Urban area
-
Election commission: హౌసింగ్ సొసైటీల్లోనూ పోలింగ్ బూత్‌లు
లక్నో: కేంద్ర రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లోని హౌసింగ్ సొసైటీల్లో సైతం 200కు పైగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వివరించారు. ‘యూపీలోని పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం స్వల్పంగా ఉంటోంది. ఈసారి ఎలాగైనా ఓటింగ్ శాతంలో మొదటి స్థానం సంపాదించాలనేదే మా లక్ష్యం’అని ఆయన వివరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఓటింగ్ శాతం 59.11 మాత్రమేనన్నారు. ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ప్రతి రెండు కిలోమీటర్ల పరిధిలో ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘‘తక్కువ ఓటింగ్ నమోదయ్యే గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల హౌసింగ్ సొసైటీల్లో ఈసారి పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తాం. ఇలాంటి మొత్తం 200పైగా బూత్‌లలో ఎక్కువ భాగం నోయిడాలోనే ఉంటాయి. ఆ తర్వాత లక్నో, కాన్పూర్, బరేలీ, మథురలోనూ ఇవి ఉంటాయి. ఈసారి ఓటింగ్ శాతం 60పైగా ఉంటుందన్న నమ్మకముంది’’ అని అన్నారు. -
పట్టణ ప్రజల్లో ‘బీమా’పై పెరుగుతున్న చైతన్యం
న్యూఢిల్లీ: పట్టణ ప్రజల్లో జీవిత బీమా పట్ల అవగాహన పెరుగుతోంది. ప్రతి నలుగురిలో ముగ్గురికి జీవిత బీమా రక్షణ ఉన్నట్టు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్ (ఐపీక్యూ) 6.0లో ద ప్రొటెక్షన్ ఇండెక్స్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 45కి చేరుకుందని, ఇది ఐపీక్యూ 5.0లో 43గానే ఉందని తెలిపింది. ప్రజల్లో రక్షణ పట్ల పెరుగుతున్న అవగాహన, ఆమోదాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఐదేళ్ల ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్ను పరిశీలించి చూస్తే ఐపీక్యూ 1.0లో 35 నుంచి ఐపీక్యూ 6.0లో 45కు చేరుకుందని, పది పాయింట్లు పెరిగినట్టు వివరించింది. ఆర్థిక సామర్థ్యాలను నిర్మించుకునే దిశగా పట్టణ ప్రజల ప్రయాణాన్ని ఇది తెలియజేస్తోందని పేర్కొంది. ప్రొటెక్షన్ క్వొటెంట్ 49 పాయింట్లతో దక్షిణ భారత్ ఆర్థికంగా ఎంతో రక్షణ కలిగినట్టు నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత పశి్చమ భారత్ 42 పాయింట్ల నుంచి 46 పాయింట్లకు చేరుకున్నట్టు తెలిపింది. పట్టణ ప్రజల ఆర్థిక రక్షణ స్థాయిలను లెక్కించేందుకు ఐపీక్యూ అచ్చమైన కొలమానంగా మారినట్టు మ్యాక్స్‌లైఫ్ ఎండీ, సీఈవో ప్రశాంత్ త్రిపాఠి అన్నారు. -
పట్టణాలకు పచ్చదనం అందాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదం, వినోదం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న నగర వనాలు త్వరలో మరో 100 అందుబాటులోకి రానున్నాయి. భూమి లభ్యతను బట్టి ప్రతి జిల్లాలో కనీసం 2 నుంచి 4 నగర వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో నగర వనాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి, పేరేచర్ల, దివాన్‌చెరువు (రాజమహేంద్రవరం),కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలో ఒక్కోటి చొప్పున, కర్నూలు, చిత్తూరులో 2 చొప్పున నగర వనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 30కి పైగా నగర వనాలను డిసెంబర్‌లోపు, మిగిలిన వాటిని మార్చి నెలాఖరులోపు సిద్ధం చేయడానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో 2, 3 ఏర్పాటుకు సన్నాహాలు కొన్ని పట్టణాల్లో భూమి దొరక్కపోవడంతో నగర వనాల ప్రణాళిక ఆలస్యమైంది. భూమి అందుబాటులో ఉన్న చోట 2, 3 నగర వనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు వద్ద అటవీ ప్రాంతం ఎక్కువ ఉండటంతో అక్కడ 2 నగర వనాలను తీర్చిదిద్దారు. అనంతపురం టౌన్ దగ్గర్లో ఎక్కడా అటవీ భూమి లేదు. దీంతో అక్కడ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో భూమి కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి చోట్ల కొద్దిగా ఆలస్యమైనా మిగిలిన ప్రాంతాల్లో త్వరితగతిన నగర వనాలు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల భూమి లేకపోయినప్పుడు అక్కడ అందుబాటులో ఉండే పెద్ద సంస్థలు, పెద్ద కాలేజీలు, క్యాంపస్‌లలో ఎక్కువ భూమి ఉంటే అలాంటిచోట్ల నగర వనాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేషన్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఆయా ప్రాంతాల్లోని కార్పొరేట్ సంస్థలు, కంపెనీలను సంప్రదిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల ప్రజలను వీటి ఏర్పాటులో భాగస్వాముల్ని చేస్తున్నారు. వాకర్స్ క్లబ్‌లు, స్థానిక ప్రముఖులను కూడా కలిసి వీటి గురించి వివరించి నిధులు సమకూర్చి, వారి ద్వారానే వాటిని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా.. పచ్చదనంతో కూడిన స్వచ్చమైన పరిసరాలు నగర వనాల్లో ఉండేలా చూస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు అక్కడకు వచ్చి ఆహ్లాదంగా గడిపేందుకు నగర వనాలను తీర్చిదిద్దుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పలు రకాల క్రీడా సౌకర్యాలు, వాకింగ్ ట్రాక్, యోగా, వెల్నెస్ సెంటర్, అరుదైన చెట్ల పెంపకం వంటివన్నీ అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి అందాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదు ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. వారి నివాసాలకు సమీపంలోనే ప్రకృతి సహజసిద్ధ ప్రాంతాలున్నాయి. వాటిని నగర వనాలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 నగర వనాలున్నాయి. మరో 100 వనాలను ఏర్పాటు చేస్తున్నాం. – ఎన్ మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ -
నిరుద్యోగం తగ్గింది.. జాతీయ శాంపిల్ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు (15 ఏళ్లు నిండిన వారు) ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 6.8 శాతానికి పరిమితమైంది. 2022 సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఉన్న 8.2 శాతంతో పోలిస్తే చెప్పుకోతగ్గ మేర తగ్గింది. పనిచేసే శక్తి ఉండి, ఉపాధి లేని వారిని నిరుద్యోగుల కింద పరిగణిస్తారు. గతేడాది మొదటి త్రైమాసికంలో నిరుద్యోగం ఎక్కవగా ఉండడానికి కరోనా వైరస్ ఇంకా సమసిపోకపోవడమేనని చెప్పుకోవాలి. ఇక 2022 అక్టోబర్–డిసెంబర్, జూలై–సెప్టెంబర్ కాలంలో 7.2 శాతం చొప్పున నిరుద్యోగ రేటు నమోదైంది. 2022 ఏప్రిల్–జూన్‌లో 7.6 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో మహిళా నిరుద్యోగం 2023 మొదటి మూడు నెలల్లో 9.2 శాతానికి తగ్గింది. 2022 మొదటి మూడు నెలల్లో ఇది 10.1 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల నిరుద్యోగ రేటు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 6 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.7 శాతంగా ఉంది. 2022 అక్టోబర్–డిసెంబర్లో ఇది 6.5 శాతంగా ఉంది. కార్మిక శక్తి భాగస్వామ్య రేటు పట్టణ ప్రాంతాల్లో 48.5 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 47.3 శాతంతో పోలిస్తే కొంత మెరుగుపడింది. ఇదీ చదవండి: బ్యాంకింగ్ ప్రైవేటీకరణ ఆగదు.. ప్రైవేటులోకి మరిన్ని ప్రభుత్వ బ్యాంకులు -
పట్టణ ప్రాంతాల్లోనూ వేగంగా భూ సర్వే
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో భూముల సర్వే జోరుగా జరుగుతున్న నేపథ్యంలో పట్టణాల్లో కూడా వేగవంతం చేయాలని జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్షపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో 15 లక్షల ఎకరాలను సర్వే చేయాల్సి ఉందని సబ్ కమిటీ పేర్కొంది పట్టణ ప్రాంతాల్లో 5.5 లక్షల ఎకరాలు వ్యవసాయ భూమి కాగా మిగిలిన 9.44 లక్షల ఎకరాలు పట్టణ ప్రాంతంగా ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి 38.19 లక్షల ఆస్తుల సర్వేను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం అమలుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై సమీక్షించింది. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో పాటు పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొలిదశలో 2 వేల గ్రామాల్లో మే 20వ తేదీలోగా సర్వే పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కమిటీ స్పష్టం చేసింది. డ్రోన్ సర్వే, మ్యాపింగ్, గ్రౌండ్ ట్రూతింగ్, రికార్డుల వివాదాల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటివరకు సిద్ధమైన 1,94,571 భూహక్కు పత్రాలను ఈ కేవైసీ ద్వారా వివాదాలకు తావు లేకుండా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ యజమానుల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. 10,409 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తి ఈ నెలాఖరు నాటికి 10,409 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తి కానుంది. 7,158 గ్రామాల్లో డ్రోన్ ఫొటోలు తీసుకుని 3,758 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 2,611 గ్రామాల్లో సర్వే పూర్తయిందని, 2,391 గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల పరిశీలన ముగిసిందని చెప్పారు. సర్వే ప్రక్రియలో జాప్యం లేకుండా ముందుగానే రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నామని, 4 లక్షలకు పైగా రికార్డులకు మ్యుటేషన్ అవసరమని గుర్తించినట్లు వెల్లడించారు. జూన్ నాటికి రాష్ట్రంలో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. 25.8 లక్షల సర్వే రాళ్లు సర్వే పూర్తయిన గ్రామాల కోసం 25.8 లక్షల సర్వే రాళ్లు సిద్ధంగా ఉన్నట్లు మైనింగ్ అధికారులు తెలిపారు. 18.9 లక్షల సర్వే రాళ్లను ఇప్పటికే సరఫరా చేయగా మరో 12.3 లక్షల రాళ్లు ఆయా గ్రామాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రోజుకు 50 వేల సర్వే రాళ్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సర్వే ముగిసిన గ్రామాల్లో రాళ్లను పాతే ప్రక్రియ మే 20వ తేదీలోగా పూర్తవుతుందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 30.11 లక్షల ఆస్తులను వెరిఫై చేశామని, అందులో 36.32 లక్షల నిర్మాణాలు ఉన్నట్లు పురపాలక శాఖ అధికారులు పేర్కొన్నారు. సర్వే కోసం మాస్టర్ ట్రైనర్ల ద్వారా అన్ని జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. సమావేశంలో సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్, అటవీ దళాల అధిపతి వై.మధుసూదన్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి, సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థజైన్, ఎంఏయూడీ కమిషనర్ కోటేశ్వరరావు, డీఎంజీ వి.జి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పట్టణ నిరుద్యోగం 7.2 శాతం
న్యూఢిల్లీ: పట్టణాల్లో నిరుద్యోగం 7.2 శాతానికి తగ్గింది. 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) గణాంకాలు విడుదలయ్యాయి. 2021 అక్టోబర్–డిసెంబర్ కాలంలో పట్టణాల్లో నిరుద్యోగం 8.7 శాతంగా ఉంది. 15 ఏళ్లకు పైగా వయసు ఉండి పనిచేయడానికి అర్హత కలిగిన వ్యక్తులను సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు. కరోనా ప్రభావం వల్ల 2021 చివరి మూడు నెలల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉండడానికి కారణం. 2022 జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో నిరుగ్యోగ రేటు 7.2 శాతంగానే ఉండడం గమనించాలి. అంటే తదుపరి మూడు నెలలకూ అదే స్థాయిలో నిరుద్యోగం కొనసాగింది. ఇక గతేడాది ఏప్రిల్–జూన్ కాలానికి 7.6 శాతం మేర నిరుద్యోగం పట్టణ ప్రాంతాల్లో ఉంది. అలాగే 2022 జనవరి–మార్చి కాలానికి పట్టణ నిరుద్యోగం 8.2 శాతంగా ఉండడం గమనార్హం. గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ వీటిని విడుదల చేసింది. మహిళల్లో 9.6 శాతం 2022 అక్టోబర్–డిసెంబర్ కాలానికి పట్టణ ప్రాంతాల్లో మహిళా నిరుద్యోగుల సంఖ్య 9.6 శాతంగా ఉంది. 2022 జూలై–సెప్టెంబర్ కాలంలో ఉన్న 9.4 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. కానీ 2021 చివరి మూడు నెలల్లో ఉన్న 10.5 శాతంతో పోలిస్తే తగ్గింది. 2022 ఏప్రిల్–జూన్ కాలంలో ఇది 9.5 శాతంగా, జనవరి–మార్చి క్వార్టర్లో 10.1 శాతం చొప్పున ఉంది. పట్టణాల్లో పురుష నిరుద్యోగులు 6.5 శాతంగా ఉన్నారు. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో 8.3 శాతంగా ఉంది. 2022 జూలై–సెపె్టంబర్లో 6.6 శాతం, 2022 ఏప్రిల్–జూన్ కాలానికి 7.1 శాతం, జనవరి–మార్చి క్వార్టర్లో 7.7 శాతం చొప్పున పట్టణాల్లో పురుషుల నిరుద్యోగం ఉన్నట్టు లేబర్ సర్వే గణాంకాలు వెల్లడించాయి. 2022 చివరి మూడు నెలల కాలంలో పట్టణాల్లో 15 ఏళ్లకు పైబడిన కార్మిక శక్తి 48.2 శాతానికి పెరిగింది. 2021 చివరి మూడు నెలల్లో ఇది 47.3 శాతంగా ఉంది. 2021–22లో 4.1 శాతం దేశవ్యాప్తంగా నిరుద్యోగుల రేటు 2021 జూలై నుంచి 2022 జూన్ కాలానికి 4.1 శాతానికి తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 4.2 శాతంగా ఉంది. 2019–20 సంవత్సరంలో ఉన్న నిరుద్యోగం రేటు 4.8 శాతంతో పోలిస్తే 15 శాతం వరకు తగ్గినట్టు తెలుస్తోంది. పట్టణాల్లో పురుషుల నిరుద్యోగం 4.4 శాతానికి దిగొచ్చింది. ఇది అంతకుముందు ఏడాది కాలంలో 4.5 శాతంగా ఉంది. మహిళల్లో నిరుద్యోగం 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గింది. -
చిన్న ప్యాక్స్ ఎత్తుగడ, దూసుకుపోతున్న వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిస్కట్స్, స్నాక్స్, సబ్బులు, టీ, కాఫీ పొడులు.. ఇలా ఉత్పాదన ఏదైనా మారుమూల పల్లెల్లోని దుకాణాల్లో రూ.1, రూ.2, రూ.5, రూ.10 ధరలో లభించే చిన్న ప్యాక్‌లే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. ఉత్పాదనను వినియోగదారుడికి అలవాటు చేయడం, అక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఇలా చిన్న ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చాయి. ఇటువంటి చిన్న ప్యాక్‌లు ఇప్పుడు ప్రధాన నగరాల్లోని రిటైల్ షాపుల్లో ఇబ్బడిముబ్బడిగా దర్శనమిస్తున్నాయి. ఆధునిక రిటైల్ ఔట్లెట్లు, ఆన్లైన్ వేదికల్లోనూ ఇవి చొచ్చుకువచ్చాయి. ఇందుకు రిటైల్ ద్రవ్యోల్బణం కారణమని ఎఫ్ఎంసీజీ రంగ కంపెనీలు చెబుతున్నాయి. ఆహారోత్పత్తుల ధరలు అధికంగా ఉండడంతో భారత్‌లో వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.52 శాతం నమోదైంది. దేశంలో ఎఫ్ఎంసీజీ మార్కెట్ 2020లో రూ.9.1 లక్షల కోట్లు ఉంది. 2025 నాటికి ఇది రెండింతలు అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. వినియోగం పెరిగేందుకు.. భారత్‌లో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) పరిశ్రమ 2022 అక్టోబర్-డిసెంబర్లో 7.6 శాతం వృద్ధి చెందింది. అంత క్రితం త్రైమాసికంలో ఇది 9.2 శాతంగా ఉంది. నిత్యావసరాలతోపాటు ఇతర విభాగాల్లోనూ ప్రముఖ తయారీ కంపెనీలు చిన్న ప్యాక్స్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. తక్కువ ధరలో లభించే చిన్న బ్రాండ్స్, ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తుల వైపు కస్టమర్లు మళ్లకుండా పెద్ద బ్రాండ్లు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఒక్కో కుటుంబం నెలవారీ చేసే ఖర్చులపై ఒత్తిడి ఉండడం కూడా మరో కారణం. ముడిసరుకు వ్యయాలు పెరుగుతుండడంతో కంపెనీలు ప్యాక్ బరువు తగ్గించడం లేదా ధర పెంచడమో చేస్తున్నాయి. ధర పెంచిన ఉత్పత్తుల అమ్మకాలు తగ్గుతున్నాయని కంపెనీలు చెబుతున్నాయి. వినియోగం పెరిగేందుకు చిన్న ప్యాక్‌లను కొనసాగించాల్సిందేనని రిసర్చ్ కంపెనీ నీల్సన్ఐక్యూ తెలిపింది. ఆహారేతర విభాగాల్లో ఇవి డిమాండ్‌ను పెంచుతాయని వివరించింది. విక్రయాల్లో 50 శాతం దాకా.. చిన్న ప్యాక్‌ల వాటా మొత్తం అమ్మకాల్లో కంపెనీని బట్టి 50 శాతం వరకు ఉందంటే మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. గడిచిన రెండు నెలల్లో నగరాల్లో మొత్తం విక్రయాల్లో చిన్న ప్యాక్‌ల వాటా 5 శాతం పెరిగిందని కంపెనీలు అంటున్నాయి. మొత్తం సేల్స్‌లో చిన్న ప్యాక్‌ల వాటా ఏకంగా 50 శాతం ఉందని పార్లే ప్రొడక్ట్స్ వెల్లడించింది. నగరాల్లో గడిచిన రెండు మూడు నెలల్లో పెద్ద ప్యాక్‌లకు బదులుగా చిన్న ప్యాక్‌ల విక్రయాలే అధికంగా ఉన్నాయని కంపెనీ సీనియర్ కేటగిరీ హెడ్ మాయంక్ షా తెలిపారు. గతంలో ఇలా ఉండేది కాదన్నారు. సాధారణంగా ఈ ట్రెండ్ గ్రామీణ ప్రాంతాలకే పరిమితం అని చెప్పారు. ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ప్యాక్‌ల వైపు మార్కెట్ మళ్లుతోందని సుస్పష్టం అవుతోందని విప్రో కంజ్యూమర్ కేర్ చెబుతోంది. ద్రవ్యోల్బణం ప్రధాన సవాల్‌గా ఉందని కోకా-కోలా ఇండియా తెలిపింది. ఇతర విభాగాల్లోనూ.. మిల్క్, న్యూట్రీషన్ విభాగాల్లో అందుబాటు ధరలో ప్యాక్‌లను పరిచయం చేయాలని దిగ్గజ సంస్థ నెస్లే నిర్ణయించింది. ఇప్పటికే ఈ కంపెనీ కెచప్, చాకొలేట్స్, కాఫీలో చిన్న ప్యాక్స్‌ను విక్రయిస్తోంది. ‘పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని బ్రాండ్స్‌లో అందుబాటు ధరలో విక్రయించేందుకు చిన్న ప్యాక్‌లు దోహదం చేస్తున్నాయి. చిన్న ప్యాక్‌లు లక్ష్యంగా ఇతర విభాగాల్లో విస్తరిస్తున్నాం. ఇది సత్ఫలితాలను ఇస్తోంది’ అని కోక–కోలా ఇండియా, సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్ సంకేత్ రే తెలిపారు. పెప్సి, మిరిండా, మౌంటెయిన్ డ్యూ సింగిల్ సర్వ్ బాటిల్స్ అమ్మకాలు ఇతర ప్యాక్‌లను మించి నమోదయ్యాయి. గెలాక్సీ, స్నిక్కర్స్, ఎంఅండ్ఎం బ్రాండ్ల చాకొలేట్లను విక్రయిస్తున్న మార్స్ రిగ్లీ రూ.10 ధరలో లభించే ప్యాక్‌లను నగరాల్లోనూ ప్రవేశపెడుతోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో మాత్రమే ద్రవ్యోల్బణం తగ్గుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పంపిణీ, ధర నిర్ణయిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. -
మహిళా మేనేజ్మెంట్ పొజిషన్లలో, పట్టణాలకంటే గ్రామీణ మహిళల హవా
న్యూఢిల్లీ: సీనియర్, మధ్యస్థాయి మేనేజ్మెంట్ పొజిషన్ల(ఉద్యోగాల)లో పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉన్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్వో) ఒక నివేదికలో పేర్కొంది. 2019–20 ఏడాదికిగాను మేనేజ్మెంట్ స్థాయి సిబ్బంది మొత్తంలో గ్రామీణ ప్రాంతాలలో మహిళల సంఖ్య 21.5 శాతంగా నమోదైనట్లు తెలియజేసింది. ఇదే సమయంలో పట్టణాలలో ఈ సంఖ్య 16.5 శాతమేనని తెలియజేసింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం మొత్తం సీనియర్, మధ్యస్థాయి మేనేజ్మెంట్ సిబ్బందిలో పట్టణాలు, గ్రామాలలో కలిపి మహిళా వర్కర్ల నిష్పత్తి 18.8 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. 2019 జులై– 2020 జూన్ మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ గణాంకాలను రూపొందించింది. చదవండి: కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే'..పశ్చిమ, ఆసియా దేశాలతో పోలిస్తే -
భూ సమీకరణకు కొత్త విధానం!
సాక్షి, హైదరాబాద్: నగర, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్ ) విధానాన్ని తీసుకురానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ భూ సమీకరణ విధానాలు, పద్ధతులపై రాష్ట్ర పురపాలక శాఖ అధ్యయనం చేపట్టింది. ఆ శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం ఒకటి గుజరాత్లో, కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలోని మరో బృందం మహారాష్ట్రలో పర్యటించింది. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ల్యాండ్ పూలింగ్ విధానాలపై బృందాలు అధ్యయనం జరిపాయి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు (ఉడాలు)/డీటీసీపీ (డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)లు నిర్వహిస్తున్న పాత్రను పరిశీలించాయి. ఈనెల 15లోగా ఈ బృందాలు పురపాలక శాఖకు తమ నివేదికలు సమర్పించనున్నాయి. వీటిని పరిశీలించి, నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త భూ సమీకరణ విధానాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. శాటిలైట్ టౌన్లు, పేద, బడుగు, బలహీన వర్గాలకు గృహ నిర్మాణ ప్రాజెక్టుల నిర్మాణం వంటి అవసరాల కోసం ఈ కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకొస్తోందని అధికారవర్గాలు తెలిపాయి. పురపాలికలు, ఉడాల ఆధ్వర్యంలోనే.. భూ సమీకరణ ద్వారా సేకరించిన భూముల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులను పురపాలికలు/ఉడాల ఆధ్వర్యంలోనే చేపట్టాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ప్రైవేటు డెవలపర్లు అభివృద్ధి చేస్తున్న నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా పైప్లైన్లు కొద్ది రోజుల్లోనే దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పనులు పూర్తిగా పురపాలికలు/ఉడాల ఆధ్వర్యంలోనే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఫామ్‌హౌస్ పాలసీ అవసరమే!
కరోనా మొదలయ్యాక అందరిలోనూ పర్యావరణ స్పృహ పెరిగింది. వర్క్ ఫ్రం హోమ్ కావచ్చు.. వీకెండ్ కావచ్చు కారణమేదైనా సరే సమయం దొరికితే సిటీకి దూరంగా పచ్చని ప్రకృతిలో కాసేపు సేద తీరాలని కోరుకుంటున్నారు. అందుకే సామాన్య, మధ్యతరగతి వాసులు కూడా ఫ్లామ్ప్లాట్లు, ఫామ్‌హౌస్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో 2 వేల గజాలపైన ఉన్న ఫామ్ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. పెద్ద సైజు ప్లాట్లను కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేకపోవటంతో సామాన్యులు పర్యావరణానికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో అర్బన్ ఫార్మింగ్, ఫామ్‌హౌస్‌లకు ప్రత్యేక పాలసీ అవసరం ఉందని ల్యాండ్‌స్కేపింగ్ ఆర్కిటెక్ట్, అర్బన్ ఫార్మింగ్ నిపుణులు సూచిస్తున్నారు. గతంలో బడా బాబులకే పరిమితమైన ఫామ్‌హౌస్ కల్చర్.. నేడు సామాన్యులు కోరుకుంటున్నారు. ఫామ్‌హౌస్‌లకు గిరాకీని దృష్టిలో పెట్టుకొని డెవలపర్లు వందల ఎకరాలలో ఈ తరహా లేఅవుట్లను చేస్తున్నారు. సిటీకి దూరంగా 4, 5 గుంటల స్థలంలో పండ్ల మొక్కల పెంపకం, సేంద్రియ వ్యవసాయం పేరిట ప్లాట్లను విక్రయిస్తున్నారు. కొందరు డెవలపర్లు అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఫామ్‌ప్లాట్స్ లేఅవుట్లను చేస్తున్నారు. ధర తక్కువగా ఉండటంతో సామాన్యులు క్రయవిక్రయాలు జరుపుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్లగొండ, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలలో ఎక్కువగా ఈ తరహా వెంచర్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్‌హౌస్/ప్లాట్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే ప్రత్యేక పాలసీని తీసుకొస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో ఫామ్ప్లాట్లకు క్రమబద్ధీకరణ కోసం స్కీమ్‌ను తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. 20 ఎకరాలు ఉంటేనే... కనీసం 20 ఎకరాల స్థలం ఉంటేనే అర్బన్ ఫార్మింగ్ పాలసీ పరిధిలోకి వస్తాయి. ఇందులో వ్యక్తిగత ఫామ్‌ప్లాట్ల విస్తీర్ణం 9 మీటర్ల వెడల్పుతో కనీసం 500 చ.మీ. ఉండాల్సిందే. ప్రాజెక్ట్‌కు అప్రోచ్ రహదారి వెడల్పు, అంతర్గత రోడ్లు కూడా 9 మీటర్లు ఉండాలి. సెంట్రల్ ప్లాజాకు 60 అడుగుల వెడల్పు రహదారులు ఉండాలి. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశం ఉండాలి. గ్రూప్ హౌసింగ్ నిర్మాణాల వలే అర్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్‌లో నిర్మాణాలకు కూడా సెట్‌బ్యాక్స్ ఉంటాయి. మొత్తం సైట్ ఏరియాలో 20 శాతానికి మించి నిర్మాణాలు ఉండకూడదు. అర్బన్ ఫార్మింగ్ పరిధిలోకి ఏమొస్తాయంటే? వ్యవసాయం, హార్టికల్చర్, ఫ్లోరికల్చర్, మెడిసినల్ ప్లాంట్స్, ఆర్బోరికల్చర్, పండ్ల తోటలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ సంబంధిత కార్యకలాపాలు, హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్ వంటివి అర్బన్ ఫార్మింగ్ కిందికొస్తాయి. పశువుల షెడ్లు, స్టోరేజ్ షెడ్లు, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ వంటి వాటిని మొత్తం ప్రాజెక్ట్ స్థలంలో 5 శాతం వరకు నిర్మించుకోవచ్చు. కాకపోతే ఇవి ఎత్తయినవిగా ఉండకూడదు. ఆయా నిర్మాణాలు సహజ వాతావరణానికి భంగం కలిగించకూడదు. నీటి వనరులు, కొండలను తొలగించడం వంటివి చేయకూడదు. ప్రాజెక్ట్‌లో సాధ్యమైనంత వరకు నీటి పునర్వినియోగం, ల్యాండ్‌స్కేపింగ్ వంటివి చేపట్టాలి. క్లబ్‌హౌస్ వసతుల కోసం.. మొత్తం ఫామ్ప్లాట్ విస్తీర్ణంలో గరిష్టంగా 2 శాతం స్థలంలో మాత్రమే సెంట్రల్ స్క్వేర్/క్లబ్‌హౌస్, ప్లాజా వంటి నిర్మాణాలకు అనుమతి ఉంటుంది. వీటి ఎత్తుపై ఎలాంటి పరిమితులు ఉండవు కానీ జీవో నంబర్ 168 హైరైజ్ బిల్డింగ్ నిబంధనలకు లోబడి ఉండాలి. ఉద్యోగులు, నిర్వహణ సిబ్బంది నిర్మించే గృహాలతో పాటు సెంట్రల్ ప్లాజాలో రైతు మార్కెట్లు, బజార్, హాట్, స్థానిక కార్యాలయాలు, హస్తకళల ఎంపోరియం, మేళా, జాయ్ రైడ్స్, ఎగ్జిబిషన్ స్పేస్ మొదలైన వాటి ప్రదర్శన వంటివి ఉంటాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద విద్యా, ఆరోగ్య, సాంస్కృతిక కార్యకలాపాల కోసం మొత్తం ప్రాజెక్ట్ ఏరియాలో 5 శాతం స్థలం వినియోగానికి అనుమతులుంటాయి. అయితే ఆయా నిర్మాణాలకు ఎంట్రీ, ఎగ్జిట్ కోసం 12 మీటర్ల వెడల్పుతో ప్రత్యేకమైన రహదారులుండాలి. నాలా అవసరం లేదు.. ఫామ్‌ప్లాట్స్ ప్రాజెక్ట్‌ల అనుమతులు, నిర్వహణ, నియంత్రణ అన్ని కూడా హెచ్ఎండీఏ పరిధిలో ఉంటాయి. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలో మినహాయించి అన్ని భూ వినియోగ జోన్లలో అర్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్‌లను చేపట్టవచ్చు. కాకపోతే ఆయా జోన్ నిబంధనలకు లోబడే ఉండాలి. ఫామ్‌ప్లాట్ల ఫీజులు, డెవలప్మెంట్ చార్జీలు బిల్టప్ ఏరియా ప్రాంతానికి మాత్రమే ఉంటాయి. అవి కూడా రెసిడెన్షియల్ సైట్లతో సమానంగా ఉంటాయి. 50 ఎకరాల లోపు ఫామ్ప్లాట్లకు స్క్రూట్నీ ఫీజుగా రూ.20 వేలు, ఆ పైన వాటికి రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. ఫామ్‌ప్లాట్స్ ప్రాజెక్ట్‌లకు వ్యవసాయేతర భూ మార్పిడి (నాలా) అనుమతులు అవసరం లేదు. ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ సమయం వరకు భూమిని ఇతరత్రా అవసరాలకు వినియోగించకూడదన్నమాట. నిర్మాణాలు ఎలా ఉండాలంటే.. వ్యక్తిగత లేదా లీజు/అద్దెకు తీసుకునే ఫ్లామ్ప్లాట్ 10 శాతం స్థలంలో మాత్రమే ఫామ్‌హౌస్ నిర్మాణానికి అనుమతులుంటాయి. గరిష్టంగా జీ+1 లేదా 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం ఉండాలి. మిగిలిన స్థలాన్ని అర్బన్ ఫార్మింగ్ కోసం వినియోగించాలి. వ్యవసాయ థీమ్ పార్క్స్, అగ్రికల్చర్ టూరిజం, రిసార్ట్ టూరిజం, స్టూడియో అపార్ట్మెంట్, కొంత కాంక్రీట్ వినియోగించి నిర్మించే వెర్నాక్యులర్ హోమ్స్, గ్రామీణ జీవనశైలిని తెలిపే థీమ్ సెట్టింగ్స్ నిర్మాణాలకు కూడా అనుమతులు ఇస్తారు. ఫామ్ఫ్లాట్ల ప్రాజెక్ట్‌లలో నీటి అవసరాల కోసం గ్రిడ్ లేదా పబ్లిక్ వాటర్ సప్లయి వ్యవస్థను వినియోగించడానికి వీలు లేదు కాబట్టి సొంతంగా నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. – సాక్షి, హైదరాబాద్ -
ఆర్థిక అభద్రతలో పట్టణ భారతం..
న్యూఢిల్లీ: గడిచిన ఏడాది కాలంగా బీమాపై అవగాహన పెరిగినప్పటికీ .. పట్టణ ప్రాంతాల ప్రజల్లో ఆర్థిక అభద్రత భావం తగ్గలేదు. రోజువారీ వైద్యం ఖర్చులు, జీవన విధానాన్ని కొనసాగించేందుకు అయ్యే వ్యయాలపై యువత మరింత ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. బీమా సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి మధ్యకాలంలో 25 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 7,014 మంది తమ అభిప్రాయాలు తెలియజేశారు. వీటిలో 6 మెట్రో నగరాలు, 9 ప్రథమ శ్రేణి నగరాలు, 10 ద్వితీయ శ్రేణి నగరాలు ఉన్నాయి. 25–55 ఏళ్ల మధ్య, సగటున రూ. 2 లక్షల పైగా కుటుంబ వార్షికాదాయం గలవారు, ఆర్థిక సాధనాలపై ఇతరులను ప్రభావితం చేయగలవారి అభిప్రాయాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య 700 బేసిస్ పాయింట్లు పెరిగి 28 శాతానికి చేరింది. టర్మ్ పాలసీల గురించి అవగాహన 1,000 బేసిస్ పాయింట్లు ఎగిసి 57 శాతానికి పెరిగింది. అత్యధికంగా బీమా భద్రతపై అవగాహన ఉన్న వారు, జీవిత బీమా పాలసీదారులతో దక్షిణాది అగ్రస్థానంలో ఉంది. ఈ విషయంలో 47 పాయింట్లతో ఢిల్లీ, 46 పాయింట్లతో హైదరాబాద్ టాప్‌లో ఉన్నాయి. మరోవైపు, అనేక అంశాల్లో పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆర్థిక అభద్రతా భావం ఎక్కువగా ఉంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో బీమా భద్రతకన్నా ఎక్కువగా పొదుపునకే ప్రాధాన్యమిస్తున్నారు. టర్మ్ పాలసీల కన్నా ఎండోమెంట్ పాలసీల వైపే మొగ్గు చూపుతున్నారు. -
అర్బన్ ఏరియాల్లో బీజేపీ పట్టు కోల్పోతుందా?
-
ఆంధ్రలో అర్బన్ మండలాల విభజన
అమరావతి: రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లోని అర్బన్ మండలాలను విభజించి కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విజయవాడ అర్బన్ మండలాన్ని నాలుగు కొత్త మండలాలుగా విభజించింది. అవి విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ ఉత్తరం, విజయవాడ మధ్య మండలాలుగా ఉంటాయి. గుంటూరు మండలాన్ని గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ మండలాలుగా, నెల్లూరు మండలాన్ని నెల్లూరు అర్బన్, నెల్లూరు రూరల్‌గా విభజించింది. ఇక కర్నూలు మండలాన్ని విభజించి కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్ మండలాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విశాఖ అర్బన్, రూరల్ మండలాలను ఐదు కొత్త మండలాలుగా విభజించింది. -
నిరుపేద యువతకు ఉపాధి కల్పించాలి
అది సర్కార్ బాధ్యత రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఉద్ఘాటన సుందరయ్య విజ్ఞాన కేంద్రం: పట్టణ ప్రాంతంలోని నిరుపేద యువతకు ఉపాధి కల్పించాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో ‘పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజల అవసరాలు-రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ జయరాజు, రిటైర్డ్ సీఎస్ కాకి మాధవరావు, ప్రొఫెసర్ వైబీ సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. కాకి మాధవరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చి ఎలాంటి ఉపాధి లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారన్నారు. పట్టణ ప్రాంత పేదలకు గృహవసతి, మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. ప్రొఫెసర్ వైబీ సత్యనారాయణ మాట్లాడుతూ మురికివాడలను ఎంపిక చేసి ఎంతమంది నైపుణ్యం గల వారున్నారనే విషయమై సర్వే నిర్వహించి ఉపాధి కల్పించాలని సూచించారు. ఉపాధి కల్పిస్తాం.. దళితులకు ప్రవేశపెట్టిన మూడు ఎకరాల భూమి పథకాన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎస్సీ కార్పొరేషన్ ఎండీ జయరాజు అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దళిత యువతకు వారి అర్హత ఆధారంగా ఉపాధి క ల్పిస్తామన్నారు. అయితే ప్రభుత్వమే 75 శాతం సబ్సిడీ ఇచ్చి, మిగితా 25 శాతం బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ప్రభుత్వానికి సూచించినట్టు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలంటే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. సమావేశంలో సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, మల్లేపల్లి లక్ష్మయ్య, కేవీపీఎస్ నాయకులు జాన్ వెస్లీ, సీపీఐ నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్, బీడీఎఫ్ ప్రధాన కార్యదర్శి శంకర్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు ఆశాలత, ప్రొఫెసర్లు మల్లేశ్, లింబాద్రి, అమన్ వేదిక నాయకురాలు నిర్మల, సీడీఎస్ నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.