ఒక గ్రామం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల పరిధిలోకి వస్తున్నాయి. తమ నియోజకర్గాల పరిధిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలు ఎమ్మెల్యేలు ఇప్పటికే అందచేశారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా ప్రతీ డివిజన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల జాబితాను కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధం చేసింది. వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకర్గం కార్పొరేషన్ చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమలతో పోల్చితే అభివృద్ధి పరంగా వెనకబడి ఉంది. సీసీ రోడ్లకు అత్యధిక వ్యయం ఐదు నియోజకవర్గాల పరిధిలో మౌలిక సదుపాయల కోసం రూ.139 కోట్ల వ్యయంతో ప్రధానంగా మౌలిక సదుపాయల కల్పనకే పెద్దపీట వేశారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్డు, సీసీ డ్రైయిన్లు, పైపులైన్లు, శ్మశానవాటికల అభివృద్ధి, జంక్షన్ల విస్తరణ, లేబర్షెడ్, పార్కులు, వెండింగ్ జోన్లు, మార్కెట్లు ఉన్నాయి. వీటిలో అత్యధిక వ్యయాన్ని సీసీరోడ్ల కోసం కేటాయించారు. మొత్తం రూ53.69కోట్ల వ్యయం తో 361 సీసీ రోడ్లు వేయాలంటూ ప్రతిపాదనలు అందగా.. దాదాపు అన్నింటికీ ఆమోదం లభించింది. సీసీ రోడ్ల తర్వాత డ్రైయిన్లకు ప్రాధాన్యత లభించింది. డ్రెయిన్ల కోసం రూ.29.02 కోట్లు వ్యయం చేస్తూ 201 పనులు చేపడతారు. మంచినీటి సరఫరా మెరుగుపరిచేందుకు రూ9.88 కోట్ల వ్యయంతో 67 ప్రాంతాల్లో కొత్తగా పైపులైన్లు ఏర్పాటు చేస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో ఉన్న శ్మశానవాటికలలో మౌలిక సదుపాయల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. 58 డివిజన్ల పరిధిలో రూ.18.69 కోట్ల వ్యయంతో 89 పనులు చేపడుతున్నారు. వీటిలో అత్యధికంగా రూ.4.14 కోట్ల 20 శ్మశానవాటిక లకు కొత్తరూపు రానుంది. అత్యంత తక్కువగా వెండింగ్ జోన్లు, పార్కులు, లేబర్షెడ్లకు నిధుల కేటాయింపు జరిగింది.