max life insurance
-
పట్టణ ప్రజల్లో ‘బీమా’పై పెరుగుతున్న చైతన్యం
న్యూఢిల్లీ: పట్టణ ప్రజల్లో జీవిత బీమా పట్ల అవగాహన పెరుగుతోంది. ప్రతి నలుగురిలో ముగ్గురికి జీవిత బీమా రక్షణ ఉన్నట్టు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్ (ఐపీక్యూ) 6.0లో ద ప్రొటెక్షన్ ఇండెక్స్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 45కి చేరుకుందని, ఇది ఐపీక్యూ 5.0లో 43గానే ఉందని తెలిపింది. ప్రజల్లో రక్షణ పట్ల పెరుగుతున్న అవగాహన, ఆమోదాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఐదేళ్ల ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్ను పరిశీలించి చూస్తే ఐపీక్యూ 1.0లో 35 నుంచి ఐపీక్యూ 6.0లో 45కు చేరుకుందని, పది పాయింట్లు పెరిగినట్టు వివరించింది. ఆర్థిక సామర్థ్యాలను నిర్మించుకునే దిశగా పట్టణ ప్రజల ప్రయాణాన్ని ఇది తెలియజేస్తోందని పేర్కొంది. ప్రొటెక్షన్ క్వొటెంట్ 49 పాయింట్లతో దక్షిణ భారత్ ఆర్థికంగా ఎంతో రక్షణ కలిగినట్టు నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత పశి్చమ భారత్ 42 పాయింట్ల నుంచి 46 పాయింట్లకు చేరుకున్నట్టు తెలిపింది. పట్టణ ప్రజల ఆర్థిక రక్షణ స్థాయిలను లెక్కించేందుకు ఐపీక్యూ అచ్చమైన కొలమానంగా మారినట్టు మ్యాక్స్‌లైఫ్ ఎండీ, సీఈవో ప్రశాంత్ త్రిపాఠి అన్నారు. -
మ్యాక్స్‌లైఫ్ మిడ్‌క్యాప్ మూమెంటమ్ ఫండ్
మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యులిప్ పాలసీదారుల కోసం ‘మిడ్‌క్యాప్ మూమెంటమ్ ఇండెక్స్ ఫండ్’ను ప్రారంభించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 మూమెంటమ్ 50 ఇండెక్స్‌ను అనుసరించి ఇది పెట్టుబడులు పెడుతుంటుంది. అంటే ఇండెక్స్‌లోని స్టాక్స్‌లోనే వెయిటేజీ ఆధారంగా పెట్టుబడులు పెడుతుంది. కనుక దీన్ని ఇండెక్స్ ఫండ్‌గా పరిగణించొచ్చు. ఈ ఇండెక్స్ రాబడులు ఐదేళ్లలో ఏటా 28.7 శాతం, పదేళ్లలో ఏటా 26.7 శాతంగా ఉన్నట్టు మ్యాక్స్‌లైఫ్ ప్రకటించింది. ఈ నెల 29వ తేదీ వరకు ఈ నూతన ఫండ్‌లో పాల్గొనవచ్చని పేర్కొంది. ఇండెక్స్‌లోని స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెడుతుంది కనుక రాబడులు కూడా దానినే ప్రతిఫలించే మాదిరిగా ఉంటాయని ఆశించొచ్చు. ఒక యూనిట్ ఎన్ఏవీ రూ.10. మిడ్‌క్యాప్ విభాగంలో వ్యూహాత్మక పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చని మ్యాక్స్‌లైఫ్ పేర్కొంది. -
జీవిత బీమా రంగంలో తొలి స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఇదే..
ముంబై: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తాజాగా యులిప్స్ విభాగంలో నిఫ్టీ స్మాల్‌క్యాప్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. జీవిత బీమా రంగంలో ఇదే తొలి స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్ అని సంస్థ సీనియర్ డైరెక్టర్ మిహిర్ వోరా తెలిపారు. పదేళ్ల వ్యవధిలో 22 శాతం రాబడి అందించిన నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 క్వాలిటీ 50 సూచీ దీనికి ప్రామాణికంగా ఉంటుందని వివరించారు. యూనిట్‌కు రూ. 10 చొప్పున ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఆగస్టు 25 వరకు అందుబాటులో ఉంటుంది. అధిక రిస్కు సామరŠాధ్యలు కలిగి ఉండి, దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు కోరుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుందని వోరా వివరించారు. -
క్యాపిటల్ ఎస్ఎఫ్బీ కస్టమర్లకు మ్యాక్స్ లైఫ్ ప్లాన్లు
న్యూఢిల్లీ: మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ) భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కస్టమర్లకు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు చెందిన సేవింగ్స్ ప్లాన్లు, ప్రొటెక్షన్ ప్లాన్లు, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన కస్టమర్లకు అందించనుంది. దీనివల్ల ఇరు సంస్థలకూ వ్యాపార అవకాశాలు పెరగనున్నాయి. -
మ్యాక్స్ ఫిన్‌తో కొత్త ఒప్పందం
న్యూఢిల్లీ: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 7 శాతం అదనపు వాటా కొనుగోలుకి సవరించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. ఇందుకు మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో పద్ధతిలో తాజా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ మార్గదర్శకాల ప్రకారం ఒప్పందంలో సవరణలకు తెరతీసినట్లు పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ అనుబంధ కంపెనీలు యాక్సిస్ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్ 2021లో మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తద్వారా మ్యాక్స్ ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ మ్యాక్స్ లైఫ్‌లో 20 శాతం వాటా కొనుగోలుకి సంతకాలు చేశాయి. దీనిలో భాగంగా ఇప్పటికే 12.99 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. మిగిలిన వాటా కొనుగోలుకి తాజాగా ఒప్పందంలో సవరణలు చేపట్టినట్లు యాక్సిస్ బ్యాంక్, అనుబంధ కంపెనీలు తెలియజేశాయి. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో పద్ధతిలో భవిష్యత్ క్యాష్ ఫ్లో ఆధారంగా ఒక కంపెనీలో చేయనున్న పెట్టుబడి విలువను నిర్ధారిస్తారు. దీనిని ఫెయిర్ వ్యాల్యూగా పేర్కొంటారు. -
మ్యాక్స్ లైఫ్ వాటాపై యాక్సిస్ కన్ను
న్యూఢిల్లీ: బీమా సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లోగల వాటాను పెంచుకోనున్నట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. రానున్న 6–9 నెలల్లో వాటాను 20 శాతంవరకూ పెంచుకునే వీలున్నట్లు బ్యాంక్ సీఈవో ప్రశాంత్ త్రిపాఠి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం అనుబంధ సంస్థలు రెండింటితో కలసి మ్యాక్స్ లైఫ్‌లో 12.99 శాతం వాటాను యాక్సిస్ బ్యాంక్ కలిగి ఉంది. గతేడాది ఏప్రిల్‌లో డీల్‌కు అనుమతిని పొందాక మ్యాక్స్ లైఫ్‌లో యాక్సిస్ ఈ వాటాను సొంతం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా మ్యాక్స్ లైఫ్‌లో 7 శాతంవరకూ అదనపు వాటా కొనుగోలుకు యాక్సిస్ అనుబంధ సంస్థలకు హక్కు లభించింది. నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి ఒకేసారి లేదా దఫదఫాలుగా వాటాను దక్కించుకోవచ్చు. గత ఐదేళ్లలో బ్యాంకెస్యూరెన్స్ విభాగం 18–20 శాతం వృద్ధిని సాధిస్తున్నట్లు త్రిపాఠి పేర్కొన్నారు. నూతన అమ్మకాలలో 60 శాతం ఈ విభాగం ద్వారానే నమోదవుతున్నట్లు తెలియజేశారు. బ్యాంక్, బీమా కంపెనీల మధ్య ఒప్పందమే బ్యాంకెస్యూరెన్స్. దీంతో బ్యాంక్ కస్టమర్లకు బీమా ప్రొడక్టులను విక్రయించడం, బ్యాంక్ బ్రాంచీలను ఇందుకు వినియోగించుకోవడానికి వీలుంటుంది. -
గుడ్ న్యూస్.. భారీగా ఏజెంట్ల నియామకం చేపట్టిన మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్
ఇన్స్యూరెన్స్ రంగంలో ఉద్యోగాలు చేరాలని అనుకునే వారికి శుభవార్త. ఇటీవల ఇన్స్యూరెన్స్ కంపెనీలు భారీగా ఉద్యోగాలను నియమించుకుంటున్నాయి. ఏజెంట్ల స్థాయి నుంచి ఆఫీసర్ల స్థాయి వరకు భారీ స్థాయిలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడుతున్నాయి. తాజాగా మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ భారీ స్థాయిలో ఉద్యోగాల ఏజెంట్ల నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 ఏజెంట్ అడ్వైజర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మ్యాక్స్ లైఫ్ ప్రకటించింది. నియామక ప్రక్రియ మొత్తం డిజిటల్ పద్ధతిలో చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ప్రక్రియ ద్వారా ఎఫ్ వై 21లో 23,000 మందికి పైగా ఏజెంట్ సలహాదారులను నియమించుకోనుంది. మాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ వి. విశ్వనాథ్ ఒక ప్రకటనలో ఇలా.. "మా ఏజెన్సీ శ్రామిక శక్తి డిజిటల్ నియామక ప్రయాణం మా ఏజెన్సీలో అత్యున్నత నాణ్యత, ప్రతిభగల వారిని నియమించుకోవడానికి మాత్రమే కాదు, మొత్తం ఆన్ బోర్డింగ్ ప్రయాణంలో ఎక్కువ చురుగ్గా, వేగంగా సమర్థవంతంగా నియామక ప్రక్రియ చేపట్టడానికి ఉపయోగపడుతుందని నిర్ధారించింది" అని అన్నారు. డిజిటల్ నియామక ప్రక్రియ కింద మాక్స్ లైఫ్ నాణ్యమైన ఏజెంట్ నియామకాన్ని ప్రారంభించడానికి సమగ్రమైన 'వెబ్-టు-రిక్రూట్ ప్రోగ్రామ్'ను ప్రారంభించింది. దీంతో పాటు కొత్త ట్రైనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ 'మ్యాక్స్ లైఫ్ ఏస్ టాక్' ప్రారంభించింది. ఇందులో మ్యాక్స్ లైఫ్ ఏజెంట్ అడ్వైజర్ల స్ఫూర్తిదాయకమైన కథలు ఉంటాయి. ఇవి ఇతర ఏజెంట్లకు స్ఫూర్తినిస్తాయి. -
ఆర్థిక అభద్రతలో పట్టణ భారతం..
న్యూఢిల్లీ: గడిచిన ఏడాది కాలంగా బీమాపై అవగాహన పెరిగినప్పటికీ .. పట్టణ ప్రాంతాల ప్రజల్లో ఆర్థిక అభద్రత భావం తగ్గలేదు. రోజువారీ వైద్యం ఖర్చులు, జీవన విధానాన్ని కొనసాగించేందుకు అయ్యే వ్యయాలపై యువత మరింత ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. బీమా సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి మధ్యకాలంలో 25 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 7,014 మంది తమ అభిప్రాయాలు తెలియజేశారు. వీటిలో 6 మెట్రో నగరాలు, 9 ప్రథమ శ్రేణి నగరాలు, 10 ద్వితీయ శ్రేణి నగరాలు ఉన్నాయి. 25–55 ఏళ్ల మధ్య, సగటున రూ. 2 లక్షల పైగా కుటుంబ వార్షికాదాయం గలవారు, ఆర్థిక సాధనాలపై ఇతరులను ప్రభావితం చేయగలవారి అభిప్రాయాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య 700 బేసిస్ పాయింట్లు పెరిగి 28 శాతానికి చేరింది. టర్మ్ పాలసీల గురించి అవగాహన 1,000 బేసిస్ పాయింట్లు ఎగిసి 57 శాతానికి పెరిగింది. అత్యధికంగా బీమా భద్రతపై అవగాహన ఉన్న వారు, జీవిత బీమా పాలసీదారులతో దక్షిణాది అగ్రస్థానంలో ఉంది. ఈ విషయంలో 47 పాయింట్లతో ఢిల్లీ, 46 పాయింట్లతో హైదరాబాద్ టాప్‌లో ఉన్నాయి. మరోవైపు, అనేక అంశాల్లో పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆర్థిక అభద్రతా భావం ఎక్కువగా ఉంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో బీమా భద్రతకన్నా ఎక్కువగా పొదుపునకే ప్రాధాన్యమిస్తున్నారు. టర్మ్ పాలసీల కన్నా ఎండోమెంట్ పాలసీల వైపే మొగ్గు చూపుతున్నారు. -
ఇ‘స్మార్ట్’ పాలసీ..!
జీవిత బీమా... ఇప్పటికీ చాలా మంది దీన్ని పెట్టుబడి సాధనంగానే చూస్తున్నారు. తమకు ఏదైనా జరగరానిది జరిగితే తమ కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడకూడదన్న ఆకాంక్ష ఎక్కువ మందిలో ఉన్నప్పటికీ... ఆచరణకు వచ్చే సరికి సరైన కవరేజీ తీసుకుంటున్న వారు అతి స్వల్పం. పాలసీ కడితే నాకేంటి...? అన్న ప్రశ్న వారిది. కుటుంబానికి సంపూర్ణ ఆర్థిక రక్షణ కల్పించే పాలసీని తక్కువ ప్రీమియానికే టర్మ్ ప్లాన్ రూపంలో తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ.... తాను జీవించి ఉంటే చివరకు నాకు వచ్చేది ఏదీ లేదన్న భావన ఎక్కువ మందిని టర్మ్‌ప్లాన్ వైపు అడుగులు వేయనీయడం లేదు. తాజాగా నిర్వహించిన సర్వేల్లోనూ సగటు వ్యక్తి ఇదే ఆలోచిస్తున్నట్టు వెల్లడైంది. మన చుట్టూ ఉన్న వారిలో ఎంత మందికి జీవితబీమా రక్షణ ఉందో చెప్పగలరా..? ఆర్థిక రక్షణ కల్పించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు చౌకగా లభిస్తున్నప్పటికీ ఎక్కువ మంది వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదన్న నిజం తెలుసా..? మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇటీవల సొంతంగా సర్వే నిర్వహించాయి. దేశంలో వ్యక్తుల ఆర్ధిక సన్నద్ధత ఎలా ఉంది? అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఈ రెండు సంస్థల సర్వేల్లోనూ తెలిసిన విషయాలు ఇవే. మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 33.3 శాతం మందికి బీమా రక్షణ ఉండగా, అందులోనూ కేవలం 20 శాతం మందికే టర్మ్ ప్లాన్ ఉన్నట్టు తెలిసింది. ఇక ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వేలో 83 శాతం మంది తమ కుటుంబ రక్షణ కోసం అవసరమైన మొత్తం పట్ల అవగాహనతో ఉన్నప్పటికీ, వారు తీసుకున్న బీమా రక్షణ అతి స్వల్పంగానే ఉండడం నివ్వెరపరిచే విషయం. కేవలం తమ వార్షిక ఆదాయానికి 1.67 రెట్ల మేరే బీమా కవరేజీతో ఎక్కువ మంది ఉన్నారు. వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లు అయినా బీమా కవరేజీ ఉండాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. అంటే కావాల్సినంత బీమా కవరేజీ తీసుకోలేదని స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా తక్కువ ప్రీమియానికే ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్ పాలసీలు తీసుకుని ఉంటే వారికి తగినంత రక్షణ లభించి ఉండేది. కానీ నేటికీ చాలా మంది టర్మ్ ప్లాన్లకు చెల్లించే ప్రీమియం వెనక్కి రాదన్న ఉద్దేశ్యంతో సంప్రదాయ పాలసీలను తీసుకుంటూ తమ కుటుంబానికి పూర్తి స్థాయి రక్షణ విషయంలో రాజీ పడుతున్నట్టు సర్వేల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఇప్పటికైనా కుటుంబానికి ఆధారమైన ప్రతీ వ్యక్తి టర్మ్ ప్లాన్ దిశగా అడుగులు వేయాలన్నది నిపుణుల సూచన. ప్రీమియం చాలా తక్కువ గడిచిన పదేళ్ల కాలంలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియం చాలా తక్కువ స్థాయిలకు దిగొచ్చినప్పటికీ... చాలా మంది వ్యక్తులు వీటికి దూరంగా ఉన్నారు. ‘‘గత 18 ఏళ్లలో జీవిత బీమా సంస్థలు ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నాయి. దాంతో అవి తమ అండర్‌రైటింగ్ ప్రక్రియలను మెరుగుపరిచాయి. బిగ్ డేటా, డేటా అనలటిక్స్ ద్వారా కస్టమర్లను సూక్ష్మంగా పరిశీలించే అవకాశం వాటికి లభించింది. దాంతో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా తగిన నమూనాలు, ధరలతో కూడిన ఉత్పత్తులను రూపొందించాయి’’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ నందా తెలిపారు. 30 ఏళ్ల వ్యక్తికి రూ.కోటి రూపాయల బీమా రక్షణకు పదేళ్ల క్రితం అయితే రూ.20,000–30,000 ప్రీమియం ఉండేదని, అదిప్పుడు రూ.8,000–10,000కు తగ్గిపోయినట్టు నందా చెప్పారు. అయితే, డిస్ట్రిబ్యూటర్లు టర్మ్ ప్లాన్ల విక్రయంలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడం కూడా ఒక కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు టర్మ్ ప్లాన్లను విక్రయించేందుకు సుముఖంగా లేరు. టర్మ్ ప్లాన్లపై వారికి ముట్టే కమీషన్ తక్కువగా ఉంటుంది’’ అని పాలసీబజార్ డాట్‌కామ్ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ సంతోష్ అగర్వాల్ తెలిపారు. చాలా మంది తమ పెట్టుబడి అవసరాలు, పన్ను ఆదా కోసం బీమా పాలసీలు తీసుకుంటున్నారని, టర్మ్ ప్లాన్ల అమ్మకాలు తక్కువగా ఉండడానికి ఇది మరో కారణమని బజాజ్ అలియాంజ్ లైఫ్ చీఫ్ ఇనిస్టిట్యూషనల్ బిజినెస్ ఆఫీసర్ ధీరజ్ సెహ్గల్ పేర్కొన్నారు. సంప్రదాయంగా మన దేశంలో పెట్టుబడి ఆధారిత బీమా పాలసీల కొనుగోలు ఎక్కువ. గడువు తీరిన తర్వాత నిర్ణీత మొత్తం తిరిగి వస్తుందన్న ఆకర్షణ వాటిల్లో వారికి కనిపిస్తోంది. అదే టర్మ్ ప్లాన్ల గడువు తీరిన తర్వాత రూపాయి కూడా తిరిగి రాదు. దీంతో వీటిని ఎక్కువ మంది పెద్దగా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఏమీ తిరిగి రాదు కనుకనే వీటిల్లో ప్రీమియం తక్కువగా ఉంటుందన్న సూక్ష్మాన్ని గ్రహించే వారు తక్కువగా ఉంటున్నారు. చిన్న వయసులో టర్మ్‌పాలసీ తీసుకుంటే చాలా తక్కువ ప్రీమియానికే మంచి కవరేజీ పొందొచ్చు. ఇలాంటి కొన్ని వ్యూహాల ద్వారా ప్రీమియాన్ని గణనీయంగా తగ్గించుకునే అవకాశాలు, అదే సమయంలో మంచి కవరేజీ పొందే అవకాశాలు ఉన్నాయని తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వయసు ఆధారంగా కవరేజీ సాధారణంగా వివాహం కాని వారికి భవిష్యత్తులో బాధ్యతలు పెరుగుతాయి కనుక వారు నిర్ణీత కాలానికి బీమా మొత్తం పెరిగే పాలసీలను తీసుకోవచ్చు. అదే వివాహమై 30 ఏళ్లు దాటిన వారికి, వయసు పెరుగుతున్న కొద్దీ కవరేజీ అవసరం తగ్గుతూ వెళుతుంది. ఎందుకంటే కొంత కాలానికి పొదుపు, పెట్టుబడులతోపాటు, ఆస్తులు కొంత మేర సమకూర్చుకుని ఉంటారు. ఉదాహరణకు 35 ఏళ్లున్న చరణ్ 60 ఏళ్లకు రిటైర్ అవుతారని అనుకుంటే, 25 ఏళ్ల పాటు పనిచేయగలుగుతారు. ఈ కాలంలోనే అన్ని రకాల లక్ష్యాలకు పొదుపు, మదుపులు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్, పిల్లల విద్య, వివాహాలు సహా తన అన్ని అవసరాలకు రూ.2 కోట్లు అవసరం అనుకుంటే... ఒకవేళ ప్రాణ ప్రమాదం ఎదురైతే చరణ్‌పై ఆధారపడిన కుటుంబానికి ఎంత కష్టం ఎదురవుతుందో ఆలోచించండి. అందుకే రూ.2 కోట్ల కవరేజీకి ఈ వ్యక్తి టర్మ్ ప్లాన్ రూపంలో వార్షికంగా రూ.17,396 చెల్లించడం ద్వారా పూర్తి రక్షణ పొందే అవకాశం సొంతం చేసుకున్నట్టు అవుతాడు. అయితే, 60 ఏళ్ల వరకూ రూ.2 కోట్ల కవరేజీ అవసరమా..? అంటే లేదనే సమాధానం వస్తుంది. రూ.2 కోట్లతో ఒకే పాలసీ తీసుకోకుండా, నాలుగు భాగాలు చేసి రూ.50 లక్షల చొప్పున భిన్న కాలాలకు తీసుకోవడం చక్కగా ఉంటుంది. 10 ఏళ్లు, 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్ల కాలానికి ఒక్కోటీ రూ.50 లక్షలకు తీసుకోవాలి. తద్వారా తన బీమా రక్షణ అవసరాల్లో రాజీ పడకుండా ప్రీమియం రూపంలో ఆదా చేసుకోవచ్చు. 25 ఏళ్ల టర్మ్‌లో రూ.2 కోట్ల కవరేజీకి రూ.4.48 లక్షలు ప్రీమియం రూపంలో చెల్లించుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా రూ.50 లక్షల చొప్పున భిన్న కాలానికి ఒక్కోటీ తీసుకోవడం వల్ల చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం రూ.2.7 లక్షలకు తగ్గిపోతుంది. దీనివల్ల రూ.1.7 లక్షలు ఆదా చేసుకోవచ్చని నిపుణుల విశ్లేషణ. ఈ విధానంలో బీమా పాలసీలు నాలుగు తీసుకోవడం వల్ల... పదేళ్ల తర్వాత నుంచి ప్రతీ ఐదేళ్లకు ఒక పాలసీ చొప్పున మెచ్యూరిటీ అవుతుంది. తీసుకున్న తర్వాత మొదటి పదేళ్లు రూ.2కోట్ల బీమా కవరేజీ లభిస్తుంది. చరణ్‌కు 45 ఏళ్లు వచ్చిన తర్వాత (అంటే పదేళ్ల తర్వాత) బీమా కవరేజీ రూ.1.5 కోట్లకు తగ్గుతుంది. అలాగే 50 ఏళ్లు రాగానే రూ.కోటి కవరేజీ, 55 ఏళ్లకు వచ్చిన తర్వాత రూ.50 లక్షలకు కవరేజీ పరిమితం అవుతుంది. ఇలా చేయడం వల్ల ప్రీమియం 25–30 శాతం ఆదా అవుతుందని ఏగా¯Œ లైఫ్ ఇన్సూరె¯Œ ్స ప్రొడక్ట్ డెవలప్మెంట్ హెడ్ హరీష్ కురూది తెలిపారు. బాధ్యతలకు విడిగా కవరేజీ... జీవిత బీమా అన్ని ఆర్థిక అవసరాలకూ రక్షణ కల్పించేది అయి ఉండాలి. లేదంటే ఒక్కో అవసరానికి ఉద్దేశించిన పాలసీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు గృహ రుణం తీసుకునేట్టు అయితే, రుణానికి సరిపడా కవరేజీతో టర్మ్ ప్లాన్ విడిగా తీసుకోవాలి. ఈ పాలసీ టర్మ్ కూడా రుణ కాల అవధికి సరిపడా ఉండాలి. ఒకవేళ ఈ టర్మ్ ప్లాన్ కవరేజీ లేనట్టయితే... రుణం తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భంలో వారసులు ఇంటి రుణం తీర్చలేకపోతే, ఆ ఇంటిని బ్యాంకు వేలం వేసి రుణ బకాయిలు రాబట్టుకునే చర్యలు చేపడుతుంది. ఒకవేళ రుణానికి టర్మ్ కవరేజీ ఉన్న సందర్భంలో రుణ గ్రహీత మరణించినట్టయితే, చెల్లింపుల బాధ్యత బీమా కంపెనీపై ఉంటుంది. దీనివల్ల కుటుంబానికి పెద్ద ఉపశమనం లభిస్తుంది. అయితే, ఇలాంటి సందర్భాల్లో నిర్ణీత కాలం వరకు ఒకటే కవరేజీ కాకుండా, ఏటా తగ్గుతున్న రుణానికి అనుగుణంగా కవరేజీ తగ్గే పాలసీని తీసుకోవడం సముచితం అవుతుంది. ఈ పాలసీల్లో సమ్ అష్యూర్డ్ ఏటా నిర్ణీత శాతం తగ్గుతూ వెళుతుంది. రెగ్యులర్ టర్మ్ ప్లాన్‌తో పోలిస్తే ఇలా సమ్ అష్యూర్డ్ తగ్గుతూ వెళ్లే వాటిల్లో ప్రీమియం తక్కువగా ఉండడం అనుకూలం. ఉదాహరణకు ప్రభుత్వరంగ బీమా సంస్థ ఒకటి 35 ఏళ్ల వ్యక్తి, 30 సంవత్సరాల టర్మ్‌కు రూ.24 లక్షల కవరేజీకి రూ.67,449 ప్రీమియం కింద వసూలు చేస్తోంది. ఈ మొత్తాన్ని రుణం తీసుకున్న ఏడాదే చెల్లించాల్సి ఉంటుంది. ఇదే వ్యక్తికి ఏటా కవరేజీ మారకుండా రుణ కాల వ్యవధి వరకు ఒకే విధంగా ఉండే పాలసీలో బీమా సంస్థ రూ.1.01 లక్షలను ప్రీమియం కింద వసూలు చేస్తోంది. అయితే, కేవలం కొన్ని బీమా సంస్థలే వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ఎక్కువ శాతం గ్రూప్ ప్లాన్‌ను బ్యాంకులు అంటగడుతున్నాయి. ఒకవేళ మీకు గృహ రుణం ఇచ్చే సంస్థ సమ్ అష్యూర్డ్ ఏటా తగ్గుతూ వెళ్లే టర్మ్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తే... అటువంటి సందర్భాల్లో ఇతర క్రెడిట్ లింక్డ్ ప్లాన్లు, లెవల్ టర్మ్ ప్లాన్లతో పోల్చి చూసి నిర్ణయం తీసుకోవాలి. సింగిల్ ప్రీమియం ప్లాన్లపై తగ్గింపు ప్రతీ నెలా, లేదా మూడు, ఆరు నెలలు లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లించడానికి బదులు... ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధపడితే బీమా సంస్థలు తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల కవరేజీ తీసుకోదలిస్తే... చౌకగా లభించే పాలసీలోనూ వార్షిక ప్రీమియం రూ.4,012 అవుతుంది. అంటే 20 ఏళ్లలో మొత్తం రూ.80,240 ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే సింగిల్ ప్రీమియం పాలసీలో రూ.59,531 కట్టేస్తే సరిపోతుంది. కానీ, ఈ విధానంలో నిజానికి చెల్లించిన మొత్తం ఆర్థిక గణాంకాల ప్రకారం ఎక్కువే అవుతుంది. ఎందుకంటే ముందుగానే పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నాం కనుక. దీనికి బదులు ఒకేసారి ప్రీమియం చెల్లించడానికి బదులు, ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా వృద్ధి చేసుకోవచ్చు. నిర్ణీత కాలంలో సంపద వృద్ధి జరుగుతుంది కనుకనే బీమా సంస్థలు తగ్గింపును ఆఫర్ చేస్తుంటాయి. 5–10 ఏళ్లు వంటి తక్కువ టర్మ్ కోసం సింగిల్ ప్రీమియంను ఎంచుకోవడం మంచిదే అవుతుంది. స్థిరమైన ఆదాయం లేని వారికీ సింగిల్ ప్రీమియం పాలసీలు అనుకూలంగా ఉంటాయి. -
హమ్మయ్య! హైదరాబాద్‌కు బీమా ఉంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా విషయంలో దేశంలోని మిగతా వారితో పోలిస్తే హైదరాబాదీలు చాలా మెరుగని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 83 శాతం మందికి ఏదో ఒక జీవిత బీమా పాలసీ ఉంది. ఇలా ఏదో ఒక పాలసీ ఉన్నవారి జాతీయ సగటు 65 శాతం. దీంతో పోలిస్తే భాగ్యనగర వాసులదే పైచేయి!!. అయితే, అతి తక్కువ ప్రీమియంతో జీవితానికి రక్షణనిచ్చే టర్మ్ ప్లాన్స్ విషయానికి వస్తే ప్రతి నలుగురిలో ఒక్కరు మాత్రమే ఈ పాలసీ తీసుకున్నారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, కాంటార్ ఐఎంఆర్బీ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టెక్ నగరం బెంగళూరుతో పోలిస్తే హైదరాబాదీలకే రకరకాల జీవిత బీమా పాలసీల (టర్మ్ ప్లాన్, మార్కెట్ ఆధారిత ప్లాన్ మొదలైనవి) గురించి ఎక్కువగా అవగాహన ఉన్నట్లు తాము నిర్వహించిన సర్వేలో వెల్లడయిందని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ ఎండీ వి.విశ్వానంద్ చెప్పారు. వ్యక్తులు తమకు ఎంత వరకు భద్రత ఉందని భావిస్తున్నారు? భవిష్యత్ అనిశ్చితిని ఎదుర్కొనేందుకు మానసికంగా ఎంత మేర సన్నద్ధంగా ఉన్నారు? అనే అంశాల ప్రాతిపదికన బీమా భద్రతపై భారతీయుల వైఖరి (0–100 స్కేల్) నివేదికను తయారు చేసినట్లు ఆయన తెలియజేశారు. అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థిక సన్నద్ధత, జీవిత.. టర్మ్ బీమాలపై అవగాహన, పాలసీల కొనుగోలుకు కారణాలు అనే మూడు అంశాల ఆధారంగా పాయింట్లను లెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం 100కి హైదరాబాద్ 44 పాయింట్లు సాధించిందని, జాతీయ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో నమోదైన 35 పాయింట్ల సగటుకన్నా ఇది అధికమని విశ్వానంద్ చెప్పారు. అయితే, హైదరాబాదీల్లో టర్మ్ ఇన్సూరెన్స్ కేవలం 23% మందికే ఉందని, భవిష్యత్‌లో ఆకస్మిక మరణం, తీవ్ర అనారోగ్యాల బారిన పడటం వంటి వాటిని 44% మంది ఆర్థికంగా ఎదుర్కొనే పరిస్థితుల్లో లేరని చెప్పారాయన. ఉత్తరాది, తూర్పు, పశ్చిమ రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోనే ఎక్కువగా జీవిత బీమా, టర్మ్ పాలసీదారులు ఉన్నట్లు సర్వేలో తేలింది. దేశానికి ఐటీ హబ్‌గా పేరొందినప్పటికీ దక్షిణాదిలో 82% జనాభా ఇప్పటికీ ఏజెంట్ల నుంచే టర్మ్ పాలసీలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. 15% మంది బ్యాంకుల నుంచి, 3% మంది మాత్రమే ఆన్లైన్ మాధ్యమం ద్వారా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. -
పొడిగించిన పీపీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రాయల్స్ ఎలా?
నేను 2000 సంవత్సరంలో ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్) ఖాతా ప్రారంభించాను. అప్పటి నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని జమ చేస్తూ వచ్చాను. ఇటీవలే మెచ్యూరిటీ కావడంతో ఈ ఖాతాను మరో ఐదేళ్ల పాటు పొడిగించాను. ఇప్పుడు నాకు డబ్బులు అవసరమయ్యాయి. పొడిగించిన పీపీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రాయల్స్‌కు సంబంధించిన నిబంధనలు ఏవిధంగా ఉన్నాయి? తెలియజేయండి. - హరినాధ్, వరంగల్ ప్రజా భవిష్య నిధి(పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్-పీపీఎఫ్) ఖాతా మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. ఈ మెచ్యూరిటీ కాలం పూర్తయిన తర్వాత ఐదేళ్లపాటు పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ ఐదేళ్ల కాలంలో ఈ ఖాతాలో డబ్బులు ఇన్వెస్ట్ చేయకపోయినా ఈ ఖాతాను కొనసాగించవచ్చు. పొడిగించిన తర్వాత కూడా మీరు ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఖాతా బ్యాలెన్స్‌లో 60 శాతం మొత్తాన్ని మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. పీపీఎఫ్ ఖాతాను పొడిగించిన మొదటి ఏడాది నుంచి ఈ సొమ్ములను ఒకటి లేదా ఒకటికి మించిన ఇన్స్టాల్మెంట్స్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఏడాదికి ఒక్క ఇన్‌స్టాల్‌మెంట్‌ను మాత్రమే అనుమతిస్తారు. ఇక ఇన్వెస్ట్చేయకుండానే ఈ ఖాతాను పొడిగించిన పక్షంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా మీ ఖాతాలో ఉన్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో కూడా ఏడాదికి ఒక్క విత్డ్రాయల్నే అనుమతిస్తారు. మీ ఖాతా నుంచి పూర్తిగా మీ సొమ్ములను ఉపసంహరించుకునేదాకా మిగిలిన బ్యాలెన్స్‌పై మీకు వడ్డీ వస్తుంది. నేను మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఫరెవర్ యంగ్ పెన్షన్ పాలసీ తీసుకున్నాను. ఈ పాలసీ తీసుకొని రెండున్నరేళ్లయింది. ఇప్పటిదాకా రూ.1,25,000 ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేశాను. కానీ ఈ పాలసీ పనితీరు సరిగ్గా లేదు. దీనిని సరెండర్ చేయమంటారా? కొనసాగించమంటారా? - శోభన్, హైదరాబాద్ మ్యాక్స్ లైఫ్ ఫరెవర్ యంగ్ పెన్షన్ ప్లాన్ అనేది బీమా కవర్‌తో కూడిన రిటైర్మెంట్ ప్లాన్. మీరు తీసుకున్నది సరైన ఇన్వెస్ట్మెంట్ పథకం కానప్పుడు. మీకు నష్టాలు వచ్చినా సరే, ఆ పథకం నుంచి వైదొలగడం సరైన నిర్ణయమే. బీమా కవర్‌తో కూడిన ఎలాంటి రిటైర్మెంట్ ప్లాన్ అయినా అది సరైన పథకం కాదు. అలాంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమూ కాదు. ఇలాంటి పాలసీల్లో వ్యయాలు అధికంగా ఉంటాయి. పారదర్శకత ఉండదు. ఈ తరహా పాలసీలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే రాబడులను ఇవ్వలేవు. ఈ పాలసీతో పోల్చుకుంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ గ్యారంటీడ్ మొత్తాలను ఇస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ పాలసీ సరెండర్‌కు సంబంధించిన విషయాలను చూస్తే, ఫండ్ విలువలో మూడో వంతును ఏకమొత్తంగా మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదా మొత్తం ఫండ్ విలువతో యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్‌కు లాక్-ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలుగా ఉంది. మీరు ఐదేళ్లకు ముందే ఈ పాలసీని సరెండర్ చేసినప్పటికీ, మీరు పాలసీ తీసుకున్న ఐదేళ్ల వరకూ ఈ పాలసీ లాక్ అయి ఉంటుంది. మీ రిటైర్మెంట్ జీవితంలో కావలసిన ఆదాయం కోసం దీర్ఘకాల పెట్టుబడి వ్యూహం అవసరం. మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కొత్త అయితే, మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ట్రాక్ రికార్డ్‌ను బట్టి మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకొని, ప్రతి నెలా కొంత మొత్తం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయండి. మీకు ఇప్పటికే స్టాక్ మార్కెట్‌తో పరిచయం ఉండి ఉన్నట్లయితే ఏదైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకొని సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయండి. బ్యాలెన్స్డ్ ఫండ్ అయినా, ఈక్విటీ ఫండ్ అయినా సరే, సిప్ విధానాన్ని ఎంచుకోండి. ఇలా చేస్తే, మీ కొనుగోళ్లు యావరేజ్ అయి. మీకు మంచి రాబడులు వస్తాయి. మీరు మరో మూడేళ్లలో రిటైరవుతారనగా, ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని ఉపసంహరించుకొని పెన్షన్ కోసం క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయండి. నా వయస్సు 56 సంవత్సరాలు. మరో నాలుగేళ్లలో రిటైరవుతున్నాను. 20 శాతం ఆదాయపు పన్ను ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్నాను. ఏడాదికి రూ.50,000 చొప్పున మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలను. మరో ఆరేళ్ల పాటు నాకు ఈ డబ్బులు అవసరం లేదు. నాకు పన్ను ప్రయోజనాలతో పాటు మంచి రాబడులు కూడా కావాలి. ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలో సూచించండి? - గంగాధర్, విజయవాడ మీరు ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. పన్ను ప్రయోజనాలు కూడా కావాలనుకుంటున్నారు. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మంచి రేటింగ్ ఉన్న ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. పన్ను ప్రయోజనాలతో పాటు మంచి రాబడులు కూడా వస్తాయి. ఈ ఫండ్స్ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. పన్ను ఆదా చేసే ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో తక్కువ లాక్-ఇన్ పీరియడ్ (3 సంవత్సరాలు) ఇన్వెస్ట్మెంట్ సాధనం ఇదే. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
క్లెయిమ్ తిరస్కరించకుండా జాగ్రత్తలు ఇవీ!
వి.విశ్వానంద్: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కుటుంబ పెద్దకి జరగకూడనిదేదైనా జరిగినా.. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులపాలు కాకుండా చూసేందుకు తీసుకునేదే జీవిత బీమా పాలసీ. అయితే, కొన్ని సందర్భాల్లో క్లెయిములు తిరస్కరణకు గురవుతుంటాయి. ఇలాంటప్పుడు... అసలు పాలసీ లక్ష్యమే దెబ్బతింటుంది. బీమా కంపెనీలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల క్లెయిమ్‌లను తిరస్కరించేందుకు చట్టబద్ధమైన కారణాలే ఉంటాయి. వీటిని గురించి కొంత అవగాహన ఉన్నట్లయితే, క్లెయిమ్‌లు తిరస్కరణకు గురి కాకుండా జాగ్రత్తపడే వీలుంటుంది. ప్రపోజల్ ఫారంలో వివరాలన్నీ ఉండాలి.. చాలామటుకు పాలసీదారులు తమ పాలసీ దరఖాస్తును సొంతంగా నింపకుండా.. బీమా ఏజెంట్లకే వదిలేస్తుంటారు. ఇలా చేయడం సరికాదు. ఎందుకంటే సేల్స్ టార్గెట్లను సాధించాలన్న తాపత్రయంతో వారు కొన్ని సందర్భాల్లో సరైన సమాచారాన్ని దరఖాస్తుల్లో పొందుపర్చకపోవచ్చు. లేదా వారికి పాలసీదారు ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు దరఖాస్తులో అరకొర సమాచారం మాత్రమే పొందుపర్చడం జరుగుతుంది. ఈ వివరాల ఆధారంగానే బీమా కంపెనీ పాలసీ జారీ చేస్తుంది. ఒకవేళ బీమా కంపెనీ మీరు దరఖాస్తులో పూర్తి వివరాలు పొందుపర్చలేదని భావించినా, ఏవైనా వివరాలు సరిగ్గా ఇవ్వలేదని భావించినా ఆ కారణం మూలంగానైనా క్లెయిమును తిరస్కరించే అవకాశాలున్నాయి. కాబట్టి, వృథా శ్రమ అని భావించకుండా ఎవరి దరఖాస్తును వారే పూర్తి చేయడం మంచిది. పాలసీ రెన్యువల్ మర్చిపోవద్దు.. యాక్టివ్‌గా ఉన్న పాలసీల క్లెయిములను మాత్రమే బీమా సంస్థలు సెటిల్ చేస్తాయి. కనుక ప్రీమియంను గడువులోగా కట్టేయాలి. లేకపోతే, ప్రీమియంలు చెల్లించకపోవడం వల్ల పాలసీ ల్యాప్స్ అయిపోయిందన్న కారణంతోనూ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల సమయంలోగా ప్రీమియం కట్టలేకపోతే.. గ్రేస్ పీరియడ్లోనైనా కట్టేసేందుకు ప్రయత్నించాలి. సమాచారాన్ని దాచిపెట్టొద్దు.. మీరు దరఖాస్తులో పొందుపర్చే ప్రతీ వివరమూ కీలకమే. దీని ఆధారంగానే బీమా సంస్థలు ప్రీమియంను నిర్ణయిస్తుంటాయి. మీ వయస్సు, వృత్తి, స్మోకింగ్.. డ్రింకింగ్ అలవాట్లు, అప్పటికే ఉన్న రుగ్మతలు, కుటుంబ ఆరోగ్య వివరాలు, ఇతరత్రా ఉన్న పాలసీల సమాచారం మొదలైనవన్నీ కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా ఏ వివరాన్నీ కూడా కప్పిపుచ్చకుండా అన్నీ అందజేయండి. లేదా క్లెయిము రిజెక్ట్ కావడానికి ఇవి కూడా కారణాలు కావొచ్చు. అలాగే అనారోగ్య సమస్యల విషయానికొస్తే.. పాలసీ కింద ఏయే వ్యాధులకు కవరేజీ ఉంటుందో క్షుణ్నంగా తెలుసుకోవాలి. నామినేషన్ వివరాలు అప్డేట్గా ఉండాలి.. సాధారణంగా వివాహం జరగడానికి ముందు తీసుకునే పాలసీల్లో తల్లిదండ్రులనే నామినీలుగా దరఖాస్తుల్లో పేర్కొంటూ ఉంటాం. అయితే వివాహం జరిగిన తర్వాత జీవిత భాగస్వామి పేరును కూడా చేర్చడం ఉత్తమం. ఇలాంటి మార్పులు, చేర్పులు ఏవైనా ఉంటే బీమా కంపెనీకి తప్పనిసరిగా తెలియజేసి నామినీ వివరాలను అప్డేట్ చేస్తే.. తదుపరి చెల్లింపుల్లో సమస్యలు ఉండవు. ఇక, చివరిగా .. క్లెయిమ్‌ను ఫైల్ చేయడంలో జాప్యం కూడదు. ఇది సందేహాలకు దారితీయొచ్చు.. క్లెయిమ్ చెల్లింపు ప్రక్రియ జాప్యం కావొచ్చు. సాధారణంగా బీమా కంపెనీలు క్లెయిమ్స్ విషయంలో సహాయం చేసేందుకు ప్రత్యేక అధికారి సర్వీసులు అందిస్తుంటాయి. మాట్లాడటానికి కష్టతరమైన అంశమే అయినప్పటికీ.. పాలసీదారు తాను తీసుకున్న పాలసీల గురించి, ఏజెంటు కాంటాక్టు నంబరు, జీవిత బీమా సంస్థ గురించి, క్లెయిముకు అవసరమైన పత్రాల గురించి నామినీలకు అన్ని వివరాలు తెలియజేయాలి. బంగారం... నెల గరిష్టం విదేశీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతుండటం, పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెరగటం వంటి తదితర అంశాల వల్ల దేశంలో బం గారం ధరలు నెల గరిష్ట స్థాయికి చేరాయి. ముంబైలో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత బంగారం ధర అంతక్రితం వారం ముగింపు ధర రూ.26,490తో పోలిస్తే రూ.265 పెరిగి రూ.26,755 వద్ద ముగిసింది. అలాగే 99.5 స్వచ్ఛత బంగారం ధర కూడా అంతక్రితం వారం ముగింపు ధర రూ.26,340తో పోలిస్తే రూ.265 పెరిగి రూ.26,605 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఒకానొక సందర్భంలో నెల గరిష్ట స్థాయి అయిన 1,156 డాలర్లకు చేరింది. కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరు ఆధారంగా ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ ప్రకటనతో 1,145 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇది అంతక్రితం వారంతో పోలిస్తే 8 డాలర్లు అధికం. -
టెర్మ్ పాలసీ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి
నా వయసు 46 సంవత్సరాలు. 2005వ సంవత్సరం జూలై నుంచి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఏడాదికి రూ.15,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నాను. 20 ఏళ్ల పాటు ఇలా పెట్టుబడులు పెట్టాలని మొదట్లో అనుకున్నాను. అయితే ఈ పాలసీ ఏమంత మంచిది కాదని మిత్రులంటున్నారు. ఈ పాలసీ సరెండర్ వాల్యూ రూ. 1,35,000. ఈ పాలసీని రద్దు చేసుకొని మరో ఉత్తమమైన పాలసీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి? -ప్రకాష్, నందిగామ మీరు పాలసీ పేరును స్పష్టంగా పేర్కొనలేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి మీ పాలసీ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యూలిప్) అయిండవచ్చు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసిన పాలసీ యూలిప్ అయితే మీరు మీ పాలసీని సరెండర్ చేయవచ్చు. బీమా, ఇన్వెస్ట్మెంట్ల కలగలుపు పథకంగా యూలిప్ను పరిగణించవచ్చు. కానీ బీమాకు ప్రత్యేకంగా ఒకటి, ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా మరొకటి తీసుకోవడమే సరైన విధానం. మీరు కొంచెం రిస్క్‌ను భరించగలిగితే, మా వెబ్‌సైట్‌లోని ఫండ్ సెలెక్టర్ టూల్ ద్వారా ఫైవ్-స్టార్ రేటెడ్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఒకేసారి ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయకుండా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. మీరు కనుక మీ పాలసీని సరెండర్ చేస్తే బీమా రక్షణ కోల్పోతారు. అందుకని మీ కుటుంబానికి పూర్తి ఆర్థిక భరోసానిచ్చే టెర్మ్ పాలసీని తీసుకోండి. మీరే కాదు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టెర్మ్ పాలసీని తీసుకోవాలి. అవి అధిక కవరేజ్‌ని ఇస్తాయి. ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఎస్బీఐ ఎమర్జింగ్ బిజినెసెస్‌లో ప్రతి నెలా రూ.1,000 చొప్పున ఏడు నెలల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. కానీ నాకు భారీగా నష్టాలొస్తున్నాయి. ఈ ఫండ్‌లోనే పెట్టుబడులు కొనసాగించమంటారా? వేరే ఫండ్‌లోకి మళ్లించమంటారా? తగిన సలహా ఇవ్వండి? - ఆనంద్, సికింద్రాబాద్ మిడ్ అండ్ స్మాల్‌క్యాప్ కేటగిరీలోని ఎస్బీఐ ఎమర్జింగ్ బిజినెసెస్ ఫండ్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది. ఈ కేటగిరీ ఫండ్స్‌లో పెట్టుబడులు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతాయి. చాలాసార్లు వాటి విలువ బాగా క్షీణిస్తూ ఉంటుంది కూడా. కానీ దీర్ఘకాలంలో మాత్రం ప్రయోజనం ఉంటుంది. ఈ కేటగిరీ ఫండ్స్ కనీస పెట్టుబడి కాలం ఐదేళ్లు, అంతకు మించి ఉండాలి. ఈ ఫండ్ అసెట్స్ ఏడాది కాలంలో రెట్టింపయ్యాయన్న విషయాన్ని గమనించాలి. గత కొన్ని నెలలుగా ఈ ఫండ్ ప్రతికూల ఫలితాలనిస్తోంది. కానీ ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు ఇన్వెస్ట్ చేసి ఏడు నెలలే అయింది. ఒక ఈక్విటీ ఫండ్ పనితీరును అంచనా వేయడానికి ఇది చాలా తక్కువ సమయం. ఈ ఏడు నెలలుగా మీకు వచ్చిన నష్టాలకు మీరు ఆందోళన చెందుతున్నట్లయితే, మీరు ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడమే ఉత్తమం. స్వల్పకాలిక ఒడిదుడుకులను తట్టుకోగలిగి, మీరు ఇన్వెస్ట్ చేసే సొమ్ములు మీకు తక్షణం అవసరం లేని పక్షంలో ఈ ఫండ్‌లో కనీసం ఐదేళ్లు పెట్టుబడులు పెట్టండి. లేదంటే డెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టుబడులు పెట్టడం మంచిది. భారత మార్కెట్లలో ఎఫ్ఐఐలు జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. అమెరికా నుంచి నిధుల ప్రవాహం పెరిగిపోతోంది. ఈ నేపథ్యం లో మ్యూచువల్ ఫండ్స్ లాభపడతాయా? ఇన్వెస్టర్లు అధిక ఎన్ఏవీ పొందగలరా? - పద్మజ, గుంటూరు అక్టోబర్‌లో ఎఫ్ఐఐలు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఎఫ్ఐఐలు పెట్టుబడులు పెడితే మార్కెట్లు పెరుగుతాయి. మార్కెట్లు పెరిగితే ఇన్వెస్టర్లకు ప్రయోజనం కలుగుతుంది. మ్యూచువల్ ఫండ్ల ఎన్ఏవీలు కూడా పెరుగుతాయి. అయితే ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం ఎంత కాలం కొనసాగుతుందో చెప్పలేం. ఎఫ్ఐఐల పెట్టుబడులతోనే మన మార్కెట్లు పెరుగుతున్నాయి. కానీ నాణ్యతపరమైన మెరుగుదల మాత్రం కాదు. ఎఫ్ఐఐల పెట్టుబడుల వల్లే మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీలు కూడా పెరుగుతున్నాయనేది కాదనలేని సత్యం. భారత్‌లోని ఇన్వెస్టర్లలో అధిక భాగం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయనంతవరకూ, మన మార్కెట్లు ఎఫ్ఐఐల మీదనే ఆధారపడతాయి. వాళ్లు పెట్టుబడులు పెడితే పెరుగుతాయి. వారు నిధులు ఉపసంహరించుకుంటే, మార్కెట్లు కుదేలవుతాయి.