retired employee
-
64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటు : రిటైర్డ్ ఉద్యోగి సక్సెస్ స్టోరీ
ఒక్కసారి ఉద్యోగంలో చేరి సంసార బాధ్యతల్లో చిక్కుకున్న తరువాత తమ కిష్టమైంది చదువుకోవడం అనేది కలే, దాదాపు అసాధ్యం అనుకుంటాం కదా. కానీ ఈ మాటలన్నీ ఉత్తమాటలే తేల్చి పారేశాడు ఒక రిటైర్డ్ ఉద్యోగి. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? నమ్మలేకపోతున్నారా? అయితే ఒడిశాకు చెందిన జైకిశోర్ ప్రధాన్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈయన సక్సెస్ స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైర్డ్ ఉద్యోగి జై కిశోర్ ప్రధాన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ 64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ కోర్సులో చేరారు. 2020లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG)లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు. ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగ విధులు నిర్వర్తించిన ఆయన రిటైర్మెంట్ తరువాత అందరిలాగా రిలాక్స్ అయిపోలేదు. డాక్టరవ్వాలనే తన చిరకాల వాంఛను తీర్చుకొనేందుకు రంగంలోకి దిగారు. వైద్య విద్య ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి నిబంధన లేకపోవడంతో దృఢ సంకల్పంతో నడుం బిగించారు. అందుకోసం పెద్ద వయసులోనూ కూడా కష్టపడి చదివి జాతీయ స్థాయిలో వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ లో అర్హత సాధించారు.ఎవరీ జై కిశోర్ ప్రధాన్జై కిశోర్ ప్రధాన్ స్వస్థలం ఒడిశాలోని బార్ గఢ్ ప్రాంతం. బాల్యం నుంచే డాక్టర్ అవ్వాలని కలలు కనేవారు. 1974లో మెడికల్ ఎంట్రన్స్ ర్యాంకు రాకపోవడంతో ఆశలు వదిలేసుకున్నారు. బీఎస్సీడిగ్రీ పూర్తి చేసి ఎస్బీఐలో ఉద్యోగం సంపాదించారు. ఈ సమయంలో తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో తండ్రి అనుభవించిన బాధ, కళ్లారా చూసిన జై కిశోర్ ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నారట.జై కిశోర్ జీవితంలో మరో విషాదం వైద్య వృత్తిపై ఉన్న ప్రేమతో తన పెద్దకుమార్తెను డాక్టర్న చేయాలని ఎంతగానో ఆశపడ్డారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆమె ఎంబీబీఎస్ చదువుతుండగా, అనారోగ్యంతో కన్నుమూయడం విషాదాన్ని నింపింది. అయితే తన రెండో కుమార్తెను కూడా మెడిసిన్ చదివిస్తుండటం విశేషం. సాధించాలన్న పట్టుదల ఉండాలేగానీ అనుకున్న లక్ష్యం చేరేందుకు వయసుతో సంబంధం లేదని జై కిశోర్ చాటి చెప్పారు. -
Paital Gagan: బట్టల తాత వచ్చాడోచ్
ఒరిస్సాలో ఏదో ఒక ఉదయం ఏదో ఒక మారుమూల పల్లెలో వ్యాన్ ఆగుతుంది. దానిని చూసిన వెంటనే పిల్లల కళ్లల్లో వెలుగు. కటిక దారిద్య్రం వల్ల చలికాలమైనా వానాకాలమైనా ఒంటి నిండా బట్టలు లేని వారికి గగన్ బట్టలు పంచుతాడు. రిటైర్డ్ ఉద్యోగి అయిన పెయిటల్ గగన్ తన భార్యతో కలిసి ఊరూరా తిరిగి బట్టలు సేకరించి పంచుతాడు. పిల్లల పసినవ్వును ఆశీర్వాదంగా పొందుతాడు. సంఘటనలు అందరికీ ఎదురవుతుంటాయి. కొందరు స్పందిస్తారు. కొందరు స్పందించరు. కొందరు ఆ సంఘటనలతో తమ లక్ష్యాన్ని, కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. అలాంటి వారు ఆదర్శంగా నిలుస్తారు. పదేళ్ల క్రితం– భువనేశ్వర్‌లో చిన్న పోస్టల్ ఉద్యోగైన గగన్ పెయిటల్ ఇంటికి వెళుతున్నాడు. అతనికి వాణి విహార్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక దిక్కులేని మహిళ కనిపించింది. ఆమె చిరిగిన చీర కట్టుకుని ఉంది. గగన్ ఆమెను చూసి జాలిపడి హోటల్ నుంచి ఫుడ్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. కాని ఆమె ‘అన్నం వద్దు. ముందు ఒక చీర ఇవ్వండి’ అని ప్రాధేయపడింది. స్త్రీగా ఆమె అవస్థ గమనించిన గగన్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లి పాత చీర తెచ్చి ఇచ్చాడు. ‘దానిని అందుకుంటూ ఆమె ముఖంలో కనిపించిన సంతోషం అంతా ఇంతా కాదు. ఒంటికి తగిన బట్ట ఉంటేనే మనిషికి మర్యాద. అది లేని వారు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. వారి కోసం ఏదైనా చేయాలి అని నిశ్చయించుకున్నాను’ అంటాడు గగన్. ఉద్యోగంలో ఉండగా మొదలుపెట్టిన ఈ పనిని రిటైరయ్యాక కూడా కొనసాగిస్తున్నాడు. చిన్న ఉద్యోగి అయినా పోస్టాఫీసులో చిరుద్యోగిగా పని చేసి రిటైరైన గగన్ భువనేశ్వర్‌లో చకైసియాని ప్రాంతంలో నివసిస్తాడు. కొడుకు మృత్యుంజయ బలిగూడ అనే ఊళ్లో క్యాబ్ డ్రైవర్. కోడలు టీచర్‌గా పని చేస్తున్నది. ఇతర బాదరబందీలు లేని గగన్ తన భార్య అన్నపూర్ణకు తన ఆలోచన చెప్పాడు. ‘మనం అందరికీ కొత్త బట్టలు ఇవ్వలేం. అలాగని అన్నేసి పాత బట్టలూ ఉండవు. కాబట్టి సేకరించి పంచుదాం’ అన్నాడు. అన్నపూర్ణ అతనికి సహరించడానికి అంగీకరించింది. ఆ రోజు నుంచి గగన్ తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా భువనేశ్వర్‌లోని అపార్ట్మెంట్లకూ హౌసింగ్ కాలనీలకు తిరిగి వాడిన దుస్తులను సేకరిస్తాడు. అవసరమైతే కటక్ వంటి ఇతర పట్టణాలకు కూడా వెళతాడు. ‘పేదలకు పంచుతాం. మీరు ఉపయోగించక పడేసిన దుస్తులు ఇవ్వండి’ అంటే చాలామంది ఇస్తారు. వాటిని తీసుకొస్తాడు గగన్. సరి చేసి, ఇస్త్రీ చేసి ‘మనం బట్టలు పంచినా అవి సరిగ్గా ఉండాలి. మావారు తెచ్చిన బట్టలు ఏవైనా చిరిగి ఉంటే కుట్టి, ఇస్త్రీ చేసి, స్త్రీలవి, పురుషులవి, పిల్లలవి విడివిడిగా ప్యాక్ చేసి కొత్తవిగా కనిపించేలా చేస్తాను’ అంటుంది గగన్ భార్య అన్నపూర్ణ. వాళ్లుండేది చిన్న ఇల్లే అయినా ఒక గది ఖాళీ చేసి పూర్తిగా గోడౌన్‌గా వదిలారు. భార్యాభర్తలిద్దరూ డాబా మీదకు చేరి వాటిని విభజించి మూటలుగా కడతారు. ఆ తర్వాత గగన్ తీసుకెళ్లి పంచుతాడు. బట్టలు, బూట్లు, దోమతెరలు గగన్ ముఖ్యంగా చిన్నపిల్లల కోసం బట్టలు సేకరిస్తాడు. ఒడిసాలో గిరిజన పిల్లలకు సరైన బట్టలు ఉండవు. కొండ ప్రాంతాలకు వెళ్లి వారి బాగోగులు ఎవరూ చూడరు. గగన్ అలాంటి పిల్లల కోసం బట్టలు సేకరించి పంచుతాడు. గగన్ సేవా భావం గమనించిన దాతలు అతనికో వ్యాన్ ఏర్పాటు చేశారు. గగన్‌కు ఏనుగంత బలం వచ్చింది. తాను సేకరించిన బట్టలను వ్యాన్‌లో వేసుకుని మారుమూల పల్లెలకు వెళ్లి పిల్లలకు పంచుతాడు. దోమలు కుట్టి పసికందులు రోగాల బారిన పడకుండా దోమతెరలు పంచుతాడు. బొమ్మలు ఇస్తాడు. పిల్లలు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరిస్తారు. బట్టల తాత అని పిలుస్తారు. పండుగల ముందు ఒడిసాలో చేసుకునే పండగల ముందు చాలా శ్రమించి బట్టలు సేకరిస్తాడు గగన్. పేదలు పండగ సమయంలో వీలైనంత మంచి బట్టలు వేసుకోవాలని ఆ సమయాలలో ప్రత్యేకంగా తీసుకెళ్లి పంచుతాడు. అంతేకాదు పూరి జగన్నాథ రథ యాత్ర సమయంలోనూ, కటక్ దుర్గా పూజకూ ఎక్కడెక్కడి పేదవారో వస్తారు. అక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ పెట్టి మరీ పాత బట్టలు పంచుతాడు. ఈ దేశంలో ప్రతి పేదవాళ్లకి ఒంటినిండా బట్ట దొరికే దాకా గగన్ లాంటి వాళ్లు వందలుగా పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారుగా ఎవరైనా ఉండొచ్చు. ప్రయత్నించాలి... కొద్దిగా మనసు పెట్టాలి అంతే. -
ఉచిత వైద్య పథకం వర్తింపజేయాలి
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత వైద్య ఆరోగ్య పథకం వర్తింప జేయాలని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధి బృందం శనివారం మంత్రి హరీష్ రావును కలిసి వివిధ సమస్యలపై వినతి పత్రం సమర్పించింది. ఈహెచ్ఎస్, టీఎస్జీఆర్ఈఏలలో సభ్యత్వం కల్పించాలని కోరగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ. దామోదర్ రెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి ఎ గంగారెడ్డి, ఉపాధ్యక్షులు రావిళ్ల సీతారామయ్య, నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సొమ్ము’సిల్లుతున్న విశ్రాంత ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: వెంకటయ్య ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి.. పదేళ్ల కింద పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ సమయంలో వచ్చిన మొత్తాన్ని వడ్డీ ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్)లో డిపాజిట్ చేశారు. ఇప్పుడు వెంకటయ్య దంపతులు ఆ డిపాజిట్‌పై వచ్చే వడ్డీతోనే రోజులు గడుపుతున్నారు. ఉన్నట్టుండి ఇప్పుడు వడ్డీ రావటం ఆగింది. సీసీఎస్ కార్యాలయానికి వెళ్లి వాకబు చేస్తే, ప్రతినెలా ఉద్యోగుల వేతనం నుంచి 7 శాతం చొప్పున మినహాయించి సీసీఎస్‌కు జమ చేయాల్సిన మొత్తం సరిగా రావటం లేదన్నారు. అందుకే వడ్డీ చెల్లించేందుకు డబ్బు లేదన్న సమాధానం వచ్చింది. తన డిపాజిట్ మొత్తం తిరిగి ఇమ్మంటే.. ఆర్టీసీ బకాయి పడ్డ మొత్తం చెల్లిస్తేగాని ఇవ్వలేమని చెప్పడంతో ప్రతినెలా నెట్టుకొచ్చేది ఎలా అన్న ఆందోళనలో పడిపోయారు. ఇది ఒక వెంకటయ్య దుస్థితే కాదు. ఆర్టీసీలో పదవీ విరమణ పొంది తమ రిటైర్మెంట్ సాయం మొత్తాన్ని సీసీఎస్‌లో దాచుకున్న దాదాపు 8 వేల మంది ఆవేదన. ఇందులో దాదాపు 4వేల మంది సీసీఎస్ అందించే వడ్డీ మీదే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆందోళనలో ఉన్న ఈ ఉద్యోగులు రోడ్డెక్కబోతున్నారు. విశ్రాంత ఉద్యోగులకు వడ్డీ అందించే ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలంటూ సీసీఎస్ నుంచి బస్‌భవన్ వరకు ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. రావాల్సిన రూ.25 కోట్లు రాకపోవడంతో.. ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత.. నెలనెలా సీసీఎస్‌లో జమ చేసుకున్న మొత్తంతో పాటు వడ్డీ పొందుతారు. దీన్ని చాలా మంది సీసీఎస్‌లోనే డిపాజిట్ చేసి వడ్డీ పొందుతుంటారు. దాన్నే పింఛన్లా భావిస్తుంటారు. ఇలా ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగుల మొత్తం సీసీఎస్‌లో రూ.250 కోట్ల వరకు ఉంది. ప్రస్తుతం ఉద్యోగుల జీతంలోంచి మినహాయించే 7 శాతం మొత్తం నెలకు రూ.25 కోట్లవుతుంది. దీన్ని ప్రతినెలా ఆర్టీసీ సీసీఎస్‌కు సరిగా చెల్లించలేకపోతోంది. దీంతో డిపాజిట్లపై వడ్డీగా చెల్లించాల్సిన నెలవారీ మొత్తం రూ.2.5 కోట్లు చెల్లించడం సీసీఎస్‌కు కష్టంగా మారి.. నిలిపివేసింది. విశ్రాంత జీవితంలో చీకూచింతా లేకుండా గడపాలనుకునే వారికి ఇది పెద్ద సమస్యగా మారింది. ఏడాది క్రితం ఇలాంటి సమస్యే ఏర్పడి కొన్ని నెలల పాటు వీరికి వడ్డీ అందలేదు. సజ్జనార్ ఎండీగా వచ్చిన తర్వాత సమస్య పరిష్కారమైంది. మళ్లీ ఇప్పుడు ఎదురుకావటంతో విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
రూ.కోటి రుణానికి రూ.18లక్షల కమీషన్
హైదరాబాద్: ‘సార్ మీ బ్యాంక్ స్టేట్మెంట్, మీ అసెట్స్ అన్నీ రీజనబుల్‌గా ఉన్నాయి. మీకు రూ.కోటి వరకు లోను ఇస్తామంటూ’ నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగిని నిండా ముంచారు సైబర్ నేరగాళ్లు. శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే రిటైర్డ్ ఉద్యోగికి ఇటీవల ఓ వ్యక్తి కాల్ చేసి లోను ఎర వేశాడు. రూ.కోటి ఇస్తానంటే ఎందుకు కాదనుకోవాలనే ఆలోచనతో ఆ ఉద్యోగి సరేనన్నారు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఇంటి పత్రాలు జిరాక్స్ అన్నీ ఆన్లైన్ ద్వారా సేకరించారు నేరగాళ్లు. ఆ తర్వాత కోటికి పదిశాతం కమీషన్ అంటూ మాయ మాటలు చెప్పసాగారు. అలా డాక్యుమెంట్స్ పేరుతో, ఐటీ పేరుతో తదితర కారణాలు చెప్పి పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.18లక్షలు కాజేశారు. ఈ డబ్బంతా ఆయన పదవీ విరమణ చేసిన అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చిందే. డబ్బు తీసుకుంటున్నారే కానీ రూ.కోటి లోను మాత్రం మంజూరు చేయడం లేదు. తాను ఎక్కడో మోసపోయానని ఆలస్యంగా తేరుకున్న ఆ ఉద్యోగి సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన తాము దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ చెప్పారు. -
మరో వారం రోజుల్లో కేన్సర్ చికిత్స.. అయ్యో కేటుగాళ్లు..
సాక్షి, మహబూబాబాద్(వరంగల్): రిటైర్డ్ ఉద్యోగి ఖాతాలోనుంచి రూ.2.30 లక్షలు మాయమయ్యాయి. ఈ ఘటన మానుకోట జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. మాజీ సైనికుడు పెద్దబోయిన భిక్షపతి మానుకోట సిగ్నల్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈయనకు ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలో రూ.95 వేలు, ఇండియన్ బ్యాంకు ఖాతాలో రూ.35 వేలు మాయమయ్యాయి. బాధితుడు భిక్షపతి ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో చెక్‌బుక్ కోసమని దరఖాస్తు చేయగా వివరాలు తెలుసుకునేందుకు బ్యాంకు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి మాట్లాడి ఫోన్ పెట్టేయగానే మరో నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తులు వివరాలు అడగగానే బ్యాంకు వారే అనుకుని వారు అడిగిన సమాచారం అందించి ఫోన్ కట్‌చేశాడు. ఆ వెంటనే ఆయన ఫోన్‌కు రూ.2.30 లక్షలు ఉపసంహరణ (డ్రా) అయినట్లు మెసేజ్ వచ్చింది. సదరు మూడు బ్యాంకు ఖాతాలకు ఒకే ఫోన్‌నంబర్ లింకు చేశారు. బ్యాంకు అధికారులు అనుకుని గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్‌కు స్పందించి సమాచారం ఇవ్వడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. బ్యాంకు ఖాతాల్లో నగదు పోయినట్లు గుర్తించి వెంటనే బ్యాంకులకు వెళ్లి ఆరాతీయగా ఆయన ఖాతాల్లోని నగదు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే ఆ బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు. తనకు మోసం జరిగిందని గుర్తించిన సదరు బాధితుడు భిక్షపతి, మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరో వారం రోజుల్లో భిక్షపతికి కేన్సర్ చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా ఇంతపెద్ద గోరం జరిగిందని గుండె బాదుకుంటూ బోరున విలపించాడు. పోలీసులు, బ్యాంకు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరాడు. చదవండి: వివాహితతో పరిచయం .. చేనులోకి బలవంతంగా తీసుకెళ్లి.. -
రిటైరైనవారు ప్రభుత్వ సలహాదారులా?
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ఉన్నతోద్యోగులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించడమేమిటని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎక్కువ మొత్తంలో జీతాలు ఇస్తూ మళ్లీ వారిని నియమించడం వల్ల దుబారా ఖర్చు తప్ప ఏమీ ఉండదని ఆ సంస్థ పేర్కొంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. కీలకమైన పోస్టుల్లో పాత వారినే నియమించడంతో ఎక్కువ మొత్తంలో జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొందరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను పదవీ విరమణ తర్వాత సలహాదారులుగా నియమించడం చూస్తుంటే వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేవారనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. వీరే కాక రెవెన్యూ, పంచాయతీరాజ్ వంటి శాఖల్లో ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగిస్తున్నారని, ఇది సమర్థనీయం కాదని అన్నారు. సలహాదారులు, వారి సిబ్బందిపై ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేయడమంటే ప్రజా ధనాన్ని వృథాచేయడమేని స్పష్టం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరారు. చదవండి: తనిఖీల వీడియో వైరల్: ‘సోషల్‌మీడియాను గుడ్డిగా నమ్మొద్దు’ -
ఇదేం బుద్ధి భిక్షపతి.. మైనర్‌పై 4 రోజులుగా అఘాయిత్యం
హసన్‌పర్తి: ఇంటి పక్కన ఉండే ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. ప్రలోభాలకు గురిచేశాడు. లైంగిక దాడికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలోని పరిమళ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన బింగి భిక్షపతి విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. కూతుళ్ల పెళ్లిళ్లు కూడా చేశాడు. ఇంటి వద్దే ఉంటున్న భిక్షపతి కన్ను.. ఇంటి పక్కనే 8వ తరగతి చదువుతున్న బాలికపై పడింది. ఎలాగైనా బాలికను లొంగదీసుకుని కామవాంఛ తీర్చుకోవాలనుకుని.. ఆమెకు వివిధ రకాల వస్తువులు కొనిస్తూ తన వలలో వేసుకున్నాడు. నాలుగు రోజులుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అయితే భిక్షపతి ఇంటికి బాలిక వెళ్తుండటంతో ఆమె బంధువు గమనించింది. ఈ క్రమంలోనే విషయం ఆ నోటా.. ఈ నోటా కాలనీ అంతా పాకింది. దీంతో కాలనీవాసులు 100కు ఫోన్ చేయడంతో సంఘటన స్థలానికి స్థానిక ఎస్సైలు సతీష్‌కుమార్, సంపత్‌కుమార్ చేరుకున్నారు. రిటైర్డ్ ఉద్యోగి భిక్షపతిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. -
బ్యాంక్‌పై కోపం.. ‘నగరంపై మరో ఉగ్ర దాడి’ అంటూ
సాక్షి, హైదరాబాద్: ఓ బ్యాంకు సేవలు నచ్చకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడమో, ఖాతాను మరో బ్యాంకులోకి మార్చుకోవడమో చేస్తాం. నగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం సహనం కోల్పోయి బెదిరింపులకు దిగాడు. ముంబైలోని ఆ బ్యాంక్ కాల్ సెంటర్‌కు ‘నగరంపై మరో ఉగ్ర దాడి జరగనుంది’ అంటూ ఈ–మెయిల్ పంపాడు. ఫలితం సైబర్ టెర్రరిజం ఆరోపణలపై కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది. వివరాలిలా ఉన్నాయి... నగరానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి ఓ జాతీయ బ్యాంకులో పెన్షన్ ఖాతా ఉంది. పెన్షన్ నిబంధనల ప్రకారం ఈ ఖాతా వివరాలను ఆన్లైన్లో పెట్టాల్సి ఉంది. జాప్యం కావడంతో కొన్నాళ్లుగా సదరు రిటైర్డ్ ఉద్యోగికి పెన్షన్ అందట్లేదు. దీంతో ఆయన దీనిపై ఆ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇది పెండింగ్‌లో ఉండిపోవడంతో పలుమార్లు ముంబైలోని బాంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లో (బీకేసీ) ఉన్న బ్యాంక్ కాల్ సెంటర్‌కు ఫోన్లు, ఈ–మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో సహనం కోల్పోయిన నగరవాసి ఆవేశపడ్డారు. బ్యాంకు కస్టమర్ కేర్ ఈ–మెయిల్ ఐడీకి మరో మెయిల్ పంపారు. ఈ కాల్ సెంటర్ ముంబైలోని బీకేసీ కాంప్లెక్స్‌లో ఉందని తెలిసిన ఆయన తన ఈ–మెయిల్లో అతి త్వరలోనే అక్కడ ఉగ్రదాడి జరుగనుందని, దానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అదే మెయిల్లో తన బ్యాంకు ఖాతా నెంబర్, వివరాలను పొందుపరిచారు. దీన్ని చూసి కంగుతిన్న కాల్ సెంటర్ ఉద్యోగులు విషయాన్ని బ్యాంక్ జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బ్యాంకు అధికారులు దీనిపై ఎంఆర్ఏ మార్గ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్వాపరాలు పరిశీలించిన పోలీసులు నగరవాసిపై ఐపీసీలోని 506, 507లతో పాటు ఐటీ యాక్ట్‌లో సైబర్ టెర్రరిజానికి సంబంధించిన 66 ఎఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్యాంకు ఖాతా వివరాలను బట్టి బాధ్యుడు హైదరాబాద్ వాసిగా తేల్చారు. బెదిరింపు ఈ–మెయిల్ వచి్చన ఐపీ అడ్రస్‌లో ఆధారాలు సేకరిస్తున్నారు. అతడి వివరాలు గోప్యంగా.. నిందితుడిని అరెస్టు చేయడానికి ఎంఆర్ఏ మార్గ్ పోలీసులకు చెందిన ప్రత్యేక బృందం త్వరలో హైదరాబాద్‌కు రానుంది. ఈ విషయంపై సదరు ఠాణా అధికారిని సాక్షి బుధవారం ఫోన్ ద్వారా సంప్రదించగా ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అతడి పేరు, వివరాలతోపాటు బ్యాంక్ అధికారుల కోరిక మేరకు ఆ వివరాలు బయటకు చెప్పలేమని అన్నారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం, సేవల్లో లోపంపై స్పందించాల్సిన తీరు ఇది కాదని వ్యాఖ్యానించారు. -
అనంతపురం: పెనుకొండలో అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య
-
విషాదం: అన్న, ఇద్దరు చెల్లెళ్లు ఆత్మహత్య
అనంతపురం: అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం పెనుకొండలో విషాదం నింపింది. ఒకేరోజు ముగ్గురు విష పదార్థం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనుకొండలోని పదవీ విరమణ పొందిన బ్యాంక్ ఉద్యోగి అశ్వర్థప్ప (65) నివాసంలో దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగ అశ్వర్థప్ప, అతడి ఇద్దరు సోదరిలు విగతజీవులుగా పడ్డారు. అయితే వారు కొన్నిరోజుల కిందట విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై పెనుకొండ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. అయితే వారు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో అనే విషయం ఇంకా తెలియరాలేదు. -
64 ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్
భువనేశ్వర్: 40 ఏళ్లపాటు బ్యాంకు ఉద్యోగం చేసి, 4 దశాబ్దాల పాటు సంసార సాగరాన్ని ఈది, పిల్లలను పెంచి పెద్దచేసి, ప్రయోజకులను చేశాక ఎవరైనా సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంటారు. కానీ, ఒడిశాకు చెందిన 64 ఏళ్ళ విశ్రాంత బ్యాంకు ఉద్యోగి జై కిశోర్ ప్రధాన్ మాత్రం అలా అనుకోలేదు. డాక్టర్ అవ్వాలన్న తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు వయస్సుని పక్కనబెట్టి కృషి చేశారు. ఎట్టకేలకు నీట్లో 175 మార్కులు పొంది, 5,94,380 స్కోరుని సాధించి, ఒడిశాలోని బర్లాలో ప్రభుత్వ, వీర్ సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కాలేజీలో నాలుగేళ్ళ ఎంబీబీఎస్ కోర్సులో చేరి తన కల నిజం చేసుకున్నారు. ప్రధాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2016లో డిప్యూటీ మేనేజర్‌గా రిటైర్ అయ్యారు. 1970లో ఇంటర్మీడియట్ అయిన తరువాత ఒకసారి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాశారు. సీటు రాకపోవడంతో బీఎస్సీలో చేరారు. అయితే అప్పటి నుంచి తన కోరిక అసంపూర్ణంగానే ఉండిపోయింది. 15 ఏళ్ళు బ్యాంకు ఉద్యోగం చేశాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని, ఇదే ప్రయత్నం చేయాలను కున్నప్పటికీ కుటుంబం గడవడం కష్టమని భావించారు. కూతుళ్ళిద్దరూ నీట్కి ప్రిపేర్ అవుతుండడంతో వారిని చదివిస్తూ తాను కూడా కృషిని కొనసాగించారు ప్రధాన్. 2019లో సుప్రీంకోర్టు నీట్ పరీక్షకు వయోపరిమితిని తాత్కాలికంగా ఎత్తివేయ డంతో ఇది సాధ్యమైందంటారు ప్రధాన్. అయితే తన కూతుళ్ళలో ఒకరు ఇటీవల మృతి చెందడంతో ప్రధాన్ కుటుంబాన్ని విషాదం వీడలేదు. తన కూతురుకు గుర్తుగా ఈ చదువుని కొనసాగిస్తానంటున్నారు ప్రధాన్. -
రిటైరైన ఉద్యోగిని సన్మానించి ఇంట్లో దింపాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సర్వీసులో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, అధికారులను సత్కరించి ప్రభుత్వం వాహనంలో వారి ఇంటి వద్ద దించి రావాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. వారికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా త్వరగా అందా లని, రిటైరైన రోజు వారికి సన్మానం చేసి ఇంటికి పంపే పద్ధతి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు కొత్త విధానం తెచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, త్వరలోనే ఇలాంటి విధానం తీసుకొస్తామని వెల్లడించారు. సోమవారం ప్రశ్నోత్తరాల్లో భాగంగా సింగరేణి కార్మికుల కారుణ్య నియామకాలపై టీఆర్ఎస్ సభ్యులు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణారెడ్డిలు అడిగిన ప్రశ్నలకు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానమిచ్చారు. తర్వాత సభ్యులు లేవనత్తిన అంశాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా చర్చలో సీఎం కలుగజేసుకొని మాట్లాడుతూ.. 30, 35 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేసి రిటైరైన అధికారిని గౌరవించుకోవడం మానవతా దృక్పథం అని చెప్పారు. చాలా బాధనిపించింది.. ‘నాకు తెలిసిన పాండురంగం అనే ఓ ఎలక్ట్రిసిటీ సీఈ ఉన్నారు. ఒకరోజు పనిమీద విద్యుత్ కార్యాలయానికి వెళ్లినప్పుడు చీఫ్ ఇంజనీర్ స్థాయిలో పనిచేసిన ఆయన అటెండర్ సీటులో కూర్చుని ఉన్నారు. ఇదేంటని అడిగితే తాను రిటైరయ్యానని, రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం వచ్చానని, అందుకే ఇక్కడ కూర్చున్నానని చెప్పారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక సార్లు ఆయనను కలిశాను. నాకు చాలా బాధనిపించింది. అప్పుడు వెళ్లిన పనిని కూడా పక్కకుపెట్టి అధికారులను పిలిపించి ఆయన సమస్య పరిష్కరించా..’అని సీఎం అన్నారు. ఇలాంటి పద్ధతి మంచిది కాదని, రిటైరైన వారిని తగినంతగా గౌరవించుకోవాలని చెప్పారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు రిటైరయ్యే సమయానికే వారికి సంబంధించిన రికార్డు సిద్ధంగా ఉండాలని, వీలున్నంత త్వరగా వాటిని అందజేయాలని తెలిపారు. అలసత్వం సరికాదు.. ఇక కారుణ్య నియామకాలకు సంబంధించి చాలా శాఖల్లో అలసత్వం వహిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం బాధలో ఉంటుంది. అలాంటి సమయంలో ఆ కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగమిచ్చి వారికి ఉపశమనం కలిగించాలి. రాబోయే రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్లు, కారుణ్య నియామకాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం. మంచి ఫలితాలు సాధిస్తాం. సింగరేణి కార్మికుల కారుణ్య నియామకాల్లో విద్యార్హతల ఆధారంగా తగిన పోస్టులిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. కొద్దిగా ఓపిక పట్టాలి. సింగరేణిలో పోస్టులు సృష్టించి ఇవ్వలేం. ఖాళీలను బట్టి ప్రయారిటీ మేరకు ఇస్తాం. ఇక సింగరేణి కార్మికులకు ఇన్‌కంట్యాక్స్ రద్దు అనేది రాష్ట్రం పరిధిలో లేదు. ఈ విషయమై ప్రధానిని స్వయంగా కోరాను’ అని సీఎం అన్నారు. తాము కేంద్రాన్ని అడిగితే సింగరేణి ఉద్యోగులకు చేస్తే కోల్ ఇండియాకు కూడా వర్తింపజేయాల్సి వస్తుందని చెప్పారే తప్ప ఇన్‌కంట్యాక్స్ రద్దుపై నిర్ణయం తీసుకోలేదన్నారు. అయినా కేంద్రంపై తాము పోరాటాన్ని ఆపేది లేదని చెప్పారు -
ఆర్టీసీ నిధులన్నీ హాంఫట్!
ఆయన ఆర్టీసీలో కండక్టర్. పదేళ్ల క్రితం రిటైర్ అయ్యారు. ఐదేళ్ల క్రితం చనిపోయారు. పదవీ విరమణ సమయంలో వచ్చిన మొత్తాన్ని ఆర్టీసీకి అనుబంధంగా ఉండే సహకార పరపతి సంఘం (సీసీఎస్)లో డిపాజిట్ చేశారు. దానిపై రూ.10వేల వడ్డీ ప్రతినెలా ఆయన భార్యకు అందుతోంది. ఆమెకు అదే జీవనాధారం. ఇప్పుడు ఉన్నట్టుండి నిధులు లేవని వడ్డీ ఇవ్వటం మానేశారు. మరి ఆమెకు పూట గడిచేదెలా? డ్రైవర్‌గా పనిచేసి రిటైర్ అయిన ఓ వ్యక్తి కుటుంబంలో ఇద్దరికి కోవిడ్ సోకింది. చికిత్సకు భారీగా ఖర్చయింది. తాను సీసీఎస్‌లో దాచుకున్న డబ్బులోంచి అంత మొత్తం ఇవ్వాలని వేడుకున్నా.. నిధులు లేకపోవటంతో చిల్లిగవ్వ కూడా అందలేదు. సాక్షి, హైదరాబాద్: ఈ ఇద్దరి పరిస్థితే కాదు.. ఆర్టీసీలో పదవీ విరమణ చేసి, అప్పుడు వచ్చిన డబ్బును సీసీఎస్‌లో దాచుకున్న 15 వేల మంది దీనగాథ. ఉద్యోగుల నెల జీతాల్లోంచి కొంత మొత్తం మినహాయిస్తూ కూడిన మొత్తంతో సీసీఎస్ నడుస్తుంది. ఆ నిధుల్లోంచి ఉద్యోగులు కుటుంబ అవసరాలకు రుణాలు తీసుకుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంతింటి నిర్మాణం, ఆస్పత్రుల ఖర్చులు.. ఇలా అన్నింటికి అదే దిక్కు. ఇక రిటైర్ అయిన సమయంలో వచ్చిన మొత్తాన్ని చాలా మంది ఇందులోనే డిపాజిట్ చేసుకుంటారు. ఇక్కడ కాస్త ఎక్కువ వడ్డీ ఇస్తారు. ఆ వడ్డీని పింఛన్ తరహాలో నెలనెలా పొందుతారు. ఇప్పటి వరకు వడ్డీ చెల్లింపులో జాప్యం లేకుండా సీసీఎస్ చెల్లిస్తూ వచ్చింది. కానీ, ఈ నెల వడ్డీ చెల్లించలేక చేతులెత్తేశారు. దీంతో ఈ వడ్డీనే ఆధారంగా చేసుకుని బతుకీడుస్తున్నవారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వడ్డీ సంగతి దేవుడెరుగు, అసలు అందుతుందా అన్న భయం మొదలైంది. ఎందుకీ పరిస్థితి?.. ఉద్యోగి జీతంలో 7 శాతం మొత్తాన్ని ఆర్టీసీ.. సీసీఎస్‌కు చెల్లిస్తుంది. ఆ మొత్తాన్ని రుణాల రూపంలో ఉద్యోగులకు ఇచ్చి.. వచ్చే వడ్డీతో సీసీఎస్ పాలకవర్గం నిధిని పెంపు చేస్తుంది. అలాగే మిగతా మొత్తాన్ని వేరే సంస్థల్లో పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని పొందుతుంది. రుణాలు తీసుకున్న ఉద్యోగుల కిస్తీలను ఆర్టీసీనే ప్రతినెలా వారి జీతం నుంచి మినహాయించి సీసీఎస్‌కు చెల్లిస్తుంది. అలా ప్రతినెలా దాదాపు రూ.40 కోట్లు సీసీఎస్‌కు జమవుతాయి. కానీ గత 19 నెలలుగా ఆర్టీసీ యాజమాన్యం సీసీఎస్‌కు జమ చేయడం మానేసింది. ఇక సీసీఎస్ నిధుల నుంచి రూ.740 కోట్లను ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. దానికి సంబంధించి రూ.140 కోట్ల వడ్డీ పేరుకుపోయింది. ఇక సీసీఎస్ నుంచి ఉద్యోగులు ఇప్పటికే తీసుకున్న రుణాల మొత్తం రూ.800 కోట్లు. వెరసి సీసీఎస్ వద్ద ప్రస్తుతం చిల్లి గవ్వ కూడా లేదు. ఫలితంగా ఆగస్టు నెలకు సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డీ ఇవ్వలేకపోయింది. ఇదే విషయాన్ని పాలక వర్గం ఆర్టీసీ యాజమాన్యాన్ని అడిగితే, మా వద్ద డబ్బు లేదని చేతులెత్తేసింది. కరోనా వేళ బయట అప్పు పుట్టడం కష్టంగా ఉన్న సమయంలో సీసీఎస్ వడ్డీ రాక విశ్రాంత ఉద్యోగులు అల్లాడుతున్నారు. ఇదీ లెక్క.. విశ్రాంత ఉద్యోగులు దాచుకున్న మొత్తం డబ్బు: రూ.370 కోట్లు దీనిపై నెలకు చెల్లించాల్సిన వడ్డీ: రూ.4.5 కోట్లు డబ్బు దాచుకున్న రిటైర్ట్ ఉద్యోగుల సంఖ్య: 15,000 సీసీఎస్ వడ్డీ చెల్లింపు ఇలా... రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులో 50 శాతానికి వడ్డీ: 14% మిగతా 50 శాతానికి వడ్డీ: 10% అదనంగా డిపాజిట్ చేస్తే దానిపై ఇచ్చే వడ్డీ: 8.5% ఈనెల సరుకులకు డబ్బుల్లేవ్ రంగారావు, విశ్రాంత ఉద్యోగి నా రిటైర్మెంట్ డబ్బంతా సీసీఎస్‌లో ఉంచాను. నెలకు రూ.13వేల వడ్డీ వస్తుంది. ఈ నెల వడ్డీ అందలేదు. దీంతో సరుకులు కొనేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాం. వెంటనే నా డిపాజిట్ డబ్బు మొత్తం ఇవ్వాలని కోరుతున్నా. మా అబ్బాయి వద్ద చేయి చాచాల్సి వచ్చింది చంద్రారెడ్డి, విశ్రాంత ఉద్యోగి సీసీఎస్ వడ్డీ డబ్బులతో ఇంతకాలం ఇల్లు గడిచింది. ఈ నెల వడ్డీ రాలేదు. డబ్బులు చాలక మా అబ్బాయి వద్ద చేయి చాచాల్సి వచ్చింది. 72 ఏళ్ల వయసులో నాకు ఎందుకీ ఇబ్బంది. వెంటనే ప్రభుత్వం ఆ డబ్బు చెల్లించేలా సహకరించాలి. -
ప్రేమకథా చిత్రమ్.. @60+
సాక్షి, సిటీబ్యూరో: ఎంతో ఉద్వేగభరితంగా ఉంది. ఆ క్షణంలోసంభ్రమాశ్చర్యాలు. ఆ వెంటనే భయాందోళనలు. ఎవరో వెంటాడి తరుముతున్నట్లు...మరెవరో ఎదురొచ్చి చేరదీస్తున్నట్లు..ఇద్దరిదీ ఒకరకమైన మనస్థితి. ఇద్దరికీ కలిసి ఉండాలని ఉంది. కానీ ఆమె కుటుంబం అందుకు సిద్ధంగా లేదు. ఆ సంతోష సమయంలోనే, ఆ భయాందోళనలోనే ఒకరినొకరు తదేకంగా చూసుకున్నారు. మాట్లాడుకున్నారు. అలా చాలా రోజులే గడిచాయి. చివరకు ఒకరికొకరు ‘తోడు’ కోసం ఏకమయ్యారు. అప్పుడు ఆమె వయసు 56. ఆయన వయసు 62 ఏళ్లు. రాజగోపాల్ పరిమి.ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో సీనియర్ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు, ఓ మధ్యతరగతి గృహిణి ఇందిర. వాళ్ల ప్రేమ పెళ్లికి వేదికైంది తార్నాక. ఇది 2016 నాటి ప్రేమ కథా చిత్రమ్. ‘చిన్నప్పుడెప్పుడో ఆమె ఆరో తరగతిలో పన్నెండేళ్ల వయస్సులో ఉన్నప్పుడు చూశాను. బంధువులమ్మాయే.ఆమెతోనే నా పెళ్లి జరగాల్సి ఉండింది.కానీ ఏవో కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఆ తరువాత ఆమెను ఎప్పుడూ చూడలేదు. తిరిగి యాభై ఆరేళ్ల వయస్సులో ఆమెను చూశాను.....’’ ఎంతో సంతోషంగా చెప్పారు రాజగోపాల్. కోల్పోయిన అపురూపమైన కానుకను తిరిగి పొందిన అనుభూతి ఆమెది. భర్తను పోగొట్టుకొని ఒంటరిగా ఉన్న ఇందిరను, కేన్సర్ కారణంగా భార్యను పోగొట్టుకున్న రాజగోపాల్‌ను ఒక్కటి చేసింది తోడు–నీడ. ఆ విశేషాలు వారి మాటల్లోనే.... ఒంటరి జీవితంలో కుంగిపోయాం... ఆర్పీఎఫ్లో పని చేస్తున్న రోజుల్లోనే నా మొదటి భార్య సరళకు కేన్సర్ జబ్బు వచ్చింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగాం, ఆమెను కాపాడుకోలేకపోయాం. కొడుకులు ఇద్దరు అమెరికాలోనే స్థిరపడ్డారు. సరళ లేని ఒంటరి జీవితం తీవ్రమైన కుంగుబాటుకు గురి చేసింది. చాలా రోజులు డిప్రెషన్‌తో గడిపాను. ఇదంతా 2014 నాటి సంగతి. ఆ రోజుల్లోనే నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఉంటున్న ఇందిర భర్త కూడా చనిపోయాడు. ఆమె కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆమెదీ నా పరిస్థితే. ఆ రోజుల్లోనే ఉప్పల్‌లో, మణికొండలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చిందామె. తరచుగా ఉప్పల్ నుంచి మణికొండకు వెళ్తూ ఉండేది. ఆ సమయంలోనే తిరిగి పరిచయం ఏర్పడింది. అయితే ఫోన్లో మాత్రమే. ఆమెతో మాట్లాడుతున్నప్పుడల్లా ఎంతో ఊరట లభించేది. బంధువులు, కుటుంబ సభ్యుల ఆంక్షల దృష్ట్యా కొద్దిగా ఇబ్బంది పడినా క్రమం తప్పకుండా నాకు ఫోన్ చేసేది. ఉద్యోగరీత్యా రిటైరయ్యాక బీపీ, షుగర్, గుండెజబ్బుల దాడి మొదలైంది. ఒకవైపు ఒంటరితనం, మరోవైపు జబ్బులు. యోగ ప్రాక్టీస్ చేశాను. జబ్బుల నుంచి విముక్తి లభించింది. ఆ సమయంలోనే ఇందిర పరిచయం గొప్ప శక్తినిచ్చింది. బహుశా ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడిపేస్తున్న ఇందిరకు సైతం నా పరిచయంతో ఒక భరోసా లభించింది. అలా కలిశాం... చివరకు ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకొన్నాను. తార్నాక రప్పించాను. తోడు–నీడ వ్యవస్థాపకురాలు రాజేశ్వరి సమక్షంలో కలిశాం. యాభై ఏళ్ల తరువాత ఒకరినొకరం చూసుకొని తీవ్ర ఉద్వేగానికి గురయ్యాం.పెళ్లి ప్రతిపాదనతో ఆమె తీవ్రంగా భయపడింది.చివరకు ఇంట్లో కుటుంబ సభ్యులతో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. చివరకు 2016 జనవరిలో హబ్సీగూడలోని ఓ హోటల్లో పెళ్లి చేసుకున్నాం. నా యోగ టీచర్ నాగేశ్వర్రావు, తోడు–నీడ రాజేశ్వరి పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఇప్పటికీ ఇందిర కుటుంబం, బంధువుల నుంచి వేధింపులు ఉన్నాయి. కానీ మేము మాత్రం హాయిగా జీవిస్తున్నాం..’ అని చెప్పారు. -
అమ్మాయి పేరిట ఫ్రెండ్ రిక్వెస్ట్.. 34 లక్షలకు టోకరా
ఫేస్బుక్ ద్వారా అమ్మాయి పేరుతో పరిచయం చేసుకున్నారు. విశ్రాంత ఉద్యోగికి మాయమాటలు చెప్పారు. వాళ్ల బుట్టలో పడిపోయిన పెద్దాయన మొత్తం 34 లక్షల రూపాయల సొమ్ము వాళ్లకు ట్రాన్స్ఫర్ చేసేశారు. విశ్రాంత జీవితానికి ఉపయోగించుకోవాల్సిన సొమ్ము మొత్తాన్నీ ఒక్క ఫేస్బుక్ మోసంతో పోగొట్టుకొని పోలీసుల్ని ఆశ్రయించారు. ఇంత పెద్ద మోసానికి పాల్పడిన ముఠాను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. కానీ సొమ్ము మొత్తాన్నీ రికవరీ చెయ్యలేకపోయారు. ఇంతకీ ఓ పెద్దాయన్ని సైబర్ నేరగాళ్లు ఎలా ట్రాప్ చేశారు? ఎంఎంటీఎస్‌లో పనిచేసి రిటైర్డ్ అయిన సోయమిర్ కుమార్ దాస్‌కు అన్నే రోజ్ అనే పేరుతో ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అవతలి మహిళ నమ్మకంగా మాట్లాడటంతో సోయమిర్ కుమార్ ఆమెతో ఫ్రెండ్షిప్ చేశారు. వ్యక్తిగత ఆర్థిక విషయాలు పంచుకునే స్థాయికి వాళ్ల స్నేహం వెళ్లింది. తాను మాట్లాడుతున్నది సైబర్ మోసగాళ్లతో అని తెలియని సోమియర్ కుమార్.. తన రిటైర్డ్మెంట్ గురించీ.. తన ఆర్థిక స్థితిగతుల గురించి పంచుకున్నారు. ఈ క్రమంలో తాను విదేశాల్లో ఉంటున్నాననీ.. ఆయన పదవీవిరమణ చేశారు కాబట్టి గిఫ్ట్ కింద విలువైన బహుమతులు, విదేశీ కరెన్సీ పంపుతున్నానని సదరు మహిళ చెప్పారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ కస్టమ్స్ నుంచి కాల్ చేస్తున్నామంటూ మరో కాల్ వచ్చింది. మీకు పెద్ద పార్శిల్ నిండా ఫారెన్ కరెన్సీ వచ్చింది.. అవి మీకు ఇవ్వాలంటే కస్టమ్స్ డ్యూటీ కట్టాలి అంటూ నమ్మబలికారు. నిజమేననుకొని ఆయన.. తన ఏడు అకౌంట్ల వివరాలను వాళ్లకు చెప్పడమే కాకుండా.. 34,19,450 రూపాయల సొమ్మును వాళ్ల ఖాతాల్లోకి పంపేశారు. కట్టిన సొమ్ము మళ్లీ తిరిగి వచ్చేస్తుందనీ.. పైగా భారీగా డబ్బు కూడా వస్తున్నాయి కదా అనుకొని అంత పెద్ద మొత్తాన్ని ఆన్లైన్లో పంపేశారు. అంతే.. మళ్లీ కాల్ చేస్తే ఫోన్ స్విచ్చాఫ్.. ఫేస్ బుక్ లోకి వెళ్లి చూస్తే అకౌంట్ క్లోజ్.. జరిగింది మోసమని గ్రహించిన సోమియర్ కుమార్ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న విశాఖ పోలీసులు ఈ ముఠా ఢిల్లీ నుంచి తమ యాక్టివిటీస్ చేస్తోందని పసిగట్టారు. నేరుగా ఢిల్లీ వెళ్లి ఓ నైజీరియన్తో పాటు.. హర్యానాకు చెందిన కిషన్ లాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నది 2 లక్షల సొమ్ము మాత్రమే. మిగతా 32 లక్షల సొమ్ము అసలు రికవరీ అవుతుందా లేదా కూడా తెలియని పరిస్థితి. అలాగే 95 సిమ్ కార్డులు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారంటే సిమ్ కార్డులు మార్చి మార్చి దేశవ్యాప్తంగా ఈ ముఠా ఎలాంటి మోసాలకు పాల్పడుతోందో అర్థం చేసుకోవచ్చు. అందుకే సైబర్ క్రైమ్ పోలీసులు నేరుగా పరిచయం లేని వ్యక్తులతో ఎప్పుడూ ఆర్థిక లావాదేవీలు చెయ్యకూడదనీ, అసలు సోషల్ మీడియా స్నేహాలనే నమ్మకండి అని చెబుతున్నారు. -
బర్డ్స్ ఫొటోగ్రఫీ అంత తేలిక కాదు..
పదవీ విరమణ చేసిన తర్వాత చాలా మంది ఉద్యోగిణులు ఇంట్లో టీవీ సీరియళ్లు చూస్తూనో.. కిట్టీ పార్టీల్లో కాలక్షేపం చేస్తూనో.. చుట్టుపక్కల వాళ్లతో సరదాగా షాపింగ్ చేస్తూనో గడుపుతుంటారు. అయితే.. డాక్టర్ వీ.ఏ.మంగ మాత్రం పదవీ విరమణ అనంతరం తన అభిరుచికి పదును పెట్టుకున్నారు. తనకున్న అలవాటును సద్వినియోగం చేసుకునే దిశగా చాలా ఓర్పుతోఫొటోగ్రఫీ నేర్చుకోవడమే కాదు.. అందమైన పక్షుల చిత్రాలు కూడా తీసి శెభాష్ అనిపించుకున్నారు. హైదరాబాద్‌లోని ఏఎస్‌రావునగర్‌లో నివసించే వీ.ఏ.మంగ నారాయణగూడలోని భవన్స్ న్యూసైన్స్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ప్రకృతి అంటే ఎంతో ఇష్టంగా భావించే మంగ ఆ ప్రకృతిలోని రమణీయమైన పక్షులను ఫొటోలు తీయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన బృహత్తర కార్యక్రమం విజయవంతంగా ముగించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయని, అవి కొండ ప్రాంతాల్లో, చెరువుల వద్ద, అడవులు, పార్కుల్లో ఉన్నాయని తెలుసుకున్న మంగ వాటి ఫొటోలు తీసేందుకు నడుం బిగించారు. ఐదేళ్ల పాటు శ్రమించిన ఆమె 500 పక్షుల చిత్రాలను తీశారు. అందులో 266 రకాల పక్షులున్నాయి. కేవలం ఫొటోలు తీసి గాలికి వదిలేయలేదు. వాటి పూర్తి వివరాలను అందంగా మల్టీకలర్లో రూపొందించిన ‘బర్డ్స్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్’ గ్రంథాన్ని తీసుకొచ్చారు. ఇందుకోసం ఆమెపడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఒక లెక్చరర్‌గా ఉండి హైదరాబాద్‌లో ఇన్ని రకాల పక్షులు ఉన్నాయని తెలియజేసిన ప్రయత్నం అద్భుతంగా ఉందని ఐపీఎస్ అధికారిణి తేజ్‌దీప్‌కౌర్ ఆమెను ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా అభినందించారు. ఈ పక్షుల వివరాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఇటీవల ఆమె ప్రారంభించారు. పక్షులకు సంబంధించిన పుస్తకాలు చాలా వచ్చినప్పటికీ మంగ ప్రచురించిన గ్రంథం చాలా ప్రత్యేకంగా, వివరణాత్మకంగా ఉందని, చాలా కొత్త విషయాలు విపులీకరించారంటూ ప్రకృతి ప్రేమికులు ప్రశంసించారు. వీ.ఏ.మంగ తీసిన పక్షుల ఫొటోలతో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన.. బర్డ్స్ ఫొటోగ్రఫీ అంత తేలిక కాదు.. తాను సరదాగా ఫొటోలు తీయడం ఆరంభించి, ఆసక్తితో సీరియస్ ఫొటోగ్రాఫర్‌గా మారిపోయి ఐదేళ్లు కష్టపడి తీసిన చిత్రాలతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినట్లు మంగ తెలిపారు. వేలాది ఫొటోలు తీసినప్పటికీ అందులోంచి 500 చిత్రాలను ఎంపిక చేశామని, వీటిలో ఉన్న మరో 226 పక్షులను డాక్యుమెంట్ చేయడం జరిగిందన్నారు. ఫొటోగ్రఫీ అంటే తనకెంతో ఇష్టమని, పక్షులంటే ప్రాణమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం తనకు లభించిన పూర్తి కాలాన్ని సిటీలో ఉన్న పక్షులను చూడటం, కెమెరాల్లో బంధించడం చేస్తూ వచ్చానన్నారు. వన్ ట్రీ మెనీ బర్డ్స్ పేరిట తొలుత కాఫీ టేబుల్ బుక్‌ను విడుదల చేశారు. ఆ పుస్తకానికి లభించిన విశేష స్పందనతో ఇప్పుడు రెండో గ్రంథం బర్డ్స్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ పుస్తకాన్ని తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో పక్షులకు కొదవ లేదని, మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడే పక్షులు ఎక్కువగా ఉన్నాయన్నారు. బర్డ్స్ ఫొటోగ్రఫీ అంత ఈజీ కాదని మామూలు కెమెరాలు ఇందుకు సరిపోవని, లాంగ్ లెన్స్ ఉన్న కెమెరాలు తీసుకొని ప్రతిరోజూ కొండకోనలు, చెరువులు, అడవుల్లో తిరగేదానినని ఆమె వెల్లడించారు. ప్రతిరోజూ 800 నుంచి వెయ్యి వరకు ఫొటోలు తీసినా అందులో అరుదైన ఫొటోలు ఎంపిక చేసుకొని ఎప్పటికప్పుడు కంప్యూటర్లో అప్లోడ్ చేసుకునేదానినని వెల్లడించారు. బర్డ్స్ ఫొటోగ్రఫీ చేయాలంటే ముందుగా బర్డ్స్ వాచ్ ముఖ్యమని, చాలా మంది 20 ఏళ్లు కష్టపడి ఈ ఫొటోలను తీసేవారని, అది కూడా ముగ్గురు, నలుగురు కలిసి తీసేవారని, తాను మాత్రం ఒక్కదాన్నే ఈ ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. -
అడ్రస్ అడిగి.. ఏమార్చారు
సాక్షి, ఖమ్మం : ఖమ్మం నగరంలో పట్టపగలు చోరీలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఓ రిటైర్డ్ ఉద్యో గి బ్యాంక్ నుంచి రూ.50 వేలు డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ అగంతకుడు ఆయన్ను అనుసరించి..అడ్రస్సు అడిగి ఏమార్చి.. చేతిలో ఉన్న రూ.50 వేలు ఉన్న బ్యాగును లాక్కొని ఉడాయించాడు. బాధితుడి కథనం ప్రకారం.. నగరంలోని 10వ డివిజన్ రాధాక్రిష్ణనగర్‌లో నివాసం ఉండే పంచాయతీ రాజ్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి లగడపాటి కృష్ణమూర్తి సోమవారం ఉదయం జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న ఎస్బీఐ బ్రాంచి నుంచి నగదు డ్రా చేసుకోని అక్కడే ఆటో ఎక్కాడు. పాలడెయిరీ ఎదురుగా ఆటో దిగి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ క్యాంప్ కార్యాలయం పక్కనే ఉన్న తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే క్రమంలో వెనక నుంచి ఒక ద్విచక్ర వాహనంపై వచ్చిన ఒక యువకుడు కృష్ణమూర్తిని ఆపి అడ్రసు అడిగి.. ముందుకు వెళ్లిపోయాడు. అనంతరం కృష్ణమూర్తి పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్లేందుకు గేటు తీస్తుండగా.. చేతిలో నగదుతో ఉన్న బ్యాగును లాక్కొని బైక్‌పై ఉడాయించాడు. రెప్పపాటులో జరిగిన సంఘటనతో ఆందోళన చెందిన రిటైర్డ్ ఉద్యోగి కేకలు వేశారు. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో అగంతకుడు క్షణాల్లో పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అర్బన్ సీఐ సాయిరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డెయిరీకి ఎదురుగా ఉన్న దుకాణంలో సీసీ ఫుటేజిని కూడా పరిశీలించి ద్విచక్రవాహనంపై వచ్చిన అగంతకుడి కోసం ఆరా తీశారు. -
‘కేసులు పెట్టలేను.. వాళ్లు లేకుండా బతకలేను’
లక్ష్మీపురం(గుంటూరు): తీవ్ర మనోవేదన భరించలేకపోతున్నానని, చావడానికి అనుమతివ్వాలని కోరుతూ ఓ రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి గుంటూరు అర్బన్ ఎస్పీకి పోలీస్ గ్రీవెన్స్‌లో విన్నవించుకున్నాడు. జగన్నాథరావు 1978లో కుటుంబ సభ్యులను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు అతన్ని మొదట్లో వెలివేసినా తర్వాత దగ్గరై కొంత ఆస్తి ఇచ్చారు. దానిని జగన్నాథరావు భార్య పేరుతో రిజిస్టర్ చేశాడు. అయితే 2011 జూన్‌లో ఆయన భార్య అతనిపై 498ఎ కేసు పెట్టడంతో పాటు కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటకు పంపింది. నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌లో ఉన్న అతని ఇళ్లు స్వాధీనం చేసుకుంది. ‘నాకు నా భార్యాబిడ్డలంటే చాలా ఇష్టం.. వారిపై నేను కేసులు పెట్టలేను.. వాళ్లు లేకుండా బతకలేను.. తీవ్ర మనోవేదనతో నరకయాతన అనుభవిస్తున్నా.. నాకు మరణించేందుకు అనుమతివ్వండి’ అంటూ అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయరావుకు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు. -
వీఆర్ఏ పదోన్నతుల్లో గందరగోళం
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్ఏ)లకు వీఆర్వోలకు పదోన్నతులు కల్పించిన సందర్భంగా గందరగోళం నెలకొంది. నిబంధనలకు పక్కన పెట్టి అనర్హులకు పదోన్నతులు కల్పించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరి నియామకాలే అడ్డదారిలో జరిగాయనే ఆరోపణలు ఉండగా.. అలాంటి వారికి ఇప్పుడు పదోన్నతుల్లో అవకాశం కల్పించడంతో పాటు అర్హులకు అన్యాయం జరిగిందనే విమర్శలు వచ్చాయి. దీంతో ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ తర్వాతే పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచి చెబుతున్నా.. ఎంతో కాలంగా సీనియారిటీ జాబితా, పదోన్నతుల జాబితాలను తయారు చేస్తుండగా పలు తప్పులు దొర్లాయని సంఘాలు ఎత్తి చూపుతూనే ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. చివరకు బుధవారం 81 మంది వీఆర్ఏలకు పదోన్నతులు కల్పిస్తూ రూపొందించిన ఫైల్‌ను కలెక్టర్ ఆమోదించగా.. అందులో చాలా మంది అనర్హులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. పదోన్నతుల జాబితాలో 16 మంది బ్యాన్ పీరియడ్‌లో ఎంపికైన వారు ఉన్నారని వీఆర్ఎ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పదోన్నతుల సందర్భంగా కలెక్టర్‌ను సైతం కొందరు అధికారులు తప్పుదోవ పట్టించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదోన్నతుల జాబితాలో పేర్లు ఉన్న వీఆర్ఏల ఎంపిక, అర్హతలు, ఎంపికైన విధానంలో ఏ మాత్రం స్పష్టత లేదని చెబుతున్నారు. చక్రం తిప్పిన రిటైర్ట్ ఉద్యోగి వీఆర్ఏల పదోన్నతుల్లో కలెక్టరేట్లో సంబంధిత విభాగంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై పని చేస్తున్న ఓ రిటైర్డు ఉద్యోగి చక్రం తిప్పినట్లు తెలిసింది. జాబితా రూపకల్పనలో అక్రమాలకు పాల్పడటమే కాకుండా అధికారులను తప్పుదోవ పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయనతో పాటు కలెక్టరేట్లో కీలక అధికారికి నమ్మిన వ్యక్తులుగా ఉన్న మరో ఇద్దరు.. పైరవీకారులకు కొమ్ము కాసి కలెక్టరేట్ ప్రతిష్టను దిగజార్చారని వీఆర్ఏ సంఘాల నాయకులు ఆరోపించారు. అప్పట్లో కావలికారులు పూర్వ కాలం నుండి గ్రామాల్లో కావలి కారులుగా చెప్పుకునే వీరు అప్పట్లో గ్రామాల్లో పట్టాదారుతో పాటు పాలేరులంతా వంతుల వారీగా విధులు నిర్వహించేవారు. రాను రాను పట్టాదారు చనిపోయిన స్థానాల్లో వారసత్వంగా వారి కుమారులు, కుమార్తెలు, భార్యకు కావలికారు ఉద్యోగం ఇచ్చేవారు. ఇలా కాకుండా కొందరు చనిపోయిన వారి స్థానంలో అప్పటి తహసీల్దార్లను మచ్చిక చేసుకుని ఇతరులను సైతం నియమించారు. కొందరి వద్ద డబ్బులు తీసుకుని పైరవీకారులు నకిలీ ఎంపిక పత్రాలు ఇవ్వడం కలకలం రేపింది. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణకు కొద్ది కాలం క్రితం జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదేశించారు. బ్యాన్ పీరియడ్‌లో 96 మందికి ఉద్యోగాలు గతంలో ఉన్న కావలికారులతో పాటు జిల్లాలోని ఖాళీల ఆధారంగా 2012లో 434 మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ప్రభుత్వం జిల్లాలో నియమించింది. 2014లో మరోసారి 90 మంది వీఆర్ఏలను నేరుగా నియమించారు. ఫిబ్రవరి 1994 నుండి నవంబర్ 2011 వరకు ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ మధ్య కాలంలో ఎలాంటి నియామకాలు చేపట్టరాదని సూచించినా అప్పటి తహసీల్దార్లు పని ఒత్తిడిని సాకుగా చెబుతూ ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లో 96 మంది వీఆర్ఏలను నియమించుకున్నారు. ఆ తర్వాత 2016లో అడ్‌హక్ ప్రమోషన్ పేరుతో 30 మందికి పదోన్నతులు కల్పించారు. దీంతో మిగతా వీఆర్ఏలు కూడా ఒత్తిడి తీసుకురాగా కలెక్టరేట్ అధికారులు సీసీఎల్ఏకు నివేదిక పంపారు. అలాగే, బ్యాన్ పీరియడ్‌లో నియమితులైన వీఆర్ఏలు కోర్టులకు సైతం వెళ్లారు. కలెక్టర్‌ను కలసిన వీఆర్ఏలు వీఆర్ఏ సంఘాల నాయకులు, పలువురు వీఆర్ఏలు బుధవారం జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయనకు వివరించగా ఎవరూ నష్టపోకుండా పదోన్నతులు కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వారు వెల్లడిండారు. 81 మంది వీఆర్ఏలకు పదోన్నతి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న 81 మంది వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ చాంబర్లో పదోన్నతులు పొందిన వీఆర్ఏలకు ఉత్తర్వులు ఆయన అందజేసి విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకట్రావు, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఏఓ ప్రేమ్‌రాజ్, ఆర్డీఓ లక్ష్మీనారాయణ, మెప్మా పీడీ గోపాల్, వీఆర్ఏ సంఘాల నాయకులు గోవిందు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో రిటైర్డ్ ఉద్యోగి సజీవ దహనం
-
చెన్నయ్యది హత్యే
జోగిపేట(అందోల్): డాకూరు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి గంగమొల్ల చెన్నయ్య(65)ది హత్యేనని జోగిపేట సీఐ తిరుపతి రాజు తెలిపారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ పరమేశ్వర్, రమణలతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు సీఐ కథనం మేరకు ఇలా ఉన్నాయి. ఎకరం భూమి కోసం స్వంత చిన్నాన్ననే హత్య చేసిన సంఘటన ఈ నెల 2న జరిగింది. డాకూరు గ్రామానికి చెందిన చెన్నయ్య కొంత కాలంగా జోగిపేటలోని కూరగాయల మార్కెట్లో గది కిరాయికి తీసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన స్వగ్రామం మండల పరిధిలోని డాకూరు. చెన్నయ్య, లక్ష్మయ్యలు అన్నదమ్ములు. వీరు భూముల పంపకాల తర్వాత ఎకరం భూమిని వీరి బావమరిది బాలయ్యపేర రాసి ఇవ్వాల్సి ఉంది. కానీ లక్ష్మయ్య తన కొడుకు గంగమోల్ల బాలయ్య(కేసులో నిందితుడు) పేర రాశాడు. అయితే కొంత కాలంగా చెన్నయ్య ఎకరం పొలాన్ని బావమరిది బాలయ్య కూతురు శృతి పేర రాయాలని నిందితుడైన బాలయ్యపై ఒత్తిడి తెచ్చాడు. అయితే ఆ భూమి మీదుగానే ఫోర్‌లైన్ బైపాస్ రోడ్డు ఏర్పాటవుతుండడంతో భూమి విలువ పెరుగుతుందని బాలయ్య భావించినట్లుగా పోలీసులు తెలిపారు. ఎకరం భూమి కోసం వేధిస్తున్న చిన్నాన్నను అంతమొందిస్తే తనకు అడ్డు ఉండదని నిందితుడు భావించాడు. ఈ క్రమంలో చెన్నయ్య నివాసం ఉండే గదికి వెళ్లి ఒక చేత్తో నోరు మూసి, మరో చేత్తో గొంతు నులిమి హత్య చేసినట్లు సీఐ వివరించారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా గొంతు నులిమి చంపినట్లు తేలిందని చెప్పారు. మొదట్లో చెన్నయ్య మరణానికి సంబంధించి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లుగా కేసు నమోదు చేశారు. అనుమానంతో బాలయ్య, శ్రీనివాస్, మరియమ్మ, దుర్గయ్యల విచారించగా బాలయ్య ఒక్కడే హత్య చేసినట్లుగా రుజువైందని, అతడిపై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మంగళవారం రిమాండ్‌కు పంపుతున్నట్లు చెప్పారు. నిందితులను చూపెట్టవద్దని ఉత్తర్వులువివిధ కేసుల్లో నిందితులను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నట్లు సీఐ తిరుపతి రాజు తెలిపారు. ఈ రోజే దీనికి సంబంధించి పోలీసు శాఖ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారమే హత్య కేసులోని నిందితుడిని ప్రవేశ పెట్టడం లేదని సీఐ చెప్పారు. -
చెట్టు మీద పడి రిటైర్డ్ ఉద్యోగి మృతి
-
రిటైర్డ్ ఉద్యోగి సజీవదహనం
అర్ధరాత్రి తిరువళ్లూరులో కలకలం హత్యకోణంలో పోలీసుల విచారణ తిరువళ్లూరు: పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి పూర్తిగా కాలిన స్థితిలో ఓ మృతదేహం కనిపించిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా రాజావీధిలో కాలిన స్థితిలో మృతదేహం ఉన్న ట్టు స్థానికులు సమాచారం ఇవ్వడంతో టౌన్ పోలీ సులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శరీరం పూర్తిగా కాలిపోయి గుర్తుప ట్టడానికి వీలులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మృ తదేహాన్ని శవపరీక్షల నిమిత్తం తిరువళ్లూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. విచారణలో మృతి చెందిన వ్యక్తి కోర్టు విశ్రాంత ఉద్యోగి కృష్ణమూర్తి(70)గా పోలీసులు గుర్తించారు. ఇతన్ని ఎవరైనా హత్య చేశారా? లేదా ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విజిలెన్స్ అధికారినంటూ టోకరా
తాడేపల్లిగూడెం రూరల్ : విజిలెన్స్ అధికారినంటూ ఓ వ్యక్తి విశ్రాంత ఉద్యోగి నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని ఉడాయించిన ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని గణేష్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ ఎంఈవో దంగేటి సూర్యారావు ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి మోటారు బైక్‌పై బయలుదేరి తాలూకా ఆఫీస్ సెంటర్‌కు చేరుకున్నాడు. ఇంతలో అంబాసిడర్ కారులో ఒక వ్యక్తి దిగి తాను విజిలెన్స్ అధికారినని చెప్పి సూర్యారావును ఆపి బైక్ రికార్డులు చూపించమన్నాడు. తదుపరి అతని చేతికి ఉన్న రెండు బంగారు ఉంగరాలు, బ్రాస్లెట్, మెడలో ఉన్న చైను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. సూర్యారావు అరిచినా ఆగకుండా కారులో ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. దీంతో బాధితుడు సూర్యారావు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై ఐ.వీర్రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంక్ వద్ద రిటైర్డ్ ఉద్యోగి మృతి
పింఛన్ కోసం వచ్చి క్యూలో ఉండగా గుండెపోటు విజయవాడ సెంట్రల్ : పింఛన్ తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చిన రిటైర్డ్ ఉద్యోగి క్యూ లైన్లో మృత్యువాత పడ్డాడు. విజయవాడ నగరపాలక సంస్థ వెహికిల్ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహించిన రెడ్డి సత్యనారాయణ (70) పింఛన్ తీసుకునేందుకు శనివారం నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలోని ఎస్బీఐ బ్యాంక్‌కు వచ్చారు. క్యూలైన్లో నిలబడి ఉండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. క్యూలైన్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు 108కి సమాచారం అందించారు. సుబ్బారావును పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. -
రిటైరయిన ఉద్యోగికి జీతం!
♦ గిరిజన సంక్షేమ శాఖ ఘనకార్యం ♦ పదవీ విరమణ చేయాల్సిన ఉద్యోగికి ఏడాదిగా జీతం ♦ బాధ్యులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆయనో చిరుద్యోగి. ఏడాది క్రితమే పదవీ కాలం పూర్తయింది. ఆ ఉద్యోగి రిటైర్మెంట్ను కప్పిపుచ్చి.. అక్రమంగా ఏడాదిపాటు కొనసాగించారు. నెలనెలా వేతనం చెల్లించారు. ఈ ఘనకార్యం ఎక్కడ జరిగిందో తెలుసా? గిరిజన సంక్షేమ శాఖలో. వివరాల్లోకి వెళితే.. కుల్కచర్ల మండలం కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో ‘వంట మనిషి’గా పనిచేసే కిష్టయ్య రికార్డుల ప్రకారం గతేడాది జూన్ 30న పదవీ విరమణ చేయాల్సివుంది. ఈ విషయాన్ని దాచిపెట్టారో.. మరిచిపోయారో తెలియదుకానీ, ఆశాఖ ఉన్నతాధికారులు ఈయన రిటైర్మెంట్ విషయాన్ని మరచిపోయారు. కిష్టయ్య కూడా ఇదేమీ పట్టించుకోకుండా విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. జీతం (దాదాపు రూ.40వేలు) ఠంచన్‌గా తన ఖాతాలో జమ అవుతోంది. ఇలా ఏడాది గడచిపోయింది. ఇటీవల జిల్లా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రమాదేవి ఉద్యోగుల సర్వీసుల రిజిస్టర్లను పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఏడాదిక్రితమే ఉద్యోగ విరమణ చేయాల్సిన ‘కుక్’కు అక్రమంగా వేతనం చెల్లించినట్లు తేల్చారు. తక్షణమే ఆ ఉద్యోగిని విధుల నుంచి తప్పించి.. ఈ నిర్వాకానికి కారణమైన సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, అలాగే సంబంధిత అధికారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రిటైర్ కావాల్సిన ఉద్యోగి ఏడాదికాలంగా పనిచేస్తున్నా.. గమనించకపోవడం చూస్తే ఆశాఖ అధికారుల నిర్లక్ష్యం ఇట్టే అర్థమవుతోంది. కాగా, జిల్లా కార్యాలయంలోనే ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లు ఉంటున్నందున.. కిష్టయ్య రిటైర్మెంట్ ఎప్పుడనే సమాచారం ఆయన పనిచేసే ఆశ్రమ పాఠశాల వార్డెన్‌కు కూడా తెలియకుండా పోయింది. -
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య
ఇల్లెందు: ఖమ్మం జిల్లాలో సింగరేణి రిటైర్డు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇల్లెందు పట్టణంలోని కోరగుట్టలో బొల్లి మల్లేష్(59) పురుగుల మందు తాగి మరణించాడు. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలానికి చెందిన మల్లేష్ సింగరేణిలో పనిచేసి రిటైరయ్యాడు. ప్రస్తుతం ఇల్లెందులో ఉంటున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పుష్కర ఘాట్‌లో అపశ్రుతి
మామిడికుదురు: తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు మండలం అప్పనపల్లి పుష్కరఘాట్‌లో గుండెపోటుతో ఓ విశ్రాంత ఉద్యోగి మృతి చెందాడు. కాట్రేనికోన మండలం చింతలమెరక గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వాసంశెట్టి నరేందర్‌రావు (62) కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం అప్పనపల్లి పుష్కరఘాట్‌కు వచ్చారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుండెపోటు రావడంతో నరేందర్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, అప్పనపల్లి పుష్కర ఘాట్‌లో ఆదివారం మధ్యాహ్నం 3.30గంటల సమయానికి సుమారు 1.20 లక్షల మంది పుణ్య స్నానాలు చేశారు. -
దీవించమని నగలతో ఉడాయింపు...!
చిక్కడపల్లి : విరాళాలు ఇస్తామంటూ వచ్చిన దుండగులు ఓ రిటైర్డ్ ఉద్యోగినికి చెందిన ఆరు తులాల నగలు ఎత్తుకెళ్లారు. చిక్కడపల్లి డీఐ పి.బల్వంతయ్య కథనం ప్రకారం... గాంధీనగర్ బాకారంలో నివసించే ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని జి. ఉషాదేవి కొంత కాలంగా దోమలగూడలోని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్‌గా పని చేస్తోంది. రోజులాగే గురువారం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉషాదేవి వద్దకు పూజమ్ జ్యువెలర్స్ నుంచి వచ్చామని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. ఫెడరేషన్‌కు విరాళాలు ఇస్తామని, తమవంతుగా ముం దుగా రూ. 200లు విరాళంగా తీసుకోండని టేబుల్‌పై పెట్టారు. ‘ మా జ్యువెలరీ షాపు బాగా నడవాలని ఆశీ ర్వదించ ండి’ అని ఆమె కాళ్లుపై పడి మొక్కుతున్నట్టు న టించి చేతులకున్న ఆరు తులాల బంగారు గాజులను లాక్కొని పారిపోయాడు. ఆమె పరుగెత్తే లోపు ఇంకో వ్యక్తి బైక్‌పై ఇద్దరూ ఉడాయించారు. బాధితురాలు వెం టనే చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
రెండు లక్షల కోసం రిటైర్డ్ ఉద్యోగి కిడ్నాప్!
విశాఖ ఎయిర్ పోర్ట్ జోన్ పరిధిలో రెండు లక్షల రూపాయలు బాకీ ఉన్నాడని ఓ వ్యక్తిని కొంతమంది కలిసి కిడ్నాప్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగి నాగేశ్వరరావును కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆయనను నగరంలోని ఓ హోటల్లో బంధించారు. అనంతరం హైదరాబాద్‌లో ఉన్న నాగేశ్వరరావు కుమార్తెకు వారు ఫోన్ చేసి, తమకు రెండు లక్షల రూపాయలు ఇస్తేనే ఆయనను విడుదల చేస్తామని బెదిరించారు. అయితే, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు ఫోన్ కాల్ ఆధారంగా దుండగుల ఆచూకీ కనుగొన్నారు. వెంటనే అక్కడ సోదా చేసి, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
డబ్బులిచ్చి...రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్ : కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవటంతో మనస్తాపం చెందిన ఆల్విన్ కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి ప్రభాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తాను ఇచ్చిన రూ.30 లక్షలు తిరిగి ఇవ్వనందువల్లే తన ఆత్మహత్యకు బిల్డర్ కారణమంటూ అతడు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. దాంతో బిల్డర్ ఇంటి ముందు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
జల్సాల కోసం.. ఎంతకైనా తెగిస్తారు
కాకినాడ క్రైం :దేశాభ్యున్నతికి పాటుబడాల్సిన ఆ విద్యార్థులు నేరాల బాట పట్టారు. కష్టపడి చది వించిన తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేశారు. జల్సాలకు అలవాటు పడి పథకం ప్రకారం చోరీలు సాగించారు. ఓ రిటైర్డ్ ఉద్యోగిని కూడా హతమార్చారు. ఈ నేరాల్లో కొంద రు విద్యార్థులతో పాటు చదువు మానేసి వివిధ పనులు చేసుకుంటున్న మరికొందరు కూడా కలిశారు. మొత్తం ఎనిమిది మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేసి, రూ.11 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాజమండ్రి త్రీ టౌన్ క్రైం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రామిరెడ్డి విజయ భాస్కర రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ ప్రతాప్‌నగర్‌కు చెందిన కొండపల్లి అరుణ్‌కుమార్ అలియాస్ అరుణ్ బీఎస్సీ ఫైనలియర్ చదువుతూ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. కాకినాడ ప్రతాప్‌నగర్ ట్రెజరీకాలనీకి చెందిన అరుణ్ స్నేహితుడు కాకరపర్తి సాయిరవికాంత్ అలియాస్ రవి రాజమండ్రి సమీపంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. కరప మండలం పెద్దాపురప్పాడుకు చెందిన మేకా గోపి బీకాం చదివాడు. ప్రస్తుతం విశాఖ జిల్లా ఆదర్శనగర్ రైల్వే గేటు వద్ద నివసిస్తున్నారు. పెద్దాపురం మండలం జె.తిమ్మాపురానికి చెందిన పిన్నమరాజు ప్రశాంత్‌వర్మ అలియాస్ ప్రశాంత్ కాకినాడలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. స్థా నిక కొండయ్యపాలేనికి చెందిన మజ్జి విజయ్‌కుమార్ అలియాస్ ఈక ఏడో తరగతి చదివి, కూ లీ పని చేసేవాడు. 2008లో చోరీ కేసులో పోలీ సులకు పట్టుబడి, మూడు నెలల జైలు శిక్ష అనుభవించాడు. కాకినాడ త్రీటౌన్ క్రైం స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. మరో 4 కేసులు పెండింగ్ లో ఉండడంతో బెయిల్‌పై వచ్చి, మళ్లీ చోరీలకు పాల్పడ్డాడు. కరప మండలం పెద్దాపురప్పాడు కు చెందిన బిరుదా మాచారావు అలియాస్ మ హేష్ ఇంటర్ చదువుకున్నాడు. జల్సాలకు అల వాటు పడ్డ మాచారావు తన అమ్మమ్మ, తాతయ్యలను బెదిరించి రూ.80 వేల విలువైన బం గారు ఆభరణాలను అపహరించాడు. స్థానిక కొండయ్యపాలేనికి చెందిన కొశిరెడ్డి సాయికుమార్ అలియాస్ సాయి నాలుగో తరగతి చది వాడు. సైకిల్, స్కూటర్ మెకానిక్, కారు డ్రైవర్ గా పనిచేసేవాడు. స్థానిక జగన్నాథపురం రెవె న్యూ కాలనీకి చెందిన చార్లెస్ రిక్సన్ జోసెఫ్ బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి, విశాఖ పట్నం సీతమ్మధారలో ఉంటున్నాడు. ఇలాఉండగా అరుణ్‌కుమార్, రవి, గోపి, ప్రశాంత్, మాచారావు, చార్లెస్.. హైస్కూల్, కాలేజీల్లో స్నేహితులు. గోపి కారు డ్రైవర్ కావడంతో, అతడికి సాయితో పరిచయం ఏర్పడింది. గోపికి మాచారావు బాల్య స్నేహితుడు. చిన్న చిన్న నేరాలకు పాల్పడే వీరంతా ఏడాది క్రితం ముఠాగా ఏర్పడ్డారు. ఒంటరిగా ఉండే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేసేవారు. ఈ నెల ఒకటిన స్థానిక జీపీటీ సమీపంలో ఒంటరిగా నివసిస్తున్న కాకరమూడి అనురాగం అలియాస్ అనురాధ (61)ను హతమార్చి, బంగారం దొంగిలించారు. ఆమె వద్ద కారు డ్రైవర్‌గా పని చేసిన సాయికుమార్ తన స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ ప్రాంతంలో సాయి, విజయ్‌కుమార్, మాచారావు, చార్లెస్ బయట కాపు కాయగా, అరుణ్‌కుమార్, రవికాంత్, గోపి, ప్రశాంత్ ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె ప్రతిఘటించడంతో ఊపిరాడకుండా చేసి హతమార్చారు. అనంతరం బంగారు ఆభరణాలతో వెనుక గేటు నుంచి పరారయ్యారు. మరిన్ని నేరాలు గతేడాది సెప్టెంబర్ 11న స్థానిక ప్రతాప్‌నగర్‌లో రూ.3.25 లక్షల విలువైన బంగారం, ఈ ఏడాది జూన్ 10న కరప మండలం పెద్దాపురప్పాడులో రూ.80 వేల విలువైన బంగారం, 23న విశాఖపట్నం కంచరపాలెంలో రూ.80 వేల విలువైన బంగారం, ఇతర వస్తువులు దొంగిలించారు. కాకినాడలో ఏడాది కాలంలో 13 బైక్‌లు అపహరించారు. ఒంటరి మహిళల మెడలో ఆభరణాలు తస్కరించారు. నిందితులు దొరికిందిలా.. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో స్థానిక శాంతినగర్‌లోని పాత ఆర్టీఓ ఆఫీసు జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. రెండు వాహనాలపై నలుగురు యువకులు వారికి అనుమానాస్పదంగా తారసపడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, హత్య, దోపిడీలు, చోరీలు, చైన్‌స్నాచింగ్‌ల విషయం వెలుగు చూసింది. ఎనిమిదిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.11 లక్షల విలువైన 280 గ్రాముల బంగారం, రెండు సెల్ఫోన్లు, 13 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠాను పట్టుకుని, ఆయా కేసులను ఛేదించిన పోలీసులను ఎస్పీ జి.విజయ్ కుమార్, డీఎస్పీ విజయభాస్కర రెడ్డి ప్రశంసించారు. క్రైం సీఐ అల్లు సత్యనారాయణ, త్రీటౌన్ క్రైం ఎస్సై సీహెచ్ మహేశ్వర రావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
పెన్షన్ చెల్లింపునకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: పెన్షన్ చెల్లింపులో ఆలస్యాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం రిటైర్డు ఉద్యోగి నేరుగా బ్యాంకుకు అండర్‌టేకింగ్ ఇస్తే వెంటనే ఆ ఉద్యోగి ఖాతాలో పెన్షన్ జమ అవుతుంది. ఇతర పెన్షన్ పత్రాలతో పాటు ఈ అండర్‌టేకింగ్ అందిన వెంటనే సదరు బ్యాంకు ఆ రిటైర్డు ఉద్యోగి ఖాతాలో డబ్బు జమచేస్తుందని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ బుధవారం పేర్కొంది. ఈ అండర్‌టేకింగ్‌ను ఆయా ఆఫీసుల అత్యున్నత అధికారి నుంచి పొందవచ్చని, దానిని పెన్షన్ పేమెంట్ ఆర్డర్, ఇతర పత్రాలతో పాటు సంబంధిత బ్యాంకుకు సమర్పించాలంది. -
తపాలా: ‘దేవుడు చనిపోయాడా నాన్నా?’
నా పేరు శ్యామ్ సుందరరావు. ప్రస్తుతం విశ్రాంత ఉపాధ్యాయుణ్ని. భార్య పుష్ప. ఆమె కూడా విశ్రాంత ఉద్యోగిని. మాకు ఒక అబ్బాయి. పేరు బాలరాజు. మేమంతా వాణ్ని బాలు అని పిలుస్తాం. ప్రస్తుతం భాగ్యనగరంలోనే ఐసీఐసీఐ బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. బాలుకు అప్పుడు అయిదేళ్ల ప్రాయం అనుకుంటాను. నా కొలీగ్ అయిన ఒక మాస్టారుగారింటికి వెళ్లాల్సిన పని ఉంది. ఆ సాయంత్రం మాస్టారుగారింటికి బయలుదేరుతుండగా బాలు, ‘‘నేనూ వస్తా నాన్నా’’ అని అన్నాడు. సరే రమ్మన్నాను. ఇద్దరం మాస్టారుగారింటికి చేరాం. ఇంటి తలుపు మూసి ఉంటే, డోర్ బెల్ కొట్టాను. కొంచెంసేపటికి మాస్టారు భార్య తలుపు తీసింది. ‘‘నమస్తే టీచరుగారండీ’’ అన్నాను. ‘‘నమస్తే మాస్టారుగారండీ’’ - మాస్టారు భార్య ప్రతి నమస్కారం చేసింది. ‘‘ఏం బాలూ! టీచర్‌గారికి నమస్తే పెట్టవా?’’ అని అడిగితే, ‘‘గుడ్ ఈవినింగ్ మిస్’’ అన్నాడు రెండు చేతులూ జోడించి. టీచరు, ‘‘గుడ్ ఈవినింగ్ బాబూ’’ అని, ‘‘నేనింకా మిస్‌ను కాదు బాలూ’’ అని అంటే, ఇద్దరం నవ్వుకున్నాం. ‘‘రండి మాస్టారూ రండి. మా మాస్టారుగారు స్నానం చేస్తున్నారు. రండి కూర్చోండి’’ అన్నారు టీచరు. నేను, బాలు హాలులో కూర్చున్నాం. టీచరు వంటింట్లోకెళ్లారు. నేను టీపాయ్ మీద ఉన్న పేపర్ తీసి, చదవనారంభించాను. బాలు హాల్లోని గోడలకున్న ఫొటోలు చూస్తూ ఉన్నాడు. అవి మాస్టారు పూర్వీకుల ఫొటోలు. వారిప్పుడు లేరు, చనిపోయారు. ‘‘ఫొటోలకు దండలెందుకు వేశారు నాన్నా?’’ అని బాలు నన్నడిగాడు. ‘‘వాళ్లు చనిపోయారమ్మా. చనిపోతే అలా దండలేస్తారు’’ అని చెప్పాను. హాల్లో మరోవైపు గోడకు దేవుళ్లు, దేవతల ఫొటోలున్నాయి. ఆ ఫొటోలకు కూడా దండలు వేసి ఉండటం చూసి, ‘‘దేవుడు చనిపోయాడా నాన్నా?’’ అని అడిగాడు బాలు. ఒక్క క్షణం స్తంభించిపోయాను. వెంటనే... ఏం చెప్పాలో తోచలేదు. ‘‘లేదమ్మా. దేవుడు చనిపోలేదు’’ అని మాత్రం అనగలిగాను గానీ, బాలు అడిగిన ఆ ప్రశ్న దండలు వేసి ఉన్న ఫొటోలు చూసినప్పుడల్లా నా మదిలో మెదులుతూనే ఉంటుంది. - బేతంచర్ల శ్యామ్ సుందర్ వినుకొండ ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
వాహనాలకు ఆకతాయిల నిప్పు
తిరుపతిక్రైం, న్యూస్‌లైన్: తిరుపతిలో వాహనాలకు భద్రత కరు వైంది. ఇంటిముందు పార్క్ చేసిన వాహనాలను ఇంతకాలం దొంగలెత్తుకెళ్లేవారు. ఇప్పుడు ఏకంగా ఆకతాయిలు నిప్పే పెడు తున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఆకతాయిల చేష్టల వల్ల నాలుగు బైక్‌లు, కారు కాలిపోయాయి. కొర్లగుంట వివేకానంద వీధిలో వైద్య ఆరోగ్యశాఖ రిటైర్డు ఉద్యోగి సుబ్రమణ్యంరెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన ఆదివారం రాత్రి తన కారు, స్ల్పెండర్ప్లస్ బైక్‌ను ఇంటిముందు రోడ్డుమీద పార్కు చేశారు. అదే వీధిలో వాసుదేవరెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన స్కూటీ పెప్(ఎపి03 ఎసి3740)ను, అదే ఇంటిలో అద్దెకు ఉంటున్న ఇద్దరు ఎస్వీ మెడికల్ కళాశాల విద్యార్థులు కారుణ్య, సురేష్‌కు చెందిన రెండు బైక్‌లను ఇంటిముందు పార్క్ చేశారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో సుబ్రమణ్యంకు చెందిన కారుతోపాటు పక్కన పార్క్ చేసిన బైక్ మంటల్లో కాలుతుండడాన్ని పొరుగింటివారు గుర్తించి కేకలు వేశారు. అప్పటికే కారు వెనుకభాగం, బైక్ పూర్తిగా కాలిపోయాయి. వారు సుబ్రమణ్యంరెడ్డిని నిద్రలేపి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపు చేసి వెళ్లిపోయారు. తర్వాత మరో 25 నిమిషాలకు వాసుదేవరెడ్డికి చెందిన స్కూటీ పెప్తోపాటు అద్దెకు ఉంటున్న వైద్యవిద్యార్థుల బైక్‌లు సైతం కాలిపోయాయి. బాధితుల ఫిర్యాదుతో సంఘటన జరిగిన రెండు ప్రాంతాలను ఈస్ట్ ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, సిబ్బంది పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశా రు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకతాయిల పనే.. రాత్రిళ్లు మందుబాబులు, ఆకతాయిలు కొర్లగుంట, తుడా సర్కిల్ ప్రాంతాల్లో నిత్యం తిరుగుతుంటారు. తుడారోడ్డులో రెండు మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటితోపాటు పెద్దకాపు లే అవుట్‌లోని ఒక బార్ అండ్ రెస్టారెంట్లో రాత్రి పొద్దుపోయేంతవరకు మద్యం విక్రయాలు జరుపుతుంటారు. అక్కడ మద్యం సేవించిన అకతాయిలు పక్కనే ఉన్న వివేకానంద వీధిలో రోడ్డుమీద పార్క్ చేసిన బైక్‌లపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. తుడా సర్కిల్లో రాత్రిళ్లు రెండు గంటల వరకు ఫుట్ పాత్మీద టిఫిన్లు విక్రయిస్తుండడంతో మందుబాబులు అరుపులు, కేకలతో ఆప్రాంతమంతా అర్ధరాత్రి దద్దరిల్లుతూంటుంది. గస్తీ పోలీసులు ఉన్నట్టా లేనట్టా.. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్లగుంట వివేకానందవీధిలో నైట్ బీట్‌లో ఉన్న కానిస్టేబుళ్లు రాత్రి ఆ ప్రాంతానికి గస్తీకి వెళ్లారా?లేదా? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గస్తీ తిరుగుతుంటే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఉండేది కాదని బాధితులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నైట్ బీట్లను చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. అలాగే కొంతమంది నైట్ బీట్‌లో ఉన్న పోలీస్ సిబ్బంది మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్నారనే అరోపణలు కూడా వినిపిస్తున్నాయి.