హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిస్కట్స్, స్నాక్స్, సబ్బులు, టీ, కాఫీ పొడులు.. ఇలా ఉత్పాదన ఏదైనా మారుమూల పల్లెల్లోని దుకాణాల్లో రూ.1, రూ.2, రూ.5, రూ.10 ధరలో లభించే చిన్న ప్యాక్‌లే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. ఉత్పాదనను వినియోగదారుడికి అలవాటు చేయడం, అక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఇలా చిన్న ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చాయి.
ఇటువంటి చిన్న ప్యాక్‌లు ఇప్పుడు ప్రధాన నగరాల్లోని రిటైల్ షాపుల్లో ఇబ్బడిముబ్బడిగా దర్శనమిస్తున్నాయి. ఆధునిక రిటైల్ ఔట్‌లెట్లు, ఆన్‌లైన్ వేదికల్లోనూ ఇవి చొచ్చుకువచ్చాయి. ఇందుకు రిటైల్ ద్రవ్యోల్బణం కారణమని ఎఫ్‌ఎంసీజీ రంగ కంపెనీలు చెబుతున్నాయి. ఆహారోత్పత్తుల ధరలు అధికంగా ఉండడంతో భారత్‌లో వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.52 శాతం నమోదైంది. దేశంలో ఎఫ్‌ఎంసీజీ మార్కెట్ 2020లో రూ.9.1 లక్షల కోట్లు ఉంది. 2025 నాటికి ఇది రెండింతలు అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.
వినియోగం పెరిగేందుకు..
భారత్‌లో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) పరిశ్రమ 2022 అక్టోబర్-డిసెంబర్‌లో 7.6 శాతం వృద్ధి చెందింది. అంత క్రితం త్రైమాసికంలో ఇది 9.2 శాతంగా ఉంది. నిత్యావసరాలతోపాటు ఇతర విభాగాల్లోనూ ప్రముఖ తయారీ కంపెనీలు చిన్న ప్యాక్స్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. తక్కువ ధరలో లభించే చిన్న బ్రాండ్స్, ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తుల వైపు కస్టమర్లు మళ్లకుండా పెద్ద బ్రాండ్లు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఒక్కో కుటుంబం నెలవారీ చేసే ఖర్చులపై ఒత్తిడి ఉండడం కూడా మరో కారణం. ముడిసరుకు వ్యయాలు పెరుగుతుండడంతో కంపెనీలు ప్యాక్ బరువు తగ్గించడం లేదా ధర పెంచడమో చేస్తున్నాయి. ధర పెంచిన ఉత్పత్తుల అమ్మకాలు తగ్గుతున్నాయని కంపెనీలు చెబుతున్నాయి. వినియోగం పెరిగేందుకు చిన్న ప్యాక్‌లను కొనసాగించాల్సిందేనని రిసర్చ్ కంపెనీ నీల్సన్‌ఐక్యూ తెలిపింది. ఆహారేతర విభాగాల్లో ఇవి డిమాండ్‌ను పెంచుతాయని వివరించింది.
విక్రయాల్లో 50 శాతం దాకా..
చిన్న ప్యాక్‌ల వాటా మొత్తం అమ్మకాల్లో కంపెనీని బట్టి 50 శాతం వరకు ఉందంటే మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. గడిచిన రెండు నెలల్లో నగరాల్లో మొత్తం విక్రయాల్లో చిన్న ప్యాక్‌ల వాటా 5 శాతం పెరిగిందని కంపెనీలు అంటున్నాయి. మొత్తం సేల్స్‌లో చిన్న ప్యాక్‌ల వాటా ఏకంగా 50 శాతం ఉందని పార్లే ప్రొడక్ట్స్ వెల్లడించింది. నగరాల్లో గడిచిన రెండు మూడు నెలల్లో పెద్ద ప్యాక్‌లకు బదులుగా చిన్న ప్యాక్‌ల విక్రయాలే అధికంగా ఉన్నాయని కంపెనీ సీనియర్ కేటగిరీ హెడ్ మాయంక్ షా తెలిపారు. గతంలో ఇలా ఉండేది కాదన్నారు. సాధారణంగా ఈ ట్రెండ్ గ్రామీణ ప్రాంతాలకే పరిమితం అని చెప్పారు. ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ప్యాక్‌ల వైపు మార్కెట్ మళ్లుతోందని సుస్పష్టం అవుతోందని విప్రో కంజ్యూమర్ కేర్ చెబుతోంది. ద్రవ్యోల్బణం ప్రధాన సవాల్‌గా ఉందని కోకా-కోలా ఇండియా తెలిపింది.
ఇతర విభాగాల్లోనూ..
మిల్క్, న్యూట్రీషన్ విభాగాల్లో అందుబాటు ధరలో ప్యాక్‌లను పరిచయం చేయాలని దిగ్గజ సంస్థ నెస్లే నిర్ణయించింది. ఇప్పటికే ఈ కంపెనీ కెచప్, చాకొలేట్స్, కాఫీలో చిన్న ప్యాక్స్‌ను విక్రయిస్తోంది. ‘పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని బ్రాండ్స్‌లో అందుబాటు ధరలో విక్రయించేందుకు చిన్న ప్యాక్‌లు దోహదం చేస్తున్నాయి. చిన్న ప్యాక్‌లు లక్ష్యంగా ఇతర విభాగాల్లో విస్తరిస్తున్నాం. ఇది సత్ఫలితాలను ఇస్తోంది’ అని కోక–కోలా ఇండియా, సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్ సంకేత్ రే తెలిపారు. పెప్సి, మిరిండా, మౌంటెయిన్ డ్యూ సింగిల్ సర్వ్ బాటిల్స్ అమ్మకాలు ఇతర ప్యాక్‌లను మించి నమోదయ్యాయి. గెలాక్సీ, స్నిక్కర్స్, ఎంఅండ్‌ఎం బ్రాండ్ల చాకొలేట్లను విక్రయిస్తున్న మార్స్ రిగ్లీ రూ.10 ధరలో లభించే ప్యాక్‌లను నగరాల్లోనూ ప్రవేశపెడుతోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో మాత్రమే ద్రవ్యోల్బణం తగ్గుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పంపిణీ, ధర నిర్ణయిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment