![People consume lot of processed food](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/food.jpg.webp?itok=oUSBbQKB)
ప్రాసెస్డ్ ఆహారాన్నే ఎక్కువగా వినియోగిస్తున్న ప్రజలు
తృణధాన్యాలు, పాలు, పండ్లు, కూరగాయలు వీటి తర్వాతే..
దేశంలోనే రెండోస్థానంలో తెలంగాణ
మొత్తం ఆహార వ్యయంలో27.47% వీటి కోసమఖర్చు చేస్తున్న వైనం..
గ్రామీణ ప్రాంతాల్లో 20.84 %
పట్టణ ప్రాంతాల్లో 33.63 %
కుటుంబ వినియోగ వ్యయ సర్వే వెల్లడి
కూల్‌డ్రింక్‌లు, చిరుతిళ్లు, బేకరీ పదార్థాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: అధిక పోషకాలుండే తాజా ఆహార పదార్థాల కంటే సులభంగా అందుబాటులో ఉండే నిలువ ఉండే ఆహారంపైనే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆహారానికి చేస్తున్న ఖర్చులో.. ప్రాసెస్డ్ ఆహారానికి సంబంధించిన వ్యయమే ఎక్కువగా ఉంటోంది. దేశ వ్యాప్తంగా ప్రాసెస్డ్ ఆహారంపైన చేస్తున్న ఖర్చు 24.44 శాతం ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘కుటుంబ వినియోగ వ్యయ సర్వే– 2023–24’ స్పష్టం చేస్తోంది.
గ్రామీణ ప్రాంత ప్రజలు 20.93 శాతం ఖర్చు చేస్తుండగా.. పట్టణ ప్రాంత ప్రజలు 27.95 శాతం ఖర్చు పెడుతున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఉన్నప్పటికీ... వినియోగం మాత్రం వేగంగా పెరుగుతూ వస్తోంది.
ఆధునిక జీవనశైలికిఅనుగుణంగా..
ఆధునిక జీవనశైలికి అనుగుణంగాఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా ఉద్యోగులు,విద్యార్థులు వారి రోజువారీ కార్యకలాపాల్లో బిజీ ఉంటూ వెంటనే అందుబాటులో ఉండే (అత్యవసర ఆహారం) నిల్వ ఉండే, శుద్ధి చేసి భద్రపర్చిన ఆహారాన్ని తీసుకుంటున్నారు.
ఈ ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగాఉండకపోవడం, ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వీలుగా ఉపయోగించే రసాయనాల కారణంగా అనారోగ్యసమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కూల్‌డ్రింక్‌లు, చిరుతిళ్లు, బేకరీ పదార్థాలు ఎక్కువగా తినడం మంచిది కాదని అంటున్నారు.
పాలు, పండ్లను మించి ఖర్చు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ వినియోగ వ్యయ సర్వేలో ఆహారంపై చేసే ఖర్చును ఏడు కేటగిరీల్లో లెక్కించారు. తృణధాన్యాలు, పాలు.. పాల ఉత్పత్తులు తదితర ఈ ఏడు కేటగిరీల్లోనూ ప్రాసెస్డ్ ఆహారం, బేవరేజెస్ (పానీయాలు) ఖర్చే ఎక్కువగా ఉండడం గమనార్హం. మొత్తం మీద పట్టణ ప్రాంతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంత ప్రజలు కొంత పోషకాలున్న ఆహారాన్ని తీసుకుంటున్నారు.
తృణధాన్యాలు, గుడ్లు, చేపలు, మాంసాహారాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం అందుకు భిన్నంగా ప్రాసెస్డ్ ఆహారంపైనే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. పోషకాలు ఎక్కువగా ఉండే తృణధాన్యాలు, కూరగాయలకు ప్రాధాన్యత తక్కువగా ఉంది.
ఇక్కడ ఈ సరుకులకు డిమాండ్ ఎక్కువగా ఉండగా, తాజా సరుకుల లభ్యత కష్టంగా ఉండడంతో వీటి వినియోగానికి ప్రాధాన్యత తగ్గుతోంది. మరోవైపు హోటళ్లు, కర్రీ పాయింట్లకు ప్రాధాన్యత ఇవ్వడం కూరగాయల కొనుగోలుపై ప్రభావం చూపుతోంది.
రాష్ట్రాల్లో తమిళనాడు టాప్
ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో (పట్టణ ప్రాంతం) తమిళనాడు (34.30 శాతం) మొదటి వరుసలో ఉంది. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ, కర్ణాటక, అసోం, పంజాబ్ రాష్ట్రాలున్నాయి. గ్రామీణ ప్రాంత కేటగిరీలోనూతమిళనాడు (29.89 శాతం)ముందుండగా.. అసోం, కర్ణాటక, పంజాబ్, రాజస్తాన్, ఒడిశా, గుజరాత్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ 10వ స్థానంలో ఉంది.
రాష్ట్రంలో జాతీయ సగటును మించి..
రాష్ట్రంలో ప్రజలు మొత్తం ఆహారం కోసం చేస్తున్న వ్యయంలో ప్రాసెస్డ్ ఫుడ్ కోసమే 27.23 శాతం ఖర్చు చేస్తున్నారు. ఇది జాతీయ సగటు కంటే 2.79 శాతం అధికంగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం మొత్తం ఆహారంలో ప్రాసెస్డ్ ఆహారంపై 20.84 శాతం ఖర్చు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో ఇది ఏకంగా 33.63 శాతంతో దేశంలో రెండో స్థానంలో ఉంది.
దేశ సగటుతో పోలిస్తే మన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాసెస్డ్ ఆహారంపైన చేస్తున్న ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ.. పట్టణ ప్రాంతంలో ఆందోళనకర స్థాయిలో ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment