ఒకేసారి ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చా?
నేను ఇటీవలే రిటైరయ్యాను. ఇద్దరు పిల్లలూ మంచి ఉద్యోగాల్లోనే సెటిలయ్యారు. పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చాయి. వీటినన్నింటినీ ఒకేసారి నాలుగు బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ? ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను సూచించండి.
–సురేందర్, విజయవాడ
రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమనేది సరైన నిర్ణయమే. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. చాలా బ్యాలన్స్‌డ్ ఫండ్స్ తమ నిధుల్లో 75 శాతం వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీల్లో ఎప్పుడూ పెద్ద మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. పైగా ఇప్పుడు స్టాక్ మార్కెట్ రికార్డ్ స్థాయి లాభాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆచి, తూచి ఇన్వెస్ట్ చేయాలి. అంతేకాకుండా ఇవి మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాబట్టి అస్సలు పెద్దమొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. ఉదాహరణకు మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.50 లక్షలు వచ్చాయనుకుందాం. ఇప్పుడు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఏడాది తర్వాత స్టాక్ మార్కెట్ 20 శాతం క్షీణించిందనుకోండి. అప్పుడు మీరు జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్ములు 20 శాతం కరిగిపోతాయి. అసలు బ్యాలన్స్‌డ్ ఫండ్స్ అనే కాదు. ఏ ఫండ్స్‌లోనూ ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఇన్వెస్ట్ చేసి, వాటిపై ఆదాయం పొందాలనుకుంటే మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. మీకు వచ్చిన రిటైర్మెంట్ మొత్తాల్లో 50 శాతాన్ని బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో 24 నుంచి 36 నెలల్లో ఇన్వెస్ట్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను సూచిస్తున్నాం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్ ఫండ్–డైరెక్ట్ ప్లాన్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్‌డ్ ఫండ్–డైరెక్ట్ ప్లాన్, ఎల్ అండ్ టీ ఇండియా ప్రుడెన్షియల్ ఫండ్, టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్, ఎస్‌బీఐ మ్యాగ్నమ్ బ్యాలన్స్‌డ్ ఫండ్.
నేను డాక్టర్‌గా పనిచేస్తున్నాను. పన్ను ప్రయోజనాల కోసం పీపీఎఫ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్‌ఎస్‌ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పీపీఎఫ్‌లో ఎక్కువ రాబడులు వస్తాయా, ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఎక్కువ రాబడులు వస్తాయా? ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్)కు సంబంధించి ఒకే ఫండ్‌లో కంటే రెండు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా?
–విజయ్, హైదరాబాద్
దీర్ఘకాలంలో మంచి రాబడులు రావాలంటే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడమే అత్యుత్తమ మార్గం. అందుకని సంపద సృష్టి, రాబడుల విషయంలో పీపీఎఫ్ కంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయడమే మంచిది. అయితే స్వల్పకాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం కొంచెం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఐదేళ్లు అంతకు మించిన కాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. ఇక పీపీఎఫ్ విషయానికొస్తే, గ్యారంటీ రాబడులనివ్వడం దీనికున్న ఆకర్షణల్లో ఒకటి. అయితే ద్రవ్యోల్బణపరంగా చూస్తే, రాబడులు నిరాశకు గురిచేస్తాయని చెప్పవచ్చు. డైవర్సిపికేషన్ కోసం పన్ను ఆదా చేసే రెండు ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి.
ఏడాది క్రితం నేను ఒక క్లోజ్‌డ్ ఎండ్ మ్యూచువల్ ఫండ్‌లో రూ.3.5 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు నా కూతురి ఉన్నత విద్య అవసరాల కోసం నాకు రూ.లక్ష వరకూ డబ్బులు అవసరమవుతున్నాయి. ఈ క్లోజ్‌డ్ ఎండ్ ఫండ్ నుంచి నేను డబ్బు విత్‌డ్రా చేసుకునే మార్గాలున్నాయా?
–నాగేశ్, విశాఖపట్టణం
ఒక క్లోజ్‌డ్ ఎండ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఆ ఫండ్ మెచ్యూరిటీ అయ్యేదాకా విక్రయించే అవకాశం లేదు. అయితే ఇవి స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో లిస్ట్ అయి, షేర్ల మాదిరే ట్రేడ్‌అవుతూ ఉంటాయి. మీరు కొనుగోలు చేసిన క్లోజ్‌డ్ ఎండ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఇలా స్టాక్ మార్కెట్ ద్వారా విక్రయించుకోవచ్చు. కానీ ఇలాంటి ఫండ్స్ యూనిట్ల ట్రేడింగ్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఈ మార్గంలో సదరు ఫండ్స్ యూనిట్లను విక్రయించడం కొంచెం కష్టసాధ్యమైన విషయమేనని చెప్పవచ్చు. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చినా, ఈ యూనిట్లు ఎన్‌ఏవీ(నెట్ అసెట్ వ్యాల్యూ)కంటే డిస్కౌంట్‌కే ట్రేడవుతాయి. అంటే వాటి అసలు విలువ కంటే తక్కువకే ఆ ఫండ్ యూనిట్లను విక్రయించాల్సి వస్తుంది. అందుకని మీ కూతురి విద్యావసరాల కోసం కావలసిన సొమ్ముల కోసం వేరే మార్గాల ద్వారా ప్రయత్నించండి. ఇప్పుడు పలు బ్యాంక్‌లు విద్యారుణాలిస్తున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలు చేయండి.
నేను రెండేళ్ల నుంచి ఒక మ్యూచువల్ ఫండ్‌లో సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కానీ ఏడాది కాలంగా ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఆపేయమంటారా ? కొనసాగించమంటారా?
–భవానీ, కర్నూలు
పనితీరు బాగాలేని ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఆపేయాలా? కొనసాగించాలా అని నిర్ణయం తీసుకోవడానికి ఫండ్ మేనేజర్ చరిత్ర, ఆ వ్యక్తికి ఎన్నేళ్ల అనుభవముంది అనే విషయాలు పరిశీలించాలి. ఉదాహరణకు ఒక ఫండ్ మేనేజర్‌కు 20 ఏళ్ల అనుభవముండి, ఆ వ్యక్తి ప్రస్తుత పెట్టుబడి వ్యూహాలు సరిగా లేక ఫండ్ పనితీరు బాగాలేదనుకోండి. మరికొంత కాలం వేచి ఉండి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఒకవేళ ఫండ్ మేనేజర్ అనుభవం 20 ఏళ్ల కంటే తక్కువగానే ఉండి, ఆ వ్యక్తి వ్యూహాల కారణంగా సదరు ఫండ్ పనితీరు బాగా లేకపోతే, ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఆపేయడం మంచిది. అనుభవం అధికంగా ఉన్న ఫండ్ మేనేజర్‌కు వివిధ మార్కెట్ సైకిల్స్‌ను చూసిన అనుభవం ఉంటుంది. కాబట్టి ఆ ఫండ్ మేనేజర్ నిర్వహిస్తున్న ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలా, వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి ఏడాది కంటే మరింత ఎక్కువ కాలం ఆ ఫండ్ పనితీరును గమనించాల్సి ఉంటుంది.