న్యూఢిల్లీ: పట్టణాల్లో నిరుద్యోగం 7.2 శాతానికి తగ్గింది. 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) గణాంకాలు విడుదలయ్యాయి. 2021 అక్టోబర్–డిసెంబర్ కాలంలో పట్టణాల్లో నిరుద్యోగం 8.7 శాతంగా ఉంది. 15 ఏళ్లకు పైగా వయసు ఉండి పనిచేయడానికి అర్హత కలిగిన వ్యక్తులను సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు.
కరోనా ప్రభావం వల్ల 2021 చివరి మూడు నెలల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉండడానికి కారణం. 2022 జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో నిరుగ్యోగ రేటు 7.2 శాతంగానే ఉండడం గమనించాలి. అంటే తదుపరి మూడు నెలలకూ అదే స్థాయిలో నిరుద్యోగం కొనసాగింది. ఇక గతేడాది ఏప్రిల్–జూన్ కాలానికి 7.6 శాతం మేర నిరుద్యోగం పట్టణ ప్రాంతాల్లో ఉంది. అలాగే 2022 జనవరి–మార్చి కాలానికి పట్టణ నిరుద్యోగం 8.2 శాతంగా ఉండడం గమనార్హం. గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ వీటిని విడుదల చేసింది.
మహిళల్లో 9.6 శాతం
2022 అక్టోబర్–డిసెంబర్ కాలానికి పట్టణ ప్రాంతాల్లో మహిళా నిరుద్యోగుల సంఖ్య 9.6 శాతంగా ఉంది. 2022 జూలై–సెప్టెంబర్ కాలంలో ఉన్న 9.4 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. కానీ 2021 చివరి మూడు నెలల్లో ఉన్న 10.5 శాతంతో పోలిస్తే తగ్గింది. 2022 ఏప్రిల్–జూన్ కాలంలో ఇది 9.5 శాతంగా, జనవరి–మార్చి క్వార్టర్‌లో 10.1 శాతం చొప్పున ఉంది. పట్టణాల్లో పురుష నిరుద్యోగులు 6.5 శాతంగా ఉన్నారు. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో 8.3 శాతంగా ఉంది.
2022 జూలై–సెపె్టంబర్‌లో 6.6 శాతం, 2022 ఏప్రిల్–జూన్ కాలానికి 7.1 శాతం, జనవరి–మార్చి క్వార్టర్‌లో 7.7 శాతం చొప్పున పట్టణాల్లో పురుషుల నిరుద్యోగం ఉన్నట్టు లేబర్ సర్వే గణాంకాలు వెల్లడించాయి. 2022 చివరి మూడు నెలల కాలంలో పట్టణాల్లో 15 ఏళ్లకు పైబడిన కార్మిక శక్తి 48.2 శాతానికి పెరిగింది. 2021 చివరి మూడు నెలల్లో ఇది 47.3 శాతంగా ఉంది.
2021–22లో 4.1 శాతం
దేశవ్యాప్తంగా నిరుద్యోగుల రేటు 2021 జూలై నుంచి 2022 జూన్ కాలానికి 4.1 శాతానికి తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 4.2 శాతంగా ఉంది. 2019–20 సంవత్సరంలో ఉన్న నిరుద్యోగం రేటు 4.8 శాతంతో పోలిస్తే 15 శాతం వరకు తగ్గినట్టు తెలుస్తోంది. పట్టణాల్లో పురుషుల నిరుద్యోగం 4.4 శాతానికి దిగొచ్చింది. ఇది అంతకుముందు ఏడాది కాలంలో 4.5 శాతంగా ఉంది. మహిళల్లో నిరుద్యోగం 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment