- జిల్లాకు విత్తనాలను కేటాయించిన ప్రభుత్వం
- ఎరువుల సరఫరా ప్లాన్‌కు ఆమోదం
- ఖరీఫ్ సీజన్‌కు 3,07,761 టన్నుల ఎరువులు
- రూ.2385.10 కోట్ల పంట రుణాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌కు వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ఏడు మిషన్లలో ఒకటైన ప్రాథమిక రంగ మిషన్ పరిధిలోకి వ్యవసాయ, అనుబంధ శాఖలు రానున్నాయి. వ్యవసాయ శాఖ ద్వారా 2015-16లో 20.47 శాతం పెరుగుదలను సాధించడానికి చర్యలు చేపట్టారు.
వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం జిల్లాకు అవసరమైన విత్తనాలను కేటాయించింది. నెల వారీగా ఎరువుల సరఫరా ప్లాన్‌ను ఇచ్చింది. సీడ్ విలేజి ప్రోగ్రాం కింద సాగు ఖరారైంది. పంట రుణాలు ఏ స్థాయిలో ఇవ్వాలనేది నిర్ణయించారు. భూసార పరీక్షల నిర్వహణకు మట్టి నమూనాల సేకరణ ముమ్మరంగా జరుగుతోంది. 2014-15లో రూ.4118.64 కోట్ల విలువ చేసే వ్యవసాయ ఉత్పాదకత సాధించగా, 2015-16లో రూ.4961.68 కోట్ల ఉత్పాదకత సాధించనుంది.
జిల్లాకు కేటాయించిన విత్తనాలు
ఖరీఫ్ సీజన్‌లో సబ్సిడీపై పంపిణీ చేసేందుకు జిల్లాకు అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ కేటాయించింది. అయితే పదేళ్ల క్రితం పాత రకం విత్తనాలకు స్వస్తి పలుకుతూ కొత్త వంగడాలను రైతులకు అందుబాటులోకి తెస్తోంది. జిల్లాకు కె-6 రకం వేరుశెనగ రూ.22 వేలు, కె-9 రకం రూ.1000, అనంత రకం రూ.1000, నారాయణి రకం వేరుశెనగ రూ.5,500 క్వింటాళ్లు.. మొత్తంగా 29 వేల క్వింటాళ్లు మంజూరు చేసింది. వీటిని 20 వేలు క్వింటాళ్లు మార్క్‌ఫెడ్, 8000 క్వింటాళ్లు ఆయిల్‌ఫెడ్, 1500 క్వింటాళ్లు ఏపీ సీడ్స్ సరఫరా చేస్తోంది. కందులు పీఆర్‌జీ 158 రకం 100 క్వింటాళ్లు, ఎల్‌ఆర్‌జీ-41 రకం 1350 క్వింటాళ్లు, మినుములు ఎల్‌బీజీ 752 రకం 250 క్వింటాళ్లు, పీఎ31 రకం 250 క్వింటాళ్లు, పెసలు ఎల్‌జీజీ 460 రకం 335 క్వింటాళ్లు, మొక్కజొన్న 1750 క్వింటాల్లు, సద్దలు 75 క్వింటాళ్లు, ఆముదం 200 క్వింటాళ్లు, ప్రొద్దుతిరుగుడు 200 క్వింటాళ్లు, కొర్రలు 40 క్వింటాళ్లు, సోయాబీన్ 150 క్వింటాళ్లు, దయంచ 6000, పిల్లిపెసర 800 క్వింటాళ్లు కేటాయించారు. అయితే ప్రభుత్వం ధరలు, సబ్సిడీలను ఖరారు చేయాల్సి ఉంది.
- 3.07 లక్షల టన్నుల ఎరువులు
ఖరీఫ్ సీజన్‌కు నెల వారీగా రసాయన ఎరువుల సరఫరా ప్లాన్‌ను వ్యవసాయ శాఖ ఇచ్చింది. దీని ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెల వరకు జిల్లాకు 3,07,761 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయి. యూరియా 1,02,600, డీఏపీ 61,412, ఎంఓపీ 15,441, కాంప్లెక్స్ ఎరువులు 1,28,301 టన్నులు అవసరమవుతాయి.
- 14.59 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లు
వ్యవసాయ శాఖ జిల్లాకు 14,59,300 బీటీ పత్తి విత్తన ప్యాకెట్లను కేటాయించింది. వీటిని 10 కంపెనీలు సరఫరా చేస్తాయి. జిల్లాలో పత్తి 3 లక్షలకు పైగా హెక్టార్లలో సాగు అయ్యే అవకాశం ఉంది. ఇందుకు 10 కంపెనీలకు చెందిన 14,59,300 బీటీ విత్తన ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. బీటీ-1, బీటీ-2 రకాలను పంపిణీ చేస్తారు. పత్తి విత్తనాలకు సబ్సిడీలు లేవు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కంపెనీలు బీటీ విత్తన ప్యాకెట్లు పంపిణీ చేస్తాయి.
- పెరిగిన సాధారణ సాగు
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సాధారణ సాగు(సార్మన్ ఏరియా) బాగా పెరిగింది. గత ఏడాది ఖరీఫ్‌లో సాధారణ సాగు 5,58,351 హెక్టార్లు ఉండగా ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణ సాగు 5,85,351 హెక్టార్లకు పెరిగింది.
ఖరీఫ్ సాగుకు సన్నద్ధం
Published Mon, Apr 27 2015 3:25 AM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM
Advertisement
Advertisement