పొడిగించిన పీపీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రాయల్స్ ఎలా? | Where to invest 7th Pay Commission bonanza? | Sakshi
Sakshi News home page

పొడిగించిన పీపీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రాయల్స్ ఎలా?

Published Mon, Jul 4 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

పొడిగించిన పీపీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రాయల్స్ ఎలా?

పొడిగించిన పీపీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రాయల్స్ ఎలా?

నేను 2000 సంవత్సరంలో ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్) ఖాతా ప్రారంభించాను. అప్పటి నుంచి  ప్రతి నెలా కొంత మొత్తాన్ని  జమ చేస్తూ వచ్చాను. ఇటీవలే మెచ్యూరిటీ కావడంతో ఈ ఖాతాను మరో ఐదేళ్ల పాటు పొడిగించాను. ఇప్పుడు నాకు డబ్బులు అవసరమయ్యాయి. పొడిగించిన పీపీఎఫ్ ఖాతా నుంచి  విత్‌డ్రాయల్స్‌కు సంబంధించిన నిబంధనలు ఏవిధంగా ఉన్నాయి? తెలియజేయండి.
- హరినాధ్, వరంగల్

 
ప్రజా భవిష్య నిధి(పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్-పీపీఎఫ్) ఖాతా మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. ఈ మెచ్యూరిటీ కాలం పూర్తయిన తర్వాత ఐదేళ్లపాటు పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ ఐదేళ్ల కాలంలో ఈ ఖాతాలో డబ్బులు ఇన్వెస్ట్ చేయకపోయినా ఈ ఖాతాను కొనసాగించవచ్చు. పొడిగించిన తర్వాత కూడా మీరు ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఖాతా బ్యాలెన్స్‌లో 60 శాతం మొత్తాన్ని మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. పీపీఎఫ్ ఖాతాను పొడిగించిన మొదటి ఏడాది నుంచి ఈ సొమ్ములను ఒకటి లేదా ఒకటికి మించిన ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో విత్‌డ్రా చేసుకోవచ్చు.

అయితే ఏడాదికి ఒక్క ఇన్‌స్టాల్‌మెంట్‌ను మాత్రమే అనుమతిస్తారు. ఇక ఇన్వెస్ట్‌చేయకుండానే ఈ ఖాతాను పొడిగించిన పక్షంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా మీ ఖాతాలో ఉన్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే  ఈ సందర్భంలో కూడా ఏడాదికి ఒక్క విత్‌డ్రాయల్‌నే అనుమతిస్తారు. మీ ఖాతా నుంచి పూర్తిగా మీ సొమ్ములను ఉపసంహరించుకునేదాకా మిగిలిన బ్యాలెన్స్‌పై మీకు వడ్డీ వస్తుంది.
 
నేను మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఫరెవర్ యంగ్ పెన్షన్ పాలసీ తీసుకున్నాను. ఈ పాలసీ తీసుకొని రెండున్నరేళ్లయింది. ఇప్పటిదాకా రూ.1,25,000 ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేశాను. కానీ ఈ పాలసీ పనితీరు సరిగ్గా లేదు. దీనిని సరెండర్ చేయమంటారా? కొనసాగించమంటారా?
- శోభన్, హైదరాబాద్

 
మ్యాక్స్ లైఫ్ ఫరెవర్ యంగ్ పెన్షన్ ప్లాన్ అనేది బీమా కవర్‌తో కూడిన రిటైర్మెంట్ ప్లాన్. మీరు తీసుకున్నది సరైన ఇన్వెస్ట్‌మెంట్ పథకం కానప్పుడు.  మీకు నష్టాలు వచ్చినా సరే, ఆ పథకం నుంచి వైదొలగడం సరైన నిర్ణయమే. బీమా కవర్‌తో కూడిన ఎలాంటి రిటైర్మెంట్ ప్లాన్ అయినా అది సరైన పథకం కాదు. అలాంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమూ కాదు. ఇలాంటి పాలసీల్లో వ్యయాలు అధికంగా ఉంటాయి. పారదర్శకత ఉండదు.  ఈ తరహా పాలసీలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే రాబడులను ఇవ్వలేవు.

ఈ పాలసీతో పోల్చుకుంటే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ గ్యారంటీడ్ మొత్తాలను ఇస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ పాలసీ సరెండర్‌కు సంబంధించిన విషయాలను చూస్తే, ఫండ్ విలువలో మూడో వంతును ఏకమొత్తంగా మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదా మొత్తం ఫండ్ విలువతో యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్‌కు లాక్-ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలుగా ఉంది. మీరు ఐదేళ్లకు ముందే ఈ పాలసీని సరెండర్ చేసినప్పటికీ, మీరు పాలసీ తీసుకున్న ఐదేళ్ల వరకూ ఈ పాలసీ లాక్ అయి ఉంటుంది.

మీ రిటైర్మెంట్ జీవితంలో కావలసిన ఆదాయం కోసం దీర్ఘకాల పెట్టుబడి వ్యూహం అవసరం. మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కొత్త అయితే, మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను ఎంచుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ట్రాక్ రికార్డ్‌ను బట్టి మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను ఎంచుకొని, ప్రతి నెలా కొంత మొత్తం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయండి. మీకు ఇప్పటికే స్టాక్ మార్కెట్‌తో పరిచయం ఉండి ఉన్నట్లయితే ఏదైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకొని సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయండి.

బ్యాలెన్స్‌డ్ ఫండ్ అయినా, ఈక్విటీ ఫండ్ అయినా సరే, సిప్ విధానాన్ని ఎంచుకోండి. ఇలా చేస్తే, మీ కొనుగోళ్లు యావరేజ్ అయి. మీకు మంచి రాబడులు వస్తాయి. మీరు మరో మూడేళ్లలో రిటైరవుతారనగా, ఈ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని ఉపసంహరించుకొని పెన్షన్ కోసం క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయండి.
 
నా వయస్సు 56 సంవత్సరాలు. మరో నాలుగేళ్లలో రిటైరవుతున్నాను. 20 శాతం ఆదాయపు పన్ను ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్నాను.  ఏడాదికి రూ.50,000 చొప్పున మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలను. మరో ఆరేళ్ల పాటు నాకు ఈ డబ్బులు అవసరం లేదు. నాకు పన్ను ప్రయోజనాలతో పాటు మంచి రాబడులు కూడా కావాలి.  ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలో సూచించండి?
- గంగాధర్, విజయవాడ

 
మీరు ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. పన్ను ప్రయోజనాలు కూడా కావాలనుకుంటున్నారు. కాబట్టి మీ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం మంచి రేటింగ్ ఉన్న ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్) ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. పన్ను ప్రయోజనాలతో పాటు మంచి రాబడులు కూడా వస్తాయి. ఈ ఫండ్స్ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. పన్ను ఆదా చేసే ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో తక్కువ లాక్-ఇన్ పీరియడ్ (3 సంవత్సరాలు) ఇన్వెస్ట్‌మెంట్ సాధనం ఇదే.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement