అది సర్కార్ బాధ్యత
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఉద్ఘాటన
సుందరయ్య విజ్ఞాన కేంద్రం:
పట్టణ ప్రాంతంలోని నిరుపేద యువతకు ఉపాధి కల్పించాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో ‘పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజల అవసరాలు-రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ జయరాజు, రిటైర్డ్ సీఎస్ కాకి మాధవరావు, ప్రొఫెసర్ వైబీ సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. కాకి మాధవరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చి ఎలాంటి ఉపాధి లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారన్నారు. పట్టణ ప్రాంత పేదలకు గృహవసతి, మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. ప్రొఫెసర్ వైబీ సత్యనారాయణ మాట్లాడుతూ మురికివాడలను ఎంపిక చేసి ఎంతమంది నైపుణ్యం గల వారున్నారనే విషయమై సర్వే నిర్వహించి ఉపాధి కల్పించాలని సూచించారు.
ఉపాధి కల్పిస్తాం..
దళితులకు ప్రవేశపెట్టిన మూడు ఎకరాల భూమి పథకాన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎస్సీ కార్పొరేషన్ ఎండీ జయరాజు అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దళిత యువతకు వారి అర్హత ఆధారంగా ఉపాధి క ల్పిస్తామన్నారు. అయితే ప్రభుత్వమే 75 శాతం సబ్సిడీ ఇచ్చి, మిగితా 25 శాతం బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ప్రభుత్వానికి సూచించినట్టు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలంటే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. సమావేశంలో సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, మల్లేపల్లి లక్ష్మయ్య, కేవీపీఎస్ నాయకులు జాన్ వెస్లీ, సీపీఐ నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్, బీడీఎఫ్ ప్రధాన కార్యదర్శి శంకర్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు ఆశాలత, ప్రొఫెసర్లు మల్లేశ్, లింబాద్రి, అమన్ వేదిక నాయకురాలు నిర్మల, సీడీఎస్ నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద యువతకు ఉపాధి కల్పించాలి
Published Tue, Aug 26 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM
Advertisement