15 నిమిషాల్లో ఇస్తామని చెప్పి, బెదిరించి రూ. 85 లక్షలు స్వాహా
విశాఖలో వెలుగు చూసిన ఘరానా సైబర్ మోసం
ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ సీబీఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ అండ్ ఇన్‌కంటాక్స్ ఆఫీసర్ల ముఠా ఒక రిటైర్డ్ ఉద్యోగిని నిలువునా ముంచేసింది. ఒకటీ, రెండూ కాదు ఏకంగా రూ.85 లక్షలను స్వాహా చేసింది.
వివరాలు ఇలా ఉన్నాయి.
ఒక ఎంఎన్‌సీ(జర్మనీకి చెందిన ఫార్మా)లో అసోసియేట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి తన కొడుకు చదువుకోసం వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. మే 2న రిటైర్మెంట్ సెటిల్మెంట్ డబ్బులు అతని ఉత్తమ్ నగర్ బ్రాంచ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న ఆయన కుమారుడి వీసా అపాయింట్‌మెంట్ మే 17న ఉంది. ఇక్కడే ముఠా తమ పథకాన్ని పక్కాగా అమలు చేసింది.
మే 14న, తండ్రి రికార్డులను తనిఖీ చేస్తామంటూ నకిలీ ముఠా రంగంలోకి దిగింది. పథకం ప్రకారమే రెండు రోజుల పాటు స్కైప్‌లో 'ఇంటరాగేషన్’ చేసి, ఫేక్ ఐడీ కార్డులు చూపించి ఆయన్ను నమ్మించింది.
నకిలీ సైబర్ క్రైమ్ డీసీపీ అంటూ బాధితుడికి మరో వ్యక్తి ఫోన్ చేశాడు. మాదక ద్రవ్యాలు , మనీలాండరింగ్ అలాంటి అనేక కేసుల్లో నీ పేరు వచ్చిందని, ఈ కేసులన్నింటికీ తన ఆధార్ లింక్ చేసి ఉన్నట్టు బెదించారు. అంతేకాదు మరొక వ్యక్తికి డయల్ చేసి,ఇతనిపై (రిటైర్డ్ ఉద్యోగి)ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలా అంటూ నాటకమాటాడు. ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అంటూ ఆదేశించాడు. లేదంటే జైలుకెళతావని కూడా బెదిరించాడు.
దీంతో తీవ్ర భయానికి, ఒత్తిడికి లోనైనాడు. ఇంతలోనే నకిలీ డీసిపీ మళ్లీ ఫోన్ చేసి మీరు నిర్దోషిగా కనిపిస్తున్నారు, కాబట్టి. రూ.85 లక్షలు తక్షణమే చెల్లించండి. వెరిఫికేషన్ తర్వాత 15 నిమిషాల్లో తిరిగి ఇస్తానని నకిలీ అధికారులు హామీ ఇవ్వడంతో దీన్ని నమ్మిన బాధితుడు చెక్కు ద్వారా చెల్లింపు చేశారు.
విశాఖపట్నంలో పోలీసులకు దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) ప్రకారం ఈ నగదును ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో హెచ్‌డిఎఫ్‌సి ఖాతాను నిర్వహిస్తున్న 'రాణా గార్మెంట్స్' అనే కంపెనీకి బదిలీ చేసింది. తరువాత దేశవ్యాప్తంగా ఉన్న మరో 105 ఖాతాలకు ఈ సొమ్మును బదిలీ చేసినట్టు తేలింది.
విశాఖ బ్యాంకులోని కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందని, రిటైర్మెంట్ తర్వాత అతను పొందిన డబ్బులు, తన ఖాతా గురించి మొత్తం సమాచారం ఈ ముఠాకు తెలుసునని ఆరోపించారు. అలాగే రాణా గార్మెంట్స్ KYC వివరాలు బ్యాంకు దగ్గర లేవా ఆయన అని ప్రశ్నించారు.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉత్తమ్ నగర్ బ్రాంచ్ కూడాపోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖ క్రైం బ్రాంచ్ ఈ కేసును టేకోవర్ చేసింది. కేసు దర్యాప్తులో ఉందని, తమకు కొన్ని ఆధారాలు లభించాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment