ప్రేమకథా చిత్రమ్‌.. @60+ | Indian Railway Retired Employee Love Story | Sakshi
Sakshi News home page

ప్రేమకథా చిత్రమ్‌.. @60+

Published Fri, Feb 14 2020 7:32 AM | Last Updated on Fri, Feb 14 2020 7:32 AM

Indian Railway Retired Employee Love Story - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఎంతో ఉద్వేగభరితంగా ఉంది. ఆ క్షణంలోసంభ్రమాశ్చర్యాలు. ఆ వెంటనే భయాందోళనలు. ఎవరో వెంటాడి తరుముతున్నట్లు...మరెవరో ఎదురొచ్చి చేరదీస్తున్నట్లు..ఇద్దరిదీ ఒకరకమైన మనస్థితి. ఇద్దరికీ కలిసి ఉండాలని ఉంది. కానీ ఆమె కుటుంబం అందుకు సిద్ధంగా లేదు. ఆ సంతోష సమయంలోనే, ఆ భయాందోళనలోనే  ఒకరినొకరు తదేకంగా చూసుకున్నారు. మాట్లాడుకున్నారు. అలా చాలా రోజులే గడిచాయి. చివరకు ఒకరికొకరు ‘తోడు’ కోసం ఏకమయ్యారు. అప్పుడు ఆమె వయసు 56. ఆయన వయసు 62 ఏళ్లు. రాజగోపాల్‌ పరిమి.ఇండియన్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ లో సీనియర్‌ అధికారిగా పనిచేసి  రిటైరయ్యారు, ఓ మధ్యతరగతి  గృహిణి  ఇందిర. వాళ్ల ప్రేమ పెళ్లికి  వేదికైంది తార్నాక. ఇది 2016 నాటి ప్రేమ కథా చిత్రమ్‌. ‘చిన్నప్పుడెప్పుడో ఆమె ఆరో తరగతిలో పన్నెండేళ్ల వయస్సులో ఉన్నప్పుడు చూశాను. బంధువులమ్మాయే.ఆమెతోనే నా పెళ్లి జరగాల్సి ఉండింది.కానీ ఏవో కారణాల వల్ల  అది సాధ్యం కాలేదు.  ఆ తరువాత ఆమెను  ఎప్పుడూ చూడలేదు. తిరిగి యాభై ఆరేళ్ల వయస్సులో ఆమెను చూశాను.....’’  ఎంతో సంతోషంగా చెప్పారు  రాజగోపాల్‌. కోల్పోయిన అపురూపమైన కానుకను తిరిగి పొందిన అనుభూతి ఆమెది. భర్తను పోగొట్టుకొని  ఒంటరిగా ఉన్న ఇందిరను, కేన్సర్‌ కారణంగా భార్యను పోగొట్టుకున్న రాజగోపాల్‌ను ఒక్కటి చేసింది తోడు–నీడ. ఆ విశేషాలు వారి మాటల్లోనే....

ఒంటరి జీవితంలో కుంగిపోయాం...
ఆర్‌పీఎఫ్‌లో పని చేస్తున్న రోజుల్లోనే  నా మొదటి భార్య సరళకు కేన్సర్‌ జబ్బు వచ్చింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగాం, ఆమెను కాపాడుకోలేకపోయాం. కొడుకులు ఇద్దరు  అమెరికాలోనే స్థిరపడ్డారు. సరళ లేని ఒంటరి జీవితం తీవ్రమైన కుంగుబాటుకు గురి చేసింది. చాలా రోజులు డిప్రెషన్‌తో గడిపాను. ఇదంతా 2014 నాటి సంగతి.  ఆ రోజుల్లోనే నెల్లూరు జిల్లా కావలి సమీపంలో  ఉంటున్న ఇందిర  భర్త కూడా చనిపోయాడు. ఆమె కొడుకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆమెదీ నా పరిస్థితే.  ఆ రోజుల్లోనే ఉప్పల్‌లో, మణికొండలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చిందామె. తరచుగా ఉప్పల్‌ నుంచి మణికొండకు వెళ్తూ ఉండేది. ఆ సమయంలోనే  తిరిగి పరిచయం ఏర్పడింది. అయితే ఫోన్‌లో మాత్రమే. ఆమెతో మాట్లాడుతున్నప్పుడల్లా ఎంతో ఊరట లభించేది. బంధువులు, కుటుంబ సభ్యుల ఆంక్షల దృష్ట్యా కొద్దిగా ఇబ్బంది పడినా  క్రమం తప్పకుండా నాకు ఫోన్‌ చేసేది. ఉద్యోగరీత్యా రిటైరయ్యాక బీపీ, షుగర్, గుండెజబ్బుల దాడి మొదలైంది. ఒకవైపు ఒంటరితనం, మరోవైపు జబ్బులు. యోగ ప్రాక్టీస్‌ చేశాను. జబ్బుల నుంచి  విముక్తి లభించింది. ఆ సమయంలోనే ఇందిర పరిచయం గొప్ప శక్తినిచ్చింది. బహుశా ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడిపేస్తున్న ఇందిరకు సైతం నా పరిచయంతో ఒక భరోసా లభించింది. 

అలా కలిశాం...
చివరకు ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకొన్నాను. తార్నాక రప్పించాను. తోడు–నీడ వ్యవస్థాపకురాలు రాజేశ్వరి సమక్షంలో కలిశాం. యాభై ఏళ్ల తరువాత  ఒకరినొకరం చూసుకొని తీవ్ర ఉద్వేగానికి గురయ్యాం.పెళ్లి ప్రతిపాదనతో ఆమె తీవ్రంగా భయపడింది.చివరకు  ఇంట్లో కుటుంబ సభ్యులతో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. చివరకు 2016 జనవరిలో హబ్సీగూడలోని ఓ హోటల్‌లో పెళ్లి చేసుకున్నాం. నా యోగ టీచర్‌ నాగేశ్వర్‌రావు, తోడు–నీడ రాజేశ్వరి పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఇప్పటికీ ఇందిర కుటుంబం, బంధువుల నుంచి వేధింపులు ఉన్నాయి. కానీ మేము మాత్రం హాయిగా జీవిస్తున్నాం..’ అని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement