The plan
-
గ్రేటర్ ప్రణాళికలు సిద్ధం
ఐదు నియోజకవర్గాల్లో రూ.140 కోట్లతో 800 పనులు సీసీ రోడ్లకు అత్యధికంగారూ. 53 కోట్లు శ్మశాన వాటికలపై ప్రత్యేక శ్రద్ధ ఎమ్మెల్యేల ప్రతిపాదనల ఆధారంగా నివేదిక హన్మకొండ :వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో విస్తరించి ఉన్న ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం భారీ ప్రణాళిక సిద్ధమైంది. నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేలు పంపిన ప్రతిపాదనల ఆధారంగా దాదాపు రూ.140 కోట్లతో 800 పనులు చేపట్టేందుకు బల్దియా యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సమీక్ష సమావేశంలో ప్రతిపాదనలు సమర్పించారు. అత్యధికంగా వర్ధన్నపేటలో.. గ్రేటర్ వరంగల్ కార్పొరేషను ఇటీవల 58 డివిజన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ డివిజన్ల పరిధిలోఐదు శాసన సభ నియోజకర్గాలు ఉన్నాయి. వీటిలో 24 డివిజన్లు వరంగల్ తూర్పు, 23 డివిజన్లు వరంగల్ పశ్చిమ, 9 డివిజన్లు వర్ధన్నపేట, 2 డివిజన్లు పరకాల, ఒక గ్రామం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల పరిధిలోకి వస్తున్నాయి. తమ నియోజకర్గాల పరిధిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలు ఎమ్మెల్యేలు ఇప్పటికే అందచేశారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా ప్రతీ డివిజన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల జాబితాను కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధం చేసింది. వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకర్గం కార్పొరేషన్ చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమలతో పోల్చితే అభివృద్ధి పరంగా వెనకబడి ఉంది. సీసీ రోడ్లకు అత్యధిక వ్యయం ఐదు నియోజకవర్గాల పరిధిలో మౌలిక సదుపాయల కోసం రూ.139 కోట్ల వ్యయంతో ప్రధానంగా మౌలిక సదుపాయల కల్పనకే పెద్దపీట వేశారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్డు, సీసీ డ్రైయిన్లు, పైపులైన్లు, శ్మశానవాటికల అభివృద్ధి, జంక్షన్ల విస్తరణ, లేబర్షెడ్, పార్కులు, వెండింగ్ జోన్లు, మార్కెట్లు ఉన్నాయి. వీటిలో అత్యధిక వ్యయాన్ని సీసీరోడ్ల కోసం కేటాయించారు. మొత్తం రూ53.69కోట్ల వ్యయం తో 361 సీసీ రోడ్లు వేయాలంటూ ప్రతిపాదనలు అందగా.. దాదాపు అన్నింటికీ ఆమోదం లభించింది. సీసీ రోడ్ల తర్వాత డ్రైయిన్లకు ప్రాధాన్యత లభించింది. డ్రెయిన్ల కోసం రూ.29.02 కోట్లు వ్యయం చేస్తూ 201 పనులు చేపడతారు. మంచినీటి సరఫరా మెరుగుపరిచేందుకు రూ9.88 కోట్ల వ్యయంతో 67 ప్రాంతాల్లో కొత్తగా పైపులైన్లు ఏర్పాటు చేస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో ఉన్న శ్మశానవాటికలలో మౌలిక సదుపాయల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. 58 డివిజన్ల పరిధిలో రూ.18.69 కోట్ల వ్యయంతో 89 పనులు చేపడుతున్నారు. వీటిలో అత్యధికంగా రూ.4.14 కోట్ల 20 శ్మశానవాటిక లకు కొత్తరూపు రానుంది. అత్యంత తక్కువగా వెండింగ్ జోన్లు, పార్కులు, లేబర్షెడ్లకు నిధుల కేటాయింపు జరిగింది. -
విహారం సురక్షితం...
ట్రావెల్ టిప్స్ ఊళ్లు, కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఇంటి రక్షణ కోసమే కాదు తమ గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రయాణానికి ముందుగానే ప్రణాళిక అవసరం. వెళ్లిన చోట ఉండబోయే వసతి సదుపాయాలన్నీ ముందుగా బుక్ చేసుకొని, ఆ వివరాలన్నీ బుక్‌లో పొందుపరుచుకోవాలి. ఆ బుక్ కూడా ప్రయాణంలో మీతో పాటే ఉండాలి. రాత్రిళ్లు ప్రయాణం సుఖం అని చాలా మంది అనుకుంటారు. కానీ, అదంత క్షేమదాయకం కాదు. ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ కాబట్టి, పగటి ప్రయాణాలను ఏవిధంగా ఆనందించాలి అనే విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి. మీరు దిగిన హోటల్లో మేనేజర్ని సంప్రదించి, స్థానికంగా ఏవి సురక్షితమైన ప్రదేశాలో కనుక్కొని వెళ్లడం క్షేమం. నగర శివార్లకు పిల్లలు, మహిళలు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం.మీ పాస్పోర్ట్సైజ్ ఫోటోతో సహా అన్ని డాక్యుమెంట్లు ప్రయాణంలో మీతో పాటు సురక్షితంగా ఉంచుకోవాలి. ఏదైనా అనుకోని ప్రమాదం వాటిల్లినప్పుడు పనులు వేగవంతం అవడానికి సహాయకారిగా ఉంటాయి. అత్యంత రద్దీగా ఉండే ఉండే ప్రదేశాలకు వెళ్లడం మానుకోవడమే సముచితం. -
ఖరీఫ్ సాగుకు సన్నద్ధం
- జిల్లాకు విత్తనాలను కేటాయించిన ప్రభుత్వం - ఎరువుల సరఫరా ప్లాన్‌కు ఆమోదం - ఖరీఫ్ సీజన్‌కు 3,07,761 టన్నుల ఎరువులు - రూ.2385.10 కోట్ల పంట రుణాలు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌కు వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ఏడు మిషన్లలో ఒకటైన ప్రాథమిక రంగ మిషన్ పరిధిలోకి వ్యవసాయ, అనుబంధ శాఖలు రానున్నాయి. వ్యవసాయ శాఖ ద్వారా 2015-16లో 20.47 శాతం పెరుగుదలను సాధించడానికి చర్యలు చేపట్టారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం జిల్లాకు అవసరమైన విత్తనాలను కేటాయించింది. నెల వారీగా ఎరువుల సరఫరా ప్లాన్‌ను ఇచ్చింది. సీడ్ విలేజి ప్రోగ్రాం కింద సాగు ఖరారైంది. పంట రుణాలు ఏ స్థాయిలో ఇవ్వాలనేది నిర్ణయించారు. భూసార పరీక్షల నిర్వహణకు మట్టి నమూనాల సేకరణ ముమ్మరంగా జరుగుతోంది. 2014-15లో రూ.4118.64 కోట్ల విలువ చేసే వ్యవసాయ ఉత్పాదకత సాధించగా, 2015-16లో రూ.4961.68 కోట్ల ఉత్పాదకత సాధించనుంది. జిల్లాకు కేటాయించిన విత్తనాలు ఖరీఫ్ సీజన్లో సబ్సిడీపై పంపిణీ చేసేందుకు జిల్లాకు అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ కేటాయించింది. అయితే పదేళ్ల క్రితం పాత రకం విత్తనాలకు స్వస్తి పలుకుతూ కొత్త వంగడాలను రైతులకు అందుబాటులోకి తెస్తోంది. జిల్లాకు కె-6 రకం వేరుశెనగ రూ.22 వేలు, కె-9 రకం రూ.1000, అనంత రకం రూ.1000, నారాయణి రకం వేరుశెనగ రూ.5,500 క్వింటాళ్లు.. మొత్తంగా 29 వేల క్వింటాళ్లు మంజూరు చేసింది. వీటిని 20 వేలు క్వింటాళ్లు మార్క్‌ఫెడ్, 8000 క్వింటాళ్లు ఆయిల్‌ఫెడ్, 1500 క్వింటాళ్లు ఏపీ సీడ్స్ సరఫరా చేస్తోంది. కందులు పీఆర్జీ 158 రకం 100 క్వింటాళ్లు, ఎల్‌ఆర్‌జీ-41 రకం 1350 క్వింటాళ్లు, మినుములు ఎల్బీజీ 752 రకం 250 క్వింటాళ్లు, పీఎ31 రకం 250 క్వింటాళ్లు, పెసలు ఎల్జీజీ 460 రకం 335 క్వింటాళ్లు, మొక్కజొన్న 1750 క్వింటాల్లు, సద్దలు 75 క్వింటాళ్లు, ఆముదం 200 క్వింటాళ్లు, ప్రొద్దుతిరుగుడు 200 క్వింటాళ్లు, కొర్రలు 40 క్వింటాళ్లు, సోయాబీన్ 150 క్వింటాళ్లు, దయంచ 6000, పిల్లిపెసర 800 క్వింటాళ్లు కేటాయించారు. అయితే ప్రభుత్వం ధరలు, సబ్సిడీలను ఖరారు చేయాల్సి ఉంది. - 3.07 లక్షల టన్నుల ఎరువులు ఖరీఫ్ సీజన్‌కు నెల వారీగా రసాయన ఎరువుల సరఫరా ప్లాన్‌ను వ్యవసాయ శాఖ ఇచ్చింది. దీని ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెల వరకు జిల్లాకు 3,07,761 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయి. యూరియా 1,02,600, డీఏపీ 61,412, ఎంఓపీ 15,441, కాంప్లెక్స్ ఎరువులు 1,28,301 టన్నులు అవసరమవుతాయి. - 14.59 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లు వ్యవసాయ శాఖ జిల్లాకు 14,59,300 బీటీ పత్తి విత్తన ప్యాకెట్లను కేటాయించింది. వీటిని 10 కంపెనీలు సరఫరా చేస్తాయి. జిల్లాలో పత్తి 3 లక్షలకు పైగా హెక్టార్లలో సాగు అయ్యే అవకాశం ఉంది. ఇందుకు 10 కంపెనీలకు చెందిన 14,59,300 బీటీ విత్తన ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. బీటీ-1, బీటీ-2 రకాలను పంపిణీ చేస్తారు. పత్తి విత్తనాలకు సబ్సిడీలు లేవు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కంపెనీలు బీటీ విత్తన ప్యాకెట్లు పంపిణీ చేస్తాయి. - పెరిగిన సాధారణ సాగు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సాధారణ సాగు(సార్మన్ ఏరియా) బాగా పెరిగింది. గత ఏడాది ఖరీఫ్‌లో సాధారణ సాగు 5,58,351 హెక్టార్లు ఉండగా ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణ సాగు 5,85,351 హెక్టార్లకు పెరిగింది. -
రూ. 25.34 కోట్ల బీఆర్జీఎఫ్ పనులకు ఆమోదం!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్జీఎఫ్ (2014-15) పనుల కార్యాచరణ ప్రణాళికకు ఆమోదముద్ర పడింది. రూ.25.34 కోట్లతో 1,934 పనులు చేపట్టేందుకు నిర్దేశించిన తీర్మానాన్ని జడ్పీ సర్వ సభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. జిల్లా పరిషత్ సమావేశమందిరంలో సోమవారం చైర్మన్ దఫేదార్ రాజు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మధ్యాహ్న భోజనం తరువాత జడ్పీ చైర్మన్ చాంబర్లో పది నిముషాలపాటు జరిగిన జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశం కూడా బీఆర్జీ ఎఫ్ పనుల తీర్మానాన్ని ఆమోదించింది. జడ్పీ, డీపీసీ సమావేశాలు ఒకటి తర్వాత ఒకటి జరిగినా రెండు గంటలలో ము గిశాయి. అత్యవసర సమావేశమని ముందే ప్రకటించినా, ప్రధాన సమస్యలపై చర్చ జరుగుతుందని సభ్యులు భావిం చారు. కానీ, గడువు మించిపోతున్న కారణంగా బీఆర్జీఎఫ్ పనుల ఆమోదానికే ప్రాధాన్యం ఇచ్చారు. జాప్యమెందుకు జరిగిందో చెప్పండి పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు వివిధ సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. బీఆర్జీఎఫ్ ప్రణాళిక ఆమోదంలో ఆలస్యం జరగడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనుల ప్రతిపాదనలలో జాప్యం ఎందుకు జరిగిందో తెలపాలని నిజామాబాద్ జడ్పీటీసీ పుప్పాల శోభ కోరారు. తీర్మానాన్ని ఆలస్యంగా పంపడం మూలంగా కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చే విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. తాము ఎన్నిక అయిననాటి నుంచి సర్వసభ్య సమావేశాలు సక్రమంగా జరగడం లేదన్నారు. ఇలా అయితే, అసలు జిల్లా పరిషత్ అంటే ఏమిటి? సమావేశాల ఎజెండా ఎలా ఉంటుంది? తదితర వివరాలు తమకు ఎలా తెలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. జక్రాన్‌పల్లి ఎంపీపీ రాజన్న మాట్లాడుతూ తమ మండలం నుంచి బీఆర్జీఎఫ్ పనులను ఆమోదించి జడ్పీకి పంపామని, ఇప్పుడు ఇందులో చూస్తే అవి కని పించడం లేదన్నారు. ఎందుకు మార్పులు చేస్తున్నారో తెలియడం లేదని విచారం వ్యక్తం చేశారు. సమావేశం రెండు రోజుల పాటు నిర్వహించి పూర్తి అంశాలను చర్చిస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చినా అమలు కావడం లేదని పలువురు సభ్యులు పేర్కొన్నారు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి బీఆర్జీఎఫ్ పనుల ఆమోదమంటూ తమ మెడపై కత్తి పెట్టారని వాపోయారు. జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, సీఈఓ రాజారాం ఇందుకు సమాధానమిస్తూ, అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించేందుకు దసరా తర్వాత రెండు రోజులపాటు సర్వసభ్య సమావేశం నిర్వహిద్దామని సూచించారు. అధికారుల బ్లాక్మెయిల్ రాజకీయాలు గర్హనీయం జిల్లావ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన కొందరు అధికారులు, ఉద్యోగుల తీరుపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. విధులను విస్మరించే అధికారులను మందలించే ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు నమోదు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే పరిస్థితి ఉందన్నారు. మోర్తాడ్ ఎంపీపీ చిన్నయ్య మాట్లాడుతూ తాను ధర్మోర పాఠశాలను తనిఖీ చేసినపుడు హెచ్ఎం లేకపోవడంతో ఫోన్ చేసానని, తాను సెలవులో ఉన్నానని ఆయన సమాధానం చెప్పారని సభ దృష్టికి తెచ్చారు. కానీ, టీఆర్ఎస్ నాయకులు అక్కడకు వచ్చి హెచ్ఎంకు మద్దతుగా గొడవ చేసి తిరిగి తనపైనే కేసుపెట్టారని వాపోయారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే మాట్లాడుతూ చాలా చోట్ల అధికారులు విధులను విస్మరిస్తున్నారని, నిలదీస్తే ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేయడం పరిపాటిగా మారిం దని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివారిపై కఠి నంగా వ్యవహరించాలని కోరారు. జడ్పీటీసీ సభ్యులకు మాత్రమే అత్యవసర సమావేశం ఎ జెండా కాపీలను సరఫరా చేసి, ఎంపీపీలను ఎందుకు విస్మరించారని, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగారావు ప్రశ్నించారు.ఇంకా పలు అంశాలను సభ్యులు ప్రస్తావించేందుకు యత్నించగా, పూర్తిస్థాయి సమావేశంలో చర్చిద్దామని, ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నందున ప్రజాప్రతినిధులు సహకరించాలని ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్తా, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్ సింధే పేర్కొన్నారు. బీఆర్జీఎఫ్ పనులు ఇలా రూ. 25.34 కోట్ల బీఆర్జీ నిధులను 20 శాతం పట్టణాలకు, 80 శాతం గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌కు కేటాయించాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీలకు 1,255 ప నులకు రూ.1012.40 లక్షలు, మండల పరిషత్‌లకు 346 పనులకు రూ.607.30 లక్షలు, జిల్లా పరిషత్ 174 పనులకు రూ.405 లక్షలు, మున్సిపాల్టీలలో 135 పనులకు రూ.509.30 లక్షలు ఖర్చు చేయడానికి సమావేశంలో ప్రతిపాదించారు. 50 శాతం అదనపు నిధుల కింద 1,171 పనులకు రూ.1132. 50 లక్షల విడుదలకు తీర్మానించారు. ఇక్కడ స్వల్ప మార్పులు డీపీసీ సమావేశంలో బీఆర్జీఎఫ్ పనులలో స్వల్ప మార్పులు చేశారు. గ్రామ పంచాయతీలకు 1,260 పనులు, మండల పరిషత్‌లకు 365 పనులు, జిల్లా పరిషత్‌కు 174, మున్సిపాల్టీలకు 135, మొత్తం 1,934 పనులను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతున్నట్లు జడ్పీ చైర్మన్ వెల్లడించారు. ఆరు మండలాల నుంచి వచ్చిన ఎన్ ఆర్ఈజీఎస్ పనుల ప్రతిపాదనలనూ ఆమోదించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్, జడ్పీ సీఈఓ రాజారాం, నగర మేయర్ ఆకుల సుజాత, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, షకీల్ అహ్మద్, జడ్పీ వైస్ చైర్పర్సన్ గడ్డం సుమనారెడ్డి, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళిక ప్రకారం రక్షణ కల్పించాలి
జన్నారం : అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ ప్రణాళికబద్ధంగా ఉండాలని దూలపెల్లి ఫారెస్ట్ అకాడమీ డెప్యూటీ డెరైక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్, మేనేజ్మెంట్పై జన్నారం అటవీ శాఖ కమ్యూనిటీ హాలులో ఇస్తున్న మూడు రోజుల శిక్షణలో భాగంగా సోమవారం ఫారెస్ట్ లా పై అధికారులకు అవగాహన కల్పించారు. వన్యప్రాణులు వేటాడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నిందితుడికి శిక్ష పడాలంటే ఎలాంటి సెక్షన్లతో కేసులు పెట్టాలో వివరించారు. అలాగే కలప స్మగ్లింగ్‌కు పాల్పడిన వారిపై ఎలాంటి కేసులు పెట్టాలో, కలప అక్రమ రవాణా నిరోధానికి ఏం చేయాలో తెలిపారు. ఒక్కోసారి కేసు ఏ సెక్షన్ కింద నమోదు చేయాలో తెలియక కేసులు నీరుగారిపోయే ప్రమాదం ఉన్నందున, ఆచి, తూచి వ్యవహరించాలని సూచించారు. తెలియకపోతే వేరే వారి సహాయం తీసుకోవాలని స్పష్టం చేశారు. దోషులకు శిక్ష పడేలా చూడాలని తెలిపారు. హెక్ట్కాస్ సంస్థ నిర్వాహకుడు ఇమ్రాన్, వివిధ డివిజన్లకు చెందిన రే ంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు పాల్గొన్నారు. -
నేనసలు అద్దమే చూడను...
అంతర్వీక్షణం ఏ రంగంలో స్థిరపడాలనుకున్నారు? ఎక్కడ స్థిరపడాలనుకున్నారు? అలాంటిదేమీ అనుకోలేదు, రచయితగా స్థిరపడడం కూడా అనుకోకుండా జరిగిపోయింది. అలాగే ఫలానా ప్రదేశంలోనే స్థిరపడాలనే ఆలోచనలు అప్పట్లో పెద్దగా ఉండేవి కాదు. ఇప్పటికి ఎన్ని నవలలు, కథలు రాసి ఉండవచ్చు? 150 నవలలు, మూడు వేలకు పైగా కథలు. మీ రచనల్లో మీకు అత్యంత ఇష్టమైనవి? రెండు రెళ్లు ఆరు, చంటబ్బాయి, విధాత ఏదైనా ఒక పాత్రను మలిచిన తర్వాత కొన్నాళ్లకు ఆ పాత్రను మరోలా రూపొందించి ఉండాల్సింది అనుకున్న సందర్భం ఉందా? లేదు. రచన మొదలు పెట్టే ముందే సమగ్రమైన ప్రణాళికను రూపొందించుకోవాలి. మొదలు పెట్టాక మార్చకూడదు. నాకెప్పుడూ మార్చాల్సిన అవసరం కూడా రాలేదు. మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు? ఏ రకంగా ప్రభావం చూపారు? కొమ్మూరి సాంబశివరావు గారు. ఆయన రచనలే నాకు స్ఫూర్తి. ఆయన లేకపోతే మల్లాది వెంకట కృష్ణ మూర్తి ఉండేవాడు కాదు. మీకు ఇష్టమైన పుస్తకాలు... అమ్మ ఒడిలోకి పయనం, ఒక యోగి ఆత్మకథ. ఇన్నేళ్లుగా ఎన్నడూ మీ ఫొటో ప్రచురించడానికి ఇష్టపడకపోవడానికి ప్రత్యేక కారణం ఉందా? నాలో కీర్తి కాంక్ష కొద్దిగా కూడా లేదు. ఫొటోలు తీసుకుని చూసుకోవాలనే కోరిక కూడా లేదు. నా జీవితంలో తీసుకున్న ఫొటోలు బస్ పాసు, పాస్ పోర్టు, స్కూలు రికార్డుల కోసమే. మీ అభిమాన పాఠకులలో ఒకరి పేరు చెప్తారా? వైజాగ్ నుంచి ఎం. ఎన్. దేవి అనే పాఠకురాలు, తాడేపల్లి గూడెం నుంచి రాము అనే పాఠకుడు క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తుండే వారు. ఎలాంటి విషయాలకు భయపడతారు? ఒక సాధారణమైన మనిషికి ఉండే భయాలన్నీ నాకూ ఉన్నాయి. పామును చూసి భయపడడం మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చినట్లుంది. ఆధ్యాత్మిక మార్గంలో తరచూ పాములుండే ప్రదేశాల్లో సంచరిస్తుండడంతో ఇప్పుడా భయం పోయింది. అబద్ధం చెప్పాల్సి వస్తే ఏం చేస్తారు? ఒకప్పుడు స్వీయరక్షణ కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అబద్ధం చెప్పేసే వాడిని. ఆధ్యాత్మికంలో సత్యానికి దగ్గరగా ఉండడాన్ని సాధన చేయడం మొదలు పెట్టిన తర్వాత పూర్తిగా మానేశాను. అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటారు? నేనసలు అద్దమే చూడను. తల దువ్వడానికి కూడా చూడను. షేవింగ్ సమయంలో కూడా చెంపల మీదే తప్ప ముఖం మీద నా దృష్టి పడదు. మీరు ఎన్నడైనా మీ శ్రీమతిని క్షమాపణ అడగాల్సి వచ్చిందా? చాలాసార్లు వచ్చింది. కానీ గతంలో మగాడిననే అహంతో క్షమాపణ చెప్పేవాడిని కాదు. ఇప్పుడు చెప్తున్నాను. శ్రీమతికే కాదు బయటి వాళ్లకు కూడా గతంలో వాళ్లకు కలిగించిన అసౌకర్యాలను గుర్తు చేసుకుని మరీ క్షమాపణ చెప్తున్నాను. పిల్లల గురించి... నాకు ముగ్గురమ్మాయిలు. పెద్దమ్మాయి కావ్య అమెరికాలోని హ్యూస్టన్‌లో, రెండో అమ్మాయి ఊహ ఇండియానాపోలిస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మూడో అమ్మాయి లిపి... విచిటా స్టేట్ యూనివర్శిటీలో ఎం.ఎస్ చేస్తోంది. ఈ తరాన్ని చూస్తే ఏమనిపిస్తుంటుంది? సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటున్నారు. వారి కారణంగా ఎదుటి వారికి ఇబ్బంది కలిగితే దానికి కనీసంగా కూడా స్పందించడం లేదు. పొరపాటు జరిగిందనే భావన మనసులోకే రానివ్వడం లేదు. ఆ ధోరణి మారాలి. మీరు పశ్చాత్తాప పడిన సందర్భం ఉందా? జీవితం నిండా అవే ఉన్నాయి. సంస్కరించుకునే ప్రయత్నం జరిగిందా? జరిగింది. అందులో భాగంగానే మద్యం, మాంసం,మగువల జోలికెళ్లడం పూర్తిగా మానేశాను. దేవుడు ప్రత్యక్షమై ‘నీ జీవితంలో ఒక్కరోజే ఉంద’ంటే.. మీ చివరి కోరిక..? మోక్ష సాధన కోసం ఏమేమి చేయాలో ఆ దేవుణ్ణే అడిగి, ఆయన చెప్పినట్లు చేస్తాను. - వాకా మంజులారెడ్డి -
ఆసియాన్‌తో అనుబంధానికి ప్రణాళిక
12వ ఆసియాన్ సమావేశంలో సుష్మాస్వరాజ్ వెల్లడి నేపితా: ఆసియాన్ దేశాలతో విభిన్న రంగాల్లో భారత సంబంధాలు, సహకారాలను మెరుగుపరచేందుకు 2016 నుంచి అమలయ్యేలా ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికను త్వరలో రూపొందిస్తామని భారతదేశం పేర్కొంది. ఆసియాన్‌కు భారత్‌కు మధ్య సేవలు, పెట్టుబడుల రంగాల్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ నెలలో జరగబోయే ఆర్థిక, వాణిజ్య మంత్రుల సమావేశంలో ఖరారవుతుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మయన్మార్‌లోని నేపితా నగరంలో శనివారం జరిగిన 12వ ఇండియా - ఆసియాన్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఆసియాన్ దేశాల బృందంతో సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు. ఆసియాన్ దేశాల మధ్య భౌగోళిక, సంస్థాగత, ప్రజా సంబంధాలు నెలకొనాలని భారత్ కాంక్షిస్తోందన్నారు. విదేశీ విధానంలో సంస్కృతి, నైపుణ్యం, పర్యాటకం, వాణిజ్యం, సాంకేతిక - (ట్రెడిషన్, టాలెంట్, టూరిజం, ట్రేడ్, టెక్నాలజీ - ఐదు ‘టీ’లు) ప్రాధాన్యం గల అంశాలని.. వీటన్నిటికన్నా ముందు ఒక ‘సీ’ - కనెక్టివిటీ (అనుసంధానం) అనేది ముఖ్యమని సుష్మా పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలను పాటించాలి... దక్షిణ చైనా సముద్రం అంశాన్ని కూడా సుష్మాస్వరాజ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. సముద్ర చట్టంపై 1982 ఐక్యరాజ్యసమితి ఒప్పందం సహా అంతర్జాతీయ చట్టాల సూత్రాలకు అనుగుణంగా సముద్రయాన స్వేచ్ఛకు, వనరుల అందుబాటుకు భారత్ మద్దతిస్తుందని పేర్కొన్నారు. వియత్నాం తనకు చెందినవిగా చెప్తున్న పారాసెల్ దీవులకు సమీపంలోని సముద్ర జలాల్లో చైనా ఆయిల్ రిగ్‌ను మోహరించటంతో ఈ అంశంపై వివాదం తలెత్తింది. దక్షిణ చైనా సముద్రంలో భారత్‌కు చెందిన ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్) చమురు బ్లాకులను నిర్వహిస్తోంది. ఈ వివాదాస్పద జలాల్లో భారత్ చమురు అన్వేషణ ప్రాజెక్టులకు చైనా అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. ఏడు దేశాల విదేశీ మంత్రులతో సుష్మా చర్చలు ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో.. చైనా, ఆస్ట్రేలియా, కెనడా, వియత్నాం, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్, మయన్మార్ దేశాల విదేశాంగ మంత్రులతో సుష్మాస్వరాజ్ విడివిడిగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. వియత్నాం మంత్రి ఫాంబిన్మిన్తో భేటీలో.. దక్షిణ చైనా సముద్రం అంశంతో పాటు, ఇంధన భద్రత, వాణిజ్యం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపొందించుకునే అంశాన్నీ చర్చించారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్తో భేటీలో.. పౌర అణు ఒప్పందంపై చర్చలను వేగవంతం చేయాలని ఇరు పక్షాలూ నిర్ణయించాయని.. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు.