నేడే పోలింగ్
‘గ్రేటర్’లో తొలి పాలకమండలికి ఎన్నికలు
ఉదయం 7 నుంచి 5 వరకు ఓటింగ్
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
అవసరమైన చోట 8న రీపోలింగ్
మొత్తం డివిజన్లు : 58
మొత్తం ఓటర్లు : 6,43,862
పోటీలో ఉన్న అభ్యర్థులు : 398
పోలింగ్ కేంద్రాలు : 660
ఎన్నికల సిబ్బంది : 3,630
హన్మకొండ : రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా వరంగల్ గుర్తింపు పొందింది. గ్రేటర్ హోదా దక్కిన తర్వాత వరంగల్ మహానగర పాలక సంస్థకు తొలిసారిగా ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ నగర పాలక సంస్థను గ్రేటర్ వరంగల్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ 2015 ఏప్రిల్ 7న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. హైదరాబాద్‌తో పాటు ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. మేడారం జాతర నేపథ్యంలో ఆలస్యమైంది. ఎట్టకేలకు ఫిబ్రవరి 21న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. గ్రేటర్‌లో పాగా వేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కదనరంగంలోకి దూకాయి. అధికార పార్టీ తరఫున హరీశ్‌రావు ప్రచార బాధ్యతలు చేపట్టగా బీజేపీ తరఫున కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ప్రచారం చేశారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.
6,43,862 మంది ఓటర్లు
గ్రేటర్ వరంగల్ జనాభా ప్రస్తుతం పది లక్షలుగా ఉంది. ఇందులో ఓటర్ల సంఖ్య 6,43,862 లక్షలు. వీరిలో స్త్రీలు 3,20,575 ఉండగా.. పురుషులు 3,23,166, ఇతరులు 121 మంది ఉన్నారు. 58 డివిజన్లు ఉండగా 398 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా 46వ డివిజన్‌లో 13,040 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా 36వ డివిజన్‌లో 8,819 మంది ఓటర్లు ఉన్నారు. పోటీలో అత్యధికంగా 6వ డివిజన్‌లో పన్నెండు మంది అభ్యర్థులు ఉండగా.. అత్యల్పంగా 17, 21, 29 డివిజన్లలో కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే ఎన్నికల బరిలో నిల్చున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ 58 డివిజన్లలో అభ్యర్థులను నిలిపింది. 154 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మార్చి 8న రీపోలింగ్ నిర్వహిస్తారు.
ఎన్నికల విధుల్లో 3,630 మంది
ఏనుమాముల మార్కెట్ నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు శనివారం చేరవేశారు. గ్రేటర్ ఎన్నికల పరిశీలకుడు విజయ్‌కుమార్, అదనపు ఎన్నికల అధికారి, వరంగల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఈ పనులను పర్యవేక్షించారు. నగర పరిధిలో 58 డివిజన్లు ఉండగా 660 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్లు వేసేందుకు పోలింగ్ బూత్‌కు ఒకటి చొప్పున మొత్తం 660 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అందుబాటులో ఉంచారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే అత్యవసరంగా ఉపయోగించేందుకు మరో 116 ఈవీఎంలను అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్కో బూత్‌కు సగటున ఐదుగురు చొప్పున పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిశీలకులుగా 24 మంది, సర్వే స్టాటిస్టికల్ అధికారులుగా 32 మంది, ఫ్లైయింగ్ స్క్వాడ్‌గా 24 మంది, మోడల్ ఆఫీసర్లుగా 21 మంది, రూట్ ఆఫీసర్లుగా 29 మంది, సెక్టోరియల్ అధికారులుగా 29 మందిని నియమించారు. మొత్తంగా 3,630 మంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. వీరుకాకుండా మరో 500 మంది ఉద్యోగులను అందుబాటులో ఉంచారు.
సమస్యాత్మకమైనవి ఎక్కువే..
మొత్తం పోలింగ్ కేంద్రాలు 660 ఉండగా వీటిలో సమస్యాత్మక కేంద్రాలు 429 ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని నిర్వహించేందుకు 700 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల సహకారం తీసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ తలెత్తకుండా నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల బందోబస్తు కోసం ఇతర జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బందిని రప్పించారు. 9వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.