క్రమబద్ధంగా ఆదాయం వచ్చేటప్పుడు ప్రతి నెలా బడ్జెట్‌ను ప్లానింగ్ చేసుకోవడం కాస్త సులువుగానే ఉంటుంది. ఆదాయం ఎంత.. ఎంత ఖర్చు చేయొచ్చు.. ఎంత పొదుపు చేయొచ్చు లాంటి లెక్కలు వేసుకోగలం. అయితే, ఫ్రీలాన్స్ ప్రొఫెషనల్స్, స్వయం ఉపాధి పొందేవారి ఆదాయాలు క్రమబద్ధంగా కాకుండా.. అస్థిరంగానే ఉంటాయి. మరి వీరు ఆర్థిక సమస్యల్లో చిక్కుకోకుండా ఎలాంటి ప్రణాళిక కావాలి? దాన్నెలా అమలు చేయాలి? ఒకసారి చూద్దాం...
సాధారణంగా ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చులు పెట్టడమనేది చాలా మందికి ఎదురయ్యే సమస్య. ఈ కోవలోకి రాకుండా ఉండాలంటే... ఖర్చు అలవాట్లను ఓ కంట కనిపెడుతుండాలి. వ్యయాలు ఆదాయాన్ని మించకుండా ఉండేలా చూసుకోవాలి. ఇలా ట్రాకింగ్ చేయడం కోసం ప్రస్తుతం చాలా మొబైల్ యాప్స్ ఉన్నాయి.
వీటిని ఉపయోగించి స్థూలంగా మీ ఖర్చులు ఎంత ఉంటున్నాయన్నది ఓ అంచనాకు రావొచ్చు. ఇందుకోసం గడిచిన పన్నెండు నెలల్లో మీ ఖర్చుల తీరుతెన్నులను రాసి పెట్టుకోండి. సగటున ప్రతి నెలా ఎంత మేర ఖర్చులుంటున్నాయో లెక్కేయండి. రాబోయే రోజుల్లో ఖర్చుల ధోరణిని మెరుగుపర్చుకోవడానికి, ఆర్థిక అంశాలను ముందస్తుగా ప్లానింగ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
తగినంత నగదు దగ్గర ఉంచుకోండి..
గత ఖర్చుల అలవాట్లను దృష్టిలో ఉంచుకుని తరచూ తలెత్తే వ్యయాలకు సరిపడేంత స్థాయిలో నగదు చేతిలో ఉండేలా చూసుకోవాలి (క్యాష్ రిజర్వ్). లేకపోతే, రుణాల వైపు చూడాల్సి వచ్చే ప్రమాదముంది. ఆదాయం మీ చేతికి రావడానికి 15– 30 రోజులు పట్టేలా ఉన్నప్పుడు.. ఆ సమయంలో గట్టెక్కడానికి వేర్వేరు బిల్లింగ్ తేదీలుండే క్రెడిట్ కార్డులను సమయోచితంగా ఉపయోగించుకోవచ్చు.
అత్యవసర పరిస్థితుల కోసం కేటాయించే నిధిని, ఈ క్యాష్ రిజర్వ్‌ని వేర్వేరుగానే ఉంచాలి. ఆదాయం క్రమానుగతంగా లేనప్పుడు కూడా రోజువారీ ఖర్చులకు సర్దుబాటు చేసుకునేందుకు ఉపయోగపడేది క్యాష్ రిజర్వ్. ఆదాయం చేతికొచ్చేందుకు సాధారణం కన్నా మరింత ఎక్కువ సమయం పట్టేసే సందర్భాల్లో ఆదుకునేదే అత్యవసర నిధి.
అంతా ఒకే అకౌంటులో ఉండాలి..
మీ ఆదాయం అంతా కూడా ఒకే బ్యాంకు ఖాతాలో ఉండేలా చూసుకోవాలి. బాధ్యతారహితంగా చేసే ఖర్చులను నియంత్రించుకునేందుకు, విత్‌డ్రాయల్స్‌పై ఎప్పటికప్పుడు ఒక కన్నేసి ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ నిర్దిష్ట స్థాయి కన్నా కిందికి తగ్గకుండా మీ అంతట మీరే ఒక పరిమితిని నిర్దేశించుకోండి.
ముందు పొదుపు.. తర్వాతే ఖర్చులు
చేతిలో డబ్బు లేకుండా పోవడమనే సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే బండగుర్తు ఒకటుంది. అదేంటంటే.. ముందుగా పొదుపు చేయాలి.. ఆ తర్వాతే ఖర్చులు చేయాలి. చాలా మంది తమ చేతిలోకి ఆదాయం రావడానికి ముందే దాన్ని క్రెడిట్ కార్డులు మొదలైన సాధనాలతో ఖర్చు చేసేస్తుంటారు. ఇలాంటి ధోరణులు తీవ్రమైన ఆర్థిక సమస్యలకు దారితీస్తాయి.
రుణాలు తిరిగి చెల్లించలేని సంక్షోభ పరిస్థితి తలెత్తవచ్చు. అలా కాకుండా.. ముందు పొదుపునకు ప్రాధాన్యమిచ్చి మీ ఆర్థిక లక్ష్యానికి అనువైన సాధనంలో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ఇది చేశాక మిగిలే మొత్తాన్నే ఖర్చుల కోసం ఉపయోగించడం అలవాటు చేసుకుంటే.. దీర్ఘకాలంలో తగినంత నిధిని పోగు చేసుకోగలుగుతారు.
బీమా రక్షణ ఉండాలి..
ఆరోగ్యపరమైన సమస్యలు, శారీరకపరమైన వైకల్యాల్లాంటివి ముందుగా చెప్పిరావు. వచ్చిన తర్వాత వీటిని చూసీ, చూడనట్లుగా వదిలేసే పరిస్థితి ఉండదు. అటూ, ఇటూగా ఆదాయం ఉండేటప్పుడు.. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనడం కష్టంగానే ఉంటుంది. అయితే, తగినంత బీమా రక్షణ ఉండేలా చూసుకోవడం ద్వారా వీటిని అధిగమించవచ్చు.
ఇంటిపెద్దకి అనుకోనిది ఏదైనా జరిగితే కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తుంది జీవిత బీమా పాలసీ. అలాగే, ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నగదురహిత ట్రీట్‌మెంట్ ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకుంటే.. చికిత్స కోసం తక్షణం డబ్బులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు.
క్రమశిక్షణ కీలకం
ఆదాయం అస్థిరమైనదైనప్పుడు.. డబ్బుపరమైన సమస్యలు తలెత్తకుండా ఆర్థిక క్రమశిక్షణతో ఉండాలి. అనవసరమైన రుణాలకు దూరంగా ఉండాలి. ప్లానింగ్ లేకుండా ఖరీదైన ఉత్పత్తుల జోలికి వెళ్లొద్దు. ఆర్థిక లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి. వ్యాపారం ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు వేర్వేరుగానే ఉంచాలి. దీంతో డబ్బు నిర్వహణ సులభతరంగా ఉంటుంది. కాబట్టి సరైన ప్రణాళిక వేసుకుని ఆర్థికంగా క్రమశిక్షణతో ఉంటే.. క్రమబద్ధమైన ఆదాయం ఉన్నవారిలాగానే హాయిగా జీవించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment