Insurance awareness
-
పది పాసైన మహిళలకు ఎల్ఐసీ ఉపాధి అవకాశం
బీమా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 9న హరియాణాలోని పానిపట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎల్ఐసీ బీమా సఖీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు నియామక పత్రాలను అందజేశారు. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి, బీమాపై అవగాహనను కల్పించడం ఈ పథకం ప్రాథమిక లక్ష్యమని ఎల్ఐసీ తెలిపింది.The Honorable Prime Minister of India, Shri Narendra Modi will be launching LIC’s BIMA SAKHI yojana at Panipat on 09th December 2024 to celebrate Women as partner in the Nations Progress.#BimaSakhiYojana #LIC@narendramodi @PMOIndia@nsitharaman @DFS_India— LIC India Forever (@LICIndiaForever) December 8, 2024కీలక అంశాలు..అర్హులు: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన 18-70 సంవత్సరాల వయస్సు గల మహిళలు.శిక్షణ, ఉపాధి: బీమా సఖీలుగా పిలువబడే మహిళలకు బీమా రంగంలో శిక్షణ ఇచ్చి ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమించుకుంటారు. ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశం అంతటా లక్ష మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.ఆర్థిక సహాయం: ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీ స్టైఫండ్ లభిస్తుంది. మొదటి సంవత్సరంలో నెలకు రూ.7,000, రెండో సంవత్సరంలో రూ.6,000, మూడో సంవత్సరంలో రూ.5,000 పొందవచ్చు. అదనంగా రూ.2,100 ప్రోత్సాహకం లభిస్తుంది.బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు. మొదటి సంవత్సరం కమీషన్ రూ.48,000 వరకు ఉంటుంది.ఇదీ చదవండి: నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్వేర్ జీతం కాదు! -
టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటి చాలదా..?
జీవిత బీమా సాధనాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ సాధనం ఎంతో కీలకమైనది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీనిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వారు, సంపాదించే శక్తి కలిగిన వారు టర్మ్ ఇన్సూరెన్స్‌తో తమవారికి తగినంత రక్షణ కల్పించుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో ఇప్పటికీ ఎక్కువ మందికి టర్మ్ బీమా ప్లాన్లు లేవు. కొందరికి ఒకటికి మించి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కూడా ఉన్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటి ఉంటే సరైనది.. రెండుంటే ప్రతికూలమని చెప్పడానికి లేదు. ఏ ప్రయోజనాలను ఆశించి ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు తీసుకున్నామనే స్పష్టత అయితే ఉండాలి. వాస్తవానికి ఎక్కువ ప్లాన్లను కలిగి ఉండడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, ఎన్ని ఉన్నా.. కవరేజీ తగినంత ఉండడం కీలకమని గుర్తుంచుకోవాలి. ఒకటికి మించిన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో ఉండే లాభ, నష్టాలపై అవగాహన కల్పించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది దీర్ఘకాలానికి తీసుకోతగిన బీమా సాధనం. పాలసీదారు ఏదేనీ కారణంతో మరణించినట్టయితే.. ఆ వ్యక్తిపై ఆధారపడినవారు, కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆదుకునే సాధనం. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. సరైన బీమా రక్షణతో తీసుకోవడమూ అంతే కీలకం. పాలసీదారు లేని పరిస్థితుల్లో కుటుంబ అవసరాలు, బాధ్యతలు, స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాలన్నింటినీ బీమా పరిహారం తీర్చేదిగా ఉండాలి. పాలసీ తీసుకునే సమయంలో ఎంత మొత్తంకావాలన్నది నిర్ణయించుకోవడం కొంచెం క్లిష్టమైన పనే. దీంతో ఎక్కువ మంది అవసరానికంటే తక్కువ మొత్తానికే కవరేజీతో సరిపెట్టుకుంటుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్‌లో మాదిరిగా లైఫ్ ఇన్సూరెన్స్‌కు టాపప్ సదుపాయం ఉండదు. కనుక ఒక్కసారి టర్మ్ ప్లాన్ తీసుకున్న తర్వాత తదనంతర పరిస్థితుల్లో కవరేజీ చాలదని గుర్తించినట్టయితే అదనంగా మరొక టర్మ్ ప్లాన్‌ను జోడించుకోవడం మినహా మరో మార్గం లేదు. ఒకటికి మించి టర్మ్ ప్లాన్లను తీసుకోవడం మన దేశంలో చట్టబద్ధమే. ఎన్నో రకాల ప్రయోజనాలు వాటితో వస్తాయి. గరిష్ట కవరేజీ, భిన్నమైన ప్రయోజనాలు ఆయా ప్లాన్లతో ఏర్పాటు చేసుకోవచ్చు. రెండో టర్మ్ ప్లాన్ తీసుకోవాలని భావించినట్టయితే.. నేరుగా బీమా కంపెనీ నుంచి తీసుకోవడం మంచిది. వివిధ కంపెనీలు ఆఫర్ చేసే ప్లాన్లలో భిన్నమైన ప్రయోజనాలు, సదుపాయాలు, మినహాయింపలు, జోడింపులు ఉంటాయి. కనుక వేర్వేరు కంపెనీల నుంచి టర్మ్ ప్లాన్ ఉండడం ఒక విధంగా లాభదాయకమే. కాకపోతే మొదటి పాలసీ తర్వాత నుంచి ఎన్ని పాలసీలు తీసుకున్నా కానీ, అంతకుముందు బీమా పాలసీల గురించి తప్పకుండా ప్రపోజల్ పత్రంలో పేర్కొనాలి. ఈ సమాచారంతోనే కంపెనీలు రిస్క్‌ను మదింపు వేసుకుని, తమ నిర్ణయాన్ని తెలియజేయగలవు. అప్పటి వరకు ఉన్న ప్లాన్ల వివరాలను దాచి పెడితే భవిష్యత్తులో క్లెయిమ్‌ల సమయంలో ఇబ్బందులు పడాల్సి రావచ్చు. అందువల్ల గత ప్లాన్ల వివరాలు దాచిపెట్టవద్దు. వయసు ఆధారంగా.. వయసు ఆధారంగా బీమా కవరేజీని నేడు బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు 18–35 ఏళ్ల వయసు వారు వార్షికాదాయానికి గరిష్టంగా 25 రెట్ల బీమా కవరేజీకి అర్హులు. 36–40 ఏళ్ల వయసు వారు వార్షిక ఆదాయానికి 20 రెట్లు.. 41–50 ఏళ్ల గ్రూపులో ఉన్న వారు వార్షిక ఆదాయానికి 10–15 రెట్ల వరకు కవరేజీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్క పాలసీ అయినా, ఒకటికి మించి టర్మ్ ప్లాన్లు అయినా వార్షిక ఆదాయ రుజువును చూపించాల్సిందే. ఎక్కువ ప్లాన్లు ఎందుకు? ఒకటి చాలక ఇంకొకటి తీసుకుంటున్నారా..? లేక వేరే ప్రయోజనాల కోసం ఒకటికి మించి ప్లాన్లను తీసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు కచ్చితంగా పాలసీదారులు సమాధానం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్క ప్లాన్‌లో తగినంత కవరేజీ తీసుకుంటే అయ్యే ప్రీమియంతో పోలిస్తే.. అంతే కవరేజీని ఒకటికి మించి ప్లాన్ల రూపంలో తీసుకోవాలంటే కాస్త అధిక ప్రీమియం భరించాల్సి రావచ్చు. అయినప్పటికీ ఒకటికి మించి ప్లాన్లతో ఉంటే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే అదే మంత భారం అనిపించదు. ఒకటికి మించిన ప్లాన్లను వేర్వేరు సంస్థల నుంచి తీసుకోవడం వల్ల.. బీమా కవరేజీలో వైవిధ్యానికి చోటు ఇచ్చినట్టు అవుతుంది. ఉదాహరణకు శాంతన్ అనే వ్యక్తి తనకు రూ.కోటి బీమా రక్షణ అవసరమని భావించాడనుకుంటే.. రూ.కోటి కవరేజీతో ఒక సంస్థ నుంచి టర్మ్ ప్లాన్ తీసుకున్నాడనుకోండి. క్లెయిమ్ సమయంలో వివాదం లేదా సమస్య ఏర్పడి సకాలంలో పరిహారం అందకపోతే అతడి కుటుంబం ఇబ్బంది పడాల్సి వస్తుంది. రూ.కోటి సమ్ అష్యూరెన్స్‌ను ఒకటికి మించిన పాలసీల పరిధిలో వేర్వేరుగా తీసుకుంటే.. అప్పుడు కనీసం ఒక సంస్థ నుంచి అయినా సకాలంలో పరిహారం లభిస్తుంది. ఇది మరణించిన వ్యక్తి కుటుంబానికి ఉపశమనాన్నిస్తుంది. అలాగే, శాంతన్‌కు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకుంటే.. రూ.కోటి కవరేజీకి బీమా కంపెనీలు అంగీకరించకపోవచ్చు. అటువంటి సందర్భాల్లోనూ ఒకటికి మించిన సంస్థల నుంచి తక్కువ మొత్తాలతో బీమా ప్లాన్‌ను తీసుకోవచ్చు. అలా గరిష్ట కవరేజీకి అవకాశం లభిస్తుంది. రుణ భారం అప్పటికే ఒక టర్మ్ ప్లాన్ ఉన్నా కానీ, మరొక పాలసీ తీసుకోవాల్సిన ప్రత్యేక సందర్భాలు కూడా ఉంటాయి. మొదటి టర్మ్ ప్లాన్ తీసుకున్న తర్వాతి కాలంలో.. ఏదైనా అవసరం కోసం రుణం తీసుకుంటే కచ్చితంగా అదనపు కవరేజీ అవసరం ఏర్పడుతుంది. రుణానికి సమాన స్థాయిలో కవరేజీతో మరొక ప్లాన్‌ను తీసుకోవాలి. గృహ రుణం, వ్యాపారం కోసం రుణాలను తీసుకుంటే, వెంటనే ఆ రుణ భారానికి సమాన స్థాయిలో టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. అలా కాకుండా అప్పటికే ఒక బీమా ప్లాన్ ఉందిలేనని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ముందు తీసుకున్న టర్మ్ ప్లాన్ కుటుంబ అవసరాల కోసమని గుర్తు పెట్టుకోవాలి. రుణాలకు ప్రత్యేకమైన కవరేజీ లేకపోతే.. అప్పుడు కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న టర్మ్ ప్లాన్.. పాలసీదారు మరణించిన తర్వాత రుణ భారాలను చెల్లించడానికి కరిగిపోవచ్చు. ముఖ్యంగా టర్మ్ ప్లాన్ కవరేజీ ‘హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ’ (హెచ్ఎల్వీ)ను మించి ఉండాల్సిన అవసరం లేదు. వ్యక్తి ఆదాయం, పొదుపు, బాధ్యతలన్నింటినీ కలిపితే వచ్చేదే హెచ్ఎల్వీ. దీనిని బట్టి ప్లాన్ ప్రణాళిక ఉంటే సరిపోతుంది. భారం దించుకోవచ్చు.. అలాగే ఎక్కువ టర్మ్ ప్లాన్లను కలిగి ఉంటే.. 50 వసంతాలను దాటి, తమపై బాధ్యతలు తగ్గిపోతున్న తరుణంలో ఒకటి, రెండు టర్మ్ ప్లాన్లను నిలిపివేసుకోవడం వల్ల కొంత ఆదా చేసుకోవచ్చు. లేదా ప్రీమియం భరించలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం ఒక ప్లాన్‌ను అయినా సరెండర్ చేయడం ద్వారా కొంత భారాన్ని దించుకోవచ్చు. అలా కాకుండా అధిక కవరేజీతో ఒక్కటే ప్లాన్ ఉంటే రక్షణ కోసం కచ్చితంగా దాన్ని కొనసాగించుకోక తప్పదు. మరోవైపు బీమా పరిశ్రమ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతోంది. పాలసీల పరంగా భిన్నమైన ప్రయోజనాలు, సదుపాయాలతో కొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. పాలసీదారులకు భిన్నమైన సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతమున్న ఉత్పత్తులతో పోలిస్తే.. 5–10–20 ఏళ్ల క్రితం ప్లాన్లు చాలా సాధారణంగానే ఉండేవి. ప్రస్తుతం టర్మ్ ప్లాన్లలో జీవిత భాగస్వామి (గృహిణులకు సైతం)కి సైతం కవరేజీని తీసుకునే అవకాశం ఉంది. అలాగే, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ రైడర్, ప్రమాద మరణం, ప్రమాద వైకల్యం, చిన్నారుల భవిష్యత్తు ప్రయోజనాలను రైడర్ రూపంలో చాలా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. పాలసీదారు తన ఆర్థిక, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా టర్మ్ ప్లాన్ కవరేజీలను ఎంపిక చేసుకోవాలి. -
కోవిడ్ ఎఫెక్ట్, భారీగా పెరగనున్న ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో బీమాపై ప్రజల మైండ్‌సెట్ నెమ్మదిగా మారుతోందని, ఇన్సూరెన్స్ అవసరం గురించి అవగాహన పెరుగుతోందని వెల్లడించారు ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ ఏజియాస్ ఫెడరల్ ఎండీ, సీఈవో విఘ్నేష్ షహాణే. టర్మ్, హెల్త్ పాలసీలకు డిమాండ్ కనిపిస్తోందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కోవిడ్ పరిణామాల కారణంగా క్లెయిమ్‌లు గణనీయంగా పెరగడంతో.. టర్మ్ ప్లాన్ ప్రీమియంలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరిన్ని ముఖ్యాంశాలు.. కోవిడ్ నేపథ్యంలో బీమాపై ప్రజల ధోరణి ఎలా ఉంటోంది? సాధారణంగా భారతీయుల మైండ్ సెట్ బట్టి చూస్తే.. జీవిత బీమా పాలసీ తీసుకున్నప్పుడు ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే, ఇన్వెస్ట్ చేసిన దానిలో ఎంతో కొంత వెనక్కి రావాలని ఆశిస్తారు. దీంతో టర్మ్ ప్లాన్లు తక్కువ ప్రీమియంకే అధిక కవరేజీ ఇచ్చేవి అయినప్పటికీ.. క్లెయిమ్ ఉంటే తప్ప ఆర్థిక ప్రయోజనం అందించవు కాబట్టి వాటికి అంతగా ఆదరణ దక్కలేదు. అయితే, అనిశ్చితిలో ఆర్థికంగా రక్షణ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం టర్మ్ ప్లాన్లు, హెల్త్ ప్లాన్లపై అవగాహన పెరుగుతోంది. పొదుపు పథకాలు, రిటైర్మెంట్, యాన్యుటీ ప్లాన్లపైనా ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా మంచి ఏదైనా జరిగిందంటే అది ఇదే. ఈ విషయంలో మైండ్‌సెట్ మెరుగుపడటం నెమ్మదిగా మొదలైంది. ఇది గణనీయంగా మారడానికి ఇంకాస్త సమయం పడుతుంది. పొదుపు సాధనంగా కూడా బీమా పథకాలకు ఆదరణ ఎలా ఉంది? మహమ్మారి సమయంలో ఉద్యోగాలు పోయి, జీతాల్లో కోత పడి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. దీంతో కష్టకాలంలో ఆదుకోవడానికి పొదుపు అవసరం కూడా పెరుగుతోంది. ఇటు పొదుపు అటు ఆర్థిక భరోసా పొందడానికి జీవిత బీమా మెరుగైన సాధనంగా ఉపయోగపడగలదు. పదేళ్ల లోపు పిల్లలున్న తల్లిదండ్రుల ఆర్థిక సన్నద్ధత, పెట్టుబడుల నిర్ణయాలను అంచనా వేసేందుకు మేను ఇటీవల యూగవ్ ఇండియా సంస్థతో కలిసి ఫ్యూచర్ఫియర్లెస్ సర్వే నిర్వహించాము. ఇతరత్రా పిల్లల పెళ్లి, వ్యాపారాల కోసం పొదుపు చేయడం వంటి జీవిత లక్ష్యాలకన్నా తమ పిల్లల విద్య అవసరాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇందులో పేరెంట్స్ తెలిపారు. ఇందుకోసం యూలిప్‌లు, మనీబ్యాక్, ఎండోమెంట్ ప్లాన్స్ వంటి జీవిత బీమా సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని మూడింట రెండొంతుల మంది చెప్పడం గమనార్హం. భవిష్యత్‌లో అనిశ్చితి నుంచి కుటుంబానికి ఆర్థికంగా భరోసానిచ్చేందుకు తక్కువ రిస్కుతో దీర్ఘకాలానికి సురక్షిత పెట్టుబడి సాధనంగా జీవిత బీమాను ఎంచుకుంటున్నారు. జీవిత బీమా పాలసీలను కొనసాగించేందుకు, రెన్యూ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తుండటంతో బీమా ప్రీమియం వసూళ్లు కూడా మెరుగ్గా ఉంటున్నాయి. యులిప్ (యూనిట్ లింక్డ్ పాలసీలు) అమ్మకాలు పెరగడానికి ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లు బా గా రాణిస్తుండటం కూడా కొంత దోహదపడింది. కోవిడ్ క్లెయిముల పరిస్థితి ఎలా ఉంది? గత ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా రూ. 116 కోట్ల క్లెయిములు వచ్చాయి. ఈసారి స్థూలంగా 2–2.5 రెట్లు పెరగవచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరం మొత్తం క్లెయిముల్లో.. కోవిడ్ క్లెయిములు 25 శాతం ఉన్నాయి. ఈసారి తొలి త్రైమాసికంలో మొత్తం క్లెయిముల్లో వీటి వాటా 75 శాతంగా ఉన్నప్పటికీ, తర్వాత త్రైమాసికాల్లో పరిస్థితులు అదుపులోకి వస్తుండటంతో తగ్గాయి. అయితే, ఇవి తగ్గినప్పటికీ కోవిడ్ వల్ల ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తి కోవిడ్–యేతర కారణాలతో మరణించే వారి సంఖ్య గతంలో కన్నా పెరిగింది. జీవిత బీమా ప్రీమియంలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయా? అవును. కోవిడ్ క్లెయిములు.. ముఖ్యంగా రెండో వేవ్‌లో.. గణనీయంగా ఎగియడం వల్ల రీఇన్సూరెన్స్ సంస్థలకు గట్టి దెబ్బ తగిలింది. దీంతో అవి టర్మ్ ప్లాన్ రేట్లను పెంచే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా 20–40 శాతం మేర రేట్లు పెరగవచ్చని అంచనా. అయితే, రీఇన్సూరెన్స్ సంస్థ .. జీవిత బీమా సంస్థను బట్టి, అలాగే ఆయా రీఇన్సూరెన్స్ సంస్థలతో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఉన్న వ్యాపార పరిమాణం బట్టి పెంపు ఆధారపడి ఉంటుంది. దక్షిణాదిలో మీ వ్యాపార ప్రణాళికలు ఏమిటి? ఫెడరల్ బ్యాంకుకు విస్తృతమైన నెట్వర్క్ ఉండటంతో దక్షిణాది రాష్ట్రాలపై మేము ముందు నుంచీ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి కాలంలో దక్షిణాదిలోని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మా వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందింది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయిదు ఏజెన్సీ శాఖలు, 1,000 పైచిలుకు అడ్వైజర్లు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏజెన్సీ, డిజిటల్, డైరెక్ట్ సేల్స్ మొదలైన మాధ్యమాల ద్వారా పంపిణీ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోబోతున్నాం. వ్యాపార వృద్ధి అంచనాలేమిటి? గత ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ అనిశ్చితి కారణంగా తొలి మూడు నెలలు లాక్‌డౌన్‌లోనే గడిచిపోయినప్పటికీ మేము ఊహించిన దానికన్నా మెరుగ్గానే రాణించాం. మొత్తం ప్రీమియం వసూళ్లు 6 శాతం పెరిగాయి. వరుసగా తొమ్మిదో ఏడాది లాభాలు ప్రకటించగలిగాం, వరుసగా మూడో ఏడాది 13 శాతం మేర డివిడెండ్ ఇచ్చాం. ఇక ఈ ఆర్థిక సంవత్సరం కూడా సెకండ్ వేవ్, లాక్డౌన్ లాంటి వాటితో అనిశ్చితిలోనే మొదలైనప్పటికీ క్రమంగా పరిస్థితి మెరుగుపడుతోంది. ప్రీమియం విషయంలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 30–35 శాతం వృద్ధి సాధించగలమని ఆశిస్తున్నాం. -
ఆర్థిక అభద్రతలో పట్టణ భారతం..
న్యూఢిల్లీ: గడిచిన ఏడాది కాలంగా బీమాపై అవగాహన పెరిగినప్పటికీ .. పట్టణ ప్రాంతాల ప్రజల్లో ఆర్థిక అభద్రత భావం తగ్గలేదు. రోజువారీ వైద్యం ఖర్చులు, జీవన విధానాన్ని కొనసాగించేందుకు అయ్యే వ్యయాలపై యువత మరింత ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. బీమా సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి మధ్యకాలంలో 25 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 7,014 మంది తమ అభిప్రాయాలు తెలియజేశారు. వీటిలో 6 మెట్రో నగరాలు, 9 ప్రథమ శ్రేణి నగరాలు, 10 ద్వితీయ శ్రేణి నగరాలు ఉన్నాయి. 25–55 ఏళ్ల మధ్య, సగటున రూ. 2 లక్షల పైగా కుటుంబ వార్షికాదాయం గలవారు, ఆర్థిక సాధనాలపై ఇతరులను ప్రభావితం చేయగలవారి అభిప్రాయాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య 700 బేసిస్ పాయింట్లు పెరిగి 28 శాతానికి చేరింది. టర్మ్ పాలసీల గురించి అవగాహన 1,000 బేసిస్ పాయింట్లు ఎగిసి 57 శాతానికి పెరిగింది. అత్యధికంగా బీమా భద్రతపై అవగాహన ఉన్న వారు, జీవిత బీమా పాలసీదారులతో దక్షిణాది అగ్రస్థానంలో ఉంది. ఈ విషయంలో 47 పాయింట్లతో ఢిల్లీ, 46 పాయింట్లతో హైదరాబాద్ టాప్‌లో ఉన్నాయి. మరోవైపు, అనేక అంశాల్లో పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆర్థిక అభద్రతా భావం ఎక్కువగా ఉంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో బీమా భద్రతకన్నా ఎక్కువగా పొదుపునకే ప్రాధాన్యమిస్తున్నారు. టర్మ్ పాలసీల కన్నా ఎండోమెంట్ పాలసీల వైపే మొగ్గు చూపుతున్నారు. -
బీమా..ఎంపిక ఇలా!
ఊహించని పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన ధీమాను కల్పించేది బీమా. అయితే పాలసీ తీసుకున్న వారిలోనూ చాలా మంది.. ఏదో ఒక పాలసీ ఉంటే చాలు అనుకునే వారే ఉంటున్నారు తప్ప.. ఇది తప్పనిసరి అవసరంగా భావించి తీసుకునే వారి సంఖ్య తక్కువ. బీమాపై ఇంకా ప్రజల్లో పూర్తిగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. కొన్ని విషయాలపై కసరత్తు చేస్తే మనకు, మన కుటుంబానికి అవసరమైన కవరేజీని చౌకగా అందించే.. అనువైన బీమా పథకాన్ని ఎంచుకోవడం సులభతరం అవుతుంది. అలాంటి అంశాల గురించి వివరించేదే ఈ కథనం. 1. రిస్కు బేరీజు: ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటున్న పక్షంలో ముందుగా మనం ఆరోగ్యపరంగా గతంలో ఎదుర్కొన్న సమస్యలు, భవిష్యత్‌లో తలెత్తే అవ కాశం ఉన్న సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి. తద్వారా మనకు రిస్కు ఎంత మేర ఉందన్న దానిపై ఒక అంచనాకు రావొచ్చు. సాధారణంగా పాలసీల్లో కొన్ని మినహాయింపులు కూడా ఉంటుంటాయి. ఒకవేళ సరైనది ఎంచుకోకపోతే మనకు కావల్సిన దానికి కవరేజీ లేకుండా పోతుంది. ఫలితంగా కట్టిన ప్రీమియం అంతా వ్యర్థమవుతుంది. గృహ బీమాకు కూడా ఇది వర్తిస్తుంది. స్థానికంగా నేరాలు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైన వాటి వల్ల గృహానికి ఎంత మేర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయన్నది బేరీజు వేసుకోవాలి. ఇంటిలోని వస్తువుల విలువను లెక్కగ ట్టి .. తగిన స్థాయిలో కవరేజీనిచ్చే పాలసీని ఎంచుకోవాలి. ఇక వాహన బీమా విషయానికొస్తే.. బీమా అవసరాలపై తగిన దృష్టి పెట్ట్లాలి. 2. ‘చౌక’ అన్ని వేళలా సరికాదు! బీమా కవరేజీ చాలా కీలకమైనది. చౌకగా వస్తోంది కదా అని ఏ పాలసీబడితే అది తీసుకోకూడదు. పాలసీకి కట్టాల్సిన ప్రీమియం కన్నా దాని ద్వారా వచ్చే కవరేజీకి ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే వైద్యం, పిల్లల విద్యాభ్యాసం మొదలైన వాటన్నింటికీ ఎలాంటి అవాంతరం లేకుండా చూసుకోవడానికి వీలవుతుంది. గృహ బీమాకు సంబంధించి తక్కువ కవరేజీ తీసుకున్న పక్షంలో ఒకవేళ ఏదైనా అనుకోనిది జరిగితే అరకొర క్లెయిమ్ మొత్తాల వల్ల ఒరిగే ప్రయోజనాలు ఉండవని గుర్తుంచుకోవాలి. ఇంటిని మళ్లీ రిపేరు చేయాలన్నా, తిరిగి కట్టుకోవాల్సి వచ్చినా, ఇంట్లో వస్తువులను తిరిగి కొనుక్కోవాల్సి వచ్చినా.. తగినంత విలువకు కవరేజీ తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. వాహన బీమాకు సంబంధించి కూడా కవరేజ్ అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. 3.ఏటా కవరేజీ సమీక్షించుకోవాలి: మన రిస్కులను ప్రతి ఏడాదీ సమీక్షించుకుంటూ ఉండాలి. ఎంచుకున్న కవరేజీ దానికి తగ్గట్లుగానే ఉందా లేదా అన్నది చూసుకోవాలి. 4. పేరొందిన బీమా సంస్థనే ఎంచుకోవాలి: వీలైనంత వరకూ పేరొందిన బీమా సంస్థ పాలసీలనే ఎంచుకోవడం మంచిది. క్లెయిమ్‌ల పరిష్కారంలో పాలసీదారుల నమ్మకాన్ని కష్టపడి సాధించుకున్న టాప్ రేటింగ్ కంపెనీలు సాధ్యమైనంతవరకూ విశ్వసనీయమైన ఆఫర్లనే అందిస్తుంటాయి. 5. మినహాయింపులు చూసుకోవాలి: పాలసీ పత్రాలను క్షుణ్నంగా చదువుకోవాలి. సందేహాలొస్తే మొహమాటపడకుండా ఏజెంటును ప్రశ్నించి తెలుసుకోవాలి. ఒకవేళ పాలసీలో ఏదైనా సందర్భానికి మినహాయింపు ఉన్న పక్షంలో... యాడ్ ఆన్ ఆప్షన్స్ లాంటివి ఉన్నాయేమో కనుక్కోవాలి.