వేలం పెట్టిన ప్రజాప్రతినిధి
రూ.2 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్న అధికారులు
విధుల్లో ఉన్న ఎస్‌ఆర్‌ను సెలవుపై వెళ్లిపోవాలని బెదిరింపు
తాను వెళ్లేది లేదంటున్న సబ్ రిజిస్ట్రార్
ఏసీబీ కేసులో ఇరికిస్తారన్న భయంతో లంచం ఇవ్వద్దంటూ బోర్డు పెట్టిన సబ్ రిజి్రస్టార్
జిల్లాలో చర్చనీయాంశమైన కావలి వ్యవహారం
కావలి సబ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా అధికారానికి, అహంకారానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. లంచం లేనిదే సంతకం పెట్టని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచాలకు తావులేదంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కావలిలోనే కాక, ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఈ శాఖలో అవినీతికి తావులేదని చెప్పిన ఆ ప్రజాప్రతినిధే.. మూడు నెలలు తిరగక ముందే ప్లేటు ఫిరాయించి ఆ పోస్టుకు బహిరంగ వేలం పెట్టడంతో సబ్ రిజిస్ట్రార్ vs ప్రజాప్రతినిధిగా మారింది. సెలవు పెట్టి వెళ్లిపోవాలని.. లేదంటే ఎలా పనిచేస్తావో చూస్తానన్న సదరు ప్రజాప్రతినిధిని ధిక్కరించి.. ఆ సబ్ రిజిస్ట్రార్ తన పలుకుబడితో అదే సీటులో కూర్చొని పనిచేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి సబ్ రిజిస్ట్రార్ సీటు.. భలే హాటుగా మారింది. ఈ పోస్టు వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్ అయింది. అధికారం, రాజకీయం ఆధిపత్యం కొనసాగుతోంది.రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థ ద్వారా అదనపు వసూళ్లు లేకుండా కాగితం కదలని పరిస్థితి. అలాంటి సబ్ రిజిస్ట్రార్కార్యాలయం ఎదుట లంచాలకు తావులేదని, ప్రభుత్వ రుసుములు చెల్లిస్తే చాలని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పెద్ద సంచలనంగా మారింది. నిత్యం క్రయవిక్రయాల్లో రూ.లక్షల్లో చేతులు మారే కార్యాలయంలో ఉన్న పళంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కథే నడిచింది. ఈ వ్యవహారం వెనుక అధికారి నిజాయితీ ఉందనుకుంటే పొరపాటే. రూ.కోట్లు పలికే ఆ పోస్టులో సదరు ప్రజాప్రతినిధిని ధిక్కరించి కూర్చొన్న సదరు మహిళా అధికారి భవిష్యత్ ప్రమాదానికి భయపడి ఆ బోర్డు ఏర్పాటు చేసినట్లుగా చర్చ సాగుతోంది.
నెలకు రూ.50 లక్షల ఆదాయం
జిల్లాలో నెలవారీ ముడుపుల ఆదాయంలో నెల్లూరు తర్వాత కావలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయమే. కావలి చుట్టూ రామాయపట్నం పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, దగదర్తి విమానాశ్రయం ఇలా పారిశ్రామికంగా అభివృద్ధి వైపు దూసుకుపోతున్న కావలిలో రియల్ ఎస్టేట్ రంగం ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. ఈ ప్రాంతంలో భూ క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే భూ వివాదాలు ఉన్న ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కీలకంగా మారింది. నిబంధలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తే రూ.లక్షల్లో ముడుపులు అందుతాయి.
నెలవారీగా సబ్ రిజిస్ట్రార్ ఆదాయం రూ.50 లక్షలకుపై మాటే ఉంటుందని సమాచారం. ఈ క్రమంలో కావలి సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు భలే డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ దఫా సాధారణ బదిలీల్లో భాగంగా ఉన్నతాధికారులను మేనేజ్ చేసుకుని ఓ మహిళా అధికారి ఈ పోస్టును పట్టేసింది. స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ లేకుండానే ఆ పోస్టులో కూర్చొంది. రెండు నెలల పాటు సబ్‌రిజి్రస్టార్ కార్యాలయంలో కాసులు గలగలాడాయి. దీంతో ఆ పోస్టుపై కన్నేసిన ప్రజాప్రతినిధి సదరు అ«ధికారిణి దందా వ్యవహారంపై ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, ఆమె కొద్ది రోజులు సెలవుపై వెళ్లడం చకచకా జరిగిపోయాయి.
పోస్టుకు బహిరంగ వేలం..
కావలి సబ్‌రిజిస్ట్రార్ సెలవుపై వెళ్లడంతో ఆ పోస్టుకు డిమాండ్ పెరిగింది. దీంతో సదరు ప్రజాప్రతినిధి ఈ పోస్టుకు వేలం పెట్టినట్లు తెలుస్తోంది. నెలవారీగా రూ.లక్షల్లో ఆదాయం వచ్చే ఆ పోస్టుకు గతంలో పని చేసిన ఓ అధికారి, నెల్లూరులో పనిచేసి వెళ్లిన మరో అధికారి పోటీ పడుతున్నారు. రెగ్యులర్ పోస్టు అయితే.. రూ.2 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉండడంతో డిప్యుటేషన్‌పై వచ్చేందుకు అధికారులు పోటీ పడుతున్నారు. రూ.కోటి వరకు బేరం కుదిరింది.
లోకల్ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖతోపాటు రిజిస్ట్రేషన్ శాఖ రాష్ట్ర కార్యాలయంలో భారీ ఆఫర్లతో పోస్టు కోసం ఎగబడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో తన పోస్టుకు ఎసరు పెడుతున్న విషయాన్ని తెలుసుకున్న సదరు అధికారిణి జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ఉన్నతాధికారులకు రెకమెండ్ చేయించుకుని వెను వెంటనే విధుల్లో జాయిన్ అయిపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాలయాన్ని సందర్శించిన సదరు ప్రజాప్రతినిధి ఇక్కడ అవినీతికి తావులేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని చెప్పారు. మూడు నెలలు తిరగక ముందే ఆ పోస్టుకు వేలం పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీటు వదలాల్సిందే.. కదిలే ప్రసక్తే లేదు..
కావలి సబ్ రిజిస్ట్రార్ గా విధుల్లో జాయిన్ అయిన అధికారిణి స్థానిక ప్రజాప్రతినిధి వద్దకు ఇతరులను రాజీ రాయబేరానికి పంపించారు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రజాప్రతినిధి ఆమె ఆ సీటులో ఎన్ని రోజులు కూర్చుంటుందో నేను చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఆ సీటు వదలాల్సిందేనని సదరు ప్రజాప్రతినిధి హుంకరిస్తుంటే.. కదిలే ప్రసక్తే లేదంటూ సబ్ రిజిస్ట్రార్ మొండికేస్తున్నారు. అధికారి, ప్రజాప్రతినిధి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో రాజకీయంగా ఉచ్చు బిగిసే అవకాశం ఉండడంతో ఆ సబ్ రిజిస్ట్రార్ ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ ప్రజాప్రతినిధికే సవాల్ విసురుతూ ఎదురొడ్డుతున్నారు. ఈ క్రమంలో ఏసీబీని అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని భావించిన సదరు అధికారిణి కార్యాలయంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఇందులో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు, చలనాలు మాత్రమే చెల్లించాలని, దళారులకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వొద్దని బోర్డు పెట్టించడమే కాకుండా క్రయ, విక్రయ దారులను ఎవరికి అదనపు రుసుములు చెల్లించవద్దని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఆ కార్యాలయ ఉద్యోగులకు నచ్చడం లేదు. రూ.లక్షలు వెచ్చించి కావలి కార్యాలయానికి బదిలీపై వస్తే లంచాలు రాకుండా ఆమె వ్యక్తిగత స్వార్థం కోసం తమకు వచ్చే ఆదాయాన్ని అడ్డుకుంటుందని ఉద్యోగులు మండిపడుతున్నారు. గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా, గుంటూరు జిల్లాలో పనిచేసిన సదరు అధికారిణిపై అనేక ఆరోపణలున్నట్లు ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది. అలాంటి అధికారిణి కావలికి వచ్చేసరికి ఇలా బోర్డులు ఏర్పాటు చేయడంపై ఆ శాఖలోనే హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment