ఆదాయం గోరంత.. ఖర్చు కొండంత | COG Axillaries To State Govt On Management Of 2019 20 Budget | Sakshi
Sakshi News home page

ఆదాయం గోరంత.. ఖర్చు కొండంత

Published Wed, Mar 16 2022 1:38 AM | Last Updated on Wed, Mar 16 2022 4:01 AM

COG Axillaries To State Govt On Management Of 2019 20 Budget - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘బడ్జెట్‌ నిర్వహణ సరిగా లేదు. బడ్జెట్‌ ప్రతిపాదనలకు, సవరణలకు, ఖర్చులకు పొంతన లేదు. అప్పులు పెరుగుతున్నా సంపద సృష్టిపై దృష్టి సారించడం లేదు. కనీసం రెవెన్యూ మిగులు చూపించలేక పోయారు. ఆదాయం గోరంత పెరిగితే ఖర్చు కొండంత అవుతోంది. విద్య, వైద్య రంగాలపై ఖర్చు తగ్గిపోయింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యంతో పెద్ద ఎత్తున నిధులు స్తంభించిపోయాయి.

మూలధన వ్యయం తగ్గిపోయింది. అదనంగా పెట్టిన ఖర్చుకు అసెంబ్లీ ఆమోదం తీసుకోకపోవడం శాసనసభ సాధికారతను తక్కువ చేయడమే..’అని 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక తప్పుబట్టింది. జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టానికి లోబడే అప్పులు తీసుకుంటున్నా ఏటేటా అప్పులు పెరిగిపోతున్నాయని, ప్రస్తుతమున్న అప్పుల్లో (రూ.89,228 కోట్లు) 46 శాతం ఏడేళ్లలో చెల్లించాల్సి ఉందని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారమవుతుందని మంగళవారం ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదిక అభిప్రాయపడింది. నివేదికలోని ముఖ్యాంశాలివే.. 

రెవెన్యూ మిగులు చూపించని బడ్జెట్‌ ఇదే  
2019–20లో తెచ్చిన అప్పుల్లో 75 శాతం నిధులను గతంలో చేసిన అప్పులు తీర్చేందుకు వినియోగించారు. ఈ విధానం రాష్ట్రంలో సంపద సృష్టిపై ప్రభావం చూపనుంది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడే రాష్ట్రం అప్పులను తీసుకువస్తోంది. ఈ సంవత్సరంలో 97 శాతం ద్రవ్యలోటును మార్కెట్‌ రుణాలతోనే పూడ్చారు. గత ఐదేళ్ల కాలంలో రెవెన్యూ మిగులు చూపించని బడ్జెట్‌ ఇదే. 

అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పోలిస్తే 2019–20 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఆదాయం రూ.1,124 కోట్లు (1.11%)పెరిగింది. అదే సమయంలో రెవెన్యూ ఖర్చు రూ.11,715 కోట్లు (12.07 శాతం) పెరిగింది.  

మూలధన వ్యయం తగ్గిపోయింది 
2018–19తో పోలిస్తే మూలధన వ్యయం చాలా తగ్గిపోయింది. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో పెద్ద ఎత్తున పెట్టుబడి స్తంభించిపోయింది. డిస్కంల నష్టాలను తగ్గించేందుకు గాను మార్చి, 2020 నాటికి ఉదయ్‌స్కీం కింద ఇస్తానన్న రూ.4,063.65 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ప్రజారుణం (మొత్తం అప్పు) 18.04 శాతం పెరిగింది. జీఎస్‌డీపీ పెరుగుదల 12.61తో పోలిస్తే కూడా ఇది ఎక్కువ.  

2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం చేసిన బడ్జెట్‌ ప్రతిపాదనలు వాస్తవ రూపంలోకి రాలేదు. బడ్జెట్‌ అమలు, పర్యవేక్షణ కూడా సరిగా లేదు. అనుబంధ గ్రాంట్లు, వినిమయాలు కూడా సరిగా లేవు. కొన్నింటికి సభ ఆమోదం కూడా పొందలేదు. రూ.84,650.99 కోట్లకు సభ ఆమోదం పొందాల్సి ఉంది. శాసనసభలో ఆమోదం పొందిన దాని కన్నా గత ఐదేళ్లుగా ఖర్చు ఎక్కువ అవుతుండడం ఆందోళన కలిగించే పరిణామం.  

సామాజిక–ఆర్థిక గ్రాంట్ల కింద చేసిన ప్రతిపాదనలో నాలుగు గ్రాంట్ల కింద ఖర్చు 50 శాతం మించలేదు. ఇది రాష్ట్ర సామాజిక–ఆర్థికాభివృద్ధికి అవరోధం కానుంది.

తగ్గిన పన్నేతర ఆదాయం 
రాష్ట్ర పన్నుల ఆదాయం పెరుగుతున్నప్పటికీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే పన్నేతర ఆదాయం తగ్గిపోయింది. 2019–20 ఆదాయంలో మొత్తం 7,360 కోట్లు (7%) పన్నేతర ఆదాయం కింద రాగా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ.2,647 కోట్లు తగ్గింది.  

వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కింద రావాల్సిన ఐజీఎస్టీ ఈ ఏడాదిలో రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదు. 2018–19తో పోలిస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో రూ.2,753 కోట్లు తగ్గాయి. 

అటుదిటు..ఇటుదటు 
రెవెన్యూ ఖర్చు కింద చూపెట్టాల్సిన రూ.716 కోట్లను మూలధన వ్యయం కింద చూపెట్టారు. మూలధన వ్యయం కింద చూపెట్టాల్సిన రూ. 49.56 కోట్లను రెవెన్యూ వ్యయం కింద చూపెట్టారు.   

పీడీ అకౌంట్ల నిర్వహణ పారదర్శకంగా లేదు 
పీడీ అకౌంట్ల నిర్వహణ కూడా పారదర్శకంగా లేదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వీటిని నిర్వహిస్తున్నారు. పీడీ అకౌంట్ల నుంచి నిధులను బ్యాంకులకు తరలించి అక్కడి నుంచి విత్‌డ్రా చేసుకుంటున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.  

అమాంబాపతు పద్దు (800) నిర్వహణ కూడా సక్ర మంగా లేదు. దీంతో కేటాయింపుల ప్రాధాన్యాలు, ఖర్చు లక్ష్యం కూడా అస్పష్టంగా మారిపోయింది. అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన నిధుల వినియోగ పత్రాలు(యూసీ) కూడా సమర్పించడం లేదు. ఇది ఆర్థిక నియమాల ఉల్లంఘనే. రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వ అకౌంటింగ్‌ ప్రమాణాలను ఇంకా పాటించాల్సి ఉంది. 

ఆర్థిక సంఘం అంచనాలు అందుకోలేదు 
15వ ఆర్థిక సంఘం అంచనాలను రాష్ట్రం అందుకోలేకపోయింది. పన్ను ఆదాయం కింద రూ.89,950 కోట్లు వస్తుందని ఆర్థిక సంఘం అంచనా వేయగా రాష్ట్ర ప్రభుత్వం రూ.69,329 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించింది. కానీ, వచ్చింది మాత్రం రూ.67,957 కోట్లే. పన్నేతర ఆదాయం రూ. 12,354 కోట్ల మేర వస్తుందని ఆర్థిక సంఘం అంచనా వేస్తే, రూ.15,875 కోట్లను ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించగా, కేవలం రూ. 7,360 కోట్లు మాత్రమే వచ్చింది.  

విద్యుత్‌ సబ్సిడీల కింద ఇచ్చే మొత్తం ఈ ఏడాదిలో రూ. 167.48 కోట్లు పెరగ్గా, పౌరసరఫరాల సబ్సిడీలు రూ. 92 కోట్లు తగ్గాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement