జీవిత బీమా సాధనాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ సాధనం ఎంతో కీలకమైనది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీనిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వారు, సంపాదించే శక్తి కలిగిన వారు టర్మ్ ఇన్సూరెన్స్‌తో తమవారికి తగినంత రక్షణ కల్పించుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో ఇప్పటికీ ఎక్కువ మందికి టర్మ్ బీమా ప్లాన్లు లేవు. కొందరికి ఒకటికి మించి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కూడా ఉన్నాయి.
టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటి ఉంటే సరైనది.. రెండుంటే ప్రతికూలమని చెప్పడానికి లేదు. ఏ ప్రయోజనాలను ఆశించి ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు తీసుకున్నామనే స్పష్టత అయితే ఉండాలి. వాస్తవానికి ఎక్కువ ప్లాన్లను కలిగి ఉండడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, ఎన్ని ఉన్నా.. కవరేజీ తగినంత ఉండడం కీలకమని గుర్తుంచుకోవాలి. ఒకటికి మించిన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో ఉండే లాభ, నష్టాలపై అవగాహన కల్పించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది.
టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది దీర్ఘకాలానికి తీసుకోతగిన బీమా సాధనం. పాలసీదారు ఏదేనీ కారణంతో మరణించినట్టయితే.. ఆ వ్యక్తిపై ఆధారపడినవారు, కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆదుకునే సాధనం. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. సరైన బీమా రక్షణతో తీసుకోవడమూ అంతే కీలకం. పాలసీదారు లేని పరిస్థితుల్లో కుటుంబ అవసరాలు, బాధ్యతలు, స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాలన్నింటినీ బీమా పరిహారం తీర్చేదిగా ఉండాలి.
పాలసీ తీసుకునే సమయంలో ఎంత మొత్తంకావాలన్నది నిర్ణయించుకోవడం కొంచెం క్లిష్టమైన పనే. దీంతో ఎక్కువ మంది అవసరానికంటే తక్కువ మొత్తానికే కవరేజీతో సరిపెట్టుకుంటుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్‌లో మాదిరిగా లైఫ్ ఇన్సూరెన్స్‌కు టాపప్ సదుపాయం ఉండదు. కనుక ఒక్కసారి టర్మ్ ప్లాన్ తీసుకున్న తర్వాత తదనంతర పరిస్థితుల్లో కవరేజీ చాలదని గుర్తించినట్టయితే అదనంగా మరొక టర్మ్ ప్లాన్‌ను జోడించుకోవడం మినహా మరో మార్గం లేదు.
ఒకటికి మించి టర్మ్ ప్లాన్లను తీసుకోవడం మన దేశంలో చట్టబద్ధమే. ఎన్నో రకాల ప్రయోజనాలు వాటితో వస్తాయి. గరిష్ట కవరేజీ, భిన్నమైన ప్రయోజనాలు ఆయా ప్లాన్లతో ఏర్పాటు చేసుకోవచ్చు. రెండో టర్మ్ ప్లాన్ తీసుకోవాలని భావించినట్టయితే.. నేరుగా బీమా కంపెనీ నుంచి తీసుకోవడం మంచిది. వివిధ కంపెనీలు ఆఫర్ చేసే ప్లాన్లలో భిన్నమైన ప్రయోజనాలు, సదుపాయాలు, మినహాయింపలు, జోడింపులు ఉంటాయి.
కనుక వేర్వేరు కంపెనీల నుంచి టర్మ్ ప్లాన్ ఉండడం ఒక విధంగా లాభదాయకమే. కాకపోతే మొదటి పాలసీ తర్వాత నుంచి ఎన్ని పాలసీలు తీసుకున్నా కానీ, అంతకుముందు బీమా పాలసీల గురించి తప్పకుండా ప్రపోజల్ పత్రంలో పేర్కొనాలి. ఈ సమాచారంతోనే కంపెనీలు రిస్క్‌ను మదింపు వేసుకుని, తమ నిర్ణయాన్ని తెలియజేయగలవు. అప్పటి వరకు ఉన్న ప్లాన్ల వివరాలను దాచి పెడితే భవిష్యత్తులో క్లెయిమ్‌ల సమయంలో ఇబ్బందులు పడాల్సి రావచ్చు. అందువల్ల గత ప్లాన్ల వివరాలు దాచిపెట్టవద్దు.
వయసు ఆధారంగా..
వయసు ఆధారంగా బీమా కవరేజీని నేడు బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు 18–35 ఏళ్ల వయసు వారు వార్షికాదాయానికి గరిష్టంగా 25 రెట్ల బీమా కవరేజీకి అర్హులు. 36–40 ఏళ్ల వయసు వారు వార్షిక ఆదాయానికి 20 రెట్లు.. 41–50 ఏళ్ల గ్రూపులో ఉన్న వారు వార్షిక ఆదాయానికి 10–15 రెట్ల వరకు కవరేజీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్క పాలసీ అయినా, ఒకటికి మించి టర్మ్ ప్లాన్లు అయినా వార్షిక ఆదాయ రుజువును చూపించాల్సిందే.
ఎక్కువ ప్లాన్లు ఎందుకు?
ఒకటి చాలక ఇంకొకటి తీసుకుంటున్నారా..? లేక వేరే ప్రయోజనాల కోసం ఒకటికి మించి ప్లాన్లను తీసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు కచ్చితంగా పాలసీదారులు సమాధానం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్క ప్లాన్‌లో తగినంత కవరేజీ తీసుకుంటే అయ్యే ప్రీమియంతో పోలిస్తే.. అంతే కవరేజీని ఒకటికి మించి ప్లాన్ల రూపంలో తీసుకోవాలంటే కాస్త అధిక ప్రీమియం భరించాల్సి రావచ్చు.
అయినప్పటికీ ఒకటికి మించి ప్లాన్లతో ఉంటే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే అదే మంత భారం అనిపించదు. ఒకటికి మించిన ప్లాన్లను వేర్వేరు సంస్థల నుంచి తీసుకోవడం వల్ల.. బీమా కవరేజీలో వైవిధ్యానికి చోటు ఇచ్చినట్టు అవుతుంది. ఉదాహరణకు శాంతన్ అనే వ్యక్తి తనకు రూ.కోటి బీమా రక్షణ అవసరమని భావించాడనుకుంటే.. రూ.కోటి కవరేజీతో ఒక సంస్థ నుంచి టర్మ్ ప్లాన్ తీసుకున్నాడనుకోండి. క్లెయిమ్ సమయంలో వివాదం లేదా సమస్య ఏర్పడి సకాలంలో పరిహారం అందకపోతే అతడి కుటుంబం ఇబ్బంది పడాల్సి వస్తుంది.
రూ.కోటి సమ్ అష్యూరెన్స్‌ను ఒకటికి మించిన పాలసీల పరిధిలో వేర్వేరుగా తీసుకుంటే.. అప్పుడు కనీసం ఒక సంస్థ నుంచి అయినా సకాలంలో పరిహారం లభిస్తుంది. ఇది మరణించిన వ్యక్తి కుటుంబానికి ఉపశమనాన్నిస్తుంది. అలాగే, శాంతన్‌కు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకుంటే.. రూ.కోటి కవరేజీకి బీమా కంపెనీలు అంగీకరించకపోవచ్చు. అటువంటి సందర్భాల్లోనూ ఒకటికి మించిన సంస్థల నుంచి తక్కువ మొత్తాలతో బీమా ప్లాన్‌ను తీసుకోవచ్చు. అలా గరిష్ట కవరేజీకి అవకాశం లభిస్తుంది.
రుణ భారం
అప్పటికే ఒక టర్మ్ ప్లాన్ ఉన్నా కానీ, మరొక పాలసీ తీసుకోవాల్సిన ప్రత్యేక సందర్భాలు కూడా ఉంటాయి. మొదటి టర్మ్ ప్లాన్ తీసుకున్న తర్వాతి కాలంలో.. ఏదైనా అవసరం కోసం రుణం తీసుకుంటే కచ్చితంగా అదనపు కవరేజీ అవసరం ఏర్పడుతుంది. రుణానికి సమాన స్థాయిలో కవరేజీతో మరొక ప్లాన్‌ను తీసుకోవాలి. గృహ రుణం, వ్యాపారం కోసం రుణాలను తీసుకుంటే, వెంటనే ఆ రుణ భారానికి సమాన స్థాయిలో టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. అలా కాకుండా అప్పటికే ఒక బీమా ప్లాన్ ఉందిలేనని నిర్లక్ష్యం చేయవద్దు.
ఎందుకంటే ముందు తీసుకున్న టర్మ్ ప్లాన్ కుటుంబ అవసరాల కోసమని గుర్తు పెట్టుకోవాలి. రుణాలకు ప్రత్యేకమైన కవరేజీ లేకపోతే.. అప్పుడు కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న టర్మ్ ప్లాన్.. పాలసీదారు మరణించిన తర్వాత రుణ భారాలను చెల్లించడానికి కరిగిపోవచ్చు. ముఖ్యంగా టర్మ్ ప్లాన్ కవరేజీ ‘హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ’ (హెచ్‌ఎల్‌వీ)ను మించి ఉండాల్సిన అవసరం లేదు. వ్యక్తి ఆదాయం, పొదుపు, బాధ్యతలన్నింటినీ కలిపితే వచ్చేదే హెచ్‌ఎల్‌వీ. దీనిని బట్టి ప్లాన్ ప్రణాళిక ఉంటే సరిపోతుంది.
భారం దించుకోవచ్చు..
అలాగే ఎక్కువ టర్మ్ ప్లాన్లను కలిగి ఉంటే.. 50 వసంతాలను దాటి, తమపై బాధ్యతలు తగ్గిపోతున్న తరుణంలో ఒకటి, రెండు టర్మ్ ప్లాన్లను నిలిపివేసుకోవడం వల్ల కొంత ఆదా చేసుకోవచ్చు. లేదా ప్రీమియం భరించలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం ఒక ప్లాన్‌ను అయినా సరెండర్ చేయడం ద్వారా కొంత భారాన్ని దించుకోవచ్చు. అలా కాకుండా అధిక కవరేజీతో ఒక్కటే ప్లాన్ ఉంటే రక్షణ కోసం కచ్చితంగా దాన్ని కొనసాగించుకోక తప్పదు. మరోవైపు బీమా పరిశ్రమ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతోంది.
పాలసీల పరంగా భిన్నమైన ప్రయోజనాలు, సదుపాయాలతో కొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. పాలసీదారులకు భిన్నమైన సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతమున్న ఉత్పత్తులతో పోలిస్తే.. 5–10–20 ఏళ్ల క్రితం ప్లాన్లు చాలా సాధారణంగానే ఉండేవి. ప్రస్తుతం టర్మ్ ప్లాన్లలో జీవిత భాగస్వామి (గృహిణులకు సైతం)కి సైతం కవరేజీని తీసుకునే అవకాశం ఉంది. అలాగే, క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజీ రైడర్, ప్రమాద మరణం, ప్రమాద వైకల్యం, చిన్నారుల భవిష్యత్తు ప్రయోజనాలను రైడర్ రూపంలో చాలా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. పాలసీదారు తన ఆర్థిక, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా టర్మ్ ప్లాన్ కవరేజీలను ఎంపిక చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment