మేలుకో పాలసీదారుడా మేలుకో.. | Insurance In The Systemic Cross-Hairs: Speech | Sakshi
Sakshi News home page

మేలుకో పాలసీదారుడా మేలుకో..

Published Mon, Nov 9 2015 1:48 AM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM

మేలుకో పాలసీదారుడా మేలుకో..

మేలుకో పాలసీదారుడా మేలుకో..

బీమా పాలసీలతో అనేక ప్రయోజనాలున్నాయి. జీవితంలో ఊహించడానికి వీలులేని సంఘటన ఏదైనా జరిగితే మనపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. అంతేకాదు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో బీమాపై ప్రజల్లో అవగాహన క్రమేపీ పెరుగుతోంది. కేవలం పాలసీ తీసుకోవడమే కాకుండా దానిపై ఉండే హక్కులపై కూడా అవగాహన పెంచుకోవాలి. పాలసీదారుడిగా వాటి హక్కులను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

బీమా లో పాలసీదారునికి ఉండే హక్కులను మూడు రకాలుగా విభజించవచ్చు.  ఒకటి పాలసీ కొనుగోలు సంబంధిత హక్కులు, కొనుగోలు తర్వాత పాలసీ సర్వీసులను పొందే హక్కులు, క్లెయిమ్ సంబంధిత హక్కులు.
 
కొనుగోలు హక్కులు

బీమా కంపెనీలు పాలసీలను విక్రయించడానికి శత విధాలా ప్రయత్నిస్తాయి. తొందరపడి వారి బుట్టలో పడొద్దు. ముందుగా బీమా కంపెనీకి సంబంధించిన విషయాలతోపాటు, ఆ పథకం వివరాలన్నీ ఏజెంట్‌ను క్షుణంగా అడిగి తెలుసుకోండి. పాలసీ కొనుగోలుదారునిగా ఈ పథకానికి సంబంధించిన అంశాలతో పాటు బీమా కంపెనీ గత చరిత్ర, దాని పనితీరును, క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో, ఫిర్యాదుల పరిష్కారం వంటి పలు అంశాలను అడిగి తెలుసుకునే హక్కు ఉంది.

అవసరమైతే ఈ విషయాలను కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కూడా పొందొచ్చు. మీరు ఎంచుకున్న పథకానికి సంబంధించిన లాభ నష్టాలను తెలియజేయాలి. ఏదైనా పథకం సూచించేటప్పుడు అతని వయసు, ఆర్థిక లక్ష్యాలను తప్పక పరిగణలోకి తీసుకోవాలి. అలాకాకుండా కస్టమరే ఏదైనా పథకాన్ని ఎంచుకుంటే... ఆ పథకానికి అతను అర్హుడా? కాదా? అనే అంశాన్ని 15 రోజుల్లోగా బీమా కంపెనీ తెలియజేయాల్సి ఉంటుంది.
 
అలాగే పాలసీ కట్టించుకుంటే 30 రోజుల్లో డాక్యుమెంట్లను కస్టమర్లకు అందివ్వాలి. బీమా కంపెనీలు కస్టమర్ల వద్ద నుంచి అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరించాలి. కస్టమర్లు కూడా ఎలాంటి ఇతర సమాచారాన్ని వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత సమాచారాన్ని బీమా కంపెనీలు బయటి వ్యక్తులకు కానీ, సంస్థలకు కానీ ఇవ్వడానికి నిబంధనలు అనుమతించవు.
 
పాలసీ సర్వీసులను పొందే హక్కులు
ఒక్కసారి పాలసీని తీసుకున్న తర్వాత ఆ పాలసీ ప్రయోజనాలను పొందే హక్కు వస్తుంది. ఒకవేళ ఆ పాలసీని వద్దనుకుంటే దాన్ని 15 రోజుల్లోగా తిరస్కరించే అవకాశం ఉందన్న విషయం మర్చిపోవద్దు. ఇలా 15రోజుల్లోగా పాలసీని రద్దు చేసుకున్నప్పుడు సదరు బీమా కంపెనీ స్టాంప్ డ్యూటీ చార్జీలను, వైద్యపరీక్షల ఖర్చులను మినహాయించుకొని తిరిగి మన ప్రీమియాన్ని మనకు చెల్లిస్తుంది.

కస్టమర్ బీమా కంపెనీ సర్వీసులు, ప్రాడక్టుతో సంతృప్తి చెందకపోతే అతను బీమా కంపెనీ నోడల్ ఆఫీస్‌లో కానీ, అంబూడ్స్‌మెన్, లేదా కన్సూమర్ కోర్టులో కానీ ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన తర్వాత ఈ కేసును 14 రోజుల్లోగా ముగించాల్సి ఉంటుంది.
 
క్లెయిమ్ సంబంధిత హక్కులు
బీమా కంపెనీ నిర్దేశించిన సమయంలో కస్టమర్‌కు లేదా అతని సంబంధీకులకు క్లెయిమ్‌ను అందిస్తే ఎలాంటి గొడవ ఉండదు. కానీ క్లెయిమ్ సెటిల్‌మెంట్లలో ఏవైనా జాప్యాలు జరిగితేనే అసలు సమస్య. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్న  తర్వాత కంపెనీకి ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే క్లెయిమ్ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోగా అడగాల్సి ఉంటుంది.

ఒకవేళ ఏదైనా దర్యాప్తు అవసరమైతే 180 రోజుల్లోగా పూర్తి చేయాలి. ఎలాంటి దర్యాప్తు అవసరం లేకపోతే 30 రోజుల్లోగా క్లెయిమ్‌ను సెటిల్ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement