
బీజింగ్: చైనాకు చెందిన కొందరు పౌరులు రష్యాకు మద్దతు పలుకుతూ పోరాడుతున్నారని ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ(Ukrainian President Volodymyr Zelensky) చేసిన ఆరోపణలపై చైనా మండిపడింది. తమ దేశ పౌరులు సాయుధ సంఘర్షణ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, యుద్ధాల్లో పాల్గొనకుండా ఉండాలని కోరుకుంటుందని పేర్కొంది. జెలెన్‌స్కీ చేసిన వాదనలను తీవ్రంగా ఖండించింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఇటీవల.. రష్యా సైన్యంతో కలిసి పోరాడుతున్న ఇద్దరు చైనీస్ పౌరులను తమ సైనికులు పట్టుకున్నారని, దీనిపై చైనా నుంచి వివరణ కోరుతున్నామని అన్నారు. ఈ ఘటన ఉక్రెయిన్‌లోని తూర్పు డొనెట్స్క్ ప్రాంతంలో జరిగినట్లు
జెలెన్‌స్కీ తెలిపారు. అయితే చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్(Chinese Foreign Ministry spokesman Lin Jian) ఈ వాదన పూర్తిగా ఆధారం లేనిదని తోసిపుచ్చారు. చైనా ప్రభుత్వం ఎప్పుడూ కూడా తమ దేశ పౌరులు సాయుధ సంఘర్షణ ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరుతుందని, వారు యుద్ధాల్లో పాల్గొనకుండా చూస్తుందని అన్నారు.
జెలెన్‌స్కీ చైనాపై మరిన్ని ఆరోపణలు చేస్తూ..రష్యా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా చైనీస్ పౌరులను తన సైన్యంలో నియమించుకుంటోందని, ఈ విషయం చైనా అధికారులకు తెలుసన్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో బీజింగ్ నుంచి ఆదేశాలు అందాయా లేదా అనేది తమ దేశం అంచనా వేయగలదన్నారు. కాగా చైనా ప్రతినిధి లిన్ జియాన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఉక్రెయిన్ సంక్షోభంపై చైనా స్థితి స్పష్టంగా, స్థిరంగా ఉందని, దీనిని అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించిందన్నారు.
ఈ వివాదం నడుతున్న తరుణంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిగా, చైనా ఛార్జ్ డి అఫైర్స్‌తో సమావేశమయ్యారు. ఈ ఘటన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చైనాకి ఉన్న బాధ్యతాయుతమైన స్థానాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి టామీ బ్రూస్ మాట్లాడుతూ ఈ నివేదికలను ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా చైనా తమ దేశం యుద్ధం విషయంలో తటస్థంగా ఉందని, రష్యా లేదా ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందించడం లేదని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్‌మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?