Retirement Benefits
-
ఎంతటి దుర్భర పరిస్థితి? చందా కొచ్చర్‌కు సుప్రీం కోర్టులోనూ తప్పని నిరాశ
దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపుతో అగ్రస్థానానికి ఎదిగి సంచలనం సృష్టించిన ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ కుంభకోణంలో ఇరుక్కుని కేసులను ఎదుర్కొంటూ తన పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పించాలని కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ సుప్రీం కోర్టులోనూ తీవ్ర నిరాశే ఎదురైంది. బ్యాంకు నుంచి తన పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించి చందా కొచ్చర్ దాఖలు చేసిన అప్పీల్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు డిసెంబర్ 8న నిరాకరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం చందా కొచ్చర్ గతంలో బాంబే హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేయగా డివిజన్ బెంచ్ తిరస్కరించింది. తాజాగా ఆ డివిజన్ బెంచ్ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కొచ్చర్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. బాంబే హైకోర్టు తీర్పు అన్యాయమని, బ్యాంకు మొదట్లో కొచ్చర్‌కు రిటైర్మెంట్ ప్రయోజనాలను అందించేందుకు అంగీకరించి తర్వాత వెనక్కితీసుకుందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ ఏడాది మే నెలలో ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి పదవీ విరమణ ప్రయోజనాలను కోరుతూ ఆమె చేసిన మధ్యంతర దరఖాస్తును తిరస్కరించిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో పదవి నుంచి చందా కొచ్చర్ తొలగింపును సమర్థించిన బాంబే హైకోర్టు దీనిపై ఆమె వేసిన పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఆమె వేసిన మధ్యంతర పిటిషన్‌ను గతేడాది నవంబర్‌లో కొట్టేసింది. 2018లో ఆమె దక్కించుకున్న 6.90 లక్షల షేర్లతో ఆమెకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. 2018 మేలో తనపై విచారణ ప్రారంభం కాగానే చందా కొచ్చర్ సెలవుపై వెళ్లిపోయారు. ఆ తరువాత ముందస్తు రిటైర్మెంట్కు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని ఆమోదించిన ఐసీఐసీఐ బ్యాంక్ టెర్మినేషన్ ఫర్ కాజ్'గా పరిగణించి ఆర్బీఐ నుంచి అనుమతి కూడా కోరినట్లు తెలిపింది. కాగా 2019 జనవరిలో దాఖలు చేసిన చార్జిషీట్లో చందా కొచ్ఛర్ ఆధ్వర్యంలోని ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ విధానాలను ఉల్లంఘించి వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేసిందని సీబీఐ పేర్కొంది. ఈ రుణాలు తరువాత నిరర్థక ఆస్తులుగా మారాయని, ఫలితంగా బ్యాంకుకు తప్పుడు నష్టం, రుణగ్రహీతకు, నిందితులకు తప్పుడు లాభం కలిగిందని సీబీఐ అభియోగం మోపిన సంగతి తెలిసిందే. -
ముందే రిటైర్మెంటా.. 20 ప్లస్‌లో ఆరంభిస్తే సాధ్యమే
నేటి తరం యువత 60 ఏళ్లు వచ్చే వరకు కష్టపడాలని అనుకోవడం లేదు. కెరీర్‌ను ముందుగానే ముగించాలని కోరుకుంటోంది. ముందస్తు రిటైర్మెంట్ ఆకాంక్ష క్రమంగా విస్తరిస్తోంది. ముందుగా రిటైర్ అయితే, అప్పటి నుంచి తమ అభిరుచులకు అనుగుణంగా స్వేచ్ఛగా జీవించొచ్చనే కాన్సెప్ట్ ఆదరణకు నోచుకుంటోంది. తోటి వారిని చూసి దీనికి ఆకర్షితులయ్యే వారూ ఉంటున్నారు. కానీ, ఇది ఎలా సాధ్యం? ఇదే ఎక్కువ మందికి ఎదురయ్యే ప్రశ్న. దీనిపై స్పష్టత తెచ్చుకోలేక, తర్వాత చూద్దాంలే.. అని అనుకుని కెరీర్లో సాగిపోయేవారూ ఉన్నారు. ఉద్యోగ, వృత్తి బాధ్యతలకు ముందస్తుగా విరమణ పలికి, నచ్చినట్టు జీవించడం అంటే వినడానికి ఎంతో ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ, దీన్ని చేరుకోవాలంటే సరైన లెక్కలు, ప్రణాళికలు కావాలి. వాటిని ఆచరణలో పెట్టినప్పుడు లక్ష్యం సఫలమవుతుంది. ఇందుకు ఏం చేయవచ్చన్నది అవగాహన కల్పించే కథనం ఇది. రిటైర్మెంట్ అన్నది అన్నింటిలోకి చివరి లక్ష్యం అవుతుంది. దీనికంటే ముందు జీవితంలో నెరవేర్చాల్సిన, సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు పిల్లల విద్య, వివాహాలు, సొంతిల్లు తదితరాలు. వీటిని సాధించేందుకు సరైన దిశలోనే అడుగులు వేస్తున్నారా? రిటైర్మెంట్ కంటే ముందుగా ఎదురయ్యే లక్ష్యాలకు సంబంధించి కచ్చితమైన ప్రణాళిక అవసరం. వీటిని చేరుకునేందుకు కావాల్సినంత, సరైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఒక్కసారి పరిశీలించుకోవాలి. లేకపోతే జీవితంలో అత్యంత ముఖ్యమైన లక్ష్యాల విషయంలో ఏ మాత్రం లెక్కలు తప్పినా, రిటైర్మెంట్ లక్ష్యం విషయంలో రాజీ పడాల్సి రావచ్చు. ఎవరైనా కానీ, ముందుగా ఎదురుపడే అవసరం గురించే ఆలోచిస్తారు. అందుకే ముందే రిటైర్మెంట్ తీసుకోవాలంటే, దానికంటే ముందు ఎదురయ్యే వాటి గురించి కూడా ప్రణాళిక వేసుకోవాలి. జీవితంలో కీలకమైన లక్ష్యాలు సాధించలేకపోతే రిటైర్మెంట్ సాధ్యం కాదన్న సూక్ష్మాన్ని గుర్తించాలి. ‘‘సురక్షితమైన భవిష్యత్తుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత మీ జీవన శైలి పదవీ విరమణ తర్వాత దిగజారిపోకూడదు. వైద్య చికిత్సలకు అవసరమైనంత నిధి ఉండాలి. పిల్లల విద్య, వారి వివాహాలు, కారు కొనుగోలు, సెలవుల్లో పర్యటనలు వీటన్నింటికీ ఏర్పాట్లు ఉండాలి’’అని హమ్ ఫౌజీ సీఈవో సంజీవ్ గోవిలా సూచించారు. ఎంత కావాలి..? విశ్రాంత జీవనం కోసం సమకూర్చుకోవాల్సిన నిధి విషయంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే సమకూర్చుకున్న నిధి ఏ మూలకూ చాలకపోవచ్చు. అదే జరిగితే పేరుకే రిటైర్మెంట్ అవుతుంది. ఆ తర్వాత ఖర్చులకు చాలక మళ్లీ ఏదో ఒక ఉపాధి వెతుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకుని రిటైర్మెంట్ కోసం కావాల్సిన నిధిని పక్కా అంచనా వేయాలి. ఈ విషయంలో నిపుణుల సాయం ఎంతో అవసరం పడుతుంది. రిటైర్మెంట్కు సంబంధించి కావాల్సిన నిధిని అంచనా వేయడం అత్యంత ముఖ్యమైనదని రైట్ హారిజాన్స్ ఫండ్ మేనేజర్ అనిల్ రెగో పేర్కొన్నారు. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం నెలవారీ ఖర్చులు రూ.25,000 ఉన్నాయని అనుకుందాం. అతడు ఏ వయసులో రిటైర్ అయితే ఆ తర్వాత జీవనానికి ఎంత మొత్తం కావాలన్నది ఇక్కడి పట్టికలో చూడొచ్చు. ప్రస్తుత నెలవారీ వ్యయాలకు ఏటా సగటున 5 శాతం ద్రవ్యోల్బణం ప్రభావం పరిగణనలోకి తీసుకుని రిటైరయ్యే నాటికి ఎంత కావాలో వేసిన అంచనాలు ఇవి. పట్టికలోని నెలవారీ పెట్టుబడిని ఏడాదికోసారి 8 శాతం పెంచుతూ వెళ్లాలి. పెట్టుబడిపై ఏటా 10 శాతం రాబడి వస్తుందన్న అంచనా. రిటైర్మెంట్ నాటికి సమకూరిన ఫండ్‌పై ఆ తర్వాత ఏటా 7 శాతం రాబడి వస్తుందని అనుకుంటే, ఇంత మొత్తం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అవసరాలు వేర్వేరు.. రిటైర్మెంట్కు తక్కువ వ్యవధి ఉన్నప్పుడు నెలవారీ పెట్టుబడికి ఎక్కువ మొత్తం అవసరపడుతుంది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన జీవనశైలి, అవసరాలు, ఖర్చులు ఉంటుంటాయి. కనుక నెలవారీ ఎంత మొత్తం, ఏడాదికి ఎంత చొప్పున కావాలన్నది ఎవరికి వారు అంచనాకు రావాలి. ఏడాదికి తమ ఖర్చులు, తమ ఆరోగ్య అవసరాలు, ఆరోగ్య బీమా, జీవిత బీమా ఉన్నాయా? పిల్లలు ఎంత మంది? వారికి ఏ స్థాయి ఖర్చులో విద్య చెప్పించాలని అనుకుంటున్నారు? సొంతింటి ప్రణాళిక, వాహనం ఇత్యాది అవసరాలన్నింటినీ ఒక జాబితాగా రాసుకోవాలి. ఆ తర్వాత ఆర్థిక సలహాదారు లేదంటే పెట్టుబడి సలహాదారును సంప్రదించాలి. వారు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, నెలవారీగా దేనికి ఎంత మొత్తం పొదుపు, మదుపు చేయాలి, ఏ సాధనాలను ఎంపిక చేసుకోవాలి? అనేది ఒక ప్రణాళిక రూపొందించి ఇస్తారు. దీనికోసం ద్రవ్యోల్బణం, జీవిత కాలం తదితర అంశాలను వారు విశ్లేషిస్తారు. వారిచ్చిన ప్రణాళిక ప్రకారం సాగిపోవాలి. 30 ఏళ్ల వ్యక్తి నెలవారీ ఖర్చులు రూ.30,000 ఉన్నాయని అనుకుంటే ఏ వయసులో రిటైర్మెంట్ అయితే ఎంత మొత్తం కావాలో ఇక్కడి టేబుల్లో చూడొచ్చు. పైన టేబుల్ మాదిరే జీవిత కాలం 90 ఏళ్లకు అనుకుని, ఏటా పెట్టుబడిపై 10 శాతం రాబడి అంచనా ప్రకారం, ఏటా పెట్టుబడి 8 శాతం పెంచుతూ వెళ్లే విధంగా, రిటైర్మెంట్ తర్వాత 7 శాతం రాబడి కోసం సమకూర్చుకోవాల్సిన నిధి అంచనాలు ఇవి. అప్రమత్తత రిటైర్మెంట్కు మరో ఐదేళ్లు ఉందనగా పెట్టుబడుల విషయంలో అప్రమత్తం కావాలి. ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకునే వారు మార్కెట్ సైకిల్‌ను పరిగణనలోకి తీసుకుని, అందుకు అనుగుణమైన వ్యూహాన్ని అమల్లో పెట్టాలి. ఉదాహరణకు 2008 మార్కెట్ పతనం, 2020 మార్కెట్ పతనం గుర్తుండే ఉంటాయి. 2020 మార్కెట్ పతనం తర్వాత స్టాక్స్ రికవరీకి ఏడాది సమయం పట్టింది. కొన్ని స్టాక్స్ పూర్తిగా కోలుకుని కొత్త గరిష్టాలకు చేరుకుంటే, కొన్ని ఆలస్యంగా రికవరీ అయ్యాయి. అందుకుని రిటైర్మెంట్కు మరో మూడు–ఐదేళ్లు ఉందనగా, మార్కెట్ సైకిల్‌ను అర్థం చేసుకోవాలి. భారీ దిద్దుబాటు వచ్చి దిద్దుబాటు వచ్చి చాలా ఏళ్లు అయ్యిందా? మార్కెట్ల వ్యాల్యూషన్లు జీవిత కాల గరిష్ట స్థాయిల్లో చలిస్తున్నాయా? ఇలాంటి అంశాలపై నిపుణుల సాయంతో అంచనాకు రావాలి. మూడు ఐదేళ్ల ముందు నుంచి ఏటా నిర్ణీత శాతం చొప్పున ఈక్విటీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ డెట్ సాధనాల్లోకి మళ్లించుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో కొంత మేర పెట్టుబడులు అవసరంపడతాయి. ఎందుకంటే ముందుగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత కనీసం 25 ఏళ్ల నుంచి 35–40 ఏళ్ల పాటు జీవించి ఉండే వారికి ఈక్విటీలు తప్పనిసరి. అప్పుడే కార్పస్ కరిగిపోకుండా ఉంటుంది. అందుకుని నిపుణులు సూచించిన మేర ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించి, మిగిలిన మొత్తాన్ని క్రమంగా వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ ఊహించని విధంగా రిటైర్మెంట్ నాటికి మార్కెట్లు భారీ దిద్దుబాటుకు గురైతే అప్పుడు రిటైర్మెంట్ లక్ష్యాన్ని ఏడాది నుంచి మూడేళ్ల పాటు వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. అందుకుని సాధ్యమైన మేర లక్ష్యం వాయిదా పడకూడదంటే ముందస్తు జాగ్రత్తలు తప్పదు. అవరోధాలు.. ముందుగా పదవీ విమరణ తీసుకునే వారికి సంపాదించే కాలం ఇతరులతో పోలిస్తే తక్కువ ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలంలో సమకూర్చుకోవాల్సినంత 20–25 ఏళ్లకే సాధించాలి. రిటైర్మెంట్ తర్వాత ఇతరులపై ఆధారపడకూడదు. పైగా ముందస్తు రిటైర్మెంట్ అంటే ఉదాహరణకు 55 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటారని అనుకుందాం. అక్కడి నుంచి కనీసం 80 ఏళ్ల వరకు జీవించి ఉంటారని అనుకుంటే, 35 ఏళ్ల కాలానికి అవసరాలు తీర్చేంత ఫండ్ కావాలి. 25–30 ఏళ్లకు కెరీర్ ఆరంభిస్తే.. అక్కడి నుంచి ముందస్తు రిటైర్మెంట్కు 30–25 ఏళ్లే మిగిలి ఉంటుంది. తక్కువ కాలంలో ఎక్కువ కాలానికి ఫండింగ్ ఏర్పాటు చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదన్నది గుర్తుంచుకోవాలి. క్రమశిక్షణతో, ఎటువంటి దుబారాకు చోటు ఇవ్వకుండా సంపాదనలో అధిక భాగం భవిష్యత్తుకు పొదుపు చేసుకున్నప్పుడు లక్ష్యం సాకారం అవుతుంది. ఉదాహరణకు పిల్లల విద్య కోసం బడ్జెట్ వేసుకుంటే, ఆ బడ్జెట్ మించకుండా దాన్ని అధిగమించాలి. లేదంటే వేరే లక్ష్యం కోసం ఉద్దేశించిన మొత్తం నుంచి దానికి సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు గొలుసుకట్టు మాదిరి ఒకదాని కోసం మరో లక్ష్యం విషయంలో రాజీపడాల్సి వస్తుంది. లేదంటే రుణం తప్పదు. రాబడి రేటు కీలకం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో (సిప్) ఇన్వెస్ట్ చేసినప్పుడు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు అందుకోవచ్చని చారిత్రక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే, పెట్టుబడుల విధానంలో చిన్న మార్పుతోనూ మెరుగైన నిధిని సమకూర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మనకు ఏటా ఆదాయం ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది. ఇలా పెరిగే మొత్తానికి అనుగుణంగా సిప్ పెట్టుబడినీ పెంచుకుంటూ వెళ్లాలి. ఏడాదికోసారి ఆర్జన పెరిగినప్పుడు పెట్టుబడిని పెంచుకోవడం ఏమంత పెద్ద కష్టం కాదు. ఖర్చులు కూడా ద్రవ్యోల్బణ ప్రభావంతో ఏటా పెరుగుతూ ఉంటాయి. ఖర్చులు పెరిగాయని పెట్టుబడుల విషయంలో రాజీ పడితే లక్ష్యం సాకారం కాదు. అనవసర ఖర్చులను తగ్గించుకుని అయినా అనుకున్న మేర, ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ఏటా ఆదాయం అనుకున్న మేర పెరగకపోతే ఎలా? దీనికి సంబంధించి కూడా ప్లాన్–బి రెడీ చేసుకుని పెట్టుకోవాలి. భవిష్యత్తు పెట్టుబడుల కోసం ప్రస్తుత జీవనశైలిలో పూర్తి రాజీ పడకూడదన్నది ఆర్థిక సలహాదారుల సూచన. రెండింటినీ సమన్వయం చేసుకునే విధంగా ఆచరణ ఉండాలి. అలాగే, ఏటా పెట్టుబడిని పెంచడం ఒక్కటి కాకుండా, పెట్టుబడి సాధనాల మధ్య సమతూకం కూడా ఉండాలి. అధిక రాబడులను ఇచ్చే ఈక్విటీలకు తప్పకుండా చోటు ఉండాల్సిందే. పెట్టుబడులకు కనీసం 20 ఏళ్లు అంతకుమించి కాలం ఉంటే అగ్రెస్సివ్ ప్రణాళిక వేసుకోవచ్చు. ఈక్విటీలకు 75 శాతం నుంచి 100 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. ఎన్పీఎస్ ప్లాన్‌లోనూ 75 శాతం ఈక్విటీ పెట్టుబడులకు ఆప్షన్ ఉంది. ఎంత ఎక్కువ కాలం ఉంటే కాంపౌండింగ్ వల్ల అంత పెద్ద మొత్తం సమకూరుతుంది. రిటైర్మెంట్కు సంబంధించి అధిక రిస్క్ తీసుకునే వారికి సాధారణంగా 70–80 శాతం ఈక్విటీలు, మిగిలిన 20 శాతం మేర స్థిరాదాయ (డెట్) పథకాలను నిపుణులు సూచిస్తుంటారు. నిజానికి చాలా మంది విషయంలో గమనిస్తే అన్నింటికంటే ఆలస్యంగా మొదలు పెట్టేది రిటైర్మెంట్ కోసమే అవుతోంది. ఎక్కువ మంది చేసే పెద్ద తప్పిదం ఇదే. ఆర్జన మొదలైన మొదటి నెల నుంచే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఆరంభించిన వారు చాలా సులభంగా కావాల్సిన నిధిని సమకూర్చుకోగలరు. అంతేకాదు, కాంపౌండింగ్ పవర్‌తో ముందస్తు రిటైర్మెంట్ వీరికి చాలా సులభం అవుతుంది. ఆలస్యం చేసే కొద్దీ ఈ లక్ష్యం భారంగా మారుతుంది. రిస్క్‌లు–రక్షణ ముందస్తు రిటైర్మెంట్ లక్ష్యం పెట్టుకున్న వారు రుణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రుణాలు తీసుకున్నా, రిటైర్మెంట్ పెట్టుబడుల ప్రణాళికకు అవరోధంగా లేకుండా ఉండాలి. రిటైర్మెంట్ నాటికి తీర్చేలా ఉండాలి. మరీ ముఖ్యంగా ముందస్తు రిటైర్మెంట్ తీసుకునే వారు ఉద్యోగం భద్రత అంశాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. కరోనా సంక్షోభ సమయంలో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. రుణాలపై మారటోరియం ఆప్షన్ తీసుకున్న వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఊహించని పరిణామాలు ఎదురైతే ప్రణాళిక వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ విధమైన రిస్క్‌లను ఎదుర్కొనే ప్రణాళిక కూడా కావాలి. అలాగే, రోడ్డు ప్రమాదంలో గాయపడి వైకల్యం పాలై ఆర్జన ఆగిపోయే పరిస్థితి వస్తే..? అనుకున్నదంతా తలకిందులైపోతుంది. దీనికి సంబంధించి బీమా కవరేజీ తప్పకుండా తీసుకోవాలి. అలాగే, మనకు ఏదైనా అనుకోనిది జరిగితే కుటుంబాన్ని ఆదుకునే జీవిత బీమా, ఆస్పత్రిలో వైద్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తప్పకుండా తీసుకోవాలి. వృద్ధాప్యంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకుని చాలా ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. ----------------------------------------------------------------------------------------------------------------------------- గమనిక: ఇక్కడ పట్టికల్లో ఇచ్చిన అంచనాలు అన్నీ కూడా పెట్టుబడిపై ఏటా 10 శాతం రాబడి ప్రకారం వేసిన అంచనాలు. కానీ, ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో 12 శాతం వార్షిక రాబడి సాధ్యమే. కనుక ఆ ప్రకారం చూస్తే చేయాల్సిన నెలావారీ పెట్టుబడి 10 శాతం తక్కువైనా అనుకున్న కార్పస్‌ను సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. -
భిక్షగాడిగా మారిన మాజీ వ్యవసాయ అధికారి దీనగాథ.. 26 ఏళ్ల తరువాత న్యాయం
పాతికేళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేసినా.. రిటైర్డ్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు(లోన్ ఉందనే కారణంతో) ఉన్నతాధికారులు నిరాకరించారు. ఇదే సమయంలో కుమారుడి మరణం అతడిని కుంగదీసింది. తన కళ్లెదుటే అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తెలు రోజు కూలీలుగా మారి దుర్భర జీవితాన్ని అనుభవించారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురై పాతికేళ్లుగా జీవచ్ఛవం అయ్యాడు. అయితే ఓ గుడి దగ్గర యాచించే సమయంలో అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడుతుండడంతో ఓ భక్తుడు గుర్తించారు. ఇతని దీనస్థితిని తెలుసుకుని మదురై ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడంతో.. ఎట్టకేలకూ 26 ఏళ్ల తరువాత న్యాయం దక్కింది. సాక్షి, చెన్నై: పదవీ విరమణానంతరం తనకు రావాల్సిన నగదు మొత్తం దక్కక పోవడంతో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ అధికారి ఒకరు భిక్షగాడిగా మారాడు. ఆయన దీనగాథను తన స్నేహితుడి ద్వారా తెలుసు కున్న న్యాయవాది కోర్టు తలుపుతట్టారు. చివరికి ఆ అభాగ్యుడిపై కోర్టు కరుణ చూపించింది. ఆరు వారాల్లోపు ఆయనకు చెల్లించాల్సిన మొత్తాన్ని వడ్డీతో కలిపి అందజేయాలని మదురై ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాలు.. మదురై శివారుల్లోని ఆల యాల వద్ద గత కొన్నేళ్లుగా ఓ వృద్ధుడు భిక్షాటన చేస్తూ వచ్చాడు. ఆయన అనర్గళంగా ఆంగ్లం, తమిళ భాషాలను మాట్లాడటం, వ్యవసాయానికి సంబంధించిన అంశాలను వల్లిస్తుండడంతో ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ఇటీవల ఆయన వివరాలను ఆరా తీశాడు. అతడి దీనగాథ∙విన్న ఆ భక్తుడు తన మిత్రుడైన న్యాయవాది జిన్నాకు సమాచారం ఇచ్చాడు. చదవండి: (Bengaluru: మాంసం, మద్యం విక్రయాలు బంద్) భిక్షగాడిగా.. విచారణలో తంజావూరు జిల్లా తిరుచ్చిట్రంబలంకు చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ వ్యవసాయ అధికారి గోపాల్‌గా గుర్తించారు. 1996లో ఈయన పదవీ విరమణ చేసిన సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫలం దక్కలేదు. ఇందుకు కారణం ఆయన సహకార బ్యాంక్‌లో రుణం తీసుకుని ఉండడమే. అదే సమయంలో మధ్యలో చదువు ఆపేయాల్సిన పరిస్థితి రావడంతో ఆయన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో గోపాల్ మానసికంగా కుంగిపోయాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి కూడా చేయలేని పరిస్థితిలో పడ్డాడు. ఆ ఇద్దరు కూలి పనులకు వెళ్తుండడంతో జీవితంపై విరక్తి చెంది ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. భిక్షాటన చేస్తూ కాలం గడుపుతుండడం వెలుగు చూసింది. దీంతో ఆయనకు రావాలసిన పదవీ విరమణ మొత్తం కోసం న్యాయవాది జిన్నా మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్ బెంచ్ మందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. 74 ఏళ్ల వయస్సులో గోపాల్ పడుతున్న వేదనపై కోర్టు స్పందించింది. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సహకారం సంఘంలో ఆయన తీసుకున్న అప్పు ప్రస్తుతం వడ్డీతో రూ. 5.37 లక్షలకు చేరినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. దీంతో ఆయనకు రావాల్సిన నగదును రుణానికి జయచేయాలని, మిగిలిన సొమ్ముకు వడ్డీ లెక్కించి గోపాల్‌కు ఆరు వారాలలోపు చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది. -
రిటైరైన ఉద్యోగిని సన్మానించి ఇంట్లో దింపాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సర్వీసులో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, అధికారులను సత్కరించి ప్రభుత్వం వాహనంలో వారి ఇంటి వద్ద దించి రావాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. వారికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా త్వరగా అందా లని, రిటైరైన రోజు వారికి సన్మానం చేసి ఇంటికి పంపే పద్ధతి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు కొత్త విధానం తెచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, త్వరలోనే ఇలాంటి విధానం తీసుకొస్తామని వెల్లడించారు. సోమవారం ప్రశ్నోత్తరాల్లో భాగంగా సింగరేణి కార్మికుల కారుణ్య నియామకాలపై టీఆర్ఎస్ సభ్యులు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణారెడ్డిలు అడిగిన ప్రశ్నలకు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానమిచ్చారు. తర్వాత సభ్యులు లేవనత్తిన అంశాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా చర్చలో సీఎం కలుగజేసుకొని మాట్లాడుతూ.. 30, 35 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేసి రిటైరైన అధికారిని గౌరవించుకోవడం మానవతా దృక్పథం అని చెప్పారు. చాలా బాధనిపించింది.. ‘నాకు తెలిసిన పాండురంగం అనే ఓ ఎలక్ట్రిసిటీ సీఈ ఉన్నారు. ఒకరోజు పనిమీద విద్యుత్ కార్యాలయానికి వెళ్లినప్పుడు చీఫ్ ఇంజనీర్ స్థాయిలో పనిచేసిన ఆయన అటెండర్ సీటులో కూర్చుని ఉన్నారు. ఇదేంటని అడిగితే తాను రిటైరయ్యానని, రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం వచ్చానని, అందుకే ఇక్కడ కూర్చున్నానని చెప్పారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక సార్లు ఆయనను కలిశాను. నాకు చాలా బాధనిపించింది. అప్పుడు వెళ్లిన పనిని కూడా పక్కకుపెట్టి అధికారులను పిలిపించి ఆయన సమస్య పరిష్కరించా..’అని సీఎం అన్నారు. ఇలాంటి పద్ధతి మంచిది కాదని, రిటైరైన వారిని తగినంతగా గౌరవించుకోవాలని చెప్పారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు రిటైరయ్యే సమయానికే వారికి సంబంధించిన రికార్డు సిద్ధంగా ఉండాలని, వీలున్నంత త్వరగా వాటిని అందజేయాలని తెలిపారు. అలసత్వం సరికాదు.. ఇక కారుణ్య నియామకాలకు సంబంధించి చాలా శాఖల్లో అలసత్వం వహిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం బాధలో ఉంటుంది. అలాంటి సమయంలో ఆ కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగమిచ్చి వారికి ఉపశమనం కలిగించాలి. రాబోయే రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్లు, కారుణ్య నియామకాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం. మంచి ఫలితాలు సాధిస్తాం. సింగరేణి కార్మికుల కారుణ్య నియామకాల్లో విద్యార్హతల ఆధారంగా తగిన పోస్టులిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. కొద్దిగా ఓపిక పట్టాలి. సింగరేణిలో పోస్టులు సృష్టించి ఇవ్వలేం. ఖాళీలను బట్టి ప్రయారిటీ మేరకు ఇస్తాం. ఇక సింగరేణి కార్మికులకు ఇన్‌కంట్యాక్స్ రద్దు అనేది రాష్ట్రం పరిధిలో లేదు. ఈ విషయమై ప్రధానిని స్వయంగా కోరాను’ అని సీఎం అన్నారు. తాము కేంద్రాన్ని అడిగితే సింగరేణి ఉద్యోగులకు చేస్తే కోల్ ఇండియాకు కూడా వర్తింపజేయాల్సి వస్తుందని చెప్పారే తప్ప ఇన్‌కంట్యాక్స్ రద్దుపై నిర్ణయం తీసుకోలేదన్నారు. అయినా కేంద్రంపై తాము పోరాటాన్ని ఆపేది లేదని చెప్పారు -
దేవుడి శాఖలో మరో వింత నిబంధన
సాక్షి, హైదరాబాద్: ఆయన దేవాదాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా 35 ఏళ్ల క్రితం చేరాడు. ఏడాదిక్రితం కార్యనిర్వహణాధికారి (ఈఓ)గా పదవీ విరమణ పొందారు. తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసుకోగా, దేవాదాయశాఖలో చేరిన నాటి నుంచి ఏయే దేవాలయాల్లో పనిచేశారో, ఆయా దేవాలయాల ఈఓల నుంచి ‘నో అబ్జెక్షన్’సర్టిఫికెట్స్ తెచ్చి దాఖలు చేయాలని హుకుం జారీ చేశారు. ఆయా దేవాలయాల్లో ఆయన పనిచేసి బదిలీ అయినప్పుడు అన్ని బాధ్యతలు సవ్యంగానే అప్పగించారని, ఎక్కడా ఎలాంటి తప్పులు జరగలేదని ఈఓ సర్టిఫై చేస్తేనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అప్పగిస్తామని మెలిక పెట్టారు. ఆయా దేవాలయాలకు వెళ్లి సర్టిఫికెట్ కోసం అడిగితే, ‘ఆ సమయంలో మేం లేం కదా, నో అబ్జక్షన్ సర్టిఫికెట్ మేమెలా ఇస్తాం’అంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో పదవీ విమరణ పొంది ఏడాది దాటుతున్నా బెనిఫిట్స్ అందటం లేదు, పింఛనూ రావటం లేదు. ఇది ఒక్క అధికారికే పరిమితం కాలేదు. ఇటీవల పదవీ విరమణ పొందిన కార్యనిర్వహణాధికారులు ఎదుర్కొంటున్న సమస్య. ఓ పద్ధతి లేకుండా కొందరు అధికారుల ఇష్టారాజ్యంగా మారిన దేవాదాయశాఖలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారమిది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆ మాజీ అధికారులు, గతంలో తాము పనిచేసిన ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదీ సంగతి... ఏ విభాగంలో అయినా సిబ్బంది పదవీ విరమణ పొందిన వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుతాయి. ఆ వెంటనే పింఛను మంజూరవుతుంది. కానీ, కొందరు అధికారుల ఇష్టారాజ్యానికి చిరునామాగా మారిన దేవాదాయశాఖలో ఇప్పుడు వింత వ్యవహారం చోటు చేసుకుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో ప్రమేయం లేకుండా నేరుగా నియామకాలు జరిగే ఏౖకైక ప్రభుత్వ విభాగం దేవాదాయశాఖ. ఆలయ ట్రస్టీలు, కమిషనరేట్‌లోని కొందరు అధికారులు కూడబలుక్కుంటే అర్హతలతో సంబంధం లేకుండా క్లర్క్‌లుగా నియమించే విధానం ఇందులో ఉంది. అలా క్లర్కులుగా నియమితులై ఆ తర్వాత వేర్వేరు ఆలయాలకు బదిలీ అవుతూ పదోన్నతులు పొందుతుంటారు. సీనియారిటీ ప్రకారం కార్యనిర్వహణాధికారులుగా ప్రమోట్ అయి ఆ తర్వాత సర్వీసు ఉంటే అసిస్టెంట్ కమిషనర్, ఆ పై పోస్టులకు కూడా పదోన్నతులు పొందుతారు. కొందరు ఈఓ స్థాయిలోనే రిటైర్ అవుతారు. గత ఏడాదిన్నరగా రిటైర్ అయిన వారికి కొత్త చిక్కొచ్చిపడింది. సాధారణంగా ఈఓగా పదోన్నతి పొందిన తర్వాత దేవాలయాల బాధ్యత పూర్తిగా వారి చేతిలో ఉంటుంది. మరో దేవాలయానికి బదిలీ అయినప్పుడు ఆ ఆలయ దేవరుల నగలు మొదలు, ఇతర అన్ని లెక్కలను తదుపరి ఈఓకు అప్పగించాలి. ఇప్పుడు ఆ అప్పగింతల తాలూకు ఆరోపణలు, ఫిర్యాదులు ఏమీ లేవన్నట్టుగా ఆయా దేవాలయాల ఈఓల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు కోరారు. కానీ విచిత్రంగా... ఈఓలుగా పదోన్నతి పొందిన నాటి నుంచే కాకుండా, క్లర్క్‌గా విధుల్లో చేరినప్పటి నుంచి ఈ సర్టిఫికెట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. అయితే ప్రారంభం నుంచి పరిశీలిస్తే ఒక్కో అధికారి 20 నుంచి 30 వరకు ఆలయాల్లో పనిచేసి ఉంటారు. అన్ని ఆలయాల నుంచి సర్టిఫికెట్లు తేవటం వారికి సవాల్‌గా మారింది. వారు బదిలీ అయినప్పుడు తాము ఆ దేవాలయంలో లేనందున, ఇప్పుడు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇస్తే, గతంలో జరిగిన లోపాల వివరాలు భవిష్యత్తులో వెలుగు చూస్తే తాము ఇబ్బందుల్లో పడతామని, అందువల్ల తాము సర్టిఫై చేయలేమని వారు చేతులెత్తేస్తున్నారు. దీంతో అన్ని దేవాలయాల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు రాక వీరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ జారీ కొలిక్కి రావటం లేదు. పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసే ఉద్దేశంతోనే ఇలా వేధిస్తున్నారంటూ సిబ్బంది ఆరోపిస్తున్నారు. తాను ఏడాదిన్నర నుంచి బెనిఫిట్స్ కోసం తిరుగుతున్నా అధికారులు కనికరించటం లేదని, తనకు అటు జీతం లేక ఇటు పింఛను రాక ఇబ్బందిగా మారిందని ఓ రిటైర్డ్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఒకేసారి ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చా?
నేను ఇటీవలే రిటైరయ్యాను. ఇద్దరు పిల్లలూ మంచి ఉద్యోగాల్లోనే సెటిలయ్యారు. పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చాయి. వీటినన్నింటినీ ఒకేసారి నాలుగు బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ? ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని బ్యాలన్స్డ్ ఫండ్స్‌ను సూచించండి. –సురేందర్, విజయవాడ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమనేది సరైన నిర్ణయమే. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. చాలా బ్యాలన్స్డ్ ఫండ్స్ తమ నిధుల్లో 75 శాతం వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీల్లో ఎప్పుడూ పెద్ద మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. పైగా ఇప్పుడు స్టాక్ మార్కెట్ రికార్డ్ స్థాయి లాభాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆచి, తూచి ఇన్వెస్ట్ చేయాలి. అంతేకాకుండా ఇవి మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాబట్టి అస్సలు పెద్దమొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. ఉదాహరణకు మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.50 లక్షలు వచ్చాయనుకుందాం. ఇప్పుడు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఏడాది తర్వాత స్టాక్ మార్కెట్ 20 శాతం క్షీణించిందనుకోండి. అప్పుడు మీరు జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్ములు 20 శాతం కరిగిపోతాయి. అసలు బ్యాలన్స్డ్ ఫండ్స్ అనే కాదు. ఏ ఫండ్స్‌లోనూ ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఇన్వెస్ట్ చేసి, వాటిపై ఆదాయం పొందాలనుకుంటే మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. మీకు వచ్చిన రిటైర్మెంట్ మొత్తాల్లో 50 శాతాన్ని బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో 24 నుంచి 36 నెలల్లో ఇన్వెస్ట్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని బ్యాలన్స్డ్ ఫండ్స్‌ను సూచిస్తున్నాం. హెచ్డీఎఫ్సీ బ్యాలన్స్డ్ ఫండ్–డైరెక్ట్ ప్లాన్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్డ్ ఫండ్–డైరెక్ట్ ప్లాన్, ఎల్ అండ్ టీ ఇండియా ప్రుడెన్షియల్ ఫండ్, టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నమ్ బ్యాలన్స్డ్ ఫండ్. నేను డాక్టర్‌గా పనిచేస్తున్నాను. పన్ను ప్రయోజనాల కోసం పీపీఎఫ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పీపీఎఫ్‌లో ఎక్కువ రాబడులు వస్తాయా, ఈఎల్ఎస్ఎస్ల్లో ఎక్కువ రాబడులు వస్తాయా? ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)కు సంబంధించి ఒకే ఫండ్‌లో కంటే రెండు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? –విజయ్, హైదరాబాద్ దీర్ఘకాలంలో మంచి రాబడులు రావాలంటే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడమే అత్యుత్తమ మార్గం. అందుకని సంపద సృష్టి, రాబడుల విషయంలో పీపీఎఫ్ కంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయడమే మంచిది. అయితే స్వల్పకాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం కొంచెం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఐదేళ్లు అంతకు మించిన కాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. ఇక పీపీఎఫ్ విషయానికొస్తే, గ్యారంటీ రాబడులనివ్వడం దీనికున్న ఆకర్షణల్లో ఒకటి. అయితే ద్రవ్యోల్బణపరంగా చూస్తే, రాబడులు నిరాశకు గురిచేస్తాయని చెప్పవచ్చు. డైవర్సిపికేషన్ కోసం పన్ను ఆదా చేసే రెండు ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయండి. ఏడాది క్రితం నేను ఒక క్లోజ్డ్ ఎండ్ మ్యూచువల్ ఫండ్‌లో రూ.3.5 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు నా కూతురి ఉన్నత విద్య అవసరాల కోసం నాకు రూ.లక్ష వరకూ డబ్బులు అవసరమవుతున్నాయి. ఈ క్లోజ్డ్ ఎండ్ ఫండ్ నుంచి నేను డబ్బు విత్‌డ్రా చేసుకునే మార్గాలున్నాయా? –నాగేశ్, విశాఖపట్టణం ఒక క్లోజ్డ్ ఎండ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఆ ఫండ్ మెచ్యూరిటీ అయ్యేదాకా విక్రయించే అవకాశం లేదు. అయితే ఇవి స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో లిస్ట్ అయి, షేర్ల మాదిరే ట్రేడ్అవుతూ ఉంటాయి. మీరు కొనుగోలు చేసిన క్లోజ్డ్ ఎండ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఇలా స్టాక్ మార్కెట్ ద్వారా విక్రయించుకోవచ్చు. కానీ ఇలాంటి ఫండ్స్ యూనిట్ల ట్రేడింగ్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఈ మార్గంలో సదరు ఫండ్స్ యూనిట్లను విక్రయించడం కొంచెం కష్టసాధ్యమైన విషయమేనని చెప్పవచ్చు. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చినా, ఈ యూనిట్లు ఎన్ఏవీ(నెట్ అసెట్ వ్యాల్యూ)కంటే డిస్కౌంట్‌కే ట్రేడవుతాయి. అంటే వాటి అసలు విలువ కంటే తక్కువకే ఆ ఫండ్ యూనిట్లను విక్రయించాల్సి వస్తుంది. అందుకని మీ కూతురి విద్యావసరాల కోసం కావలసిన సొమ్ముల కోసం వేరే మార్గాల ద్వారా ప్రయత్నించండి. ఇప్పుడు పలు బ్యాంక్‌లు విద్యారుణాలిస్తున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలు చేయండి. నేను రెండేళ్ల నుంచి ఒక మ్యూచువల్ ఫండ్‌లో సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కానీ ఏడాది కాలంగా ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ ఆపేయమంటారా ? కొనసాగించమంటారా? –భవానీ, కర్నూలు పనితీరు బాగాలేని ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ ఆపేయాలా? కొనసాగించాలా అని నిర్ణయం తీసుకోవడానికి ఫండ్ మేనేజర్ చరిత్ర, ఆ వ్యక్తికి ఎన్నేళ్ల అనుభవముంది అనే విషయాలు పరిశీలించాలి. ఉదాహరణకు ఒక ఫండ్ మేనేజర్‌కు 20 ఏళ్ల అనుభవముండి, ఆ వ్యక్తి ప్రస్తుత పెట్టుబడి వ్యూహాలు సరిగా లేక ఫండ్ పనితీరు బాగాలేదనుకోండి. మరికొంత కాలం వేచి ఉండి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఒకవేళ ఫండ్ మేనేజర్ అనుభవం 20 ఏళ్ల కంటే తక్కువగానే ఉండి, ఆ వ్యక్తి వ్యూహాల కారణంగా సదరు ఫండ్ పనితీరు బాగా లేకపోతే, ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ ఆపేయడం మంచిది. అనుభవం అధికంగా ఉన్న ఫండ్ మేనేజర్‌కు వివిధ మార్కెట్ సైకిల్స్‌ను చూసిన అనుభవం ఉంటుంది. కాబట్టి ఆ ఫండ్ మేనేజర్ నిర్వహిస్తున్న ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలా, వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి ఏడాది కంటే మరింత ఎక్కువ కాలం ఆ ఫండ్ పనితీరును గమనించాల్సి ఉంటుంది. -
పెన్షన్‌తో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి
కాకినాడ సిటీ :పెన్షన్‌తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు కాకినాడలోని ఐసీడీఎస్ పీడీ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యాన జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలోని కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సుమారు నాలుగు గంటలపాటు ఆందోళన చేశారు. అంగన్వాడీ వర్కర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష గ్రాట్యుటీ చెల్లించాలని, చివరి నెల వేతనంలో సగం పెన్షన్‌గా ఇవ్వాలని, యూనియన్ ప్రతినిధులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం రూ.15 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు జి.బేబీరాణి మాట్లాడుతూ, సుమారు 40 ఏళ్ల నుంచి అతి తక్కువ వేతనాలతో పని చేస్తూ ప్రజలకు సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న అంగన్వాడీలకు పెన్షన్ ఇవ్వకపోవడం సమంజసం కాదన్నారు. అరవయ్యేళ్లు నిండినవారందరికీ రిటైర్మెంట్ కల్పిస్తూ జీఓ నంబర్ 20 విడుదల చేసిన ప్రభుత్వం.. వర్కర్‌కు రూ.50 వేలు, హెల్పర్‌కు రూ.20 వేలు గ్రాట్యుటీ చెల్లిస్తామని ప్రకటించిందన్నారు. అంగన్వాడీ ప్రతినిధులతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీడీపీఓపై చర్యలు తీసుకోవాలి అంగన్వాడీలతో ఇంటి పనులు చేయించుకుంటున్న తుని అర్బన్ సీడీపీఓపై చర్యలు తీసుకోవాలని బేబీరాణి డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో కూడా ఇంట్లో పని చేయాలంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. ఇంటిపనికి రాని వారిని తప్పుడు కారణాలు చూపి మెమోలు ఇవ్వడం, కేంద్రాలకు వెళ్లి అసభ్యకరంగా తిట్టడం వంటి కక్ష సాధింపు చర్యలకు సీడీపీఓ పాల్పడుతున్నారన్నారు. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టీపట్టనట్టు వ్యవహరించడం తగదని, తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వీరలక్ష్మి, ఐద్వా రాష్ట్ర నాయకురాలు టి.సావిత్రి, సీపీఎం నాయకులు పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల వేతన వెతలు
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించక, కనీస వేతనాలూ అందక ఇక్కట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిన్నచూపు పొరుగు రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలుకు నోచుకోని హామీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కొన్నేళ్లుగా వేతన పెరుగుదల లేక అల్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాలు, ప్రస్తుత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలుకాక కుంగిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల ద్వారా 35 వేల అంగన్వాడీ కేంద్రాల ద్వారా పనిచేస్తున్న సుమారు 70 వేల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు... గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు విద్య, పౌష్టికాహారం వంటి అంశాల్లో అవగాహన కల్పిస్తున్నారు. పార్ట్‌టైం ఉద్యోగులైనప్పటికీ పూర్తిసమయాన్ని కేటాయించి పనిచేస్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్లు రూ. 4,200 (కేంద్రం రూ. 3 వేలు, రాష్ర్టం రూ. 1,200), హెల్పర్లు రూ. 2,200 (కేంద్రం రూ. 1,500, రాష్ట్రం రూ. 700) చొప్పున గౌరవ వేతనం అందుకుంటున్నారు. అయితే ఏడేళ్ల నుంచి వేతనాలు, పదేళ్ల నుంచి ప్రమోషన్లకు పరీక్షలు లేకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా తంటాలు పడుతున్నారు. అమలుకాని గత హామీలు ఉమ్మడి రాష్ట్రంలో (గత ఫిబ్రవరిలో సమ్మె సందర్భంగా) అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికల సభల్లో అంగన్వాడీలకు నెలకు రూ.15 వేల వేతనం ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక దాన్ని నిలుపుకోవట్లేదని ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి. గౌరవవేతనం పెంపుదల, పీఎఫ్ ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామని, తెల్లరేషన్ కార్డులిచ్చి ఆరోగ్యశ్రీ అమలయ్యేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపిస్తామని, ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చూస్తామని, ప్రభుత్వ ఆమోదం తర్వాత గౌరవవేతనం పెంచుతామని, పెండింగ్‌లో ఉన్న వేతనాల చెల్లింపు, ఇతర బిల్లుల చెల్లింపు బడ్జెట్ విడుదల తర్వాత ఇస్తామని కొత్త రాష్ట్రంలో గత ఏడాది నవంబర్ 18న చేపట్టిన ‘చలో హైదరాబాద్’ నిరసనల సందర్భంగా అంగన్వాడీ సంఘాలతో అప్పటి మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ డెరైక్టర్ ఆమ్రపాలి రాతపూర్వకంగా హామీలు ఇచ్చారు. అవి కనీసం పరిశీలనకు కూడా నోచుకోలేదు. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, హర్యానా తదితర రాష్ట్రాల్లో అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ల వంటివి ఇస్తున్నారు. మహారాష్ట్రలో వర్కర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.75 వేల చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్, మిగతా రాష్ట్రాల్లో పెన్షన్లు, తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేత నాల చెల్లింపు, కేరళలో ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లను మూడోతరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా, హెల్పర్లను నాలుగోతరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ఇది జరిగే వరకు వర్కర్లకు రూ.15 వేలు, హెల్పర్లు, మినీవర్కర్లకు రూ.12 వేల చొప్పున కనీస వేతనాలు చెల్లించాలని అంగన్వాడీ సంఘాలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి పనిచేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నా తమకు ఏమాత్రం న్యాయం జరగడం లేదంటున్నాయి. కేంద్రం నుంచి నిధులు అందుతున్నందున తాము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా లేదా కనీస వేతనం చెల్లించేందుకు కూడా అంగీకరించలేమని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించే ఎక్కువగా పనిచేస్తున్నందున కేంద్రం కూడా పెద్దగా పట్టించుకోవట్లేదని సంఘాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబోమని చెబుతూనే మరోవైపు తెల్లరేషన్ కార్డులు, వృద్ధాప్య, వితంతు పింఛన్లకు వీరు అర్హులు కారంటూ ప్రభుత్వం చెబుతుండటం గమనార్హం. డిమాండ్లు పరిష్కరించాలి అంగన్వాడీ సంఘాలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు కనీస వేతనం చెల్లించాలని, ఐసీడీఎస్ ప్రాజెక్టులను పటిష్టంగా అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. ప్రతినెలా 5న గౌరవ వేతనాలు చెల్లించడంతోపాటు గత 10 నెలలుగా పెండింగ్‌లో ఉంచిన సెంటర్ల అద్దె బకాయిలను చెల్లించాలని అంగన్వాడీ వర్కర్ల సంఘం (ఏఐటీయూసీ) జనరల్ సెక్రటరీ కరుణ కుమారి డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి అన్ని కేంద్ర సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల 26న నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
కళ్లకు గంతలతో అంగన్వాడీల నిరసన
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్ : తమ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతం రూ. 10వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారానికి పదో రోజుకు చేరుకుంది. సమ్మె చేపట్టి పది రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్‌లో అంగన్వాడీలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయు డివిజన్ ప్రధానకార్యదర్శి తుమ్మ విష్ణువర్ధన్, సీఐటీయు ఖమ్మం అంగన్వాడీల అర్బన్ ప్రాజెక్టు గౌరవధ్యక్షులు మర్రి బాబురావులు మాట్లాడుతూ నిత్యం ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లే అంగన్వాడీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి సరికాదని అన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల వల్ల అంగన్వాడీలు బతికే పరిస్థితి లేదని, అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు అర్బన్ మండల కార్యదర్శి నవీన్‌రెడ్డి, ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు కలంగి ప్రమీల, సుధారాధ, నాయకులు నాగ మణి, బాలకుమారి, మంగ, అంజలి, రజియా పాల్గొన్నారు.