పెండింగ్ బిల్లుల మంజూరుకు రూ.40 వేల లంచం డిమాండ్
ప్రైవేట్ వ్యక్తి ద్వారా లావాదేవీలు
అతడితోపాటు ఎస్టీఓను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
ఉదయగిరి: ఉదయగిరి ఉపఖజానా అధికారిణి సీహెచ్ మమత మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఓ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ శిరీష తెలిపిన సమాచారం మేరకు.. వరికుంటపాడు మండలం తూర్పుబోయమడుగుల గ్రామంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న లోకసాని వెంగయ్యకు సుమారు రూ.9 లక్షల వరకు పాత బిల్లులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఈ బిల్లులు మంజూరు చేయాలని వెంగయ్య ఉప ఖజానా అధికారిణి సీహెచ్ మమతను వారం రోజుల క్రితం కలిశారు. అందుకు పది శాతం లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సదరు ఉపాధ్యాయుడు అంత డబ్బు ఇవ్వలేక వెనుదిరిగాడు.
తర్వాత అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీహరిని సంప్రదించి రూ.40 వేలు లంచం ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేక ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు మంగళవారం ఎస్టీఓకు లంచం ఇచ్చేందుకు కార్యాలయానికి వెళ్లి ఆమెను కలిసి రూ.40 వేలు తీసుకొచ్చానని చెప్పడంతో అదే కార్యాలయంలో పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి పవన్‌కు ఇవ్వాలని సూచించింది. దీంతో బాధితుడు కార్యాలయం కింద ఉన్న ప్రైవేట్ వ్యక్తి పవన్‌కు రూ.40 వేలు లంచం ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న ఏసీబీ అధికారుల బృందం పవన్‌ను అదుపులోకి తీసుకొని పైనున్న ఎస్టీఓ వద్దకు తీసుకెళ్లారు. ఎస్టీఓ సూచన మేరకే ఈ నగదు తీసుకున్నట్లు పవన్ ఏసీబీ అధికారులకు చెప్పడంతో ఆమెను అదుపులోకి తీసుకొని నగదుకు రసాయన పరీక్షలు నిర్వహించారు.
అనంతరం ఎస్టీఓను, పవన్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు ఆంజనేయరెడ్డి, విజయకుమార్‌తోపాటు మరో పది మంది సిబ్బంది ఉన్నారు. మమత మూడేళ్ల క్రితం ఉదయగిరి ఉప ఖజానా అధికారిణిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె సక్రమంగా విధులకు రావడం లేదని, ప్రతి చిన్న బిల్లుకు కూడా పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐసీడీఎస్‌కు సంబంధించిన బిల్లుల విషయంలో కూడా లంచాలు డిమాండ్ చేసి సకాలంలో బిల్లులు పాస్ చేయలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
లంచం ఇవ్వడం ఇష్టం లేక పట్టించాను
నాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.8,92,710 పాత బిల్లులు పాస్ చేయాలని ఎస్టీఓను కోరాను. ఆమె పది శాతం లంచం అడిగారు. అంత ఇవ్వలేనని చెప్పినా ఒప్పుకోకపోవడంతో ఇదే కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ శ్రీహరి మధ్యవర్తిత్వం ద్వారా రూ.40 వేలకు ఒప్పందం చేసుకున్నాను. అయినా లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకు వ్యవహరించి లంచం నగదు ఇచ్చాను.
Comments
Please login to add a commentAdd a comment