గ్రేటర్ ప్రణాళికలు సిద్ధం
ఐదు నియోజకవర్గాల్లో రూ.140 కోట్లతో 800 పనులు
సీసీ రోడ్లకు అత్యధికంగారూ. 53 కోట్లు
శ్మశాన వాటికలపై ప్రత్యేక శ్రద్ధ
ఎమ్మెల్యేల ప్రతిపాదనల ఆధారంగా నివేదిక
హన్మకొండ :వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో విస్తరించి ఉన్న ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం భారీ ప్రణాళిక సిద్ధమైంది. నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేలు పంపిన ప్రతిపాదనల ఆధారంగా దాదాపు రూ.140 కోట్లతో 800 పనులు చేపట్టేందుకు బల్దియా యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సమీక్ష సమావేశంలో ప్రతిపాదనలు సమర్పించారు.
అత్యధికంగా వర్ధన్నపేటలో..
గ్రేటర్ వరంగల్ కార్పొరేషను ఇటీవల 58 డివిజన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ డివిజన్ల పరిధిలోఐదు శాసన సభ నియోజకర్గాలు ఉన్నాయి. వీటిలో 24 డివిజన్లు వరంగల్ తూర్పు, 23 డివిజన్లు వరంగల్ పశ్చిమ, 9 డివిజన్లు వర్ధన్నపేట, 2 డివిజన్లు పరకాల, ఒక గ్రామం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల పరిధిలోకి వస్తున్నాయి. తమ నియోజకర్గాల పరిధిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలు ఎమ్మెల్యేలు ఇప్పటికే అందచేశారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా ప్రతీ డివిజన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల జాబితాను కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధం చేసింది. వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకర్గం కార్పొరేషన్ చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమలతో పోల్చితే అభివృద్ధి పరంగా వెనకబడి ఉంది.
సీసీ రోడ్లకు అత్యధిక వ్యయం
ఐదు నియోజకవర్గాల పరిధిలో మౌలిక సదుపాయల కోసం రూ.139 కోట్ల వ్యయంతో ప్రధానంగా మౌలిక సదుపాయల కల్పనకే పెద్దపీట వేశారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్డు, సీసీ డ్రైయిన్లు, పైపులైన్లు, శ్మశానవాటికల అభివృద్ధి, జంక్షన్ల విస్తరణ, లేబర్‌షెడ్, పార్కులు, వెండింగ్ జోన్లు, మార్కెట్లు ఉన్నాయి. వీటిలో అత్యధిక వ్యయాన్ని సీసీరోడ్ల కోసం కేటాయించారు. మొత్తం రూ53.69కోట్ల వ్యయం తో 361 సీసీ రోడ్లు వేయాలంటూ ప్రతిపాదనలు అందగా.. దాదాపు అన్నింటికీ ఆమోదం లభించింది. సీసీ రోడ్ల తర్వాత డ్రైయిన్లకు ప్రాధాన్యత లభించింది. డ్రెయిన్ల కోసం రూ.29.02 కోట్లు వ్యయం చేస్తూ 201 పనులు చేపడతారు. మంచినీటి సరఫరా మెరుగుపరిచేందుకు రూ9.88 కోట్ల వ్యయంతో 67 ప్రాంతాల్లో కొత్తగా పైపులైన్లు ఏర్పాటు చేస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో ఉన్న శ్మశానవాటికలలో మౌలిక సదుపాయల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. 58 డివిజన్ల పరిధిలో రూ.18.69 కోట్ల వ్యయంతో 89 పనులు చేపడుతున్నారు. వీటిలో అత్యధికంగా రూ.4.14 కోట్ల 20 శ్మశానవాటిక లకు కొత్తరూపు రానుంది. అత్యంత తక్కువగా వెండింగ్ జోన్లు, పార్కులు, లేబర్‌షెడ్లకు నిధుల కేటాయింపు జరిగింది.