సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కారణంగా ఆకాశాన్నంటున్న ధరలే ప్రధాన సమస్యలని, ఈ రెండు అంశాలే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని 70 శాతానికిపైగా ప్రజలు తెలియజేశారని ‘ప్యూ రీసర్చ్ సెంటర్’ చేసిన సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం ప్రధాన సమస్య అని 76 శాతం మంది తెలియజేశారు. దేశంలో గత 49 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ సమస్య పెరిగి పోయింది, అది పట్టణ ప్రాంతాల్లో 7.8 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 5.3 శాతం ఉన్నట్లు 2017–2018 ఆర్థిక సంవత్సరంలో ‘నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్’ లీకైన డాక్యుమెంట్లు తెలియజేసిన విషయం తెల్సిందే.
ఆ పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలు పెద్ద రెండో పెద్ద సమస్య అని 73 శాతం మంది, అవినీతి అధికారులు సమస్యని 66 శాతం మంది, టెర్రరిజమ్ సమస్యని 65 శాతం, నేరాలు సమస్య అని 64 శాతం, వ్యాపారుల అవినీతి అని 59 శాతం మంది, ధనవంతులు, పేద వారి మధ్య వ్యత్యాసం మరింత పెరిగిందని 51 శాతం, దేశంలో విద్యా ప్రమాణాలు సన్నగిల్లాయని 50 శాతం, ఉద్యోగాల కోసం భారతీయులు విదేశాలకు వలస పోతున్నారని 49 శాతం, కాలుష్యమని 44 శాతం, వైద్య సదుపాయాలు సరిగ్గా లేవని 44 శాతం, మత ఘర్షణలు సమస్య అని 34 శాతం మంది అభిప్రాయపడ్డారు.
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో, ఆ తర్వాత ఏమన్నా పరిస్థితి మెరుగుపడిందా ? అన్న పరిస్థితికి నిరుద్యోగ సమస్యపై మెరుగుపడిందని 21 శాతం మంది చెప్పగా, మరింత అధ్వాన్నమైందని 64 శాతం మంది చెప్పారు. అవినీతి అంశంలోను 21 శాతం మంది పరిస్థితి మెరగుపడిందని తెలపగా, మరంతి దిగజారిందని 65 శాతం మంది చెప్పారు. దేశంలో సరుకులు, సర్వీసుల పరిస్థితి బాగా లేదని 66 శాతం మంది, మెరగుపడిందని 21 శాతం చెప్పారు. టెర్రరిజమ్ పెరిగిందని 52 శాతం, మెరుగుపడిందని 19 శాతం మంది ప్రజలు తెలిపారు. స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం పెరిగిందని 54 శాతం మంది చెప్పారు. వాయు కాలుష్యం కూడా పెరిగిందని 51 శాతం మంది అభిప్రాయపడగా పరిస్థితి మెరగుపడిందని 21 శాతం మంది చెప్పారు.
పాకిస్థాన్ నుంచే భారత్‌కు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని 63 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. పుల్వామా ఉగ్ర దాడి, దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లో బాలకోట్‌పై భారత వైమానిక దళం దాడి జరపడానికి ముందు పీయూష్ రీసర్చ్ సెంటర్ ఈ సర్వేను నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment