
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ఉన్నతోద్యోగులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించడమేమిటని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎక్కువ మొత్తంలో జీతాలు ఇస్తూ మళ్లీ వారిని నియమించడం వల్ల దుబారా ఖర్చు తప్ప ఏమీ ఉండదని ఆ సంస్థ పేర్కొంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు.
కీలకమైన పోస్టుల్లో పాత వారినే నియమించడంతో ఎక్కువ మొత్తంలో జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొందరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను పదవీ విరమణ తర్వాత సలహాదారులుగా నియమించడం చూస్తుంటే వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేవారనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. వీరే కాక రెవెన్యూ, పంచాయతీరాజ్ వంటి శాఖల్లో ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగిస్తున్నారని, ఇది సమర్థనీయం కాదని అన్నారు.
సలహాదారులు, వారి సిబ్బందిపై ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేయడమంటే ప్రజా ధనాన్ని వృథాచేయడమేని స్పష్టం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరారు.
చదవండి: తనిఖీల వీడియో వైరల్: ‘సోషల్‌మీడియాను గుడ్డిగా నమ్మొద్దు’