నాకు ఆరు నెలల క్రితం ఉద్యోగం వచ్చింది. ఇంకా పెళ్లి కాలేదు. నాకంటూ ఓ స్వంత ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలనుకుంటున్నాను. భవిష్యత్ అవసరాలు, రెండేళ్లలో పెళ్లి, అయిదేళ్లలో ఇల్లు, 18, 20 ఏళ్ల తర్వాత పిల్లల చదువులు, రిటైర్‌మెంట్ తర్వాత పెన్షన్... వీటికోసం ఏ పొదుపు మార్గాలున్నాయి. ఎక్కువ రిస్కు భరించలేను.
- రాగలలిత, హైదరాబాద్
రెండేళ్లలో పెళ్లి పెట్టుకుంటున్నారంటే బ్యాంకులో ప్రతి నెలా రికరింగ్ డిపాజిట్ వేసుకోవడం ఉత్తమ మార్గం. ఎందుకంటే స్వల్పకాలానికి మీరు మార్కెట్లోకి వెళ్లడం మంచిది కాదు. మీ జీతం వచ్చే బ్యాంకులో స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాసిస్తే, బ్యాంక్ కంప్యూటర్లే ఆ మొత్తాన్ని బదిలీ చేస్తాయి. ఇక మీరు ఐదేళ్లలో ఇల్లు కొనాలంటే చేతిలో డౌన్‌పేమెంట్ కొంతకావాలి. ఆర్.డి.ద్వారా వచ్చే వడ్డీ హోమ్‌లోన్ స్వల్పతేడాతోనే ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పట్నుంచే దానికోసం కూడా ఆర్.డి. చేసుకోవడం మంచిది. ఇందులో చక్రవడ్డీ పరంగా చూస్తే హోమ్‌లోన్‌కు కట్టే వడ్డీ మీకు గిట్టుబాటు అయినట్లే.
ఇక 18, 20 ఏళ్ల తర్వాత పిల్లల చదువులకి ప్లాన్ చేయాలనుకుంటే మదుపు అవకాశాలు పెరుగుతాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో సొమ్ము దాచుకోవచ్చు. ఇది పన్ను రహితం. మీ ఆదాయంలో కొంత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లోనూ పెట్టొచ్చు. ప్రతినెలా సిప్ మార్గంలో సొమ్ము దాచుకుంటూ పోతే దీర్ఘకాలానికి రిస్క్ పోయి మదుపు ఆదాయం పెరుగుతుంది. కాబట్టి పిల్లల చదువులకు ఈ రెండు మార్గాలు ఉత్తమమైనవి.
ఇక 35 ఏళ్ల తర్వాత రిటైర్‌మెంట్ గురించి మీరు ఆలోచించడం అభినందనీయం. మీ వయసు ఇంకా తక్కువే కాబట్టి షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. షేర్ మార్కెట్‌పై అవగాహన వచ్చేవరకు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టండి. సుదీర్ఘ భవిష్యత్‌లో మార్కెట్ భారీగా వృద్ధి చెందే అవకాశం ఉన్నవి మార్కెట్, రియల్ ఎస్టేట్... ఈ రెండే. వీటిలో పెట్టుబడి మంచిదే.
- వంగా రాజేంద్రప్రసాద్, ఆర్థిక వ్యవహారాల నిపుణులు
మహిళకూ రిటైర్‌మెంట్ ప్లాన్ అవసరమే!
Published Fri, Nov 22 2013 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
Advertisement