fake officers
-
చదువుకు దాచిన డబ్బులు... సైబర్ నేరగాళ్ల పాలు!
ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ సీబీఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ అండ్ ఇన్‌కంటాక్స్ ఆఫీసర్ల ముఠా ఒక రిటైర్డ్ ఉద్యోగిని నిలువునా ముంచేసింది. ఒకటీ, రెండూ కాదు ఏకంగా రూ.85 లక్షలను స్వాహా చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.ఒక ఎంఎన్సీ(జర్మనీకి చెందిన ఫార్మా)లో అసోసియేట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి తన కొడుకు చదువుకోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మే 2న రిటైర్మెంట్ సెటిల్మెంట్ డబ్బులు అతని ఉత్తమ్ నగర్ బ్రాంచ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న ఆయన కుమారుడి వీసా అపాయింట్మెంట్ మే 17న ఉంది. ఇక్కడే ముఠా తమ పథకాన్ని పక్కాగా అమలు చేసింది. మే 14న, తండ్రి రికార్డులను తనిఖీ చేస్తామంటూ నకిలీ ముఠా రంగంలోకి దిగింది. పథకం ప్రకారమే రెండు రోజుల పాటు స్కైప్‌లో 'ఇంటరాగేషన్’ చేసి, ఫేక్ ఐడీ కార్డులు చూపించి ఆయన్ను నమ్మించింది. నకిలీ సైబర్ క్రైమ్ డీసీపీ అంటూ బాధితుడికి మరో వ్యక్తి ఫోన్ చేశాడు. మాదక ద్రవ్యాలు , మనీలాండరింగ్ అలాంటి అనేక కేసుల్లో నీ పేరు వచ్చిందని, ఈ కేసులన్నింటికీ తన ఆధార్ లింక్ చేసి ఉన్నట్టు బెదించారు. అంతేకాదు మరొక వ్యక్తికి డయల్ చేసి,ఇతనిపై (రిటైర్డ్ ఉద్యోగి)ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా అంటూ నాటకమాటాడు. ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అంటూ ఆదేశించాడు. లేదంటే జైలుకెళతావని కూడా బెదిరించాడు. దీంతో తీవ్ర భయానికి, ఒత్తిడికి లోనైనాడు. ఇంతలోనే నకిలీ డీసిపీ మళ్లీ ఫోన్ చేసి మీరు నిర్దోషిగా కనిపిస్తున్నారు, కాబట్టి. రూ.85 లక్షలు తక్షణమే చెల్లించండి. వెరిఫికేషన్ తర్వాత 15 నిమిషాల్లో తిరిగి ఇస్తానని నకిలీ అధికారులు హామీ ఇవ్వడంతో దీన్ని నమ్మిన బాధితుడు చెక్కు ద్వారా చెల్లింపు చేశారు. విశాఖపట్నంలో పోలీసులకు దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ప్రకారం ఈ నగదును ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో హెచ్‌డిఎఫ్‌సి ఖాతాను నిర్వహిస్తున్న 'రాణా గార్మెంట్స్' అనే కంపెనీకి బదిలీ చేసింది. తరువాత దేశవ్యాప్తంగా ఉన్న మరో 105 ఖాతాలకు ఈ సొమ్మును బదిలీ చేసినట్టు తేలింది. విశాఖ బ్యాంకులోని కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందని, రిటైర్మెంట్ తర్వాత అతను పొందిన డబ్బులు, తన ఖాతా గురించి మొత్తం సమాచారం ఈ ముఠాకు తెలుసునని ఆరోపించారు. అలాగే రాణా గార్మెంట్స్ KYC వివరాలు బ్యాంకు దగ్గర లేవా ఆయన అని ప్రశ్నించారు.హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉత్తమ్ నగర్ బ్రాంచ్ కూడాపోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖ క్రైం బ్రాంచ్ ఈ కేసును టేకోవర్ చేసింది. కేసు దర్యాప్తులో ఉందని, తమకు కొన్ని ఆధారాలు లభించాయని పోలీసు వర్గాలు తెలిపాయి. -
షాకింగ్ ఫ్రాడ్: సీనియర్ టెకీని ఏకంగా రూ. 3.7 కోట్లకు ముంచేశారు
ఛాన్స్ దొరికితే చాలు.. కాదు కాదు.. సందు దొరకబుచ్చుకుని మరీ సేబర్ నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా దిగ్గజ ఐటీ కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌కు టోకరా ఇచ్చి మూడు కోట్లు దోచేసిన వైనం కలకలం రేపింది. పోలీసుల అధికారుల పేరుతో ఇన్ఫోసిస్ ఉద్యోగిని భయపెట్టి, బెదిరించి నిలువునా ముంచేశారు. నకిలీ పోలీసు స్టేషన్ సృష్టించిన ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని ఇన్ఫోసిస్ ఉద్యోగి ఇచ్చిన పోలీసుల ఫిర్యాదు మేరకు సైబర్ నేరగాళ్లు అతడిని టార్గెట్‌గా చేసుకున్నారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), సీబీఐ, ముంబై పోలీసుల అధికారుల అవతారమెత్తారు. మనీలాండరింగ్‌తో సహా పలు నేరాలకు పాల్పడ్డావంటూ తీవ్రంగా బెదిరించారు. అరెస్టుకు సిద్ధమని హెచ్చరించారు. నవంబర్ 21న ఫోన్ చేసిన మోసగాళ్లు మనీలాండరింగ్‌తో పాటు అనేక నేరారోపణల కింద, అరెస్టు చేస్తామని బెదిరించారు. ట్రాయ్ అధికారిగా పరిచయం చేసుకున్న కేటుగాడు పేరు మీద ఉన్న సిమ్‌కార్డు అక్రమ ప్రకటనల కోసం వినియోగిస్తున్నారని తెలిపాడు. షాక్ తిన్న ఇన్ఫోసిస్ టెకీ ఆ నంబర్ తనది కాదని చెప్పాడు. ఆధార్ కార్డ్ మీద సిమ్ కార్డు రిజిస్టర్ అయిందన్నాడు. ఆ మరునాడు తాను ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారినని మరొకడు ఫోన్ ఏశాడు. ఢిల్లీ, ముంబైలలో ఇదే కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఇందులో ఒకటి ముంబైలోని వకోలా పోలీస్ స్టేషన్లో, మరొకటి ముంబైలో మనీలాండరింగ్ కేసులని మ్మ బలికాడు తాను చెప్పిన మాట వినకుంటే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరించారు. అంతేకాదు వీడియో కాల్ చేసిన మోసగాళ్ళు అతడిని మరింత భయపెట్టారు. వీడియో కాల్లో నకిలీ పోలీస్ స్టేషన్, నకిలీ పోలీసులు, ఐడి కార్డులు ..ఇలా పెద్ద తతంగమే చేశారు. ఫిర్యాదు (తప్పుడు) కాపీని కూడా చూపించారు. దీంతో అయోమయం, గందరగోళానికి గురైన టెకీ మోసగాళ్లు చెప్పినట్లే చేశాడు. తన ఖాతాలో ఉన్న రూ.3.7 కోట్లను మోసగాళ్లకు వివిధ ఖాతాలకు బదిలీ చేశారు. ఇదంతా నవంబర్ 21 నుంచి 23 మధ్య జరిగింది. ఈ షాక్ నుంచి తేరుకున్నాక మోసపోయానని గ్రహించాడు. దీంతో నవంబర్ 25న పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 3 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినందున కేసును క్రిమినల్ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ)కి బదిలీ చేయనున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. అక్రమార్కుల బ్యాంకు ఖాతాలపై ఆరా తీస్తున్నారు. -
నకిలీ ఈడీ అధికారుల అరెస్ట్
నెల్లూరు (క్రైమ్) (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల వేషంలో బంగారు దుకాణంలో దోపిడీకి యత్నించిన ఏడుగురు నిందితులను నెల్లూరు సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎయిర్ పిస్టల్, పెల్లెట్స్, రెండు ఇన్నోవా కార్లు, తొమ్మిది సెల్ఫోన్లు, నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ (క్రైమ్స్) కె.చౌడేశ్వరి ఈ వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణాపురానికి చెందిన ఆరవీటి రమేష్ వ్యాపార రీత్యా హైదరాబాద్‌లోని మియాపూర్‌లో స్థిరపడ్డాడు. వివిధ వ్యాపారాలు చేసి అప్పుల పాలయ్యాడు. హైదరాబాద్‌లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూ యజమానిని రూ.కోటి వరకు మోసగించాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న ముషీరాబాద్‌కు చెందిన కౌశల్రావును తన పీఏగా పెట్టుకున్నాడు. కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు రమేష్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. తన బావ హత్య కేసులో రమేష్‌ను 2018లో కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రమేష్‌కు దొంగనోట్ల కేసులో అదే జైలులో ఉన్న శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లికి చెందిన యోగానంద్‌గౌడ్ అలియాస్ యోగితో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలయ్యాక రమేష్ తిరిగి హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ హోల్‌సేల్ వ్యాపారుల వద్ద బంగారు ఆభరణాలు కొని కందుకూరు, పొదిలి తదితర ప్రాంతాల్లోని వ్యాపారులకు కమీషన్ పద్ధతిపై సరఫరా చేసేవాడు. పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని.. వ్యాపారం చేస్తున్నా ఆశించిన స్థాయిలో డబ్బులు రాకపోవడంతో ఎలాగైనా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని రమేష్ నిర్ణయించుకున్నాడు. ఈడీ అధికారులు ఎక్కడైనా దాడులు చేయొచ్చు.. ఏదైనా సీజ్ చేయొచ్చని పత్రికల్లో వచ్చిన కథనాలను చదివాడు. నకిలీ ఈడీ అధికారి అవతారమెత్తి బంగారు ఆభరణాలు కాజేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని యోగానంద్గౌడ్కు, పీఏ కౌశల్రావుకు తెలియజేశాడు. యోగానంద్‌గౌడ్ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన మద్దిలేటి గౌడ్, నంద్యాల జిల్లాకు చెందిన జి.బాలకృష్ణ, మామిళ్లపల్లికి చెందిన జి.బాబును కలిశాడు. ఈ ఆరుగురు గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. పక్కాగా రెక్కీ నిర్వహించి.. ఈ క్రమంలో ఎక్కువ బంగారం ఏ దుకాణంలో ఉంటుందో గ్యాంగ్ రెక్కీ నిర్వహించింది. నెల్లూరులోని లావణ్య జ్యుయెలరీ షాప్‌ను తమ దోపిడీకి ఎంచుకుంది. చెన్నెలో నకిలీ ఐడీ కార్డులు, పోలీస్ యూనిఫామ్ తయారు చేయించారు. అక్కడే ఎయిర్ పిస్టల్, పిల్లెట్స్ కొనుగోలు చేసి నెల్లూరు వచ్చారు. ఈ నెల 26న లావణ్య జ్యుయెలరీలో ఈడీ అధికారుల మాదిరిగా తనిఖీలకు వెళ్లినట్టు గ్యాంగ్ వెళ్లింది. సహజంగా తనిఖీకు వెళ్లిన ఏ అధికారులైన బంగారాన్ని సీజ్ చేసిన వెంటనే ఫొటోలు తీసి కేసు నమోదు చేస్తారు. అనంతరం బంగారాన్ని అక్కడే వదిలివెళ్తారు. అయితే నిందితులు కిలో బంగారాన్ని బ్యాగ్‌లో సర్దుకుని వెళ్లిపోతుండటంతో అనుమానమొచ్చిన షాప్ యజమాని పోలీసులకు సమాచారం అందించారు. సంతపేట ఇన్స్పెక్టర్ షేక్ అన్వర్‌బాషా నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారించారు. అనంతరం ఆరుగురు నిందితులను, కారు డ్రైవర్ నెల్లూరుకి చెందిన వెంకటకృష్ణను ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని ఎస్పీ విజయారావు అభినందించారు. -
నకిలీ సీబీఐ అధికారుల అరెస్టు
కడప అర్బన్: సీబీఐ అధికారులమని బెదిరించి.. ఓ కాంట్రాక్ట్ అధ్యాపకుడిని కిడ్నాప్ చేసి అతని వద్దనుంచి కారు, రూ.1,14,000 కాజేసిన నలుగురు ఘరానా మోసగాళ్లను వైఎస్సార్ జిల్లా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కడప డీఎస్పీ బి.వెంకటశివారెడ్డి తన కార్యాలయంలో తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నవంబర్ 23వ తేదీ రాత్రి సుమారు 7:19 గంటల సమయంలో చెన్నూరు పీఎస్ పరిధిలోని ఇర్ఖాన్ సర్కిల్ వద్ద ఖాజీపేట మండలం పత్తూరు గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకుడు బేరి ఉదయ్‌కుమార్(37)ను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు తాము సీబీఐ అధికారులమని, విచారణ చేయాలని కారులో ఎక్కించుకున్నారు. అక్కడక్కడా తిప్పుతూ అతడిని కొట్టి, బెదిరించి రూ.1,14,000ను ఫోన్‌పే ద్వారా వారి అకౌంట్లలోకి జమ చేసుకున్నారు. రెండ్రోజుల అనంతరం 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉదయ్‌కుమార్‌ను రోడ్డుపై వదిలి పరారయ్యారు. దీనిపై బాధితుడు నవంబర్ 27న చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన కడప అర్బన్ సీఐ ఎస్ఎం అలీ, చెన్నూరు ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి తమ సిబ్బందితో కలిసి శనివారం ఉదయం కొక్కరాయపల్లి క్రాస్‌రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో మైదుకూరు నుంచి చెన్నూరువైపు వస్తున్న ఓ కారులో ఉన్న నలుగురు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి వారిని అరెస్టు చేశారు. నిందితుల్లో అనంతపురం జిల్లా ఖాజానగర్‌కు చెందిన మాగంటి నగేష్ అలియాస్ నగేశ్‌నాయుడు, అతని బంధువైన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం, నాగరాజుపాడు గ్రామానికి చెందిన పావుకూరి సుందర రామయ్య అలియాస్ సుందర్‌నాయుడు, కడప నగరం రామాంజనేయపురానికి చెందిన వాసం నవీన్‌రాజు, బుక్కే ప్రభాకర్ నాయక్ ఉన్నారు. వీరి వద్ద నుంచి ఓ కారు, రూ.84,000, సీఆర్పీఎఫ్ పేరుతో ఉన్న ఓ నకిలీ గుర్తింపుకార్డును సీజ్ చేశారు. కాగా.. నగేష్, సుందరరామయ్యలకు కారు ఉంది. దానిని బాడుగకు తీసుకున్నవారు కిరాయి కానీ, కారునుకానీ ఇవ్వకుండా తిప్పుకుంటుండడంతో వారిని బెదిరించాలని భావించారు. మిగతా ఇద్దరు నిందితులతో కలసి ఇందుకోసం పథకం రచించారు. కారు బాడుగకు తీసుకున్నవారు తన బంధువులవడంతో వారి తరఫున ఉదయ్‌కుమార్ అడ్వాన్స్ కింద రూ.3 వేలు ఫోన్‌పే ద్వారా చెల్లించారు. దీంతో అతన్ని పట్టుకుంటే డబ్బు లాగవచ్చని భావించిన నిందితులు సీబీఐ అధికారులమంటూ బెదిరించి అతన్ని కారెక్కించి తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం ఉదయ్‌కుమార్ ఇంటి వద్ద ఉన్న తమ కారును తీసుకోవడమే గాక, ఫోన్‌పే ద్వారా రూ.1,14,000ను తమ ఖాతాలకు జమ చేయించుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో అప్రమత్తంగా వ్యవహరించిన అధికారులను, పోలీసులను జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అభినందించారు. -
ఎరక్కపోయి.. ఇరుక్కున్నారు!
పలమనేరు(చిత్తూరు): ఏసీబీ అధికారులమంటూ జిల్లాలోని పలు అధికారులను టార్గెట్ చేసి వారినుంచి తమ ఖాతాల్లోకి డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకున్న ముఠా నుంచి రాబట్టిన సమాచారంతోనే జిల్లాలో మంగళవారం ఏసీబీ దాడులు జరిగినట్టు తేటతెల్లమైంది. కర్నూలు జిల్లాలో ఇదే తరహా మోసాలకు పాల్పడుతూ శ్రీనాథ్‌రెడ్డి ముఠా ఈనెల 1న అక్కడి పోలీసులకు పట్టుబడింది. గత జూన్ నుంచి నకిలీ ఏసీబీ అధికారులకు, జిల్లాలోని పలువురు అధికారులకు మధ్య సాగిన లావాదేవీలు, ఫోన్‌కాల్ సంభాషణలు ఇప్పుడు ఏసీబీకి ‘కీ’లకమైన ఆధారాలయ్యాయి. నకిలీ ఏసీబీ ముఠా పట్టుబడడంతో గుట్టుగా సాగుతున్న అధికారుల బాగోతం బట్టబయలైంది. ఫేక్ ఏసీబీకి నగదు ముట్టజెప్పినవారు రాష్ట్రంలో 60మందికిపైగా ఉండగా జిల్లాలో చిత్తూరు ఆర్అండ్బీ ఈఈ చంద్రశేఖర్ రూ.2లక్షలు, ఇరిగేషన్ డిప్యూటీ ఎస్ఈ కృష్ణమూర్తి రూ.1.5 లక్షలు, పలమనేరు మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి రూ.3.49 లక్షలు సమర్పించుకున్నట్టు తేలింది. (చదవండి: వదినపై మరిది కర్కశం) అంతా చూసినట్టుగానే..! పలమనేరు మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి గత ఏడాది ఎర్రగుంట్ల మున్సిపాలిటీ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈనెలాఖరున ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జూలై మొదటివారంలో ఆయనకు విజయవాడ ఏసీబీ అధికారినంటూ ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘మీ అక్రమాల చిట్టా మొత్తం మావద్ద ఉంది. మేం చెప్పినట్టు చేయకపోతే ఉద్యోగం పోవడమేకాదు, బెనిఫిట్స్ కూడా రాకుండా జైలుకెళ్తారు’’ అంటూ బెదరగొట్టినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారో కూడా చెప్పడంతో చేసేదిలేక వారి చెప్పిన ఖాతాలకు డబ్బులు జమచేశారని తెలిసింది. పక్కాగా వివరాలు తెలుసుకుని టార్గెట్ ఫేక్ ఏసీబీ ముఠాలో ఓ వ్యక్తి సీఐగా ఫోన్ చేయడం.. తరచూ తమ డీఎస్పీతో మాట్లాడాలంటూ చేసేవాడని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. తన కుమార్తె అమెరికాలో ఉందనే విషయం కూడా చెప్పారని తెలిపారు. రిటైర్డ్ స్టేజ్‌లో ఎందుకొచ్చిన∙సమస్య అనుకుని తాను వారి ఖాతాల్లోకి డబ్బు వేశానని చెప్పుకొచ్చారు. జరిగిన వ్యవహారాన్ని బట్టి ఫేక్ ఏసీబీ ముఠా అధికారులు, కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని టార్గెట్ చేసినట్లు బోధపడుతోంది. చేయి ఎందుకు తడిపారు? చిత్తూరు అర్బన్: లంచం తీసుకోవడం ఎంత నేరమో.. ఇవ్వడం కూడా అంతే తప్పు. నకిలీ ముఠా ఉచ్చులో పడ్డ అధికారులకు తొలుత ఫోన్ వచ్చినప్పుడే పోలీసులకు ఫిర్యాదుచేసి ఉండాల్సింది. అలా చేసినట్లయితే ఇపుడు ఇబ్బందులు వచ్చేవికావు. కానీ అలాచేయని అధికారులు దఫాలవారీగా ముఠా చెప్పిన బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. డబ్బులు ఇవ్వకుంటే ఎక్కడ తమపై కేసులు నమోదవుతాయోనని భయపడి లంచాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇది అధికారుల నిజాయితీని ప్రశ్నిస్తోంది. ఫోన్లకు భయపడొద్దు నకిలీ ఏసీబీ పేరిట పట్టుబడ్డ దొంగలు ఇచ్చిన సమాచారంతో జిల్లాలో దాడులు నిర్వహించాం. వీళ్ల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిన సమయంలో ఫెళ్లను తనిఖీ చేశాం. పలమనేరు కమిషనర్, ఆర్అండ్బీ ఈఈ నకిలీ ఏసీబీ ముఠాకు రూ.లక్షల్లో నగదు ఇచ్చారు. ఏ తప్పు చేయకుంటే ఎందుకు డబ్బులిచ్చారు..? లంచం ఇవ్వడం కూడా నేరమే. మాపరంగా నివేదికను ప్రభుత్వానికి పంపుతాం. చర్యలు తీసుకుంటారు. ఏసీబీ అని ఎవరైనా ఫోన్‌చేస్తే భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయండి. – అల్లాభక్ష్, డీఎస్పీ, అవినీతి నిరోధకశాఖ, తిరుపతి -
‘నకిలీ మకిలి’ అధికారులపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి: ఏసీబీ ముసుగులో వచ్చిన నకిలీ వ్యక్తులు బెదిరించడంతో భయపడి కొందరు అధికారులు వారికి డబ్బులు ముట్టజెప్పారు. నకిలీ అధికారులు వస్తేనే బెదిరిపోయి డబ్బులు ఇచ్చారంటే.. వాళ్లెంత అవినీతికి పాల్పడ్డారోననే సందేహం అసలు ఏసీబీ అధికారులకు కలిగింది. దాంతో నకిలీలకు సొమ్ములిచ్చిన రాష్ట్రంలోని పలువురు అధికారులపై మంగళవారం దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఆర్ అండ్ బీ డీఈ జాన్ విక్లిఫ్ వద్ద రూ.1.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఏసీబీ అధికారుల ఖాతాల్లో డబ్బు జమ చేసినవారు వీరే.. శ్రీకాకుళం పంచాయతీరాజ్ ఇంజనీర్ జీఆర్ గుప్తా రూ.50 వేలు, జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జె.శివశంకర్‌రెడ్డి రూ.5 లక్షలు, ద్వారకా తిరుమల ఆలయ ఈవో రావిపాటి ప్రభాకరరావు రూ.1.97 లక్షలు, గుడివాడ ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వెంకటేశ్వరరావు రూ.3.50 లక్షలు, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన కె.రామచంద్రరావు రూ.4.94 లక్షలు, నెల్లూరు జిల్లా ఆర్డీవో పి.ఉమాదేవి రూ.25 వేలు, జీఎస్టీ స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. వెంకట దుర్గాప్రసాద్, గూడూరు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ టి.రాఘవరావు, చిత్తూరు ఆర్ అండ్ బీ ఈఈ గుడారం చంద్రశేఖర్ రూ.2 లక్షల చొప్పున, చిత్తూరు నీటిపారుదల శాఖ ఎస్ఈ బి.కృష్ణమూర్తి (ప్రస్తుతం డిప్యూటీ ఎస్ఈ, నీటిపారుదల శాఖ, కడప) రూ.1.50 లక్షలు నకిలీ ఏసీబీ అధికారుల ఖాతాల్లో జమ చేశారు. చైన్ స్నాచింగ్ బ్యాచ్ ముఠాగా ఏర్పడి.. రాయలసీమ ప్రాంతానికి చెందిన నూతేటి జయకృష్ణ, రాఘవేంద్ర, రామచంద్ర, శ్రీనాథ్‌రెడ్డి ముఠాగా ఏర్పడి చైన్ స్నాచింగ్‌లు చేసేవారు. వారిని అనంతపురం పోలీసులు 2019లో అరెస్ట్ చేశారు. అప్పటికే జయకృష్ణ, శ్రీనాథ్‌రెడ్డి తాము ఏసీబీ అధికారులమంటూ 16 మంది అధికారులను బెదిరించి రూ.28.51 లక్షలు వసూలు చేశారు. జైలులో మరికొందరితో కలసి గ్యాంగ్‌గా ఏర్పడిన జయకృష్ణ జైలు నుంచి బయటకు వచ్చాక కూడా కొందరితో కలసి అదే తరహాలో నేరాలకు పాల్పడ్డాడు. కర్నూలులో ఏసీబీ పేరు చెప్పి ఇద్దరు అధికారుల నుంచి రూ.8.50 లక్షలు వసూలు చేశారు. వారిని కర్నూలు పోలీసులు ఈనెల 1న అరెస్ట్ చేసి డబ్బులు సమర్పించుకున్న అధికారుల వివరాలు సేకరించారు. -
నకిలీ ఐటీ అధికారుల ముఠా అరెస్ట్
హైదరాబాద్: ఐటీ అధికారులమని చెప్పి.. ఓ వ్యక్తి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వికారాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నోట్లను మార్చుకోవడానికి నగరానికి వస్తుండగా.. ‘ఎర్రబుగ్గ’ కారులో వచ్చిన ఓ ముఠా.. ఐటీ అధికరారులమని చెప్పి.. రూ. 9.2 లక్షల నగదుతో ఉడాయించారు. ఆలస్యంగా తేరుకున్న బాధితుడు లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నకిలీ ఐటీ అధికారుల ముఠాను ఆదివారం అరెస్ట్ చేశారు. -
సీబీఐ అధికారులమంటూ దోపిడీ యత్నం
కసింకోట : సీబీఐ అధికారులమంటూ ఓ ఇంటిలోకి చొరబడిన ముగ్గురు యువకులు దోపిడీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా కసింకోట మండల కేంద్రంలో జరిగింది. ఆర్ఈసీఎస్ ప్రాజెక్టు ఇంజనీరు జి.శ్రీనివాసరావు అగ్రహారం వీధిలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ముగ్గురు యువకులు కారులో శ్రీనివాసరావు ఇంటికి వచ్చారు. తలుపు మూసి ఉండగా బయటి నుంచి బెల్ కొట్టి తాము సీబీఐ అధికారులమని, సోదాలు నిర్వహించడానికి వచ్చామంటూ తలుపులు తెరవాలని కోరారు. ఆ సమయంలో శ్రీనివాసరావు భార్య హైమావతి ఒక్కరే ఇంటిలో ఉన్నారు. ఇంటి యజమాని లేని సమయంలో సోదాలు నిర్వహించడానికి కుదరదని, తర్వాత రావాలని చెప్పారు. అది విన్న దుండగులు తలుపులు బలవంతంగా తెరచుకుని లోపలికి ప్రవేశించారు. తుపాకీతో బెదిరించి బీరువా తలుపులు తెరచి వెతికిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. కొన్ని విలువైన వస్తువులను దోచుకెళ్లినట్టు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.