సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి నాలుగు నెలల్లో నాలుగో వంతు రాబడులు వచ్చాయి. ఈ ఏడాదికి మొత్తం రూ.2.58 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందించగా జూలై నెల ముగిసే నాటికి రూ.67,494.73 కోట్ల మేర ఖజానాకు ఆదాయం సమకూరిందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే మొత్తం బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇది 26 శాతం అన్నమాట. ఇందులో పన్నుల వాటా కింద రూ.42,712.27 కోట్లు వచ్చింది. ఆ తర్వాత అప్పుల పద్దు కింద కూడా ఎక్కువ సమకూరింది.
ఈ ఏడాది బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా రూ.38,234 కోట్లు సేకరించాలన్నది అంచనా కాగా, అందులో దాదాపు 54 శాతం ఇప్పటికే సమకూరింది. 2023 జూలై నాటికి రూ.20,637.23 కోట్లు అప్పుల ద్వారా సేకరించినట్టు రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు పంపిన నివేదికలో వెల్లడించింది. మొత్తం రాబడుల్లో అప్పులే 30 శాతం ఉండడం గమనార్హం.
ఇక పన్నుల ఆదాయంలో ఎక్కువగా జీఎస్టీ నుంచి రూ.15 వేల కోట్లకు పైగా వచ్చింది. మొత్తం అంచనాల్లో ఇది కూడా 30 శాతం దాటింది. ఎక్సైజ్ రాబడులు కూడా 30 శాతం దాటాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్, పన్నుల్లో వాటా కలిపి రూ.6,300 కోట్లకు పైగా సమకూరాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలై నాటికి రాబడులు 3 శాతానికి పైగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment