సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సర్వీసులో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, అధికారులను సత్కరించి ప్రభుత్వం వాహనంలో వారి ఇంటి వద్ద దించి రావాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. వారికి అందాల్సిన రిటైర్‌మెంట్ బెనిఫిట్లు కూడా త్వరగా అందా లని, రిటైరైన రోజు వారికి సన్మానం చేసి ఇంటికి పంపే పద్ధతి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు కొత్త విధానం తెచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, త్వరలోనే ఇలాంటి విధానం తీసుకొస్తామని వెల్లడించారు. సోమవారం ప్రశ్నోత్తరాల్లో భాగంగా సింగరేణి కార్మికుల కారుణ్య నియామకాలపై టీఆర్‌ఎస్ సభ్యులు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణారెడ్డిలు అడిగిన ప్రశ్నలకు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానమిచ్చారు. తర్వాత సభ్యులు లేవనత్తిన అంశాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా చర్చలో సీఎం కలుగజేసుకొని మాట్లాడుతూ.. 30, 35 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేసి రిటైరైన అధికారిని గౌరవించుకోవడం మానవతా దృక్పథం అని చెప్పారు.
చాలా బాధనిపించింది..
‘నాకు తెలిసిన పాండురంగం అనే ఓ ఎలక్ట్రిసిటీ సీఈ ఉన్నారు. ఒకరోజు పనిమీద విద్యుత్ కార్యాలయానికి వెళ్లినప్పుడు చీఫ్ ఇంజనీర్ స్థాయిలో పనిచేసిన ఆయన అటెండర్ సీటులో కూర్చుని ఉన్నారు. ఇదేంటని అడిగితే తాను రిటైరయ్యానని, రిటైర్‌మెంట్ బెనిఫిట్ల కోసం వచ్చానని, అందుకే ఇక్కడ కూర్చున్నానని చెప్పారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక సార్లు ఆయనను కలిశాను. నాకు చాలా బాధనిపించింది. అప్పుడు వెళ్లిన పనిని కూడా పక్కకుపెట్టి అధికారులను పిలిపించి ఆయన సమస్య పరిష్కరించా..’అని సీఎం అన్నారు. ఇలాంటి పద్ధతి మంచిది కాదని, రిటైరైన వారిని తగినంతగా గౌరవించుకోవాలని చెప్పారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు రిటైరయ్యే సమయానికే వారికి సంబంధించిన రికార్డు సిద్ధంగా ఉండాలని, వీలున్నంత త్వరగా వాటిని అందజేయాలని తెలిపారు.
అలసత్వం సరికాదు..
ఇక కారుణ్య నియామకాలకు సంబంధించి చాలా శాఖల్లో అలసత్వం వహిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం బాధలో ఉంటుంది. అలాంటి సమయంలో ఆ కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగమిచ్చి వారికి ఉపశమనం కలిగించాలి. రాబోయే రోజుల్లో రిటైర్‌మెంట్ బెనిఫిట్లు, కారుణ్య నియామకాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం. మంచి ఫలితాలు సాధిస్తాం. సింగరేణి కార్మికుల కారుణ్య నియామకాల్లో విద్యార్హతల ఆధారంగా తగిన పోస్టులిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. కొద్దిగా ఓపిక పట్టాలి. సింగరేణిలో పోస్టులు సృష్టించి ఇవ్వలేం. ఖాళీలను బట్టి ప్రయారిటీ మేరకు ఇస్తాం. ఇక సింగరేణి కార్మికులకు ఇన్‌కంట్యాక్స్ రద్దు అనేది రాష్ట్రం పరిధిలో లేదు. ఈ విషయమై ప్రధానిని స్వయంగా కోరాను’ అని సీఎం అన్నారు. తాము కేంద్రాన్ని అడిగితే సింగరేణి ఉద్యోగులకు చేస్తే కోల్ ఇండియాకు కూడా వర్తింపజేయాల్సి వస్తుందని చెప్పారే తప్ప ఇన్‌కంట్యాక్స్ రద్దుపై నిర్ణయం తీసుకోలేదన్నారు. అయినా కేంద్రంపై తాము పోరాటాన్ని ఆపేది లేదని చెప్పారు
రిటైరైన ఉద్యోగిని సన్మానించి ఇంట్లో దింపాలి
Published Tue, Sep 15 2020 2:41 AM | Last Updated on Tue, Sep 15 2020 2:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment