కోవిడ్‌ ఎఫెక్ట్‌, భారీగా పెరగనున్న ఇన్సూరెన్స్‌ ప్రీమియం ధరలు | Sakshi Interview On Ageas Federal Life Insurance MD and CEO Vighnesh Shahane | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ ఎఫెక్ట్‌, భారీగా పెరగనున్న ఇన్సూరెన్స్‌ ప్రీమియం ధరలు

Published Fri, Dec 24 2021 4:57 AM | Last Updated on Fri, Dec 24 2021 7:59 AM

Sakshi Interview On Ageas Federal Life Insurance MD and CEO Vighnesh Shahane

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో బీమాపై ప్రజల మైండ్‌సెట్‌ నెమ్మదిగా మారుతోందని, ఇన్సూరెన్స్‌ అవసరం గురించి అవగాహన పెరుగుతోందని వెల్లడించారు ప్రైవేట్‌ రంగ జీవిత బీమా సంస్థ ఏజియాస్‌ ఫెడరల్‌ ఎండీ, సీఈవో విఘ్నేష్‌ షహాణే. టర్మ్, హెల్త్‌ పాలసీలకు డిమాండ్‌ కనిపిస్తోందని సాక్షి బిజినెస్‌ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కోవిడ్‌ పరిణామాల కారణంగా క్లెయిమ్‌లు గణనీయంగా పెరగడంతో.. టర్మ్‌ ప్లాన్‌ ప్రీమియంలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరిన్ని ముఖ్యాంశాలు..

కోవిడ్‌ నేపథ్యంలో బీమాపై ప్రజల ధోరణి ఎలా ఉంటోంది?
సాధారణంగా భారతీయుల మైండ్‌ సెట్‌ బట్టి చూస్తే.. జీవిత బీమా పాలసీ తీసుకున్నప్పుడు ఒకవేళ క్లెయిమ్‌ చేయకపోతే, ఇన్వెస్ట్‌ చేసిన దానిలో ఎంతో కొంత వెనక్కి రావాలని ఆశిస్తారు. దీంతో టర్మ్‌ ప్లాన్లు తక్కువ ప్రీమియంకే అధిక కవరేజీ ఇచ్చేవి అయినప్పటికీ.. క్లెయిమ్‌ ఉంటే తప్ప ఆర్థిక ప్రయోజనం అందించవు కాబట్టి వాటికి అంతగా ఆదరణ దక్కలేదు. అయితే, అనిశ్చితిలో ఆర్థికంగా రక్షణ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం టర్మ్‌ ప్లాన్లు, హెల్త్‌ ప్లాన్లపై అవగాహన పెరుగుతోంది. పొదుపు పథకాలు, రిటైర్మెంట్, యాన్యుటీ ప్లాన్లపైనా ఆసక్తి చూపుతున్నారు.  కోవిడ్‌ మహమ్మారి కారణంగా మంచి ఏదైనా జరిగిందంటే అది ఇదే. ఈ విషయంలో మైండ్‌సెట్‌ మెరుగుపడటం నెమ్మదిగా మొదలైంది. ఇది గణనీయంగా మారడానికి ఇంకాస్త సమయం పడుతుంది.

పొదుపు సాధనంగా కూడా బీమా పథకాలకు ఆదరణ ఎలా ఉంది?
మహమ్మారి సమయంలో ఉద్యోగాలు పోయి, జీతాల్లో కోత పడి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. దీంతో కష్టకాలంలో ఆదుకోవడానికి పొదుపు అవసరం కూడా పెరుగుతోంది. ఇటు పొదుపు అటు ఆర్థిక భరోసా పొందడానికి జీవిత బీమా మెరుగైన సాధనంగా ఉపయోగపడగలదు. పదేళ్ల లోపు పిల్లలున్న తల్లిదండ్రుల ఆర్థిక సన్నద్ధత, పెట్టుబడుల నిర్ణయాలను అంచనా వేసేందుకు మేను ఇటీవల యూగవ్‌ ఇండియా సంస్థతో కలిసి ఫ్యూచర్‌ఫియర్‌లెస్‌ సర్వే నిర్వహించాము. ఇతరత్రా పిల్లల పెళ్లి, వ్యాపారాల కోసం పొదుపు చేయడం వంటి జీవిత లక్ష్యాలకన్నా తమ పిల్లల విద్య అవసరాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇందులో పేరెంట్స్‌ తెలిపారు.

ఇందుకోసం యూలిప్‌లు, మనీబ్యాక్, ఎండోమెంట్‌ ప్లాన్స్‌ వంటి జీవిత బీమా సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నామని మూడింట రెండొంతుల మంది చెప్పడం గమనార్హం. భవిష్యత్‌లో అనిశ్చితి నుంచి కుటుంబానికి ఆర్థికంగా భరోసానిచ్చేందుకు తక్కువ రిస్కుతో దీర్ఘకాలానికి సురక్షిత పెట్టుబడి సాధనంగా జీవిత బీమాను ఎంచుకుంటున్నారు. జీవిత బీమా పాలసీలను కొనసాగించేందుకు, రెన్యూ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తుండటంతో బీమా ప్రీమియం వసూళ్లు కూడా మెరుగ్గా ఉంటున్నాయి. యులిప్‌ (యూనిట్‌ లింక్డ్‌ పాలసీలు) అమ్మకాలు పెరగడానికి ఇటీవలి కాలంలో స్టాక్‌ మార్కెట్లు బా గా రాణిస్తుండటం కూడా కొంత దోహదపడింది.

కోవిడ్‌ క్లెయిముల పరిస్థితి ఎలా ఉంది?
గత ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా రూ. 116 కోట్ల క్లెయిములు వచ్చాయి. ఈసారి స్థూలంగా 2–2.5 రెట్లు పెరగవచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరం మొత్తం క్లెయిముల్లో.. కోవిడ్‌ క్లెయిములు 25 శాతం ఉన్నాయి. ఈసారి తొలి త్రైమాసికంలో మొత్తం క్లెయిముల్లో వీటి వాటా 75 శాతంగా ఉన్నప్పటికీ, తర్వాత త్రైమాసికాల్లో పరిస్థితులు అదుపులోకి వస్తుండటంతో తగ్గాయి. అయితే, ఇవి తగ్గినప్పటికీ కోవిడ్‌ వల్ల ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తి కోవిడ్‌–యేతర కారణాలతో మరణించే వారి సంఖ్య గతంలో కన్నా పెరిగింది.

జీవిత బీమా ప్రీమియంలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయా?
అవును. కోవిడ్‌ క్లెయిములు.. ముఖ్యంగా రెండో వేవ్‌లో.. గణనీయంగా ఎగియడం వల్ల రీఇన్సూరెన్స్‌ సంస్థలకు గట్టి దెబ్బ తగిలింది. దీంతో అవి టర్మ్‌ ప్లాన్‌ రేట్లను పెంచే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా 20–40 శాతం మేర రేట్లు పెరగవచ్చని అంచనా. అయితే, రీఇన్సూరెన్స్‌ సంస్థ .. జీవిత బీమా సంస్థను బట్టి, అలాగే ఆయా రీఇన్సూరెన్స్‌ సంస్థలతో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి ఉన్న వ్యాపార పరిమాణం బట్టి పెంపు ఆధారపడి ఉంటుంది.  

దక్షిణాదిలో మీ వ్యాపార ప్రణాళికలు ఏమిటి?
ఫెడరల్‌ బ్యాంకుకు విస్తృతమైన నెట్‌వర్క్‌ ఉండటంతో దక్షిణాది రాష్ట్రాలపై మేము ముందు నుంచీ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. కరోనా వైరస్‌ వ్యాప్తి కాలంలో దక్షిణాదిలోని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మా వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందింది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయిదు ఏజెన్సీ శాఖలు, 1,000 పైచిలుకు అడ్వైజర్లు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏజెన్సీ, డిజిటల్, డైరెక్ట్‌ సేల్స్‌ మొదలైన మాధ్యమాల ద్వారా పంపిణీ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోబోతున్నాం.  

వ్యాపార వృద్ధి అంచనాలేమిటి?
గత ఆర్థిక సంవత్సరంలో కోవిడ్‌ అనిశ్చితి కారణంగా తొలి మూడు నెలలు లాక్‌డౌన్‌లోనే గడిచిపోయినప్పటికీ మేము ఊహించిన దానికన్నా మెరుగ్గానే రాణించాం. మొత్తం ప్రీమియం వసూళ్లు 6 శాతం పెరిగాయి. వరుసగా తొమ్మిదో ఏడాది లాభాలు ప్రకటించగలిగాం, వరుసగా మూడో ఏడాది 13 శాతం మేర డివిడెండ్‌ ఇచ్చాం. ఇక ఈ ఆర్థిక సంవత్సరం కూడా సెకండ్‌ వేవ్, లాక్‌డౌన్‌ లాంటి వాటితో అనిశ్చితిలోనే మొదలైనప్పటికీ క్రమంగా పరిస్థితి మెరుగుపడుతోంది. ప్రీమియం విషయంలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 30–35 శాతం వృద్ధి సాధించగలమని ఆశిస్తున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement