ఒక్కసారి ఉద్యోగంలో చేరి సంసార బాధ్యతల్లో చిక్కుకున్న తరువాత తమ కిష్టమైంది చదువుకోవడం అనేది కలే, దాదాపు అసాధ్యం అనుకుంటాం కదా. కానీ ఈ మాటలన్నీ ఉత్తమాటలే తేల్చి పారేశాడు ఒక రిటైర్డ్ ఉద్యోగి. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? నమ్మలేకపోతున్నారా? అయితే ఒడిశాకు చెందిన జైకిశోర్ ప్రధాన్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈయన సక్సెస్ స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైర్డ్ ఉద్యోగి జై కిశోర్ ప్రధాన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ 64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ కోర్సులో చేరారు. 2020లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG)లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు.
ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగ విధులు నిర్వర్తించిన ఆయన రిటైర్‌మెంట్ తరువాత అందరిలాగా రిలాక్స్ అయిపోలేదు. డాక్టరవ్వాలనే తన చిరకాల వాంఛను తీర్చుకొనేందుకు రంగంలోకి దిగారు. వైద్య విద్య ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి నిబంధన లేకపోవడంతో దృఢ సంకల్పంతో నడుం బిగించారు. అందుకోసం పెద్ద వయసులోనూ కూడా కష్టపడి చదివి జాతీయ స్థాయిలో వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ లో అర్హత సాధించారు.
ఎవరీ జై కిశోర్ ప్రధాన్
జై కిశోర్ ప్రధాన్ స్వస్థలం ఒడిశాలోని బార్ గఢ్ ప్రాంతం. బాల్యం నుంచే డాక్టర్ అవ్వాలని కలలు కనేవారు. 1974లో మెడికల్ ఎంట్రన్స్ ర్యాంకు రాకపోవడంతో ఆశలు వదిలేసుకున్నారు. బీఎస్సీడిగ్రీ పూర్తి చేసి ఎస్‌బీఐలో ఉద్యోగం సంపాదించారు. ఈ సమయంలో తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో తండ్రి అనుభవించిన బాధ, కళ్లారా చూసిన జై కిశోర్ ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నారట.
జై కిశోర్ జీవితంలో మరో విషాదం
వైద్య వృత్తిపై ఉన్న ప్రేమతో తన పెద్దకుమార్తెను డాక్టర్న చేయాలని ఎంతగానో ఆశపడ్డారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆమె ఎంబీబీఎస్ చదువుతుండగా, అనారోగ్యంతో కన్నుమూయడం విషాదాన్ని నింపింది. అయితే తన రెండో కుమార్తెను కూడా మెడిసిన్ చదివిస్తుండటం విశేషం. సాధించాలన్న పట్టుదల ఉండాలేగానీ అనుకున్న లక్ష్యం చేరేందుకు వయసుతో సంబంధం లేదని జై కిశోర్ చాటి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment