క్లెయిమ్ తిరస్కరించకుండా జాగ్రత్తలు ఇవీ!
వి.విశ్వానంద్: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్
కుటుంబ పెద్దకి జరగకూడనిదేదైనా జరిగినా.. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులపాలు కాకుండా చూసేందుకు తీసుకునేదే జీవిత బీమా పాలసీ. అయితే, కొన్ని సందర్భాల్లో క్లెయిములు తిరస్కరణకు గురవుతుంటాయి. ఇలాంటప్పుడు... అసలు పాలసీ లక్ష్యమే దెబ్బతింటుంది. బీమా కంపెనీలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల క్లెయిమ్‌లను తిరస్కరించేందుకు చట్టబద్ధమైన కారణాలే ఉంటాయి. వీటిని గురించి కొంత అవగాహన ఉన్నట్లయితే, క్లెయిమ్‌లు తిరస్కరణకు గురి కాకుండా జాగ్రత్తపడే వీలుంటుంది.
ప్రపోజల్ ఫారంలో వివరాలన్నీ ఉండాలి..
చాలామటుకు పాలసీదారులు తమ పాలసీ దరఖాస్తును సొంతంగా నింపకుండా.. బీమా ఏజెంట్లకే వదిలేస్తుంటారు. ఇలా చేయడం సరికాదు. ఎందుకంటే సేల్స్ టార్గెట్‌లను సాధించాలన్న తాపత్రయంతో వారు కొన్ని సందర్భాల్లో సరైన సమాచారాన్ని దరఖాస్తుల్లో పొందుపర్చకపోవచ్చు. లేదా వారికి పాలసీదారు ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి ఉండకపోవచ్చు.
ఇలాంటప్పుడు దరఖాస్తులో అరకొర సమాచారం మాత్రమే పొందుపర్చడం జరుగుతుంది. ఈ వివరాల ఆధారంగానే బీమా కంపెనీ పాలసీ జారీ చేస్తుంది. ఒకవేళ బీమా కంపెనీ మీరు దరఖాస్తులో పూర్తి వివరాలు పొందుపర్చలేదని భావించినా, ఏవైనా వివరాలు సరిగ్గా ఇవ్వలేదని భావించినా ఆ కారణం మూలంగానైనా క్లెయిమును తిరస్కరించే అవకాశాలున్నాయి. కాబట్టి, వృథా శ్రమ అని భావించకుండా ఎవరి దరఖాస్తును వారే పూర్తి చేయడం మంచిది.
పాలసీ రెన్యువల్ మర్చిపోవద్దు..
యాక్టివ్‌గా ఉన్న పాలసీల క్లెయిములను మాత్రమే బీమా సంస్థలు సెటిల్ చేస్తాయి. కనుక ప్రీమియంను గడువులోగా కట్టేయాలి. లేకపోతే, ప్రీమియంలు చెల్లించకపోవడం వల్ల పాలసీ ల్యాప్స్ అయిపోయిందన్న కారణంతోనూ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల సమయంలోగా ప్రీమియం కట్టలేకపోతే.. గ్రేస్ పీరియడ్‌లోనైనా కట్టేసేందుకు ప్రయత్నించాలి.
సమాచారాన్ని దాచిపెట్టొద్దు..
మీరు దరఖాస్తులో పొందుపర్చే ప్రతీ వివరమూ కీలకమే. దీని ఆధారంగానే బీమా సంస్థలు ప్రీమియంను నిర్ణయిస్తుంటాయి. మీ వయస్సు, వృత్తి, స్మోకింగ్.. డ్రింకింగ్ అలవాట్లు, అప్పటికే ఉన్న రుగ్మతలు, కుటుంబ ఆరోగ్య వివరాలు, ఇతరత్రా ఉన్న పాలసీల సమాచారం మొదలైనవన్నీ కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా ఏ వివరాన్నీ కూడా కప్పిపుచ్చకుండా అన్నీ అందజేయండి. లేదా క్లెయిము రిజెక్ట్ కావడానికి ఇవి కూడా కారణాలు కావొచ్చు. అలాగే అనారోగ్య సమస్యల విషయానికొస్తే.. పాలసీ కింద ఏయే వ్యాధులకు కవరేజీ ఉంటుందో క్షుణ్నంగా తెలుసుకోవాలి.
నామినేషన్ వివరాలు అప్‌డేట్‌గా ఉండాలి..
సాధారణంగా వివాహం జరగడానికి ముందు తీసుకునే పాలసీల్లో తల్లిదండ్రులనే నామినీలుగా దరఖాస్తుల్లో పేర్కొంటూ ఉంటాం. అయితే వివాహం జరిగిన తర్వాత జీవిత భాగస్వామి పేరును కూడా చేర్చడం ఉత్తమం. ఇలాంటి మార్పులు, చేర్పులు ఏవైనా ఉంటే బీమా కంపెనీకి తప్పనిసరిగా తెలియజేసి నామినీ వివరాలను అప్‌డేట్ చేస్తే.. తదుపరి చెల్లింపుల్లో సమస్యలు ఉండవు.
ఇక, చివరిగా .. క్లెయిమ్‌ను ఫైల్ చేయడంలో జాప్యం కూడదు. ఇది సందేహాలకు దారితీయొచ్చు.. క్లెయిమ్ చెల్లింపు ప్రక్రియ జాప్యం కావొచ్చు. సాధారణంగా బీమా కంపెనీలు క్లెయిమ్స్ విషయంలో సహాయం చేసేందుకు ప్రత్యేక అధికారి సర్వీసులు అందిస్తుంటాయి. మాట్లాడటానికి కష్టతరమైన అంశమే అయినప్పటికీ.. పాలసీదారు తాను తీసుకున్న పాలసీల గురించి, ఏజెంటు కాంటాక్టు నంబరు, జీవిత బీమా సంస్థ గురించి, క్లెయిముకు అవసరమైన పత్రాల గురించి నామినీలకు అన్ని వివరాలు తెలియజేయాలి.
బంగారం... నెల గరిష్టం
విదేశీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతుండటం, పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెరగటం వంటి తదితర అంశాల వల్ల దేశంలో బం గారం ధరలు నెల గరిష్ట స్థాయికి చేరాయి. ముంబైలో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత బంగారం ధర అంతక్రితం వారం ముగింపు ధర రూ.26,490తో పోలిస్తే రూ.265 పెరిగి రూ.26,755 వద్ద ముగిసింది.
అలాగే 99.5 స్వచ్ఛత బంగారం ధర కూడా అంతక్రితం వారం ముగింపు ధర రూ.26,340తో పోలిస్తే రూ.265 పెరిగి రూ.26,605 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర ఒకానొక సందర్భంలో నెల గరిష్ట స్థాయి అయిన 1,156 డాలర్లకు చేరింది. కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరు ఆధారంగా ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ ప్రకటనతో 1,145 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇది అంతక్రితం వారంతో పోలిస్తే 8 డాలర్లు అధికం.