
హైదరాబాద్: ‘సార్ మీ బ్యాంక్ స్టేట్‌మెంట్, మీ అసెట్స్ అన్నీ రీజనబుల్‌గా ఉన్నాయి. మీకు రూ.కోటి వరకు లోను ఇస్తామంటూ’ నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగిని నిండా ముంచారు సైబర్ నేరగాళ్లు. శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే రిటైర్డ్ ఉద్యోగికి ఇటీవల ఓ వ్యక్తి కాల్ చేసి లోను ఎర వేశాడు. రూ.కోటి ఇస్తానంటే ఎందుకు కాదనుకోవాలనే ఆలోచనతో ఆ ఉద్యోగి సరేనన్నారు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఇంటి పత్రాలు జిరాక్స్ అన్నీ ఆన్‌లైన్ ద్వారా సేకరించారు నేరగాళ్లు.
ఆ తర్వాత కోటికి పదిశాతం కమీషన్ అంటూ మాయ మాటలు చెప్పసాగారు. అలా డాక్యుమెంట్స్ పేరుతో, ఐటీ పేరుతో తదితర కారణాలు చెప్పి పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.18లక్షలు కాజేశారు. ఈ డబ్బంతా ఆయన పదవీ విరమణ చేసిన అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చిందే. డబ్బు తీసుకుంటున్నారే కానీ రూ.కోటి లోను మాత్రం మంజూరు చేయడం లేదు. తాను ఎక్కడో మోసపోయానని ఆలస్యంగా తేరుకున్న ఆ ఉద్యోగి సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన తాము దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment