క్లెయిమ్‌కు దారిదీ! | A New Online Guide For Filing An Auto Insurance Claim | Sakshi
Sakshi News home page

క్లెయిమ్‌కు దారిదీ!

Published Sun, Mar 8 2015 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

క్లెయిమ్‌కు దారిదీ!

క్లెయిమ్‌కు దారిదీ!

బీమా కంపెనీలందించే సేవల్లో అన్నింటికన్నా ముఖ్యమైంది క్లెయిమ్. అన్ని కాగితాలతో క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తే కంపెనీలు ఏడు రోజుల్లోపే వీటిని పరిష్కరిస్తాయి. కానీ సరైన సమాచారం ఇవ్వకుండా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తే మటుకు బీమా కంపెనీల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. అసలు క్లెయిమ్ చెయ్యడానికి ఏవి అవసరమో, ఏ పత్రాలు కావాల్సి వస్తాయో ఓసారి చూద్దాం.
 


హెల్త్ ఇన్సూరెన్స్..
ఇందులో 2 రకాల క్లెయిమ్‌లుంటాయి. ఒకటి క్యాష్‌లెస్. మరోటి రీ-ఇంబర్స్‌మెంట్. క్యాష్‌లెస్ సౌకర్యం ఉంటే బీమా కంపెనీ సూచించిన ఆసుపత్రిలో చేరి పాలసీతో పాటు మీకిచ్చిన కార్డును ఇస్తే సరిపోతుంది. మిగిలినదంతా వారే చూసుకుంటారు. అదే రీ-ఇంబర్స్‌మెంట్ అయితే కనుక బిల్లులు మొత్తం జాగ్రత్త చేసి వాటిని క్లెయిమ్ దరఖాస్తుతో పాటు జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. బీమా కంపెనీ వీటిని పరిశీలించిన తర్వాత
 క్లెయిమ్‌ను సెటిల్ చేస్తుంది.
 
హోమ్ ఇన్సూరెన్స్..
ఇతర క్లెయిమ్‌లతో పోల్చితే హోమ్ ఇన్సూరెన్స్ విషయంలో కొద్దిగా హోం వర్క్ ఎక్కువ చేయాలి. వరదలు, తుపాను, అగ్ని ప్రమాదం వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టం వివరాలను పూర్తిగా వాటి వాస్తవ విలువలతో తెలియజేయాల్సి ఉంటుంది. ఇతర సంఘటనలో జరిగిన నష్టాల్లో కూడా నష్టపోయిన ఆస్తి విలువలను (అసలు) పేర్కొంటూ క్లెయిమ్ మొత్తాన్ని కోరాల్సి ఉంటుంది. క్లెయిమ్ చేసిన తర్వాత సర్వేయర్ వచ్చి నష్టం విలువ అంచనా వేస్తాడు. అదే దొంగతనం, దోపిడీ వంటి విషయాల్లో అయితే పై వివరాలతో పాటు ఎఫ్‌ఐఆర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
 
ఆనంద్‌కి దూరదృష్టి ఎక్కువే. తను ఉన్నా.. లేకున్నా తన కుటుంబం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ పడకూడదన్న ఉద్దేశంతో అన్ని చర్యలూ తీసుకున్నాడు. ఇందులో భాగంగానే తగిన బీమా పాలసీ కూడా తీసుకున్నాడు. కానీ, తను అమితంగా ప్రేమించే జీవిత భాగస్వామికి ఎలాంటి కష్టాలూ రాకూడదన్న ఉద్దేశంతో పాలసీలు తీసుకున్న ఆనంద్.. ఆవిషయాన్ని మాత్రం భార్యకు చెప్పలేదు. అప్పుడప్పుడు ఆయన చెప్పబోతే.. అలాంటి అపశకునం మాటలెందుకంటూ ఆయన భార్య పెద్ద రాద్ధాంతమే చేసేది. దీంతో ఎప్పుడూ వారిద్దరూ తమ పాలసీలు, క్లెయిమ్‌ల గురించి చర్చించుకోవటమే కుదరలేదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రమాదాలు మనకు తెలిసిరావు.

ఒక రోజు ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆనంద్ అక్కడికక్కడే మరణించాడు. అప్పుడు మొదలయ్యాయి ఆయన భార్య కష్టాలు. అసలు ఆనంద్ ఏ పాలసీలు తీసుకున్నాడో ఆమెకు తెలియదు. ఆయన ఎక్కడెక్కడ డిపాజిట్లు చేశాడో కూడా తెలియదు. ఇంట్లో ఉన్న పత్రాల ఆధారంగా కొన్ని పాలసీల గురించి తెలుసుకుంది. వాటిని ఎలా క్లెయిమ్ చేయాలన్న అవగాహన కూడా ఆమెకు లేదు. చివరికి బంధువుల సహాయంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటూనే క్లెయిమ్‌లు పూర్తి చేసింది. ఇంకా విచిత్రమేమిటంటే ఆనంద్ మరణించిన ఆరు నెలలకు ఓ బీమా కంపెనీ నంచి ప్రీమియం కట్టాలంటూ లేఖ వచ్చింది. దాంతో ఆ పాలసీ కూడా ఉన్నట్లు ఆయన భార్యకు తెలిసి.. ఆ క్లెయిమ్ కూడా పూర్తి చేసింది.

ఆనంద్ కట్టిన పాలసీలన్నింటినీ ఆయన భార్య క్లెయిమ్ చేసిందా. అన్న ప్రశ్నకు నిజామానికి ఆమె దగ్గర సమాధానమే లేదు. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కుటుంబీకులతో చర్చించకపోతే అసలు లక్ష్యం నెరవేరటం కష్టం. పెపైచ్చు క్లెయిమ్‌పై కూడా అవగాహన అవసరం. లేదంటే సమయం, డబ్బు వృథా కాకతప్పదు. జీవిత బీమాతో పాటు, ఆటో, హెల్త్, ట్రావెల్, ఇన్సూరెన్స్‌ల విషయంలో క్లెయిమ్ ఎలా చేయాలన్న విషయమై అవగాహన పెంచేందుకు ఈ ప్రాఫిట్ కథనం..
 
మోటార్ ఇన్సూరెన్స్..
ఇందులో యాక్సిడెంట్ క్లెయిమ్, ఓన్ డ్యామేజీ, దొంగతనం వంటి రకరకాల క్లెయిమ్‌లుంటాయి. ముందుగా యాక్సిడెంటల్ క్లెయిమ్ గురించి చూస్తే. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి.
- ప్రమాదానికి మరో వాహనం కారణమైతే వెంటనే ఆ వాహనం నంబర్ రాసుకోవాలి.
- అలాగే ఆ ప్రమాదానికి ఎవరైన ప్రత్యక్ష సాక్షులుంటే వారి వివరాలు, చిరునామా లేదా ఫోన్‌నంబర్లు సేకరించి పెట్టుకోవాలి.
- ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయించాలి.
- ఒక వేళ మీరే ఎదుటి వాహనాన్ని ఢీకొన్నా.. థర్డ్ పార్టీ ఆస్తికి నష్టం జరిగితే పారిపోకుండా సమీపంలోని పోలీస్ అధికారులకు సమాచారం అందించండి. ఢీకొట్టి పారిపోవటాన్ని మన చట్టాలు అతిపెద్ద నేరంగా పరిగణిస్తాయి.
- ప్రమాదం తర్వాత మీ వాహనం కదల్లేని స్థితిలో ఉంటే బీమా కంపెనీకి  ఆ సమాచారం అందించి దగ్గర్లోని గ్యారేజీకి తీసుకెళ్లండి.
- ప్రమాదం జరిగిన వెంటనే తొలుత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అక్కడ ఎఫ్‌ఐఆర్ కాపీ తీసుకున్నాక క్లెయిమ్ కోసం బీమా కంపెనీని సంప్రదించాలి. నేరుగా లేదా ఏజెంట్ ద్వారా లేదా టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా క్లెయిమ్‌ను రిజిస్టర్ చేయవచ్చు.
 
కావాల్సిన పత్రాలు..
- సంతకం చేసిన క్లెయిమ్ దరఖాస్తు
- పాలసీ డాక్యుమెంట్లు (మొదటి రెండు పేజీలు)
- వాహనం ఆర్సీ కాపీ
- మీ డ్రైవింగ్ లెసైన్స్
- రిపేరు వ్యయానికి సంబంధించి ఒరిజినల్ బిల్


ఈ కాగితాలన్నీ జతపరిచి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తే చాలు. థర్డ్‌పార్టీ, దొంగతనం, యాక్సిడెంట్ వల్ల జరిగిన డ్యామేజీలకే ఎఫ్‌ఐఆర్ కావాల్సి ఉంటుంది. క్లెయిమ్ దరఖాస్తు చేసిన 24 గంటల్లో సర్వేయర్ వచ్చి నష్టాన్ని అంచనా వేసి క్లెయిమ్ మొత్తాన్ని నిర్ధారిస్తాడు.ఇప్పుడు చాలా కంపెనీలు రిపేర్లకు క్యాష్‌లెస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అంటే బీమా కంపెనీ ప్యానెల్‌లో ఉన్న గ్యారేజీల్లో ముందు డబ్బులివ్వకుండానే రిపేరు చేయించుకోవచ్చు. సర్వేయర్ గ్యారేజీకొచ్చి నష్టాన్ని చూసి క్లెయిమ్‌ను అంచనా వేస్తాడు. ఆ మొత్తాన్ని గ్యారేజీకి బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఇంకా ఎక్కువైతే ఆ మొత్తాన్ని మీరే చెల్లించాలి.
 
ట్రావెల్ ఇన్సూరెన్స్..
ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మనం విదేశాలకెళ్లినప్పుడు ప్రయాణంలో బ్యాగేజీ పోవడమో, దెబ్బతినటమో జరిగినప్పుడు ప్రయాణం ఆలస్యం వల్ల నష్టం జరిగినా విమానం రద్దు కావటమో మరోటి జరిగి ప్రయాణం రద్దయి నష్టపోతే.. పాస్‌పోర్ట్ పోవటం, ప్రమాదం, ఆసుపత్రి పాలు కావటం.. తదితరాలు జరిగితే బీమా ర క్షణ ఉంటుంది. ప్రయాణించేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఏ కంపెనీది తీసుకున్నారో ఆ కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్, పాలసీ నంబర్ దగ్గర పెట్టుకోవటం మర్చిపోవద్దు. మీరు ఏ దేశంలో ఎక్కడ ఉన్నా క్లెయిమ్ సంభవించినప్పుడు ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే కంపెనీ దగ్గర్లోని క్యాష్‌లెస్ సౌకర్యం ఉన్న ఆసుపత్రి వివరాలతో పాటు అక్కడెలా క్లెయిమ్ చెయ్యాలన్న విషయంలో కూడా మీకు సహాయం చేస్తుంది.
 
జీవిత బీమా..
జీవిత బీమాలో క్లెయిమ్ రెండు రకాలు. ఒకటి మెచ్యూరిటీ క్లెయిమ్ కాగా, రెండోది డెత్ క్లెయిమ్. మెచ్యూరిటీ క్లెయిమంటే పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత పాలసీదారు చేతికి వచ్చే మొత్తం. దీనికి మనం చేయాల్సింది ఏమీ ఉండదు. పాలసీ కాలపరిమితి ముగియగానే చాలా బీమా కంపెనీలు నేరుగా మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తాయి. లేదంటే మీ పేరు మీద చెక్కును మీ ఇంటికే పంపిస్తాయి. దీనికన్నా నెల రోజుల ముందు మీ పాలసీ గడువు పూర్తి కావ స్తోందని.. మెచ్యూరిటీ క్లెయిమ్ అందబోతోందని చెబుతూ ఒక పత్రాన్ని పంపిస్తాయి. దానిపై సంతకం పెడితే చాలు. అలాంటి పత్రాలేవీ రానట్లయితే దగ్గర్లోని బ్రాంచిని కానీ, ఏజెంట్‌ను కానీ సంప్రదిస్తే దానికి సంబంధించిన కాగితాలిస్తారు.
 
డెత్ క్లెయిమ్..
మెచ్యూరిటీ క్లెయిమ్‌తో పోలిస్తే దీని విధానం కొంత సుదీర్ఘం. ఇక్కడ పాలసీదారుడికి కాకుండా నామినీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి కంపెనీలన్నీ క్లెయిమ్‌లను ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా పరిశీలించి కానీ సెటిల్ చెయ్యవు. ఎలాంటి వివాదాలు లేకుండా అన్ని కాగితాలు ఉంటే క్లెయిమ్‌ను దరఖాస్తు చేసిన ఏడు రోజుల్లోపు సెటిల్ చేస్తారు. లేదంటే కొంత ఆలస్యమవుతుంది. అయితే బీమా నియంత్రణ రెగ్యులేటరీ సంస్థ (ఐఆర్ డీఏ) నిబంధనల ప్రకారం ఏ క్లెయిమ్‌నైనా దరఖాస్తు చే సిన 30 రోజుల్లోగా సెటిల్ చేయాలి. లేకపోతే వివాదాల పరిష్కార సెల్‌ను ఆశ్రయించవచ్చు.
 
ఇవీ కావాల్సిన పత్రాలు..
- బీమా కంపెనీలకు క్లెయిమ్ కోరుతూ ఇచ్చే దరఖాస్తుతో పాటు పాలసీ ఒరిజినల్ డాక్యుమెంట్, డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
- ప్రమాదంలో మరణించినట్లయితే దాని ఎఫ్‌ఐఆర్, పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వాలి.
- ఏదైనా వ్యాధితో మరణిస్తే వైద్య చికిత్సకు సంబంధించిన కాగితాలు, డిశ్చార్జి కాగితాలు సమర్పించాల్సి ఉంటుంది.
- మీరిచ్చిన సమాచారంతో బీమా కంపెనీలు తృప్తి చెందితే క్లెయిమ్‌ను వెంటనే పరిష్కరిస్తాయి. లేకపోతే అదనపు సమాచారాన్ని అడగవచ్చు. సాధారణ బీమా విషయానికొచ్చే సరికి ఇందులో మెచ్యూరిటీ ఉండదు. కాబట్టి అవసరమైన సందర్భాల్లో క్లెయిమ్ చెయ్యటం మాత్రమే ఉంటుంది. వీటిలో చాలా కేసుల్లో మనకు ఎఫ్‌ఐఆర్ అవసరమవుతుంది. మోటార్ ఇన్సూరెన్స్, హోమ్, హెల్త్, ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో క్లెయిమ్ ఎలా చేయాలో, ఏ పత్రాలు అవసరమవుతాయో ఓ సారి చూద్దాం.
 
మొదట ఏం చేయాలంటే..
- పాలసీదారు మరణించిన సందర్భంలో క్లెయిమ్ కు ఆ మరణం విషయాన్ని సాధ్యమైనంత త్వర గా బీమా కంపెనీకి లిఖిత పూర్వకంగా తెలపాలి.
- పాలసీదారు పేరు, పాలసీ నంబర్, మరణించిన తేదీ, మరణానికి కారణం, క్లెయిమ్‌కు దరఖాస్తు చేసిన వారి వివరాలు తెలియజేయాలి.
- క్లెయిమ్ ఫారాన్ని మీ దగ్గర్లోని బ్రాంచి కార్యాలయం లేదా బీమా ఏజెంట్ ద్వారా పొందవచ్చు. కంపెనీ వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కంపెనీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి క్లెయిమ్ చేయడానికి తగిన సమాచారాన్ని ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement