‘నకిలీ మకిలి’ అధికారులపై ఏసీబీ దాడులు | ACB Attacks On Fake Officers | Sakshi
Sakshi News home page

‘నకిలీ మకిలి’ అధికారులపై ఏసీబీ దాడులు

Published Wed, Sep 9 2020 4:34 AM | Last Updated on Wed, Sep 9 2020 4:38 AM

ACB Attacks On Fake Officers - Sakshi

సాక్షి, అమరావతి: ఏసీబీ ముసుగులో వచ్చిన నకిలీ వ్యక్తులు బెదిరించడంతో భయపడి కొందరు అధికారులు వారికి డబ్బులు ముట్టజెప్పారు. నకిలీ అధికారులు వస్తేనే బెదిరిపోయి డబ్బులు ఇచ్చారంటే.. వాళ్లెంత అవినీతికి పాల్పడ్డారోననే సందేహం అసలు ఏసీబీ అధికారులకు కలిగింది. దాంతో నకిలీలకు సొమ్ములిచ్చిన రాష్ట్రంలోని పలువురు అధికారులపై మంగళవారం దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఆర్‌ అండ్‌ బీ డీఈ జాన్‌ విక్లిఫ్‌ వద్ద రూ.1.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

నకిలీ ఏసీబీ అధికారుల ఖాతాల్లో డబ్బు జమ చేసినవారు వీరే..
శ్రీకాకుళం పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ జీఆర్‌ గుప్తా రూ.50 వేలు, జాయింట్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ జె.శివశంకర్‌రెడ్డి రూ.5 లక్షలు, ద్వారకా తిరుమల ఆలయ ఈవో రావిపాటి ప్రభాకరరావు రూ.1.97 లక్షలు, గుడివాడ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వెంకటేశ్వరరావు రూ.3.50 లక్షలు, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన కె.రామచంద్రరావు రూ.4.94 లక్షలు, నెల్లూరు జిల్లా ఆర్డీవో పి.ఉమాదేవి రూ.25 వేలు, జీఎస్టీ స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వై. వెంకట దుర్గాప్రసాద్, గూడూరు మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.రాఘవరావు, చిత్తూరు ఆర్‌ అండ్‌ బీ ఈఈ గుడారం చంద్రశేఖర్‌ రూ.2 లక్షల చొప్పున, చిత్తూరు నీటిపారుదల శాఖ ఎస్‌ఈ బి.కృష్ణమూర్తి (ప్రస్తుతం డిప్యూటీ ఎస్‌ఈ, నీటిపారుదల శాఖ, కడప) రూ.1.50 లక్షలు నకిలీ ఏసీబీ అధికారుల ఖాతాల్లో జమ చేశారు.

చైన్‌ స్నాచింగ్‌ బ్యాచ్‌ ముఠాగా ఏర్పడి..
రాయలసీమ ప్రాంతానికి చెందిన నూతేటి జయకృష్ణ, రాఘవేంద్ర, రామచంద్ర, శ్రీనాథ్‌రెడ్డి ముఠాగా ఏర్పడి చైన్‌ స్నాచింగ్‌లు చేసేవారు. వారిని అనంతపురం పోలీసులు 2019లో అరెస్ట్‌ చేశారు. అప్పటికే జయకృష్ణ, శ్రీనాథ్‌రెడ్డి తాము ఏసీబీ అధికారులమంటూ 16 మంది అధికారులను బెదిరించి రూ.28.51 లక్షలు వసూలు చేశారు. జైలులో మరికొందరితో కలసి గ్యాంగ్‌గా ఏర్పడిన జయకృష్ణ జైలు నుంచి బయటకు వచ్చాక కూడా కొందరితో కలసి అదే తరహాలో నేరాలకు పాల్పడ్డాడు. కర్నూలులో ఏసీబీ పేరు చెప్పి ఇద్దరు అధికారుల నుంచి రూ.8.50 లక్షలు వసూలు చేశారు. వారిని కర్నూలు పోలీసులు ఈనెల 1న అరెస్ట్‌ చేసి డబ్బులు సమర్పించుకున్న అధికారుల వివరాలు సేకరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement