టర్మ్‌ ప్లాన్స్‌.. అన్నీ ఒకటి కాదు! | Term plans are not all the same, explanation of term plans | Sakshi
Sakshi News home page

టర్మ్‌ ప్లాన్స్‌.. అన్నీ ఒకటి కాదు!

Published Mon, Feb 19 2024 6:07 AM | Last Updated on Mon, Feb 19 2024 6:07 AM

Term plans are not all the same, explanation of term plans - Sakshi

జీవిత బీమాను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణిలో మార్పు వస్తోంది. అయినా, ఇప్పటికీ అధిక శాతం మంది బీమా ప్లాన్‌ను రాబడి కోణం నుంచే చూస్తుంటారు. చివరిలో ఎంతొస్తుందని అడుగుతారు. అందుకే బీమా ఏజెంట్లు ఎండోమెంట్‌ ప్లాన్లను ఎక్కువగా మార్కెటింగ్‌ చేస్తుంటారు. కానీ, బీమా అర్థం వేరు. ఒక వ్యక్తి మరణం కారణంగా కుటుంబం ఆరి్థకంగా కష్టాలు పడకుండా ఆదుకునే సాధనం ఇది. బీమా రక్షణను ఈ కోణంలోనే తీసుకోవాలి. అచ్చమైన బీమా కవరేజీ ఇచ్చేదే టర్మ్‌ ఇన్సూరెన్స్‌. కానీ, ఇందులోనూ పలు రకాలు ప్రవేశించాయి. నిక్షేపంగా జీవించి ఉంటే మాకేంటి..? అని ప్రశ్నించే వారి కోసం టర్మ్‌ ప్లాన్‌ను బీమా సంస్థలు వినూత్నంగా అందిస్తున్నాయి. కానీ, ఏది తీసుకోవాలి..? దీనికి సమాధానం కావాలంటే నిపుణుల విశ్లేషణ తెలుసుకోవాల్సిందే.

తన కుటుంబ క్షేమం కోరేవారు తీసుకోవాల్సిన బీమా పాలసీ ఏదన్నా ఉందంటే అది టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అని చెప్పాలి. తక్కువ ప్రీమియానికే మెరుగైన కవరేజీ ఇందులో లభిస్తుంది. కానీ, పాలసీ గడువు ముగిసే వరకు జీవించి ఉంటే ఇందులో చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదు. దీంతో కట్టిన ప్రీమియం గంగపాలేనా? అని ఆలోచించే వారి కోసం బీమా సంస్థలు పరిష్కారాన్ని కనుగొన్నాయి. సగటు మనిషి ఆలోచనా తీరుకు అనుగుణంగా, చెల్లించిన ప్రీమియం చివర్లో వెనక్కి వచ్చే ఆప్షన్‌తోనూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టాయి. అలాగే, పాలసీ గడువు ముగియకపోయినా కానీ, మధ్యలో వైదొలిగితే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియాన్ని వెనక్కి ఇచ్చే రకాన్ని కూడా తీసుకొచ్చాయి. కానీ, పాలసీదారు తనకు నిజంగా ప్రయోజనకరమైన పాలసీ తీసుకున్నప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతుంది.

టర్మ్‌ పాలసీలో రకాలు
టర్మ్‌ ఇన్సూరెన్స్‌లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. ఇందులో మొదటిది రెగ్యులర్‌ టర్మ్‌ ప్లాన్‌. దీన్నే లెవల్‌ టర్మ్‌ ప్లాన్‌ అని కూడా అంటారు. పాలసీదారులు తమ అభీష్టం మేరకు నిరీ్ణత వయసు వరకు (నిరీ్ణత కాలానికి) కవరేజీని తీసుకోవచ్చు. కొన్ని బీమా సంస్థలు నూరేళ్ల కాలానికీ కవరేజీని ఆఫర్‌ చేస్తుంటే, కొన్ని గరిష్టంగా 85 ఏళ్లకే  రక్షణను పరిమితం చేస్తున్నాయి. ఇక టర్మ్‌ ప్లాన్‌లో రెండో రకం టీఆర్‌వోపీ. అంటే టర్మ్‌ ప్లాన్‌ విత్‌ రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం. గడువు తీరే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి 18 శాతం జీఎస్‌టీని మినహాయించి మిగిలినది వెనక్కిచేస్తాయి బీమా సంస్థలు.

మూడో రకం జీరో కాస్ట్‌ టర్మ్‌ ప్లాన్‌. ఇప్పుడు బీమా సంస్థలు దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. మిగిలిన రెండు రకాల కలయికగా ఇది ఉంటుంది. పాలసీ కాల వ్యవధిలోనే కట్టిన ప్రీమియంలు వెనక్కి ఇవ్వాలని కోరొచ్చు. వీటిల్లో మూడో రకం 2022 నుంచే అందుబాటులోకి వచి్చంది. మ్యాక్స్‌ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్, కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ తదితర సంస్థలు జీరో కాస్ట్‌ టర్మ్‌ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. వీటిల్లో రెగ్యులర్‌ టర్మ్‌ ప్లాన్‌ కాకుండా మిగిలిన రెండు రకాల పట్ల మొగ్గు చూపించేట్టు అయితే, ముందుగా వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి రావాలి.

వ్యత్యాసాలు...
రెగ్యులర్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌లో.. పాలసీ కాల వ్యవధి ముగిసేలోపు పాలసీదారు ఏ కారణంతో మరణించినా, పరిహారాన్ని నామినీకి చెల్లిస్తారు. పరిహారం మొత్తాన్ని ఒకే విడత లేదంటే, వాయిదాలుగానూ తీసుకోవచ్చు. కేవలం ఈ రిస్క్‌ వరకే ఈ పాలసీ పరిమితం. గడువు ముగిసేలోపు పాలసీదారు జీవించి ఉంటే ఏమీ తిరిగి రాదు. దీన్ని చౌక ప్లాన్‌గానూ చెబుతారు. కోటి రూపాయిల కవరేజీ సైతం 30 ఏళ్ల ఆరోగ్యకరమైన వ్యక్తికి రూ.12వేల కంటే తక్కువ వార్షిక ప్రీమియానికి వచ్చేస్తుంది. టీఆర్‌వోపీ (పాలసీ గడువు తీరిన తర్వాత ప్రీమియం వెనక్కి వచ్చేవి) ప్లాన్‌లో పాలసీ గడువులోపు పాలసీదారు మరణించినట్టయితే నామినీకి పరిహారం వస్తుంది.

పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి 18% జీఎస్‌టీని తగ్గించి ఇస్తారు. కానీ, రెగ్యులర్‌ టర్మ్‌ ప్లాన్‌లతో పోలిస్తే ఇవి ఖరీదుగా ఉంటాయి. రెగ్యులర్‌ టర్మ్‌ ప్లాన్‌ ప్రీమియం కంటే 2 రెట్ల వరకు అధిక ప్రీమియం వీటి కోసం చెల్లించాల్సి వస్తుంది. ఇలా అదనంగా వసూలు చేసే ప్రీమియంను సంప్రదాయ డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసి, గడువు తీరిన తర్వాత పాలసీదారులకు బీమా కంపెనీలు చెల్లిస్తుంటాయి.

అదనంగా చెల్లించే మొత్తం నుంచే తమ ప్రీమియం వెనక్కి వస్తుందన్న వాస్తవాన్ని పాలసీదారులు గుర్తించాలి. జీరో కాస్ట్‌ ప్లాన్‌లో పాలసీ గడువు కంటే ముందుగానే వైదొలగొచ్చు. ఒక వ్యక్తి తన ఆరి్థక బాధ్యతలు ముగిశాయని భావించినప్పుడు లేదంటే పదవీ విమరణ తర్వాత పాలసీ గడువు ఇంకా మిగిలి ఉన్నా వైదొలగడానికి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత ఇలా చేయవచ్చు. ఇలా ముందస్తుగానే తప్పుకుంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తం నుంచి 18% జీఎస్‌టీని మినహాయించి బీమా సంస్థలు వెనక్కి ఇచ్చేస్తాయి. దీంతో పాలసీ రద్దయిపోతుంది. దీనివల్ల బీమా సంస్థలకు ప్రయోజనం.. వృద్ధాప్యానికి వచి్చన పాలసీదారు తప్పు కోవడం వల్ల వాటికి క్లెయిమ్‌ రిస్క్‌ తగ్గుతుంది.

వాస్తవం ఏంటి?
జీరోకాస్ట్‌ టర్మ్‌ ప్లాన్‌ అంటే, ఎలాంటి చార్జీలు ఉండవని, దీన్నే చౌక ప్లాన్‌ అని పొరబడే అవకాశం లేకపోలేదు. ‘‘కొన్ని ప్లాన్లకు జీరోకాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అనే లేబుల్‌ వేయడం ఎందుకంటే.. ప్రత్యేకంగా వైదొలగడం, ప్రీమియం వెనక్కి వచ్చే ఆప్షన్‌ వల్లే. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు అనుసరించే మార్కెటింగ్‌ ఎత్తుగడల్లో భాగమే ఇది’’ అని ప్రోబస్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకర్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ గోయల్‌ పేర్కొన్నారు. ప్రీమియం వెనక్కి వస్తుంది కనుక, జీరోకాస్ట్‌గా బీమా కంపెనీలు వీటిని వర్ణిస్తున్నాయి. అయినా, పాలసీదారు ఎప్పడంటే అప్పుడు పాలసీ నుంచి తప్పుకోవడం కుదరదని పాలసీబజార్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ హెడ్‌ రిషబ్‌ గార్గ్‌ స్పష్టం చేశారు. కనీస కాల వ్యవధి ముగిసి, ఆరి్థక బాధ్యతలు తీరిన తర్వాతే ఇందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ‘‘జీరో కాస్ట్‌ అనేది మైండ్‌ గేమ్‌. ఈ పాలసీ కోసం నేడు చెల్లించే ప్రీమియం విలువ, చివర్లో బీమా సంస్థ తిరిగిచ్చే ప్రీమియం కంటే చాలా ఎక్కువ’’అని వివరించారు.

ఏమిటి మార్గం?
టర్మ్‌ పాలసీ కాల వ్యవధి సాధారణంగా 30–40 ఏళ్లు అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. ఉద్యోగం వచి్చన నాటి నుంచే జీవిత బీమా కవరేజీ ఉండాలన్నది నిపుణుల సూచన. కనుక రిటైర్మెంట్‌ వరకు తీసుకోవడం ఎంతో అవసరం. 60 ఏళ్ల నాటికి కూడా ఆరి్థక బాధ్యతలు తీరుతాయో, లేదో అన్న సందేహంతో 75 ఏళ్లు, 85 ఏళ్ల వరకు కూడా పాలసీలు తీసుకుంటున్నారు. అయితే, కొన్ని పాలసీల్లో వయసు ఆధారంగా ఫీచర్లను బీమా సంస్థలు పరిమితం చేస్తుంటాయి.

జీరో కాస్ట్‌ టర్మ్‌ ప్లాన్‌ తీసుకుంటే ఆరి్థక బాధ్యతలు తీరిన వెంటనే పాలసీ నుంచి వైదొలగొచ్చు. దీనివల్ల ప్రీమియంలు వెనక్కి వస్తాయి. పాలసీ కాల వ్యవధి ముగియక ముందే ప్రీమియంల కోసం వైదొలగడం సరికాదు. దీనివల్ల జీవిత బీమా రక్షణను కోల్పోవాల్సి వస్తుంది. రెగ్యులర్‌ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీకి ప్రీమియం ఎంత? ప్రీమియం వెనక్కి వచ్చే ప్లాన్‌లో ప్రీమియం ఎంత? ఈ రెండింటి మధ్య అంతరం చెప్పుకోదగినంత ఉంటుంది. కనుక చివర్లో ప్రీమియం వెనక్కి వచ్చే ప్లాన్‌ కాకుండా రెగ్యులర్‌ ప్లాన్‌ తీసుకుని, మిగిలిన మేర మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకుంటే.. దీర్ఘకాలంలో భారీ మొత్తమే సమకూరుతుందని ఎన్నో నిదర్శనాలు చెబుతున్నాయి.
 
 ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఐప్రొటెక్ట్‌ స్మార్ట్‌ జీరో కాస్ట్‌ టర్మ్‌ ప్లాన్‌’ 60 ఏళ్ల వయసు వచ్చే వరకు రూ.కోటి కవరేజీ తీసుకునేట్టు అయితే ప్రీమియం రూ.16,287గా ఉంది. రెగ్యులర్‌ ప్లాన్‌లో ఇదే కవరేజీకి ప్రీమియం రూ.12,686. వ్యత్యాసం రూ.3,601. రెగ్యులర్‌ ప్లాన్‌ తీసుకుని, మిగిలే మొత్తాన్ని ప్రతి నెలా రూ.300 చొప్పున (ఏడాదికి రూ.3,600) ఈక్విటీ ఫండ్‌లో 30 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఇలా చేస్తే 12 శాతం రాబడి అంచనా ప్రకారం 30 ఏళ్లకు రూ.10.5 లక్షలు సమకూరుతుంది.

రిస్క్‌ తీసుకోని డెట్‌ సాధనంలో ఇన్వెస్ట్‌ చేసుకున్నా రూ.4.5 లక్షలు సమకూరుతుంది. ఇలా చేయడం వల్ల రెగ్యులర్‌ ప్లాన్‌ సైతం జీరోకాస్ట్‌గానే సమకూరుతుంది. ఇక్కడ చెప్పుకున్నట్టు జీరోకాస్ట్‌ టర్మ్‌ ప్లాన్‌ కోసం ఏటా రూ.16,287 చొప్పున 30 ఏళ్లలో రూ.4.89 లక్షలు చెల్లించుకోవాలి. చివరి వరకు జీవించి ఉంటే, చెల్లించిన మొత్తం నుంచి 18 శాతం జీఎస్‌టీ మినహాయిస్తారు. అప్పుడు చేతికి వచ్చేది రూ.4 లక్షలు. ఇక కనిపించని చార్జీల గురించి కూడా తెలుసుకోవాలి. జీవిత బీమా ప్రీమియంలపై సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. మరి అవే ప్రీమియంలు వెనక్కి వచి్చనప్పుడు పన్ను వర్తించొచ్చు.   

ఇతర రకాలు
ఇంక్రీజింగ్‌ టర్మ్‌ ప్లాన్‌..
చిన్న వయసులోనే టర్మ్‌ ప్లాన్‌ తీసుకునే వారు ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత నుంచి జీవితంలో పలు దశల్లో బాధ్యతలు పెరుగుతూ వెళతాయి. కనుక పెరిగే బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీ విస్తృతం చేసుకునేందుకు ఇంక్రీజింగ్‌ టర్మ్‌ ప్లాన్‌ వీలు కల్పిస్తుంది. ఈ ప్లాన్‌లో ఏటా నిరీ్ణత శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళుతుంది. అలాగే, ఐదేళ్లకోసారి సమ్‌ అష్యూర్డ్‌ పెరిగే పాలసీలు కూడా ఉన్నాయి. కవరేజీ పెరిగినప్పటికీ, పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం స్థిరంగానే ఉంటుంది.

డిక్రీజింగ్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌..
ఏటా కవరేజీ పెరిగే ప్లాన్‌కు విరుద్ధంగా ఇది పనిచేస్తుంది. సాధారణంగా 60–65 ఏళ్లకు వచ్చే సరికి ఆరి్థక బాధ్యతలు తగ్గిపోతుంటాయి. అటువంటప్పుడు ఈ ఆప్షన్‌లో ఏటా నిరీ్ణత శాతం మేర సమ్‌ అష్యూరెన్స్‌ తగ్గుతూ వెళుతుంది. ఇందులోనూ ప్రీమియం స్థిరంగానే ఉంటుంది. ఇతర ప్లాన్లతో పోలిస్తే ప్రీమియం తక్కువ.

లమ్సమ్, పీరియాడిక్‌ పేమెంట్స్‌..
మరణ పరిహారం మొత్తాన్ని ఒకే విడత చెల్లించేవి లమ్సమ్‌. ఒకేసారి అంత మొత్తం చేతికి వస్తే, దాన్ని ఆదాయంగా మలుచుకోవడం సమస్యగా భావించేవారు, పీరియాడిక్‌ పేమెంట్స్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకోవచ్చు. పాలసీదారు కాల వ్యవధి ముగియక ముందే మరణించిన సందర్భంలో పరిహారాన్ని నెలవారీ చొప్పున పదేళ్ల పాటు చెల్లించేలా ఎంపిక చేసుకోవచ్చు. సగం పరిహారం ఏక మొత్తంలో చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నెలవారీ వాయిదాలుగా తీసుకునే ఆప్షన్‌ కూడా ఇందులో ఉంటుంది.   

కన్వర్టబుల్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌..
టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అనేది ఎంపిక చేసుకున్న కాలానికి అమల్లో ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల కాలానికి టర్మ్‌ప్లాన్‌ తీసుకున్నారని అనుకుందాం. 70 ఏళ్లకు వచ్చే సరికి టర్మ్‌ ప్లాన్‌ ముగిసిపోతుంది. అప్పుడు కావాలంటే దాన్ని మరింత కాలానికి బీమా పాలసీ కింద మార్చుకోవచ్చు.

ఇంక్రీజింగ్‌ టర్మ్‌ ప్లాన్‌..
చిన్న వయసులోనే టర్మ్‌ ప్లాన్‌ తీసుకునే వారు ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత నుంచి జీవితంలో పలు దశల్లో బాధ్యతలు పెరుగుతూ వెళతాయి. కనుక పెరిగే బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీ విస్తృతం చేసుకునేందుకు ఇంక్రీజింగ్‌ టర్మ్‌ ప్లాన్‌ వీలు కల్పిస్తుంది. ఈ ప్లాన్‌లో ఏటా నిరీ్ణత శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళుతుంది. అలాగే, ఐదేళ్లకోసారి సమ్‌ అష్యూర్డ్‌ పెరిగే పాలసీలు కూడా ఉన్నాయి. కవరేజీ పెరిగినప్పటికీ, పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం స్థిరంగానే ఉంటుంది.

లిమిటెడ్‌ పే, సింగిల్‌ పే..
రెగ్యులర్‌ ప్లాన్‌లో ఎంపిక చేసుకున్న కాలం అంతటా నిరీ్ణత రోజులకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తుండాలి. అదే సింగిల్‌ ప్రీమియం పాలసీలో ఆరంభంలోనే ఒకసారి ప్రీమియం చెల్లించాలి. రెగ్యులర్‌గా ప్రీమియం కట్టే వెసులుబాటు లేని వారు దీన్ని పరిశీలించొచ్చు. ఇక లిమిటెడ్‌ పే ప్రీమియం ప్లాన్‌లో.. పాలసీ కాల వ్యవధి అంతటా కాకుండా, కొన్నేళ్ల పాటు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 80 ఏళ్లు వచ్చే వరకు 50 ఏళ్ల కాలానికి టర్మ్‌ ప్లాన్‌ ఎంపిక చేసుకున్నాడని అనుకుందాం. 60 ఏళ్లకు రిటైర్‌ అయిన తర్వాత కూడా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారంగా భావిస్తే లిమిటెడ్‌ పే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. 5–10–15 ఏళ్లు ఇలా లిమిటెడ్‌ పేలో ప్రీమియం చెల్లింపుల కాలవ్యవధి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement