
న్యూఢిల్లీ: గడిచిన ఏడాది కాలంగా బీమాపై అవగాహన పెరిగినప్పటికీ .. పట్టణ ప్రాంతాల ప్రజల్లో ఆర్థిక అభద్రత భావం తగ్గలేదు. రోజువారీ వైద్యం ఖర్చులు, జీవన విధానాన్ని కొనసాగించేందుకు అయ్యే వ్యయాలపై యువత మరింత ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. బీమా సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి మధ్యకాలంలో 25 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 7,014 మంది తమ అభిప్రాయాలు తెలియజేశారు. వీటిలో 6 మెట్రో నగరాలు, 9 ప్రథమ శ్రేణి నగరాలు, 10 ద్వితీయ శ్రేణి నగరాలు ఉన్నాయి. 25–55 ఏళ్ల మధ్య, సగటున రూ. 2 లక్షల పైగా కుటుంబ వార్షికాదాయం గలవారు, ఆర్థిక సాధనాలపై ఇతరులను ప్రభావితం చేయగలవారి అభిప్రాయాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు.
దీని ప్రకారం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య 700 బేసిస్ పాయింట్లు పెరిగి 28 శాతానికి చేరింది. టర్మ్ పాలసీల గురించి అవగాహన 1,000 బేసిస్ పాయింట్లు ఎగిసి 57 శాతానికి పెరిగింది. అత్యధికంగా బీమా భద్రతపై అవగాహన ఉన్న వారు, జీవిత బీమా పాలసీదారులతో దక్షిణాది అగ్రస్థానంలో ఉంది. ఈ విషయంలో 47 పాయింట్లతో ఢిల్లీ, 46 పాయింట్లతో హైదరాబాద్ టాప్‌లో ఉన్నాయి. మరోవైపు, అనేక అంశాల్లో పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆర్థిక అభద్రతా భావం ఎక్కువగా ఉంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో బీమా భద్రతకన్నా ఎక్కువగా పొదుపునకే ప్రాధాన్యమిస్తున్నారు. టర్మ్ పాలసీల కన్నా ఎండోమెంట్ పాలసీల వైపే మొగ్గు చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment