కార్పొరేషన్ పోలింగ్ ప్రశాంతం | Corporation polling peaceful | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్ పోలింగ్ ప్రశాంతం

Published Mon, Mar 7 2016 1:52 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

కార్పొరేషన్ పోలింగ్ ప్రశాంతం - Sakshi

కార్పొరేషన్ పోలింగ్ ప్రశాంతం

గ్రేటర్ వరంగల్‌లో  60.28 శాతం  
ఖమ్మంలో 67.68 శాతం
అచ్చంపేటలో 70.88 శాతం
 ‘వరంగల్ తూర్పు’లో ఘర్షణలు

 
సాక్షి నెట్‌వర్క్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు అచ్చంపేట నగర పంచాయతీ పోలింగ్ చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో 60.28 శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 67.68 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు ప్రకటించారు. అచ్చం పేట నగర పంచాయతీ పరిధిలో 70.88 శాతం పోలింగ్ జరిగింది. గ్రేటర్ వరంగల్‌లో మొత్తం 6,43,863 మంది ఓటర్లు ఉన్నారు. గ్రేటర్‌లో కొత్తగా విలీనమైన శివారు ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువగా జరిగింది. నగరంలోని 36వ డివి జన్ పరిధిలోని కాజీపేట రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్ పోలింగ్ బూత్ బయట రైల్వే జేఏసీ నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోల్ చీటీలు పంచుతుండగా ధర్మసాగర్ ఎస్‌ఐ దేవేందర్ ఎలాంటి హెచ్చరికలూ చేయకుండా రైల్వే జేఏసీ నేతలు, రాజకీయ పార్టీల నేతలపై లాఠీచార్జి చేశారు. లాఠీచార్జిని నిరసిస్తూ రైల్వే జేఏసీ నేతలు అరగంట పాటు ధర్నా చేశారు. అలాగే, ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ 44వ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు పరస్పర దాడులు చేసుకున్నారు.

47వ డివిజన్ పరిధిలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ, ఆ పార్టీకి చెందిన ఈవీ సతీశ్ ఇంటిపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. 40వ డివిజన్‌లో తెలుగుదేశం అభ్యర్థి మారగాని కీర్తి కిరణ్‌గౌడ్ ఓటు గల్లంతైంది. తన డివిజన్‌లో పరిధిలో తన కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు చెందిన 65 ఓట్లు గల్లంతయ్యాయంటూ కీర్తి కిరణ్ ఆరోపించారు. 15వ డివిజన్ పరిధిలో టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి శారద భర్త సురేష్ జోషిపై అధికార పార్టీ అభ్యర్థి భర్త సాదిక్ డాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సురేష్‌జోషి చేతికి, ఛాతీలో దెబ్బలు తగిలాయి.  13, 20 డివిజన్లలో బరిలో ఉన్న అధికార పార్టీ రెబెల్ అభ్యర్థులు, అనుచరులపై అధికార పార్టీ అభ్యర్థికి చెందిన అనుచరులు దాడి చేసిన ఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 2,65,710 మంది ఓటర్లు ఉండగా.. 1,79,827 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ ఉద యం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 3గంటల వరకు 57.54 శాతం పోలింగ్ పూర్తికాగా.. ఆ తర్వాత మందకొడిగా సాగింది. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో 18,614 మంది ఓటర్లు ఉండగా 13,193 మం ది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్పీ పి.విశ్వప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.
 
ఖమ్మంలో నకిలీ ఓటరు కార్డులు..
ఖమ్మంలోని 22వ డివిజన్‌లో భారీగా నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను టీడీపీ, ైవైఎస్సార్‌సీపీ నేతలు పట్టుకున్నారు. రోటరీనగర్‌లోని ఓ డీటీపీ సెంటర్ నిర్వాహకుడితో.. ఎన్నికల అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఓటరు కార్డులు రూపొందించారు.  1,500కుపైగా కార్డులు తయారు చేశారని, 750 కార్డులు మాత్రం బయటకు వచ్చినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ పోలింగ్ కేంద్రం సమీపంలోని ఓ టైలర్ షాపులో నకిలీ ఓటరు గుర్తింపు కార్డుతో పాటు, రూ.2 వేల నగదును ఇస్తుండటాన్ని గమంచిన టీడీపీ అభ్యర్థి బంధువులు వీటిపై ఆరా తీశారు. టైలర్ షాపులో భారీగా ఉన్న గుర్తింపు కార్డులను టీడీపీ నాయకులు పట్టుకోవడంతో.. టీడీపీ, టీఆర్‌ఎస్ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పద్మజారెడ్డి, టీడీపీ అభ్యర్థి సరిపుడి సతీష్‌లు,  నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను బయటకు తీసుకొచ్చి రోడ్డుపై పోసి ఆందోళనకు దిగారు. టీఆర్‌ఎస్ నేతలు ఉన్న టైలర్‌షాపు నుంచి తీసుకొచ్చిన 250 నకిలీ
ఓట్ల గుర్తింపు కార్డులను మీడియాకు చూపించారు.
 
ఎంపీ పొంగులేటి ఆగ్రహం: నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ నకిలీ వ్యవహారం అధికారులకు తెలిసినా చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.  నకిలీ గుర్తింపు కార్డులతో చాలా మంది ఓటు వేశారని, ఇక్కడ వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశా రు. కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి అధికారులు కొమ్ము కాస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఓటర్లుగా చేర్పిం చి ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. కొత్త ఓటర్లపై విచారణ చేయకుండా అధికారులు ఓటు హక్కు కల్పించారన్నారు. దీనికి కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు సైతం సహకరించారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్యలు అక్కడకు చేరుకొని రీపోలింగ్ నిర్వహించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల ఆందోళనతో చాలాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డుపై వేసిన నకిలీ గుర్తింపు కార్డులను అక్కడే ఉన్న ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవి అసలువా..? నకిలీవా అని గుర్తించేందుకు వాటిని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దీనిపై స్పష్టత ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు అభ్యర్థులకు హామీ ఇచ్చారు.
 
ఈవీఎంలకు ప్రింటర్లు
దేశంలోనే తొలిసారిగా  ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లను అనుసంధానం చేశారు. 50 డివిజన్లకు గాను 265 పోలింగ్ కేంద్రాలుండగా, 25 కేంద్రాల్లో ప్రింటింగ్ మిషన్లు అనుసంధానం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement