భువనేశ్వర్ : ఉద్యోగ విరమణకాగానే ‘కృష్ణా రామా’ అనుకుంటూ కాలం గడపాలనుకునేవాళ్లనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈయన అలా కాదు. కన్నబిడ్డ దూరమై మిగిల్చిన విషాదం ముందు.. వయసు మీదపడి ఓపిక తగ్గే తరుణంలో ఉరకలేసే ఉత్సాహంతో నీట్ యూజీ 2020 ఫలితాల్లో ర్యాంక్‌ను సాధించారు. ఎంబీబీఎస్ విద్యార్థిగా పాఠాలు నేర్చుకుంటున్నారు. త్వరలో డాక్టర్‌గా విధులు నిర్వహించనున్నారు.
ఒడిశాకు చెందిన 64ఏళ్ల జే కిషోర్ ప్రధాన్ ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఉన్నత ఉద్యోగం. ఇద్దరు కవలలు. అందమైన కుటుంబం. ఏచీకూ చింతాలేదు. ఎందుకో ముచ్చటైన ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది.
మలిదశలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండాలనుకున్న కుమార్తెను దూరం చేసింది. ఆ తల్లిదండ్రుల కలలను కల్లలు చేసింది. ఇంటి వెలుగులను ఒకేసారి ఆర్పేసి చీకట్లు మిగిల్చింది.
అదుగో అప్పుడే తనలాగే మరో ఆడబిడ్డ తండ్రికి గుండె కోత మిగిల్చకూడదనుకున్నారు. డాక్టర్‌గా సేవలందించాలని దీక్షబూనారు. ఎస్‌బీఐ అసిస్టెంబ్ బ్యాంక్ మేనేజర్‌గా పదవీ విరమణ చేసినా డాక్టర్‌గా సేవలందించాలనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకునే పనిలో పడ్డారు. దృఢ సంకల్పంతో ఓ వైపు విద్యార్థి, మరోవైపు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే పెద్దగా ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తన కలల ప్రయాణాన్ని ప్రారంభించారు.
కుటుంబ వ్యవహారాలు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దేశంలోనే అత్యంత కఠినమైన నీట్ పరీక్షల్లో ఉత్తర్ణీత సాధించాలనే లక్ష్యం ముందు అవి చిన్నవిగా కనిపించాయి. ముందుగా నీట్ యూజీ 2020 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు పోటీ పడ్డారు. ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ అయ్యారు. మొక్కవోని దీక్షతో అనేక సవాళ్లను అధిగమించారు. చివరికి అనుకున్నది సాధించారు.
నీట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (VIMSAR)లో ఎంబీబీఎస్ చదివేందుకు అర్హత సాధించారు. ప్రస్తుతం ఆయన ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. వచ్చే ఏడాది డాక్టర్‌గా ప్రజా సేవ చేయనున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు డబ్బు మీద ఆశలేదు. దూరమైన నా కుమార్తె కోసం నేను బతికి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను’అని వ్యాఖ్యానించారు. ‘దేశ వైద్య విద్యా చరిత్రలో ఇదొక అరుదైన సంఘటన. ఇంత వయస్సులో వైద్య విద్యార్థిగా అర్హత సాధించి ప్రధాన్ ఆదర్శంగా నిలిచారు’ అని విమ్స్‌ఆర్ డైరెక్టర్ లలిత్ మెహెర్ ప్రధాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
👉చదవండి : ‘మేం ఏపీకి వెళ్లలేం’
Comments
Please login to add a commentAdd a comment