సాక్షి, హైదరాబాద్: ఓట్ల పండగకు కొత్త నిర్వచనం నోట్ల పండగ. ఎన్నికలు వచ్చాయంటే గ్రేటర్‌లో నోట్ల వర్షమే కురుస్తోంది. తాజాగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి కనిష్టంగా రూ.50–75 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. అంటే ఒక్కో నియోజకవర్గంలో కనిష్టంగా రూ.150–200 కోట్ల వరకు వ్యయం కానుందని విశ్లేషకుల అంచనా. ఈ మేరకు వెచ్చించగల సత్తా, ఆర్ధిక పరిపుష్టి కలిగిన వారినే అభ్యర్థులుగా ఆయా రాజకీయ పార్టీలు ఖరారు చేశాయి గ్రేటర్ హైదరాబాద్‌లో 29 నియోజకవర్గాలు ఉన్నాయి.
పాతబస్తీ, రిజర్వ్ స్థానాలు మినహా మిగిలిన గ్రేటర్ నియోజకవర్గాల్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో నోట్ల వరద పారనుంది. ఇప్పటికే ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తాయిలాలు పంపిణీ మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు నుంచే ప్రతి రోజు కార్యకర్తలు, అనుచరుల బాగోగులు చూసు కోవడం తప్పనిసరిగా మారింది. పెట్రోల్ బంక్‌లలో ఇంధనం వైన్స్, బెల్ట్ షాపులలో మద్యాన్ని పద్దు రూపేణా ఆయా దుకాణాలు, బంకుల యజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవేగాకుండా నియోజకవర్గ కేంద్రం సహా మండలం, వార్డుకు, పంచాయితీకో క్యాంపు ఆఫీసును ఏర్పాటు చేశారు. ఇక్కడ పార్టీ శ్రేణులకు బ్రేక్ ఫాస్ట్ మొదలు రాత్రి విందు, మందు వరకు ఫ్రీ. మరోవైపు ప్రచారరథాలు, ప్రజలను సమీకరణకు లారీలు, డీసీఎం వంటి వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు.
ఖరీదైన ఎన్నికలకు కేరాఫ్
దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలకు తెలంగాణ పేరుగాంచింది. గతేడాది నవంబర్‌లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అనే స్థాయిలో పోటాపోటీగా ఖర్చు పెట్టాయి. ఒక్కో ఓటుకు రెండు పార్టీలు కలిపి రూ.10 వేల వరకూ ఓటర్‌కు అందించినట్లు, మొత్తంగా రూ.600 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు రాజకీయ వర్గాలలో చర్చ నడిచింది.
ఇలాంటి పరిస్థితులలో వచ్చే నవంబర్‌లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు అధికారం చేజిక్కించుకునేందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడట్లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్థికంగా బలమైన అభ్యర్థులకే టికెట్లను కేటాయించడమే ఇందుకు నిదర్శనం. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) ప్రకారం.. ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు రూ.9,500 కోట్ల నుంచి రూ.10,500 కోట్ల మధ్య ఖర్చు చేశాయని తెలిపింది. 2013 ఎన్నికల వ్యయం కంటే ఇది రెండింతలు అని పేర్కొంది.
విభాగాల వారీగా తాయిలాలు..
ఒక్కో అభ్యర్థి ఎన్నికల సంఘం నిర్దేశించిన రూ.40 లక్షలకు మించి వ్యయం చేయకూడదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్–77 ప్రకారం ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చులకు సంబంధించి ప్రత్యేకంగా కరెంట్ ఖాతాను తెరవాలి. వ్యయ, నిర్వహణ రికార్డులను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది.అయితే ఈసీ నిర్ణయించిన మొత్తానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వంద రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తారనేది జగమెరిగిన సత్యం.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను వర్గాల వారీగా విభజించి వారిని ఆకట్టుకుంటున్నాయి. మహిళలకు చీరలు, వెండి, బంగారం, కుట్టు మిషన్లు, కుక్కర్లు, మిక్సీలు వంటి గృహోపకరాలను అందిస్తుంటే... యువత కోసం గిఫ్ట్ కూపన్లు, ఆట వస్తువుల పంపిణీ, డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఫోన్లు బహుమతులుగా ఇస్తున్నారు. వృద్ధుల కోసం వైద్య శిబిరాలు, దసరా, దీపావళి బహుమతులు, బాణాసంచాలు అందిస్తున్నారు.
ఆ సెగ్మెంట్లపై ఈసీ స్పెషల్ ఫోకస్
గ్రేటర్‌లో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాలపై రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఈ సెగ్మెంట్లలో అభ్యర్థులు అత్యధిక వ్యయం ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ఈ నియోజక వర్గాలలో సగటున ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఓటింగ్ శాతం తక్కువే అయినప్పటికీ రాజకీయ పార్టీలు వెచ్చించే సొమ్ము మాత్రం ఎక్కువగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment