రిటైరయిన ఉద్యోగికి జీతం!
♦ గిరిజన సంక్షేమ శాఖ ఘనకార్యం
♦ పదవీ విరమణ చేయాల్సిన ఉద్యోగికి ఏడాదిగా జీతం
♦ బాధ్యులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆయనో చిరుద్యోగి. ఏడాది క్రితమే పదవీ కాలం పూర్తయింది. ఆ ఉద్యోగి రిటైర్‌మెంట్‌ను కప్పిపుచ్చి.. అక్రమంగా ఏడాదిపాటు కొనసాగించారు. నెలనెలా వేతనం చెల్లించారు. ఈ ఘనకార్యం ఎక్కడ జరిగిందో తెలుసా? గిరిజన సంక్షేమ శాఖలో. వివరాల్లోకి వెళితే.. కుల్కచర్ల మండలం కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో ‘వంట మనిషి’గా పనిచేసే కిష్టయ్య రికార్డుల ప్రకారం గతేడాది జూన్ 30న పదవీ విరమణ చేయాల్సివుంది. ఈ విషయాన్ని దాచిపెట్టారో.. మరిచిపోయారో తెలియదుకానీ, ఆశాఖ ఉన్నతాధికారులు ఈయన రిటైర్‌మెంట్ విషయాన్ని మరచిపోయారు. కిష్టయ్య కూడా ఇదేమీ పట్టించుకోకుండా విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. జీతం (దాదాపు రూ.40వేలు) ఠంచన్‌గా తన ఖాతాలో జమ అవుతోంది. ఇలా ఏడాది గడచిపోయింది. ఇటీవల జిల్లా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రమాదేవి ఉద్యోగుల సర్వీసుల రిజిస్టర్‌లను పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఏడాదిక్రితమే ఉద్యోగ విరమణ చేయాల్సిన ‘కుక్’కు అక్రమంగా వేతనం చెల్లించినట్లు తేల్చారు. తక్షణమే ఆ ఉద్యోగిని విధుల నుంచి తప్పించి.. ఈ నిర్వాకానికి కారణమైన సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, అలాగే సంబంధిత అధికారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రిటైర్ కావాల్సిన ఉద్యోగి ఏడాదికాలంగా పనిచేస్తున్నా.. గమనించకపోవడం చూస్తే ఆశాఖ అధికారుల నిర్లక్ష్యం ఇట్టే అర్థమవుతోంది. కాగా, జిల్లా కార్యాలయంలోనే ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లు ఉంటున్నందున.. కిష్టయ్య రిటైర్‌మెంట్ ఎప్పుడనే సమాచారం ఆయన పనిచేసే ఆశ్రమ పాఠశాల వార్డెన్‌కు కూడా తెలియకుండా పోయింది.